22, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2881 (చారును దూరముంచిననె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్"
(లేదా...)
"చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

89 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

తోరపు బొజ్జ రాదనుచు దూరము నుంచుచు కీటకమ్ములన్
నారులు మెచ్చెడిన్ తనువు నాదగు తంత్రము నిచ్చునంచు తా
వారము వారమున్ విడక బామ్మయె తెచ్చెడి నాముదంపుదౌ
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా

కంది శంకరయ్య చెప్పారు...

చేరెను పెద్ద పుండది విశిష్టముగా నుదరమ్ములోన శా
రీరక సౌఖ్యమున్ వలయు రీతిగ నుంచగ పుల్లనైన యా
హారము తింత్రిణీ మిళితమైనది వర్జ్యముగా నెరింగి యా
చారును దూర ముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా.

విరించి చెప్పారు...

కోరిరి పుత్రులెల్లరని కూరిమి జూపుచు శాకపాకముల్
భూరిగ జేయనేమి యట మూతలఁ బెట్టుట మర్చిపోవగా
చారున జారిపడ్డదొక సాంజన మింకను బ్రహ్మ ఘోషమౌ
చారును దూరముంచిననె సాగును జీవన మద్భుతమ్ముగన్

విరించి చెప్పారు...

పేరిమి పేర పూరుషుల విత్తము చిత్తము దోచునట్టి యా
జారిణి చిచ్చుబెట్టె గద చక్కగ సాగెడి కాపురమ్ములో
వేరు పథమ్ము లేదికను విజ్ఞత తోడ చరించి వేశ్య నాం
చారును దూరముంచిననె సాగును జీవన మద్భుతమ్ముగన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

దారుల పొంచుచు సతతము
కోరిక తీరగ కులుకుచు క్రూరపు రీతిన్
నారుల వెన్నాడు దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్!

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

మారుని జోలికిన్ జనక , మత్తున మున్గక , యెల్లవేళలన్
ధీరమనస్కుడై హరి మదిన్ దలపోయుచు భక్తియుక్తులన్
పారము చేరగావలయు ., పాములు కామగుణాదికమ్మటం....
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

కంది శంకరయ్య చెప్పారు...

సర్పతుల్య గుణషట్కాన్ని దూరముంచాలన్న మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

👏👏👏

pks kumar చెప్పారు...

కోరికలు తీర్చ లేదని
పోరాడక,పతికి సతము బోదు నొసగుచున్,
కారిసములందెపుడు వా
చారున్ దూరన నుంచ సౌఖ్యం బబ్బున్

వాచారు = దుఃఖము, బోదు = ప్రేమ, కారిసము = కష్టము

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ధీర మనస్కులై మహిత దివ్య వికాస పు కార్య కర్త లై
సారపు ధర్మ వర్తుల యి సత్ కృప తో జనాళిగాచి స
త్కా ర మొనర్చి సజ్జ నుని గార వ మొ ప్ప నుతి oచు న్ దురా
చారు ను దూర ముం చి ననె సాగును జీవిత మ ద్భు తం బు గా

Kota Rajasekhar చెప్పారు...

గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2881
సమస్య :: చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా.
*చారును (రసమును) దూరంగా ఉంచితే జీవితం సరసంగా అద్భుతంగా ఉంటుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: చారుమతి అనే చక్కనైన పేరు గల స్త్రీ మన వీధిలో ఉంది. ఆమె పేరులో మంచిబుద్ధి ఉంది కానీ నడతలో మంచిబుద్ధి లేదు. ఆమె సహజంగా దుర్బుద్ధి గలిగినది. మంధర లాగా మాట్లాడుతూ చాడీలు చెబుతూ సంసారాలను కూల్చివేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమెను అందఱూ *చారు* అనికూడా పిలుస్తూ ఉంటారు.
కాబట్టి ఆ ‘చారు’ను కాస్త దూరంగా ఉంచు. అప్పుడే నీ కాపురం చక్కగా సాగుతుంది” అని క్రొత్తగా వచ్చిన కోడలికి అత్తగారు హితవు పలికే సందర్భం.

