24, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2939 (జ్ఞానుల పాదధూళి...)

కవిమిత్రులారా 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .. 
"జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్" 
(లేదా...)
"జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ"
(డా. రాంబాబు గారికి ధన్యవాదాలతో...) 

36 కామెంట్‌లు:

  1. మానిని మానము దోచుచు
    మౌనులమని దొంగ జపము,మౌఢ్యముగల్గన్
    ధ్యానము నందని కడు న
    జ్ఞానుల పద ధూళి పాప సంగతి గూర్చున్

    రిప్లయితొలగించండి
  2. "ఉదర నిమిత్తం బహుకృత వేషః"

    దానము ధర్మములనుచున్
    దీనుల వంచనల జేసి తీర్థము లిడెడిన్
    హీనపు బుద్ధుల కపట
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  3. భానుని గొలిచిన నిరతము
    జ్ఞానుల పదధూళి, పాప సంగతిఁ గూర్చున్
    హీనుల దుష్కృత్యములను
    కానుకలుగ నిచ్చు నంట కలి దైత్యుం డై

    రిప్లయితొలగించండి
  4. ధ్యానము చేసె డు భంగిమ
    తో నటి యించుచు భజన ల తో కపటుండై
    మౌను లు గా మెలగెడు య
    జ్ఞానుల పద ధూళి పాప సంగతి గూర్చు న్

    రిప్లయితొలగించండి
  5. ధ్యానతపస్సమాధిజపతర్పణతత్పరమాన్యచిత్తులౌ
    జ్ఞానులపాదధూళి శిరసావహియించిన భూరిపుణ్యమౌ,
    మౌనివిశేషకీర్తిగతమానవతీధనశీలవంచనా
    జ్ఞానుల పాదధూళి శిరసావహియించిన ఘోరపాపమౌ.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి


  6. ఆననము చూడగ తెలియు
    నే నమ్మదగిన మనుజులనే నమ్మవలెన్
    మీనాక్షి జిలేబీ య
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. వీనుల విందగు మాటల
    తో నెనరును జూపునట్లు దుర్మార్గు లిలన్
    పేనుదురు వలలు, కపటపు
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీనులఁ దేనెలన్ గురియు వీరుల గాథలఁ గల్పితమ్ముగాఁ
      బేనుచుఁజెప్పి,గానముల వెచ్చనినెత్తురుఁ బొంగజేయుచున్
      దీనత జూచి జవ్వనులఁ దీవ్రపుఁ దోవల బెట్టు క్రూరులౌ
      జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ

      తొలగించండి
  8. ధీనిధులను ద్వేషించుచు
    మానక దుష్కృతము చేయు మానవు డొకడున్
    వాని సుత కిట్లు తెల్పెను
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి


  9. జ్ఞానమె తెల్పు న్యాయమును,జ్ఞానమె నేర్పును ధర్మమెద్దియో!

    జ్ఞానమె తెల్పు సత్పథము,జ్ఞానమె సంపద మానవాళికిన్

    జ్ఞానుల సన్నిధంబె ఘన నాకపథంబును దెల్పునోయి;య

    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  10. పూనికతో సేవింపుము
    మానవతిగ మారెరాయి మా రాఘవునిన్
    హీనుల సాంగత్యమిలను
    ఙ్ఞానుల,పాదధూళి,పాపసంగతి గూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మానసమందునన్ దొలగు మాంద్యపుబుద్ధులు పావనాత్ములౌ
      ఙ్ఞానుల పాదధూళి శిరసావహియించిన;ఘోరపాపమౌ
      సానుల సంగతిన్ దనదు సాధ్విని మిక్కిలి సొక్కజేయుచున్
      హీనపుజేష్టల మిగుల హింసనుబెట్టగ దల్లిదండ్రులన్

      తొలగించండి


  11. వేనకు వేలు జ్ఞానులము వేండ్రపు స్వాముల మంచు వీధులన్
    ధ్యానము చేయుచుందురవధానుల మంచు నిషాని భంగులన్
    తానము లాడుచుందురు! నిదానము మేలగునే జిలేబి! య
    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. దీనులగాచెదమనుచును
    దానగుణముగల మనసులదాతృత్వమునన్
    గానగ దోచెడు కుహనా
    *"జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్"*!!

    రిప్లయితొలగించండి
  13. జ్ఞాని నటంచు నటించుచు
    మానవులకు మాటలందు మత్తు గొలుపుచున్
    దానము లిడమని గొను న
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  14. దేనిని జూచుమీదనిక దేనినిజూచుట కిచ్ఛగించడో
    దేనినిజేరుచోమరల తిర్గి భవంబులనందబోడొకో
    దేనిని నేర్చుకొన్ననిక దేహియటంచును జేరడార్యులన్
    దానిని జ్ఞానమందురని ధ్యానసమాధులు దన్నిమిత్తమై
    దీనులు దారికైజనగ తెల్యనిమూఢులు మోహబద్ధు ల
    జ్ఞానులపాదధూళి శిరసావహియించిన ఘోరపాపమౌ

    రిప్లయితొలగించండి
  15. ఒనగూర్చును సుఖశాంతుల
    జ్ఞానుల పదధూళి, పాప సంగతిఁ గూర్చున్
    మనుజులకు నాపదల సత
    మును, కనుగొని వారికి నెడముగ మనుడెపుడున్

    రిప్లయితొలగించండి
  16. కానము మనమెన్నటికిని
    ఙ్ఞానులపదధూళి ,పాపసంగతిగూర్చున్
    ఙ్ఞానవిహీనుల కలయిక
    ఙ్ఞానమె యికనిచ్చుమనకు సమయస్ఫూర్తిన్

