5, జులై 2018, గురువారం

సమస్య - 2725

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాణి రాణియయ్యె భర్గునకును"
(లేదా...)
"వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై"

67 కామెంట్‌లు:

  1. పగలు రాత్రి పోరు పడలేక నాతండు
    సరిసరి యికనాపు చాలుననుచు
    సగము భాగమిచ్చి వగచుచుండ సతత
    వాణి రాణియయ్యె భర్గునకును

    భర్గుడు = శివరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ప్రారంభపూరణమే వైవిద్యంగా ఉన్నది. సాధారణంగా ఈ సమస్యకు మొదటగా 'శర్వాణి రాణి యయ్యె...' అన్న పూరణ వస్తుంది. ఆ తరువాతి కవులు వైవిధ్యంగా పూరించే ప్రయత్నాలు చేస్తారు. మీరు ముందే ఆ విధంగా ఆలోచించారు. మంచి ఆలోచన!
      వాగుడుకాయను సతతవాణి అనడం మీ కల్పనానైపుణ్యాన్ని తెలియజేస్తున్నది.
      చక్కని పూరణతో శుభారంభం చేసారు. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏🙏🙏

      నాకేమీ తెలియదు సార్! ఏదో ఒకటి సరదాకు వ్రాసితిని

      🙏🙏🙏

      తొలగించండి
  2. జగము లేలు వాడు చంద్రశేఖరుడంచు
    ఫాలలోచనుడను పతిగ బడయ
    ఘోర తపము జేసి కోమలి యైన శ
    ర్వాణి రాణి యయ్యె భర్గునకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఫాలలోచనుఁ దన పతిగ బడయ" అనండి.

      తొలగించండి
  3. తపము జేసి జేసి నెపములే కుండగా
    నలుప నంగ శివుడు యలిగి గౌరి
    పంత మూని తుదకు వంతుగా గెలుపొంది
    వాణి రాణి యయ్యె భర్గు నకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శివుడు + అలిగి' అన్నపుడు యడాగమం రాదు. "శివుడె యలిగి" అనండి. "వంతుగా గెలిచి శ।ర్వాణి..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. తపము జేసి జేసి నెపములే కుండగా
      నలుప నంగ శివుడె యలిగి గౌరి
      పంత మూని తుదకు వంతుగా గెలిచి శ
      ర్వాణి రాణి యయ్యె భర్గు నకును

      తొలగించండి

  4. ధ్యాన మార్గమున సదా శివుని మనసు
    నందు నిలిపె గౌరి నందయంతి
    మురిసెనాదిభిక్షు, ముక్కనుసామి,శ
    ర్వాణి రాణియయ్యె భర్గునకును!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టాసత్యనారాయణ
    పడతి బట్టననెడి బైరాగికైనను
    మోక్షకాంత యెడల మోజు చెలగు
    ప్రకృతి పురుషులెపుడు బాయరు పరగ శ
    ర్వాణి రాణియయ్యె భర్గునకును

    రిప్లయితొలగించండి
  6. శివుని నాథుగ గొను స్థిరనిశ్చ యమ్ముతో
    మంచు కొండ మీద నంచితముగ
    ఘోర తపము జేసి, కొండచూలి యగు శ
    ర్వాణి రాణియయ్యె భర్గునకును

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    ప్రాణములొడ్డి , యెండనక, వాన గణింపక దీక్షతో జగ...
    త్త్రాణపరాయణున్ బతిగ భావన చేసి తపించు లోక క
    ళ్యాణగుణాన్వితన్ లలితనద్రితనూజను మెచ్చి చేరి శ...
    ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. వేదశిఖల పదఘట్టనలు గ్రహగతులయ్యె తాండవ
    హొయలు
    జటాజూటపు విసిరె అలలు సామవేదమై పలికిన
    లయలు
    డమరుక జనితమగు నాద వాణిని రాణిగా
    గొనియె భర్గుడు
    లోకహితానుకారియై ప్రణవమొసగె కైలాస
    దుర్గుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమేశ్ గారూ,
      మంచి భావాలను అందిస్తున్నారు. పద్యరచనకు ఉపక్రమించండి.

      తొలగించండి
  9. పార్వతి తపస్సుకు ముజ్జగములు తల్లడిల్లగ బ్రహ్మాది దేవతలు శంకరుని ప్రార్ధించే సందర్భము...

