26, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 238 (వరుఁడను నా కేల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు

39 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మరి!నాన్న!మీకు చెప్పక
    సరితను మనువాడినాను శంకరు గుడిలో
    మరియొక కన్యకు నేనా
    వరుడను?నాకేల వధువు?వలదనె నతడున్.

    రిప్లయితొలగించండి
  2. గురువుల బోధన పొందితి.
    పరమాత్ముని చేర వలతు.భాగ్యమ్మిదియే.
    నిరుపమ జీవన్ముక్తి ప్ర
    వరుఁడను. నా కేల వధువు? వల దనె నతఁడున్.

    రిప్లయితొలగించండి
  3. తరువులు,నటవులు,కోనలు
    చెరువులు,నదులు,జలపాతచెల్వములూహా
    తరుణిఁగలసి దిరిగెడు కవి
    వరుఁడను నాకేల వధువు వలదనె నతఁడున్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    చింతా రామకృష్ణారావు గారూ,
    మంచి భావన. అభినందనలు.
    మూడవ పాదంలో " జీవన్ముక్తి ప్రవరు" డన్నప్పుడు సమాసాంతర్గతమైన "క్తి" గురువై గణదోషం వస్తున్నదేమో? ఒకసారి పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  5. ఊకదంపుడు గారూ,
    మీ ఊహావధువును కోరుకొనే కవి వరుని పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శంకరయ్య గారూ,
    ధన్యవాదములు.
    "భావకవి" అని పూరిద్దామని మొదలుపెట్టి, కాస్త ఆలస్యంగా గణాలు కుదరవని తెలుసుకున్నాను. అందుకని ఆయన వస్తుచయమంతా పట్టుకొచ్చాను.
    "భావకవిని నేను, భామ లేల?" అన్నట్టు.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  7. వరకట్నము దరిజేరక
    కరగ్రహణము చేయుటెట్లు? కాంతలు తెచ్చే
    కరకర నోటుల కోరెడు
    వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్.

    రిప్లయితొలగించండి
  8. నరుడను, నేనొక గేస్తును,
    అరుణాస్పదపురము మాది, ఆహిత యగ్నున్
    హరిహరి! తగదిది వినుము ప్ర-
    వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్.

    రిప్లయితొలగించండి
  9. హరి గారూ,
    నోట్లు కోరే వరుని గురించి చక్కగా పూరించారు. అభినందనలు.
    "కరగ్రహణము" అన్నప్పుడు "ర" గురువై గణదోషం ఏర్పడుతున్నది. ము ప్రత్యయాన్ని అదిలేసి "కరగ్రహణఁ జేయు టెట్లు" అందాం.

    మిస్సన్న గారూ,
    ప్రవరుణ్ణి ఎవరు ఎత్తుకుంటారా అని చూస్తున్నా. ఆ పని మీరు కానిచ్చారు. సంతోషం. అభినందనలు.
    "ఆహిత + అగ్ని = ఆహితాగ్ని", అక్కడ యడాగమం రాదు. "ఆహితవహ్నిన్" అందాం.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ, బాగుంది. ప్రవరుడు వచ్చి మరీ వద్దని చెప్తున్నాడా! భలే!

    రిప్లయితొలగించండి
  11. గురువు గారూ మీ సవరణకు కృతజ్ఞతలు.
    మందాకిని గారూ క్షమించాలి. మీ వ్యాఖ్యను సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాను.
    వరూధిని హిమవన్నగం మీద విహరించే ప్రవరుణ్ణి చూచి మోహించి తనను పెళ్లి చేసుకోమంటుంది కదా. ఆ సందర్భం నేపథ్యంలో అలా వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    సరదాగా అలా రాశాను. మన్నించండి. మీరు ఆ ఘట్టం రాసేటప్పుడు ఉండాల్సిన పద్యం రాశారు. నాకు అర్థం అయ్యిందనుకోండి.
    అక్కడ వరూధినిని వద్దని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ మన బ్లాగు కొచ్చి మరీ ఇక్కడి వధువుని వద్దంటున్నాడా? అని జోక్ వెయ్యబోయాను. పేలలేదన్నమాట. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  13. కంది శంకరయ్య గారు,

    సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా! సంయుక్తంలో రేఫమున్నందున వెసులుబాటు కలిగి ఉంది. కాన లఘు భావంతో ప్రయోగించాను.

