23, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 235 (తల్లి తల్లి మగఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల్లి తల్లి మగఁడు తాత కాదు
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. తల్లిమగని నీవు తండ్రి యనఁగవలెఁ
    దాత యన్న సంస్కృతంబ యౌను
    తెలుఁగుభాషయందుఁ దెలియగా నా బుల్లి
    తల్లి! తల్లిమగఁడు తాత కాదు

    రిప్లయితొలగించండి
  2. జనని భాషయైన సంస్కృతమందును -
    తల్లి తల్లి మగఁడు తాత కాదు.
    మాత తండ్రి గాన మాతామహుడనవలె.
    తాత యర్థముఁ గన తండ్రి యేను.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి.

    తల్లి తల్లి మగడు తాతయ తెలుగులో
    తాత అర్థ మిదియె తండ్రి యగును
    సంస్కృతమ్ము లోన చక్కగా జూచిన
    తల్లి తల్లి మగడు తాత కాదు.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి.

    అడుగు చుంటి చెపుమ , అమ్మమ్మ ఎవరౌను?
    తల్లి కెవరు మనకు తండ్రి యైన?
    తల్లి చెల్లి సుతుడు తాతయ్య మనకౌన?
    తల్లి తల్లి, మగడు, తాత కాదు.

    రిప్లయితొలగించండి
  5. ఆకలి కడుపునకు నన్నమ్ము పెట్టెడి
    అతివ తరిచి చూడ గమ్మ గాదె
    అట్టి తల్లి యమ్మ అమ్మమ్మ యెట్లౌను
    తల్లి తల్లి మగఁడు తాత గాదు .

    రిప్లయితొలగించండి
  6. నా మొదటి పూరణ మొదటి పాదం లో తాతయ బదులుగా 'తాతయ్య ' అని సవరణ,గమనించగలరు.


    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి.

    సీత అవని సుతయె, శ్రీరాముడే హరి
    వసుధ భర్త అగును వాసుదేవు
    డరయ లవ కుశులకు ఆవిధముగ జూడ
    తల్లి తల్లి మగడు తాత కాదు.

    రిప్లయితొలగించండి
  8. చెల్లి వినుము నీకు చెప్పెద వివరమ్ము
    తల్లి అక్క యగును తాను పెద్ద
    తల్లి, తల్లి మగడు తాత కాదులెతండ్రి,
    తాత భార్య మామ్మ తగను మనకు.

    రిప్లయితొలగించండి
  9. శివ శివా! శివ శివా!!

    భర్త = భరించెడివాడు
    మగడు, భర్త ఒకటే అవుతారా కవిగారు?
    భరించే వాళ్ళంతా మగళ్ళవుతారా?
    కవుల పైత్యానికి హద్దూపద్దులుండవు అంటే, ఇదేనా కవి పుంగవా? మీరు సంఘానికి ఇచ్చే సందేశమిదేనా?

    రిప్లయితొలగించండి
  10. తల్లి తల్లి మగడు తాత ! కాదు/అవును
    ప్రశ్న యొకటి యుండె పత్ర మందు
    చిట్టి"అవును" పట్టి కొట్టి వేయ మిగిలె
    తల్లి తల్లి మగడు తాత కాదు !

    రిప్లయితొలగించండి
  11. తల్లి తల్లి మగడు తాతయ్య!తనఁ గన్న
    తండ్రి తల్లి మగడు తాత! తెలుసు.
    కళ్ళముందరతఁడు చెల్లెలి మనుమని
    తల్లి తల్లి మగఁడు. తాత కాదు.

    రిప్లయితొలగించండి
  12. తల్లి తల్లి మగడు తాతయ్య నే గదా
    తల్లి భర్త యగును తండ్రి నీకు!
    బాల ,గోల యేల, బంగారు నాచిట్టి
    తల్లి! తల్లి మగడు తాత కాదు !

