"జడ కందములు - మా కందములు" ఆవిష్కరోత్సవానికి వచ్చిన కవిమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఎందరో మహానుభావులు, అవధానులు, పండితులు, కవిశ్రేష్ఠులు, బహుగ్రంథకర్తలు నామీది ఆప్యాయతతో దూర భారాలను లెక్కించక, ఇబ్బందులు పడుతూ వచ్చి సభను అలంకరించారు. వేదిక మీద కూర్చుని, సన్మానాలు పొందదగినవారు సామాన్య ప్రేక్షకులై సభనిండా కూర్చుని ఎదురుగా కనిపిస్తుంటే ఒకింత అపరాధ భావానికి లోనయ్యాను. నా పిలుపు మేరకు ఎక్కడెక్కడి నుండో వచ్చి, స్నేహభావంతో పలుకరించిన మిత్రుల సౌహార్దాన్ని చూచి భావోద్వేగానికి లోనయ్యాను. ఎన్నెన్నో విషయాలు చెప్పాలని, అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలని ఆత్రంగా ఉన్న నేను తీరా నన్ను మాట్లాడమనే సరికి కారణం లేకుండానే దుఃఖం ముంచుకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను. నా మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూసిన మిత్రులను నిరుత్సాహ పరచినందుకు మన్నించండి.
పుస్తకాన్ని సలక్షణంగా ప్రకటించాలన్న ఉద్దేశంతో నేను, గుండు మధుసూదన్ గారు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి దోషాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికి రెండు దోషాలు నా దృష్టికి వచ్చాయి.
"అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడింది" అని ఒక సామెత. అందరి తప్పులు వెదకి, దిద్దిన నేను నా పద్యంలో గణదోషాన్ని గుర్తించలేకపోయాను. అలాగే గోగులపాటి వారి పద్యంలో ప్రాస తప్పింది. ఇలాగే నా దృష్టికి రానివి కొన్ని ఉండవచ్చు.
ఇది నేను మొదటిసారిగా ప్రచురించిన పుస్తకం. మొదటిసారిగా నిర్వహించిన సభ. అనుభవ రాహిత్యం వల్ల ఏవైనా లోటు పాట్లు జరిగితే, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను.
మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.