    రిప్లయితొలగించండి
  15. హమ్మయ్య మందాకిని గారూ బ్రతికించారు. నేనేమైనా తప్పు అర్థం వచ్చేలా
    వ్రాశానేమో అని కంగారు పడ్డాను. మీ రెండో వ్యాఖ్య చూశాక హాయిగా నవ్వుకొన్నాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. "వరముగ నీకును ఓ కే
    సరిపుత్ర! వధువునుఁ దెచ్చి జరుపుదుఁ మనువున్"
    పలికిన రామునితో, "కపి
    వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్"

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ, మా (చిన్నప్పటి) తెలుగు మాస్టారు వరూధినీ ప్రవరాఖ్యం రసవత్తరంగా చెప్పేవారు. వినితీరవలసిందే. ప్రవరాఖ్యుడు వద్దన్నాడు సరే, మీ సంగతి వ్రాయలేదు మరి మిత్రవర్యులు మిస్సన్న గారు(జోకుతూ). మా మాస్టారి లెఖ్క ప్రకారం వరూధిని వస్తే కావలించుకొని తీర వలసిందే, వద్దనలేము, అదంతే!

    రిప్లయితొలగించండి
  18. హా .... హతవిధీ ! ఐతె అందరూ వరూధిని కోసం ఎదురు చూస్తున్నారన్న మాట ? ఎం......త.....దారుణం ? ? ?
    మరదళ్ళూ ! ?....?....?

    రిప్లయితొలగించండి
  19. అరకను నమ్ముకు గరితతొ
    పరసేద్యము జేయ కుండ పరువుగ యెపుడున్ !
    వరి పైరు వెంట దిరిగెడి
    వరుఁడను నాకేల వధువు వలదనె నతఁడున్ !

    రిప్లయితొలగించండి
  20. అయ్యో, అక్కయ్య గారున్నారన్న సంగతి మరచిపోయాను. లేదండీ, మేమంతా ఆహితాగ్నులమే! పాదలేపనమే మమ్మల్ని వేరేచోటికి చేర్చింది (నవ్వుతూ).

    రిప్లయితొలగించండి
  21. అవును కదా ! పాద లేపనం కరిగి పోయింది అయ్యొ పాపం ?
    రెండే సరణ్యం ఒకటి వరూధిని రెండు పూరణలు [ సరదాకి ]

    రిప్లయితొలగించండి
  22. వధువును వలదని చెప్పిన కవి మిత్రులందరకు అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  23. చంద్ర శేఖర్ గారూ మీ మేష్టార్ని అడిగి ఒక్కసారి వరూధిని అడ్రస్ కనుక్కోరా నేనే వెళ్లి వచ్చేస్తాను.......... మళ్ళీ తిరిగి రాలేనంటారా?........
    రాజేశ్వరి గారూ మా ఇంట్లో చెప్పకండి దయచేసి ......అసలు ఇల్లు కదల నివ్వరు.......

    రిప్లయితొలగించండి
  24. హిమవన్నగమునకు వెళ్ళడము వలన ఆలస్యమయింది,మన్నించండి,

    కరములకు వణకు గట్టెను
    వెరపొందెను యెదయు మిగుల వేగము గొట్టెన్
    కురురాజ కొమరు లక్ష్మణ
    వరుఁడను నాకేల వధువు వలదనె నతడున్ !

    రిప్లయితొలగించండి
  25. మూర్తి గారూ .. హిమవన్నగానికి వెళ్ళొచ్చానంటున్నారు.వరూధిని కనిపించలేదా.. అలో 'లక్ష్మణ 'అంటున్నారు.



    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  26. ఆమె యిప్పుడు ఈ బ్లాగులోనే ఉందిట,మిస్సన్న గారు తీసుకు వెళ్ళారని చెప్పారు !

    రిప్లయితొలగించండి
  27. ఊకదంపుడు గారూ, భావకవి భావన చాలా బాగుంది,మెల్లగా చొరిపించి మరో పూరణ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  28. రవి గారూ,
    కపి వరుని భావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఐనా ఆ బ్రహ్మచారికీ లోకం "సువర్చల"ను అంటగట్టింది కదా :-)

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    భార్యతో వరిపైరు వెంట తిరిగే శ్రేష్ఠునికి వధువు అక్కర లేదని చాలా బాగా చెప్పారు. అభినందనలు.
    "గరితతొ" అని "తొ" హ్రస్వంగా ప్రయోగించరాదు. ఇది చాలా మంది చేసే పొరపాటే. "సతితో" అందాం.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    "మాయాబజార్"ను గుర్తు చేసారు. ధన్యవాదాలు.
    "కొమరు" అనకుండా "సుతుఁడ" అంటే బాగుంటుందేమో?