    రిప్లయితొలగించండి
  13. రాఘవ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రవి గారూ,
    మీరూ రాఘవ గారి వలె సంస్కృత తాతనే గ్రహించారు. మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. మొదటి పూరణలో మీరు కూడ సంస్కృత తాతనే ఆశ్రయించారు. పూరణ బాగుంది. "తాతయ" అని ముందు చెప్పి తరువాత " తాతయ్య" అని సవరించారు. "తాతయ" అంటేనే విశేషార్థం వస్తున్నది.
    ప్రశ్నోత్తర పూర్వకమైన మీ రెండవ పూరణ విభిన్నంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కొత్త వరస కలిపారు. బాగుంది. అభినందనలు.
    "చూడగన్ + అమ్మ"ను "చూడ గమ్మ"గా కాకుండ "చూడన్ + అమ్మ = చూడ నమ్మ" అందాం.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడవ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. అజ్ఞాత గారూ,
    మీరు దైవనామస్మరణ చేసి పరిహారం చేసికొనదగ్గ పాపాన్ని ఇక్క డెవరు చేసారండీ?
    మీ అభ్యంతరం సమస్యా పాదంలోని "మగడు" శబ్దానికా, లేక పూరణలో కవి మిత్రులు ప్రయోగించిన "భర్త" శబ్దానికా? భర్త, మగడు శబ్దాలు "పతి"కి పర్యాయ పదాలే కదా. జన వ్యవహారంలోను అర్థం అదే కదా. భర్త, మగడు, పతి, కాంతుడు, ధవుడు, వల్లభుడు, ఈశుడు, స్వామి శబ్దాలకు ఎన్నో నానార్థా లున్నాయి. ఇక్కడ వ్యుత్పత్యర్థాల, నానార్థాల ప్రసక్తి అవసరమా?
    దయచేసి రంధ్రాన్వేషణ మాని "శ్రమించి" పద్య రచన చేస్తున్న ఔత్సాహికులను ప్రోత్సహించండి. లేదా మీ అభ్యంతరాన్ని సమర్థించుకొనే ఆధారాలను చూపండి.

    రిప్లయితొలగించండి
  16. మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మొదటిది. ఆబ్జెక్టివె టైప్ పరీక్షా పత్రంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలాంటి పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

    చింతా రామకృష్ణా రావు గారూ,
    చెల్లెలి మనుమని తల్లి తల్లి మగడంటే బావగారే కదా! బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. సీత అవని సుతయె, శ్రీరాముడే హరి
    వసుధ భర్త అగును వాసుదేవు
    డరయ లవ కుశులకు ఆవిధముగ జూడ
    తల్లి తల్లి మగడు తాత కాదు.

    పద్యంలో అర్థాన్ని గమనించండి గురువర్యా.

    రిప్లయితొలగించండి
  18. ఆంగ్ల మాధ్యమమ్ము లాక్రమించినవిప్డు
    తల్లి ' మమ్మి ' యయ్యె , తండ్రి ' డాడి ' ;
    తాతగారు పోయి తగని ' గ్రాండ్ పా ' వచ్చె
    తల్లి తల్లి మగఁడు తాత కాదు !!!

    అందరి పూరణమ్ములు ఒకదానిమించి మరొకటి అద్భుతంగా వున్నాయి . ఇక ఏమి వ్రాయాలో పాలు పోక వ్రాసినదిది .

    రిప్లయితొలగించండి
  19. పై అజ్ఞాత గారి అభ్యంతరం నాకు బోధపడకున్నది కానీ , శాస్త్రిగారు , చాలా చక్కని వూహ చేశారు పూరణలో . అభినందనలు .....!!!

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    అఙ్ఞాత గారి
    అభ్యంతరం ఏమిటో
    అవగత మగుట లేదు!

    01)

    ________________________________________

    తల్లి మగడు కాడు - తండ్రి పిల్లలకును !
    తల్లి తల్లి మగడు - తాత కాదు !
    తల్లి చిన్న కొడుకు - తమ్ముండు కాదన్న
    తవళు లన్ని ధరను ! - తరుణు లార !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  21. శంకరయ్యగారికి నమస్కారం. నేను సూచించిన సమస్య
    'తల్లి తల్లిమగఁడు తల్లియయ్యె'. దీనిని కొద్దిగా సవరించి
    'తల్లి తల్లి మగఁడు తాత కాదు' అని ప్రకటించినందుకు సంతోషం. పై సమస్యను కొప్పరపు సోదర కవులు ఒక శతావధానంలో క్రింది విధంగా పూరించారు.