    వేణి తపంబు నీజగతి వేదన నొందగ జేసె శంకరా!
    ప్రాణులు తల్లడిల్లె భువిపై ధర బొంగరమై భ్రమించె వే
    మౌనము వీడి పార్వతికి మంగళ సూత్రము గట్టమన్న *శ*
    *ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    వాణికి మాధ్యమంబు గను బాణిని వేదము లాశ్రయించ నా
    శ్రేణికి భాష్యపుంజముల శ్రేష్ఠుడు శంకర గౌడపాదుడా
    కోణమునెంచె బోధనకు కూర్మిని భాషలకెల్ల తల్లి గీ
    ర్వాణము రాణిగావెలసె వాసిని బోల్చ నదెట్లటన్న శ
    ర్వాణిని రాణిగా గొనియె భర్గుడు లోక హితానుకారియై

    రిప్లయితొలగించండి
  11. (గౌరీకల్యాణం)
    కాంతులీనుచుండ కల్యాణతిలకమ్ము,
    పులకరించుచుండ కలికిమేను,
    మహిత లలిత గిరిజ మధుపవేణి మధుర
    వాణి రాణియయ్యె భర్గునకును.



    రిప్లయితొలగించండి
  12. ఘోరతపముజేసిగుణవతియైనశ
    ర్వాణిరాణియయ్యెభర్గునకు
    తల్లిదండ్రులుగదధరణికేవారలు
    వందనములుసేతువందలాది

    రిప్లయితొలగించండి
  13. ఘోర తపము జేయ కోరిక నె ర వేరి
    శివుడు మెచ్చి వచ్చె చెంత జేరి
    సురులు మునులు పొగడ సుము హూ ర్త మందు శ
    ర్వాణి రాణి య య్యే భర్గు నకు ను

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2725
    సమస్య :: *వాణిని రాణిగా గొనియె భర్గుడు లోకహితానుకారియై.*
    సందర్భం :: తన తండ్రి యైన దక్షుడు నిరీశ్వర యాగం చేస్తూ తన ప్రాణనాథుడు శుభకరుడు ఐన పరమేశ్వరుని చులకన చేసి నిందిస్తూ ఉంటే సహింపలేక సతీదేవి యోగాగ్నిని కల్పించుకొని దేహత్యాగం చేసింది. ఆమెయే మఱు జన్మలో హిమవంతునికి కుమార్తెగా శైలజ గా జన్మించి మరలా పరమశివునే భర్తగా పొందగోరి తపస్సు చేసింది. ఆమె తపస్సునకు మెచ్చి మహాదేవుడైన భర్గుడు గత జన్మలో తన ప్రాణేశ్వరిగా ఉండిన ఆ శర్వాణిని ఇప్పుడు తన రాణిగా చేసికొని కుమారస్వామిని కుమారుడుగా పొందదలచి లోకహితమును చేయదలచిన సందర్భం.

    ప్రాణ సమాను నాథుని శుభంకరు దండ్రియె నింద సేయ, శ
    ర్వాణి స్వదేహమున్ విడిచి పావనియై, మఱు జన్మ మందు నా
    స్థాణుని భర్తగా బడయ, శైలజ గా జనియింప, నాటి శ
    *ర్వాణిని రాణిగా గొనియె భర్గుడు లోకహితానుకారియై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-7-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      నాటి శర్వాణి అంటూ అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  15. గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారూ!
    హృదయపూర్వక ప్రణామాలండీ.

    రిప్లయితొలగించండి
  16. డా.ఎన్.వి.ఎన్.చారి
    శ్రోణితలంబునన్ హిమవశీకృత సుందర పర్వతాగ్రమున్
    ప్రాణవిభుండుతాపసిగ భగ్నమనంబు న మౌనమూర్తియై
    ధ్యానముసేయుచుండగ భయంబున చేరగ చేరదీసి శ
    ర్వాణిని రాణిగా గొనియె భర్గుడు లోకహితాను కారియై

