10, ఫిబ్రవరి 2011, గురువారం

వారాంతపు సమస్యా పూరణం - (పతికి నమస్కరించగనె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......

పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి

    గతులనుదప్పి, శుంఠలయి, గాడిదలై చరియించుచుండె,స
    న్మతియును,భక్తి,బాధ్యతలు మచ్చుకు లేకనె రామ!రామ!నా
    సుతులకు బుద్ధి,జ్ఞానములు సొంపుగ నిమ్మని,తండ్రి జానకీ
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి సందర్భశుద్ధితో పూరణ అలరిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. హనుమచ్ఛాస్త్రి గారూ మీ సమస్య అద్భుతం, పూరణ అత్యద్భుతం.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారికి,మిస్సన్న గారికి ధన్య వాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  5. తల్లిదండ్రులు విశ్వపతికి
    నమస్కరిస్తుంటే
    విఙ్ఞత లేని పుత్రులు :

    01)

    _______________________________________________

    సతి కెదు రాడలేరు ! పరి - చర్యలు జేయరు , తల్లి, దండ్రికిన్ !
    మతమును గారవింప కవ- మానము జేతురు , నెల్ల వారలన్ !
    స్తుతి యొనరింప రెవ్వరికి! - సూకర సూనుల సాటి వారిలన్ !
    పతికి నమస్కరించ గనె - ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.
    _______________________________________________

    రిప్లయితొలగించండి
  6. పతినెటు లెక్కజేయకను పైసలు లేవని ఈసడించుచున్
    వెతలకు మూలకారణము నీతడనంచును గోలచేయుచున్
    బ్రతికెడు భార్య నా పతియె బంపరు డ్రా గెలువంగ దెల్వగా
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

    రిప్లయితొలగించండి
  7. సూకర సూనుల గురించి చెప్పిన కిశోర్ గారి పూరణ,ఈసడించుసతి గురించి చెప్పిన హరి గారి పూరణ అదిరాయి.అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  8. 'పతితులు గారు పాండవులు, భక్తులు జూడగ పెద్ద తండ్రికిన్,
    సతతము ధర్మ మార్గమున సాగెడు వారికి రాజ్య భాగమున్
    హితము దలిర్ప నీయ దగు' నిట్లని కౌరవ మాత పల్కుచున్
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ మీ పద్యం కృష్ణ రాయబారం పద్యాల్లా అదిరింది.
    అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  10. వసంత్ కిశోర్ గారూ,
    సూకరసూనుల గురించి వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని పై ముందుమాట లేకుంటే సందిగ్ధార్థం వచ్చేది.

    హరి గారూ,
    ఉత్తమమైన పూరణ. బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    అత్యుత్తమమైన మీ పూరణ ప్రశంసార్హమై శోభిస్తున్నది. అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.

    "ఉతమును నేక వస్త్రమున నూతగ నమ్మితి నిన్ను నొక్కనిన్
    గుతిల పడంగ బట్టితిరి కుంతికి గోడలఁ బంచ భర్తృకన్
    బతితులు భూపతీ సుతులఁ బగ్గము లుంపుమ "కృష్ణ యంచు శ్రీ
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ కృతజ్ఞతలు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
    నరసింహ మూర్తి గారూ మీ పూరణ మంచి భావ గర్భితమై శోభిల్లు తోంది.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ ,మీ పూరణ చాలా బాగుంది. మీకు ధన్యవాదములు. చూద్దాము,గురువుగారు గాని మీరు గాని సవరణలు చెస్తే కృతజ్ఞుడిని.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ నమస్కృతులు. నా పూరణను అందంగా మలచండి. లేకపోతే మీరు ఓ మంచి పూరణ నియ్యండి. మీ పూరణ చదివి చాలా దినములయింది.

    రిప్లయితొలగించండి
  15. శ్రీకృష్ణ రాయబారము:

    గతమును వీడి పాండవులు, కౌరవ! పంపిరి నన్ను సంధియే
    హితమని బంధుమిత్రులకు, నీనృప లోకము మేలు పొంద నీ
    సుతులను నిన్ను కోరిరి యశోధన! భూవర! యంచు పల్కి భూ
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వృత్తరచనకై మీ శ్రమ స్పష్టంగా తెలుస్తున్నది. చాలా వరకు సఫల మయ్యారు. అభినందనలు.
    ఈ సమస్యకు వారాంతంలో నా పూరణ తప్పక ఉంటుంది.

    జిగురు సత్యనారాయణ గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. సతతము దూరదర్శనిని సాయపు వేళల వచ్చు చెత్తనున్
    మతినిడి జూచుచూ నటులఁ మన్నన జేసెడి సాధ్వి యొక్క నా
    డతి వినయంబునన్ సుమను యన్నయు గట్టిన వేషమౌ - రమా
    పతికి నమస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందరున్

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు
    అందరి పూరణలూ చక్కగా
    అలరించు చున్నవి.

    ఉత్తమమైన పూరణల నందించిన
    శాస్త్రిగారికీ , హరిగారికీ
    మిస్సన్న మహాశయులకూ
    మూర్తిగారికీ, జి.ఎస్.జీ కీ
    రవిగారికీ
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా !
    మిస్సన్న మరియు జి.ఎస్.జీ గార్ల స్ఫూర్తితో
    శ్రీ కృష్ణ రాయబారాన్ని కొంచెం పెంచాను.
    తిలకించి తప్పొప్పులు జెప్పుడని
    ప్రార్థన.
    _____________________________________________

    శ్రీ కృష్ణుడు ధృతరాష్ట్రునితో :

    01)

    వెతల సహించి , శాంతముగ - వేదన లెన్నియొ బెట్ట , నీసుతుల్ !
    గత జల సేతు బంధనము - గా దలబోసిరి ! నన్నుయియ్యెడన్
    హితమును గూర్పగాదలచి - హేళనలన్ విడి, రాయబారిగా
    మతియొనరింప , నంపిరి; స - మస్త జనావళి మోద మందగన్ !