    మోహినీస్వరూపమున నొప్పు హరితోడ
    భవుఁడు కలయఁ బుట్టె భైరవుండు
    దాన భైరవునకుఁ దండ్రియయ్యె శివుండు
    తల్లి తల్లి మగఁడు తల్లియయ్యె

    పై పద్యంలో నాకు చివరి పాదం అర్థం కాలేదు. దయచేసి వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  22. డా. విష్ణు నందన్ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారు కొప్పరపు సోదరుల పద్యాన్ని ఇచ్చి "భైరవుని తల్లి తల్లి మగడు విష్ణు వెలా అయ్యాడు?" అని ప్రశ్నించారు. నాకూ సమాధానం తట్టడం లేదు. దయచేసి మీరేమైన వివరించ గలరా?

    రిప్లయితొలగించండి
  23. వసంత్ కిశోర్ గారూ,
    ఎక్కడ పట్టారండీ అసత్యపు "తవళి"ని? అన్నట్టు అన్ని పాదాల్లోను "త" వళులే వేసారు కదా! ఆరు తకారాలకు నేనూ ఇవ్వాలి కదా తకారపు తాళ్ళు. వేసుకోండి ఆరు వీరతాళ్ళు.

    రిప్లయితొలగించండి
  24. శంకరయ్య గారు , ధన్యవాదాలు .....

    తల్లి తల్లి = లక్ష్మీ దేవి ; తల్లి తల్లి మగడు = విష్ణువు :

    పురాణ పాత్రలను అర్థం చేసుకొనడం కాస్త సంక్లిష్టమైన పని .
    విష్ణు పాదోద్భవ గంగ . అంటే గంగకు తల్లి లక్ష్మీ దేవి .

    అదే లక్ష్మీదేవి , క్షీరసముద్ర రాజతనయ అయినప్పుడు , సముద్రుడి భార్య అయిన గంగ తనకు తల్లి అయినది.

    అంటే లక్ష్మీదేవి తన తల్లి కి తల్లి అన్న మాట .

    అలాగే విష్ణువుకు గల అనేక " తెలుగు పర్యాయపదాల్లో " మామ మామ ఒకటి . తన మామ అయిన సముద్రునికి ( లక్ష్మీదేవిని పెండ్లాడగా వచ్చిన చుట్టరికం ) , తన కూతురైన గంగను ఇచ్చినప్పుడు మామ అయిన వైనం .

    ఇలాంటివి చమత్కార పద్యాలకు బాగా వుపయోగపడే విశేషాలు .
    ఇక మళ్లీ కొప్పరపు వారి పూరణ కు వస్తే , తల్లి తల్లి మగడు = ఎవరు ? తల్లి తల్లి - లక్ష్మీ దేవి కాబట్టి తన మగడు విష్ణువే కదా , ఆ విష్ణువే భైరవునికి మోహినీ వేషంలో తల్లి అయ్యాడు అని పూరణ .

    రిప్లయితొలగించండి
  25. అక్కడ భైరవుని తల్లి తల్లి మగడు అని తీసుకోరాదు . ' జనరల్ గా ' తల్లి తల్లి = లక్ష్మి , తల్లి తల్లి మగడు = విష్ణువు ,

    " తల్లి తల్లి మగడు " అని విష్ణువు కు పర్యాయపదంగా వాడారు . అంతే !!! ఇది

    రిప్లయితొలగించండి
  26. డా. విష్ణు నందన్ గారూ,

    నా సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నేనింకా భైరవుని తల్లి ఎవరా అని తల బ్రద్దలు కొట్టుకుంటున్నాను :-)

    రిప్లయితొలగించండి
  27. విష్ణు నందను గారూ! అరటి పండు ఒలిచి పెట్టినట్లు సమస్యను చక్కగా విడమరచి చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణు నందన్ గారూ,

    ఇంకా రెండు సమాధానం తెలియని ప్రహేళికలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని సాధించగల సామర్థ్యం కలవారు మీరేనని అనిపిస్తున్నది. దయచేసి ఈ క్రింది లింకులపై మీ కటాక్ష వీక్షణాలను ప్రసరింప జేయండి.