    రిప్లయితొలగించండి
  17. కోరి శివుని మదిని ఘోరతపము జేసి
    సురలు,మునులు బొగడ గిరిజ తాను;
    మెచ్చ హరియు,బ్రహ్మ,లచ్చియు మఱియును
    "వాణి ; రాణియయ్యె భర్గునకును"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      వాణి శబ్దాన్ని సరస్వతిగానే స్వీకరించి చక్కని విరుపుతో చెప్పిన మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. వేణినందు గంగ వేడ్కగా ధరియించి
    జాణ తనము మీర శంకరుండు
    మేన నర్ధభాగమిచ్చి మురియగ శ
    ర్వాణి రాణి యయ్యె భర్గునకును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేణియందు' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏🙏

      తొలగించండి
  19. వీణలరాగముల్దగిలివీనులకింపునైబ్రహ్రదేవుడున్
    వాణినిరాణిగాగొనియె,భర్గుడులోకహితానుకారియై
    రాణిగజేసెగాగిరిధరాధిపుసోదరిపార్వతమ్మనున్
    వాణియుబార్వతమ్మయునువాసినినొందిరిలక్ష్మిరూపులై

    రిప్లయితొలగించండి
  20. తొలిపాదము చివర 2వభగణము
    కింపయి
    గాచదువప్రార్ధన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గిరిధరాధిపు పుత్రిక' అంటే బాగుంటుందేమో? మైనాకునికి సోదరియే. కాని అతడు గిరిధరాధిపుడు కాడు కదా!

      తొలగించండి
  21. అనితర జన సాధ్య ఘన తపో మహిమ బ
    లాన్విత సతి సరసిజాక్షి శీత
    శైల తనయ మృదు వచన భరిత మధుర
    వాణి రాణియయ్యె భర్గునకును


    త్రాణ గుణాభి రాజిత విలాసిత షట్చరణ ప్రభా లస
    ద్వేణి మహోత్పలాక్షి యుగ దేవి సు శీతల శైల సంచల
    ద్రాణి వినీలలోహిత విదగ్ధ సుగాత్ర తపఃపునీత శ
    ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 23/11/2017 నాటి సదృశపు సమస్యా పూరణలు:

      త్రాణ గుణ సంచయములకుఁ
      గాణాచి గిరిజ రజత నగవర విభు బహిః
      ప్రాణము పార్వతి సురుచిర
      వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్


      ప్రాణి నికాయ సుప్రణతి భాసిత పద్మదళాయతాక్షి సు
      శ్రోణి పతివ్రత ప్రణుత సువ్రత శంకర సంగ్ర హేద్ధ స
      త్పాణి ధరాధరాత్మజ కపార కృపారస సిక్త భవ్య భా
      వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

      [భావ+ఆణి = భావాణి; ఆణి = ఎల్ల (హద్దు); దయాగుణపూరిత భావములకు హద్దు]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణలన్నీ ఎప్పటివలె అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
    4. షట్చరణప్రభాలసద్వేణి... ఆహా ..అద్భుతమండీ.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు 🙏🙏

      తొలగించండి
    5. మురళీకృష్ణ గారు మీ వంటి కవి వరేణ్యుల ప్రశంసల నందు కొన్నందుకు మహదానందముగా నున్నది. ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
  22. తపనతత్వ తలపు తట్టగపార్వతి
    ఈడుజోడు నెంచి తోడుకొరకు
    తపసుజేసి గెలిచె ధర్మము కొరకుశా
    ర్వాణి రాణియయ్యె భర్గునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తపము జేసి... శర్వాణి..' అనండి.

      తొలగించండి
  23. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు
    లోకహితానుకారియై

    సందర్భము:
    విపంచ్యా గాయన్తీ వివిధ
    మపదానం పశుపతే
    స్త్వయాఽఽరబ్ధే వక్తుం చలిత శిరసా
    సాధు వచనే
    త్వదీయై ర్మాధుర్యై రపహసిత తంత్రీ
    కలరవాం
    నిజాం వీణాం వాణీ నిచుళయతి
    చోళేన నిభృతమ్
    (ఆదిశంకరుల సౌందర్య లహరి)