‘చారుమతీ’ సునామమున చక్కగ నుండెడి భామ యోర్తు, సం
సారము గూల్చు కొండెముల సంతతమున్ వచియించు, చారనన్
పేరును బెట్టి పిల్చినటు వేగమె వచ్చును, పిల్వబోకు మా
చారును, దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-12-2018)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మూడవ పాదం లో నుతిoచు చు న్ అని సవరణ చేయడ మైనది

కంది శంకరయ్య చెప్పారు...

పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బోదు నొసగుచున్' అర్థం కాలేదు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "సత్కృపతోడ" అంటే సరి.

కంది శంకరయ్య చెప్పారు...

రాజశేఖర్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా సత్యనారాయణ
కౄరునితో నగు స్నేహము
బారున్నెన్నాళ్ళు శాంతి పాటలు పాడన్?
చేరడు చంకన దుష్ట వి
చారున్ దూరమున నుంచ సౌఖ్యంబబ్బున్

కంది శంకరయ్య చెప్పారు...

డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రూరుని' అనండి.

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా సత్యనారాయణ
కోరిన కోర్కెలన్ గనగ గొప్పగ రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్
కూరిమి బెంచ బ్రాంతపు దుకూలము నెల్లల గాచు కేంద్రపు
న్నారడి గాన జాలనిదె యైక్యతయున్ ఘన దేశ భక్తియు
న్నేరికి నెట్లు జెప్పుదుము? యీమన గుజ్జనగూళ్ళ పుల్సునున్
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా!

కంది శంకరయ్య చెప్పారు...

డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

సమస్య :-
"చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్"

*కందం**

వారము వర్జ్యమని పనులు
తీరక నడ్డుపడు జనుని,దేవతలంటూ
మారని మనిషిని, మూఢా
చారున్, దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్
.....................✍చక్రి

A.Satyanarayana Reddy చెప్పారు...

ధారుణి పై మనుష్యుల నధర్మము వైపు మరల్చి నిత్యమున్
ఘోరపు జీవితమ్ములను కూర్చుచు నుండును కామ క్రోధముల్
చేరదుమంచి, మానవుల చేటుకు మూలము దుష్టషట్కమం
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

ధారయు లేనితిండి ధర దయ్యపు తిండని,బాడిలేనిచో
పాఱులుబాడుతిండియన బాకముషడ్రుచిపూరితంబునౌ
చారులె షడ్రసాల జవసత్త్వము లై రుచిగూర్చుజేర్చు నే
చారునుదూరముంచినను సాగును జీవితమద్భుతంబుగా?

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

మారరు కామక్రోధమద మత్సర లోభవిమోహవైరు లం
*చారునుదూరముంచిననెసాగునుజీవితమద్భుతంబుగా*
నారినిగోరి రావణు డనంతుని జంపహిరణ్యకశ్యపుం
డారరె వాలి పౌండ్రకుడు నా కురుఱేడు నయోధ్యఱేడులున్

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

హారిన్శ్రీహరినిసదా
చారుజగద్గురుమురారిశౌరినిదూరెన్
నారియెమరుమాయ! దురా
*చారున్ దూరమున నుంచ సౌఖ్యంబబ్బున్*

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

*చారు చారే!*

సందర్భము: వంటవాడి ఉవాచ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
జోరుగ సలసల మరిగెడు
తీరుగ వేడిగను నున్నది సుమా! ఇది చే
జారిన నొలుకునొ యేమో!
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.12.18
-----------------------------------------------------------

seethadevi gurram చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seethadevi gurram చెప్పారు...

నారదువలె హరిజేరక
దీరుగ నింద్రియములందు తిరుగుచు సతమున్
ఘోరాఘము మున్గు దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యంబబ్బున్

seethadevi gurram చెప్పారు...

హరి జీరక గా చదువ ప్రార్ధన!

కంది శంకరయ్య చెప్పారు...

చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంటూ' అనడం వ్యావహారికం. "దేవత లనుచున్" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

ఫణి కుమార్ తాతా చెప్పారు...

ధారుణి యందు మానవులు ధర్మము వీడక కామ క్రోధముల్
మీఱక లోభమోహములు మెండుగ గాక మదంబు కుంచుచున్
బేరిమి మత్సరంబువిడి పీడిత దేహము నశ్వరంబటం
చారును దూరముంచిననె సాగును జీవితమద్భుతమ్ముగా

కంది శంకరయ్య చెప్పారు...

శంకర్ గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

డా. వెలుదండ వారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఫణికుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

subbarao చెప్పారు...