    1. http://turupumukka.blogspot.com/2009/02/blog-post_21.html

    2. http://kandishankaraiah.blogspot.com/2010/10/48.html

    రిప్లయితొలగించండి
  29. శంకరం మాస్టారు గారికీ, విష్ణు నందన్ గారికి ధన్యవాదములు.అజ్ఞాత గారి సందేహం నాకును పూర్తిగా అవగతమవలేదు.బహుశా వాసుదేవుడు
    వసుధ భర్త కాదనేమో.
    నాకు తెలిసిన వరకు శ్రీదేవి,భూదేవి
    ఇద్దరూ విష్ణు మూర్తి భార్యలే.మీ సమర్ధనతో నా అనుమానం తీరినది.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  30. శంకరార్యా !
    మిక్కిలి కృతఙ్ఞతలు !

    హమ్మయ్య !
    ఈ రోజు సంపాదించిన - 06 - వీరతాళ్ళతో
    ఋణ విముక్తుణ్ణయ్యాను !

    మిస్సన్న మహాశయా !
    యుద్ధరంగాన్ని రంగవల్లి చేసిన
    మీ యుద్ధ నైపుణ్యానికి
    10-02-2011 ఇవ్వవలసినవి --------------02

    రవీజీ !
    ఖరసఖి గానంతో
    ఖరాన్ని గంధర్వుణ్ణి చేసిన
    మీ అమర గానానికి
    10-02-2011 ఇవ్వవలసినవి --------------02

    మూర్తి గారూ !
    పీటలాగి పిదప పీఠమెక్కిన
    మీ శిష్య పూజకు
    06-02-2011 ఇవ్వవలసినవి --------------02

    అయ్యా ! మీ మీ బాకీలు చెల్లు !

    మిస్సన్న మహాశయా !
    మీ "అరువు లేదు " బోర్డు
    ఇప్పుడు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు !

    ఎలాగో
    గురువు గారి దయ వలన బాకీలు తీర్చ గలిగాను !

    రిప్లయితొలగించండి
  31. విష్ణు నందనా ! సుందరా !
    అరటి పండు ఒలిచినట్టు
    సందేహ నివృత్తి చేసారన్న
    మిస్సన్న గారి మాట నిజమే గాని

    ఎల్లప్పుడూ సందేహాలతో సతమతమయ్యే
    ఈ సందేహ ప్రాణికి ఇంకో కొత్త సందేహం 1
    కోప్పడకండి స్వామీ !

    హరిహరులకు పుట్టింది అయ్యప్ప గదా ?
    మధ్యలో ఈ భైరవు డెక్కణ్ణుంచి వచ్చాడూ ?
    ఈ భైరవుడు ఏ భైరవుడు ?
    కాల భైరవుడా ?
    కాక వేరే ఇంకొకడు వున్నాడా ?

    రిప్లయితొలగించండి
  32. డా.విష్ణునందనుల వారికి మరోసారి అభినందనలు,కృతజ్ఞతలు చక్కని వివరణ యిచ్చినందులకు. మామ మామ విన్నాను గాని తల్లి తల్లి యిది వరకు వినలేదు. మీరింత జ్ఞానము,విజ్ఞానము ఎప్పుడు,ఎలా సంపాదించారని చాలా ఆశ్చర్యము ,ఆనందము కలుగుతొంది మాకందఱికీ.

    వసంత కిశోర్ జీ నేను బాకీ తీర్చేయమని మీ యింటి మీద కూర్చోలేదు కదా, కొన్నాళ్ళు ఆ వీర తాళ్ళు మెడలో వేసుకొని నెమ్మదిగా తర్వాత బాకీ తీర్చేద్దురు గాని. అవి మీ దగ్గఱే అట్టే పెట్టండి. మిస్సన్న గారికి మళ్ళీ త్వరలోనే యివ్వ వలసిన అవసరము కలుగుతొంది.

    రిప్లయితొలగించండి
  33. వసంత మహోదయా! అభినందనలు ఋణ విముక్తులైనందుకు.
    కానీ మూర్తిగారి మాట కూడా ఆలోచించ దగ్గదే.