    రిప్లయితొలగించండి
  17. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మీనము మేషమున్ కొలిచి మెండుగ లెక్కలు వేసికూర్చుచున్
    బోనము దండిగా కుడిచి బోనసు కోసము గోలజేయుచున్
    త్రేనుచు భూమికంపనము తెల్పగ జాలని భూమిశాస్త్రవి
    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ :)

    రిప్లయితొలగించండి
  18. నా ప్రయత్నం :

    కందం
    మానవులారా! మీదగు
    దానవతను రూపుమాపి ధన్యులఁజేయన్
    బూనితినని దోచెడు న
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్

    ఉత్పలమాల
    మానవ నైజమేమియొ? యమాయకులౌదురు భక్తిమత్తులో!
    దీనత లొంగిపోవుచు నధీనతఁ గొల్తురు దొంగ సాములన్
    వైనముఁ దెల్సి మ్రొక్కరయ! పావనమూర్తుల పుణ్యమెంచి య
    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ

    రిప్లయితొలగించండి
  19. కానగరానిలోకమును గాంతుము విప్రునివోలెనేసుమా
    ఙ్ఞానులపాదధూళి శిరసావహియించిన,ఘోరపాపమౌ
    దానమునిత్తురాయనుచుదండనజేయుచుదిర్గిపంపుచో
    నేనరునైననాహిమగిరీశుడుదప్పక శిక్షజేయుగా

    రిప్లయితొలగించండి
  20. ఙానానందము లించుక
    లేని, పరమ పధము నందు లేశమయిననూ
    కానపడని చింతనగల
    ఙానుల పదధూళి పాప సంగతి గూర్చున్

    ఙానమూ ఆనందమూ ఏమీ లేని భక్తి మార్గం గురించి ఏమాత్రం ఆలోచన లేని ఙానానందుల పాదసేవ పాపమే ఇస్తుంది

    రిప్లయితొలగించండి


  21. జ్ఞానము బోధించెదనని
    మానుగ పలుకుచు కపటపు మాటల తోడన్
    ధ్యానము నటియించెడున
    జ్ఞానుల పదధూళి పాపసంగతి గూర్చున్.

    రిప్లయితొలగించండి
  22. ఆననమందు దైవ కళ యద్భుత రీతిని పల్లవించగా
    దీనులఁ బ్రోచుచున్ చెలగు ధీరుల పూజల దన్ప మేలగున్
    పూని మనోహరమ్మయిన భూసుర వేషము మోసగించు న
    జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ

    రిప్లయితొలగించండి
  23. జ్ఞానామృతమును పంచెడు
    జ్ఞానుల మనుచును పలుకుచు చాటుగ నెపుడున్
    మానినుల తో కులికె డ
    జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  24. అనునిత్యము తా దప్పక సం
    ధ్యను జేయని బ్రాహ్మణ గుల సంజాతులైనన్
    బెను డంభమున నగుపడు న
    జ్ఞానుల పదధూళి పాప సంగతి గూర్చున్

    రిప్లయితొలగించండి
  25. దీనుల దీనత దీర్చక
    మానిని మర్యాదలన్ని మంటనుగలిపే
    దానవ ధర్మ ప్రభోద
    జ్ఞానులపదధూళి పాపసంగతిగూర్చున్

    రిప్లయితొలగించండి
  26. ఈ నర జన్మ మొక్కటె మహీతల మందు ప్రశస్తమంచు నా
    మానవ జాతి సద్గతికి మార్గము జూపెడు దైవ తుల్యమౌ
    జ్ఞానుల మంచు చెప్పుచును సానుల తోడ చరించు నీచుల
    జ్ఞానుల పాదధూళి శిరసా వహియించిన ఘోరపాపమౌ.

    రిప్లయితొలగించండి
  27. సూనృత వాక్యం బియ్యది
    కానేర దసత్య వాక్కు కలనందైనన్
    మానవు లిండ్లను దాకిన
    జ్ఞానుల పదధూళి పాప! సంగతిఁ గూర్చున్

    [సంగతి = జ్ఞానము]


    మానిత ధర్మ వర్తనుఁడు మాన్య విభీషణు మాట లెంచ కా
    దానవ లోక రక్షకుఁ డధర్ముఁడు రావణ నామ సంతత
    ధ్యాన పరాయ ణాత్ములయి దైత్య వరాజ్ఞ, తృణీకరించి సు
    జ్ఞానుల పాద ధూళి, శిరసా వహియించిన ఘోర పాపమౌ

    రిప్లయితొలగించండి
  28. ధేనుపయః ప్రపూత నుతధీ పరిపూర్ణులు , భక్తితత్త్వవి...
    జ్ఞాననిధుల్ గురూత్తముల సన్నిధి మ్రొక్కుమటన్న , కన్ను మిన్
    గానక యేదొ మొక్కుబడిగా మదినెంచి తృణీకరించుచున్
    జ్ఞానుల పాదధూళి శిరసావహియించిన, ఘోరపాపమౌ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  29. జ్ఞానము బోధించెదనని
    మానుగ పలుకుచు కపటపు మాటల తోడన్
    ధ్యానము నటియించెడున
    జ్ఞానుల పదధూళి పాపసంగతి గూర్చున్.

    రిప్లయితొలగించండి
  30. జ్ఞానము నార్జించియుఁ గన
    మానవతది మృగ్యమై సమాజములోఁ దా
    హీనపు గుణమెంచెడి య
    "జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్"

    రిప్లయితొలగించండి