    మిస్సన్న గారూ,
    కేవలం వరూధిని అడ్రస్ మాత్రమేనా, పాదలేపం అక్కరలేదా?

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న గారూ.. మిస్ వరూధిని కనబడిందా, మిస్ అయ్యిందా?

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  30. మూర్తి గారూ మీరు హిమవన్నగానికి వెళ్లి వచ్చానంటున్నారు. మీకు వరూధిని కనబడినట్లు లేదు. నా దగ్గర ఉందను కొంటున్నారు. పొరపాటు. గోలి వారూ ప్రస్తుతం మిస్సింగ్. నా అనుమానం ఏమిటంటే చంద్రశేఖర్ గారు అడ్రస్ చెప్పమంటే చెప్పటం లేదు. ఆయనే ఎక్కడో దాచేసున్టారని.
    గురువు గారూ అసలంటూ అడ్రస్ దొరికితే అప్పుడు ఏ గురువుల శుశ్రూషో చేసి లేపనమో లేక మరో సాధనమో సంపాదించ లేమా అని. క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  31. అన్నన్నా! బుద్ధిగా పద్యాలు, చందస్సుతో పాఠాలు చదువుకోండి,ఆటలాడుకోండి అంటే వరూధినికోసం వెతుకుతున్నారా?? ఉండండుండండి. మీ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను. పోన్ నంబర్లు తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదనుకుంటా? గురువుగారు కూడా మిన్నకున్నారే :))))

    రిప్లయితొలగించండి
  32. ఛలోక్తులతో సరసమైన చర్చను కొనసాగిస్తూ బ్లాగులో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న మిత్రు లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. పరస్పర స్నేహ పూర్వక వ్యాఖ్యలతో అలరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  33. ష్ష్!!!!!అందరూ గప్ చిప్ !! బ్లాగ్గురు గారు కూడా వినేశారు! ఇళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తారట. పారి పొండి! అరె లగారే భాయ్!

    గురువుగారూ మీ సహృదయతకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. హరుడను ,పావన గంగా
    ధరుడను,శివుడను ,గిరిజకు ధవుడను ,నేనే
    నిరువురి తరుణుల హృదయా
    వరుడను, నాకేల వధువు వలదనె నతడున్!

    (వేములవాడ ప్రాంతములో ఎందరో పడతులు రాజన్న సాన్నిధ్యం లో శివసత్తులుగా(శివసతులు)మారి శివుని స్తుతించే ఆచారమున్నది .భక్తితో ఒకడు తన సుతను శివసతిగా ఎలుకొమ్మన ,శివుడు భక్తునితో పై విధముగా అని ఉంటాడని భావన చేసాను.)
    గ్రామాంతరము వెళ్ళుట వలన సకాలంలో పూరణను పంపించలేదు .

    రిప్లయితొలగించండి
  35. మంద పీతాంబర్ గారూ,
    ఆలస్యంగా స్పందించినా మంచి పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. తరుణము లేనే లేదుర!
    బరువగు మోడీని దింపు బాధ్యత మీర
    న్నరయగ కాంగ్రెసు భామా
    వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్

    రిప్లయితొలగించండి
  37. "Hyderabad: Congress president Rahul Gandhi on Tuesday said that he is married to his party when asked about his plan to get married"

    కరచుచు రాహులుడప్పుడు
    పరిపరి జెప్పితిని శుంఠ! పలువురి యెదుటన్
    బరువైన వనిత "కాంగ్రెసు"
    వరుఁడను;...నా కేల వధువు?వల దనె నతఁడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. సరసంపు ముదిత కాంగ్రెసు!
      పరువంపు మగసిరి నాది! పండిన హస్త
      మ్ము! రసికుడనేను విడువని
      వరుఁడను! నా కేల వధువు వల దనె నతఁడున్!


      నారదా

      తొలగించండి