    రిప్లయితొలగించండి
  34. వసంత్ కిశోర్ గారూ,
    భైరవుడన్నా, కాలభైరవుడన్నా ఒకరే.
    అమృతాన్ని పంచడానికి విష్ణువు జగన్మోహినీ రూపాన్ని ధరిస్తే, ఆ సౌందర్యాన్ని చూసిన శివుడికి మతి భ్రమించి ఆమెను పట్టుకోబోయాడు. మోహిని అతనికి అందకుండ పరుగుతీసింది. శివు డామె వెంటబడ్డాడు. చివరికి శివునికి వీర్యస్ఖలనమై అది నేల మీద పడ్డది. ఆ వీర్యం నుండి కాల భైరవుడు పుట్టాడు.
    బ్రహ్మకు మొదట్లో ఐదు ముఖా లుండేవి. ఒకసారి అతని ఐదవ ముఖం శివున్ని దూషించడంతో కోపించిన కాల భైరవుడు దానిని ఖండించాడు. అప్పటినుండి బ్రహ్మ చతుర్ముఖు డయ్యాడు.
    ఖండించిన బ్రహ్మ కపాలం భైరవుడి చేతికి అంటుకొని ఎంత ప్రయత్నించినా ఊడిరాలేదు. చివరికి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు తన భ్రూమధ్య భాగాన్ని పొడిచి ఆ రక్తాన్ని కపాలంలో పట్ట మన్నాడు. ఒక సంవత్సరం పాటు స్రవించిన ఆ రక్తాన్ని పట్టినా కపాలం ఊడిరాలేదు. విష్ణువు సలహాతో భైరవుడు కాశికి వెళ్ళి అక్కడ పాతిపెట్టాడు. ఆ విధంగా భైరవుడు కపాలాన్నీ, బ్రహ్మహత్యా పాతకాన్నీ వదిలించుకున్నాడు. భైరవుడు కపాలాన్ని పాతిన చోటు "కపాల మోచన తీర్థం" అయింది.
    దక్ష యాగ విధ్వంసంలో శివునికి భైరవుడు తోడ్పడ్డాడు.
    హరిహర పుత్రుడుగా అయ్యప్ప (ధర్మశాస్తా) జననం గురించి నాకు తెలిసినంత వరకు ఏ పురాణంలోను ఆధారం లేదు.

    రిప్లయితొలగించండి
  35. మూర్తిగారూ !
    మిస్సన్న మహాశయా !
    నా యింటి మీద కూర్చోకుండా ఉండడం
    మీ గొప్పతనం !
    అలాగని బాకీ ఎగ్గొట్టేస్తామా ?
    నాలుగు రోజులు మెళ్ళో వేసుకొన్నాకైనా
    మీకిచ్చెయ్యాలిగదా !
    ఈ లోపు అవేమైనా పాడైతే ఇబ్బంది గదా !
    బరువు ఎప్పటి దప్పుడు దించేసు కోవడమే
    హాయి నాదృష్టిలో !

    రిప్లయితొలగించండి
  36. శంకరార్యా !
    ధన్యవాదములు !

    అయ్యప్ప స్వాములు
    హరి హర పుత్రా అయ్యప్పా !
    అని కీర్తిస్తుంటారు వినలేదా ?

    దక్షాధ్వర విధ్వంసం చేసింది
    శివుని జట నుండి పుట్టిన వీరభద్రుడు గదా !
    ఆయనకు ఈయన సహాయ పడ్డాడా లేక
    ఇద్దరూ ఒకటేనా ?

    రిప్లయితొలగించండి
  37. కోడీహళ్లి మురళీమోహన్ గారూ ధన్యవాదాలు . మీ వ్యాఖ్య నింతవరకు గమనింపలేదు . ఆలస్యమైనది . తప్పక వాటిని చూచి పరిష్కరించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను . కానీ నిజానికి సాహిత్యమంటే కొంచెం తెలుసును కానీ , పురాణాల్లో అంతగా పట్టు లేదు . కనుక ప్రయత్నించి చూస్తాను . కాస్త వ్యవధినివ్వండి .

    రిప్లయితొలగించండి