ఆరయనాకుగాదెలిసెనష్టదరిద్రుడు,దుష్టుడామతా
చారునుదూరముంచిననెసాగునుజీవితమద్భుతంబుగా
వారలుమోసగాండ్రుదమవాక్కులచేతనుమభ్యవెట్టుచున్
భూరిగసంపదల్గొనుచుబూర్తివిరాగిగజేతురేసుమా

subbarao చెప్పారు...

సర్ ! ఈవారం సమస్య తెలుపగలరు

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈవారం ఆకాశవాణి వారి సమస్య...
"దొండతీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"
మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
padyamairhyd@gmail.com

Kota Rajasekhar చెప్పారు...

శ్రీ గురుభ్యో నమః

subbarao చెప్పారు...

కిరుకిరుచప్పులతోడను
గురఖావలెదిరుగుచుండిగుట్టుగఱేయిన్
నరకొరగాదోచుదురా
చారున్దూరముననుంచసౌఖ్యంబబ్బున్

V.V. Balakrishna చెప్పారు...

చారు యనుచు దిరగకురో
పోరివెనుకనీవు, మాను పోకిరి పనులన్
తీరుగ చదువుము, వినరో
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

( భారతీయులను విభజించే నవీనశకునులు )
భారతదేశపు బౌరుల
నూరక దక్షిణులనుచును , నుత్తరులనుచున్
దారుణముగ బల్కు దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్ .

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

ఆరయవంచనాత్మకునికాశ్రయమౌసుజనాత్మచాలు నాం
*చారునుదూరముంచిననెసాగునుజీవితమద్భుతంబుగా*
హారిమురారిగోకులవిహారిముకుందరమాధవాగలిన్
గోరకువర్ణసంకరము,గోపికగాదిది !ద్వాపరంబొకో!
(బీబీనాంచారును వెంకటేశ్వరుడు ప్రేమించాడని తెల్సి ,ఇది తగదనీ,ద్వాపరయుగంకాదనీ ,కలియని ,వర్ణసంకరమనీ లక్ష్మీదేవి చెబుతున్న భావనతో..)

V.V. Balakrishna చెప్పారు...

తీరుగ విభూతి రేఖలు
గారవమునగొని శివశివ గానము తో సం
చారము జేసెడి దంభా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

కంజర్ల రామాచార్య. చెప్పారు...

శ్రీకృష్ణలీలామృతము.

కోరిక మీర ముద్దొసగఁ, గూర్మి రదమ్మును జేర్చు మోవిపై,
జేరినఁ జంకఁ బెందొడలఁ జేయినిఁ గృష్ణుడు దూర్చు నెక్కడో!,
పేరిమి దాపున న్దగడు వీడట, నో సఖి! ధూర్తుడౌ దురా
చారును దూరముంచిననె సాగును జీవితమద్భుతంబుగన్.

కంజర్ల రామాచార్య
కోరుట్ల.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మేరు వొసంగినఁ బృథివీ
సార మొసంగిన మనమున సంతృప్తి యనన్
నేరని వానిని నిత్య వి
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్


వారక దుష్ట చిత్తు లగు వారినె కాదు సుమా కడంగి యే
తీరున నొప్పునో తలఁచి ధీరత యోర్పును నైపుణంబు నే
పారఁగ నొవ్వ నీక మృదు వాక్య పరంపర దుష్ట సంఘ సం
చారు ను దూర ముంచిననె చాగును జీవిత మద్భుతమ్ముగా

seethadevi gurram చెప్పారు...

దూరము జేయుచున్ చలువ దోషము జార్తుల నింటివైద్యమై
చారను దివ్యనామమున చక్కగ బిల్వగ సారవంతమై
వారికి వీరికిన్ యనక వాసిగ నందరి ప్రీతిపాత్ర మే
చారును దూరముంచినను సాగును జీవిత మద్భుతమ్ముగా?

జార్తి = జ్వరము

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

కోరిక తీరగా నుడివి క్రూరపు రీతిని వేదవాక్కులన్
బోరును కొట్టుచున్ విరివి పొంకము మీరగ బల్ల గుద్దుచున్
వారము వర్జ్యమున్ విడిచి భారిగ నీతులు పల్కెడిన్ సదా
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా :)

eshwarappak1948 చెప్పారు...