    వాణి శివుని విజయ గాథలను
    (త్రిపురాసుర విజయాదులను) వీణ వాయిస్తూ గానం చేస్తుండగా శర్వాణి అనగా పార్వతి సంతోషంతో తల నూపుతూ అభినందించే మధుర వచనాల కుపక్రమించినది.
    ఆమె పలుకుల మాధుర్యం తన వీణా కల రవమును మించి యున్న దని తెలుసుకొని (సిగ్గుతో) సరస్వతి చోళేన.. అనగా ముసుగుతో వీణను కప్పివేసినది.
    అటువంటి ఉమాదేవిని.. దివ్య మాధురీ వాణిని.. దివ్యమైన తీయదనముతో కూడిన వాక్కు గలిగిన శర్వాణిని భర్గుడు లోక హితార్థమై రాణిగా స్వీకరించినాడు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    వాణి మహేశు దివ్య కథ
    భక్తిని గాన మొనర్చు వేళ శ
    ర్వాణి శిరస్సు నూపి మది
    రంజిలఁ బల్కగ సిగ్గు జెంది గీ
    ర్వాణి ముసుంగు వీణ కిడె
    భద్రముగా.. నుమ దివ్య మాధురీ
    వాణిని రాణిగాఁ గొనియె
    భర్గుఁడు లోకహితానుకారియై

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    5.7.18

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    ("మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ")

    రాణులు రాజులున్ ప్రజలు రమ్యపు రీతిని నేనునేననున్
    ప్రాణులు కాఠముల్ మణులు పండుగ చేయుచు నేనునేననున్
    రేణువు రేణునన్ వెలసి రేఖల రూపుల నేనునేననున్
    వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు
    లోక హితానుకారియై...

    రిప్లయితొలగించండి
  25. గురుదేవులకు నమస్కారములు.

    ప్రాణము నీవటంచు ననవద్య సుధీర్ఘ తపంబుజేసె న
    క్షీణ వితీర్ణ భక్తిమెయి శీతనగాధిపుఁ జేరగోరి ని
    ర్వాణ సురాజ్యనాథుని వరంబు వరుండుగ లోదలంచు శ
    ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

    నిర్వాణ సురాజ్యనాథుడు = మోక్షసామ్రాజ్యాధినేత-ఈశ్వరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. హరికి రమయె సతియు యంచరవుతుకేమొ
    వాణి రాణి యయ్యె, భర్గునకును
    పర్వత సుత యైన పార్వతి యర్ధాంగి
    శ్రీత్రయంబు గొలువ శ్రీకరంబు.

    రిప్లయితొలగించండి
  27. ప్రాణము లెక్కజేయక తపమ్మును జేసెను కోమలాంగితా
    క్షోణిరథుండనే పతిగ గోరుచు నత్తరి వేడగన్ సుర
    శ్రేణులు తారకున్ పరిహరించెడు పుత్రుని బొందనెంచి శ
    ర్వాణిని రాణిగా గొనియె భర్గుడు లోకిహితాను కారియై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. కవి మిత్రులు శ్రీ బొల్లికొండ రామనాథం గారు వ్రాసిన గత న్యస్తాక్షరి పూరణను పరిశీలించగలరు.

    (పో)రు సల్పు వేల్పు పోలేరు మాతవే
    (లే)మి తనము మాకు లేక యుండ
    (ర)జత నాసికాభరణము రంజిలగ న
    (మ్మ)! నిను గొలుతు మమ్మ! మమ్ము గనుమ!

    రిప్లయితొలగించండి
  29. మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందలి నేటి పద్యములలో నొకటి:

    నేన క్రతువును యజ్ఞము నేన పిండ
    మేన నేన మందును మంత్ర మేన యాజ్య
    మేన నేన యగ్ని హుతము నేన సర్వ
    మేన యై యుందు సంశయ మేల యిందు .. శ్రీకృష్ణ.సూక్తి.సుధా. 9.16


    మూలము:
    అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహ మౌషధమ్ |
    మంత్రో౽హ మహమే వాజ్య మహ మగ్ని రహం హుతమ్ || .. శ్రీమద్భగ. 9.16.

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల
    స్థాణువు శైలజా పతిగ తారకుఁ జంపెడు సూను నా నయు
    గ్బాణు దయన్ గనన్ రతికి బాధ మిగుల్చక భర్త నీయుమన్
    వాణికి మెచ్చి దంపతుల బంధముఁ దెల్సిన సధ్యుపాస్య శ
    ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

    రిప్లయితొలగించండి

  31. పాలకడలి యందు ప్రభవించి శ్రీదేవి
    కోరి హరికి మాల కూర్మి తోడ
    వేసి సతియు కాగ,వేడ్కనా గిరిజ,శ
    ర్వాణి రాణియయ్యె భర్గునకును"

    రిప్లయితొలగించండి