    02)
    సుతులగు వారు నీకు ! గడు- సోకుల పాలయి యున్నవారు ! నీ
    సుతు లతి ధూర్త వర్తనము - శోచ్యము బెట్టిన , నాగ్రహించకన్
    స్తుతి యొనరించు , నిన్నెపుడు !- శోధన జేయకు , వారి నియ్యెడన్ !
    సతతము , నీవె తండ్రియని - సంస్మరణం బొనరింతు , రెల్లరున్ !

    03)
    హితమును జెప్పెదన్ !వినుము !-హే , నృప సన్నుత ! నీకు హెచ్చగున్ !
    సుతులను ,భీష్మ, ద్రోణ, కృప, - సూరుల తోడను; చర్చ జేసి స
    ద్గతిని జరించు మోయి; సుహృ - ధామయమౌ నటు నెల్ల వారికిన్ !
    నుతిమతి వౌదు వీవు ! సుమ - నోహర మౌను ! సమస్త రాజ్యమున్ !

    04)
    సతియగు వారి కైదురకు ! - సారెకు ,సాధ్విని , బాధ పెట్టి; నీ
    సుతులు , నవఙ్ఞ ,జేసిరి;మ - త్సోదరి,కృష్ణను,నిండు కొల్వునన్ !
    పతులగు వారి ముందర , స - భాసదు లెల్లరు వీక్ష జేయగన్ !
    కుతుకలు కోయరైరి; పెను - కోపము వచ్చిన , నీదు సూనులన్ !

    05)
    అతగులు కారు వారు , కడు - యౌవన వంతులు ,మంచివారిలన్ !
    శతమఖు గెల్వ జాలు , పటు - శౌర్యము గల్గిన వార లౌట చే
    అతిశయ మొందకుండ ,విను !-హైన్యము జూడకు ! ముప్పువచ్చు నీ
    సుతులకు ! వారలన్ బిలచి - శోకము దీర్చిన , శోభనం బగున్ !
    ____________________________________________
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    సోకు = కష్టము
    శోచ్యము = దుఃఖము
    సూరి = పురోహితుడు
    సారెకు = మాటిమాటికి
    క్రొత్తడి=పతివ్రత
    అవఙ్ఞ=అవమానము
    అతగులు=దుర్భలులు
    ______________________________________________‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

    రిప్లయితొలగించండి
  20. రవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రాయబార పద్య పంచకం మనోహరంగా ఉంది. అభినందనలు.
    నాల్గవ పద్యం రెండవ పాదంలో "మత్సోదరి" అన్నచోట గణదోషం ఉంది. ఆ పాదాన్ని " సుతులు నవజ్ఞ సేసి రది సోదరి నా కగు, నిండు కొల్వునన్" అందామా?

    రిప్లయితొలగించండి
  21. 06)
    ______________________________________________

    శంకరార్యా !
    మిక్కిలిధన్య వాదములు !

    06)

    ____________________________________________

    అతులిత శౌర్యమున్ గలిగి - హంసుని గెల్వగ జాలినట్టి యా
    సుతులకు రాజ్యమిమ్ము; నిను - సోదరు లందరు గొల్తు రెన్నడున్!
    హితమును గూర్చు మెల్లరకు -హే ,జన సన్నుత !యంచు ,పల్కి ,భూ
    పతికి నమస్క రించ గనె - ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్ !
    ____________________________________________
    హంసుడు = ఈశ్వరుడు
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  22. వసంత మహోదయా మీ రాయబార పద్యాలు అత్యద్భుతం. పెద్ద కవుల సరసన మిమ్మల్ని చూడగలిగే అర్హత మీకున్నది.

    రిప్లయితొలగించండి
  23. మీరు జూపిన దారియే ,మిస్సనన్న !
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  24. కిశోర్ గారూ, చాలా బాగున్నాయి, మీ రాయబార పద్యాలు. మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. వసంత కిశోర్ గారూ అభినందనలు.


    రాయబార మపుడు ఆయదు సింహుని
    మాటలన్ని మీరు మలచినారు
    పద్య ధార మీకు పట్టుబడెను బాగ
    ఆరు పద్యములును అదిరిపోయె.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న మహాశయులకూ
    మూర్తిగారికీ
    శాస్త్రిగారికీ
    మిక్కిలి ధన్యవాదములు

    అంతా మీ సాంగత్యం
    మరియు ప్రోత్సాహం
    గురువు గారి దయ
    వలననే.

    రిప్లయితొలగించండి
  27. సతతము సత్య మార్గమున సాగ లభించు నదేమి ? నేటి భా
    రతమున,నేలు రాజు ధృతరాస్ట్రుని బోల, నమాత్య శేఖరుల్
    పతితులు గాగ , సూనుల కుపాది ని గోరగ తండ్రి ,పార్వతీ
    పతికి నమాస్కరింపగనె ఫక్కున నవ్విరి పుత్రులందఱున్!

    రిప్లయితొలగించండి
  28. కలియుగ కుచేలుడు:

    గతుకుట కిన్ని నూకలును కట్టుకు లేవని నూలుబట్టలున్
    అతివ పదేపదే మగని హైరన జేయుచు తిట్టిపోయుచున్
    పతి యొక లాటరీని పలు వందల లక్షలు గెల్చి చూపగా
    పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్

    రిప్లయితొలగించండి