పోరున్ సలిపెడిసమయము
క్రూరత్వము నందుగాక కుటిలత్వమునన్
దారులుగను దుష్టదురా
చారున్ దూరముననుంచ?సౌఖ్యంబబ్బున్

V.V. Balakrishna చెప్పారు...

సారణ రోగము బుట్టగ
ఆరోగ్యము చేకురునది ఆకర్ణించన్
మీరును మితముగ తినుచున్
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

BVVHBPrasadarao చెప్పారు...

మారణ హోమమాపి, తగ మంచిని పెంచుచు, తోటివారికిన్
కూరిమి సాయమిచ్చి, పలుకుల్ చిలుకన్ మధురంపు వాక్సుధల్
ధారుణిలోన పోవలయు ధార్మిక మార్గమునందునన్ - ‘దురా
-చారు’ ను దూరముంచిననె సాగును జీవితమద్భుతంబుగా

- బి. వి. వి. హెచ్.బి. ప్రసాదరావు, గుంటూరు

BVVHBPrasadarao చెప్పారు...

తారక తాపసోత్తములు తప్పని తల్చిరి, క్రోధ, లోభ, సం
బారములన్ జితేంద్రియత; పాపపు పంకిలమంటునంచు, న
వ్వారలు షడ్వికారముల, పల్మరు రోసిరి, వాని, దోషమం
చారును(చు+ఆరును) దూరముంచిననే సాగును జీవితమద్భుతంబుగా.

- పులిపాక సావిత్రి, నర్సరావుపేట

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

నా ప్రయత్నం :

కందం
మీరెను క్రొవ్వులు మనకా
హారమ్మున, జీర్ణ క్రియకు నంచిత మనుచున్
జేరుచ విందున, నెటులన్
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్?

ఉత్పలమాల
ఆరని దీపమట్లు గృహమందున నిత్యము వెల్గులీనుచున్
భారము కాక భర్తకిల పంచుచు సేవల నారురీతులన్
దీరిన ధర్మపత్నిమది తేలిక నుండగఁ జూచి కంట వా
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా

(వాచారు = ఏడ్పు, దుఃఖము)

Prasad చెప్పారు...

బీరే సర్వస్వమ్మని
బారుల వెంటంబడియెడి బండితుడైనన్
సారా దాసుడగు దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్"

A.Satyanarayana Reddy చెప్పారు...

నారులు సౌందర్యమ్మును
నేరుగ చూపించు చుండ నిరతము బయలున్
నేరములు పెరిగె నింతులు
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్

sailaja చెప్పారు...

దారను, తల్లితండ్రులను, దప్పక జూచుచు ప్రేమమీఱగన్
పేరిమి తోడ బంధువులు బెద్దలు నాప్తుల గారవించుచున్
ధారుణి దైవమున్ గొలిచి ధర్మము దప్పక తృప్తిగల్గి, వా
చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగన్!!!

BVVHBPrasadarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

తీరగు నీతి పథమ్మున
గారవముగ బ్రదుకు నడపు ఖ్యాతులు సతమున్
దారయె సరిలేని దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్.

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెప్పులతోడను... రేయిన్...' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చారు + అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "చా రనుచును దిరుగకురో" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

జంధ్యాల వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రామాచార్య గారూ,
మీ పూరణ శృంగార భరితమై (కొద్దిగా మోతాదు మించినట్టుంది) బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీరికిన్ + అనక' అన్నపుడు యడాగమం రాదు. "వారికి వీరి కంచనక" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
సదాచారున్నే దూరముంచలా? బాగుంది మీ సరదా పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

సారము గల్గినట్టిదగు సామయికమ్మును పూంచుచున్ సదా
తీరగు రీతిని బ్రదుకు తిన్నన జేయుచు చెంగలించెడిన్
ధీరుడు నిచ్చలున్ తనను ద్వేషముతో విహసించు నా యనా
చారును దూరముంచిననె సాగును జీవితమద్భుతమ్ముగా.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

"అతి సర్వత్ర వర్జయేత్"

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

"పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః"

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందంములు.
రాను రాను శంకరాభరణ సాహిత్య ప్రాంగణములో నసభ్య పద జాల భూయిష్ట పూరణములు చోటు చేసుకొనుట హృదయ విదారకముగా నున్నది.

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