28, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2943 (సీతాపతి యనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా"
(లేదా...)
"సీతావల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్"

96 కామెంట్‌లు:

  1. ప్రీతిగ శ్రీరాముడు గద
    సీతాపతి యనఁగఁ;...జంద్రశేఖరుఁడు గదా
    మా తెలగాణకు దైవము
    చేతులతో దండమిడుదు చెన్నుగ నన్నా!

    రిప్లయితొలగించండి
  2. మాతను వనముల కంపెను
    సీతాపతి యనఁగఁ , జంద్ర శేఖరుఁడు గదా
    సీతల నగమున మెండుగ
    ఖాతరు జేయక తపమున కాంక్షితు డగుచున్

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'శీతల నగమున నుండును' అనండి.

    రిప్లయితొలగించండి
  4. మాతను వనముల కంపెను
    సీతాపతి యనఁగఁ , జంద్ర శేఖరుఁడు గదా
    శీతల నగమున నుండును
    ఖాతరు జేయక తపమున కాంక్షితు డగుచున్

    రిప్లయితొలగించండి
  5. ఖ్యాతిని గలిగిన రాముడె
    సీతాపతి యనఁగఁ, జంద్ర శేఖరుడు గదా
    బూతని దాల్చి శశానము
    లో తిరు గాడెడనఘుండు లోకేశ్వరుడే.

    రిప్లయితొలగించండి
  6. ( శంకరార్యులు స్కూల్లో విద్యార్థులను ప్రశ్నించి జవాబులు
    రాబట్టుతున్నారు )
    " గీతా ! చెప్పుము ! రాము డేమని మహా
    కీర్తిన్ వెలారించెనో ?
    జేతా ! పల్కర ! పార్వతీపతిగ జే
    జేలందినాడెవ్వరో ?
    ప్రీతా ! నీవు వచింపు ! మెవ్వనిగ నే
    పేర్గాంచె శ్రీకృష్ణుడే ? "
    "సీతావల్లభు " " డిందుశేఖరుడు " " వా
    సిం గాంచె గంసారిగన్ ."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. శార్దూలవిక్రీడితము

    శ్రోతల్మెచ్చెడు రూప రావములతో సొంపారు చాతుర్యమున్
    జైతన్యంబున ప్రేక్షకాళిమదిలో సాగెన్ విభిన్నంబుగా
    ప్రీతిన్ గూర్చడె యింట బైట నటుడై వేవేల చిత్రంబులన్
    సీతావల్లభుఁ డిందుశేఖరుఁడు వాసింగాంచెఁ గంసారిగన్ 

    రిప్లయితొలగించండి
  8. భూతేశుడు, శూలధరుదు,
    సీతాపతి, యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!
    ప్రీతిని తిరిపెమునెత్తుచు
    శీతనగమ్మున వసించు చేయుచు తపమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సీతాపతి'కి అన్వయం? దానిని సంబోధనగా స్వీకరించాలా?

      తొలగించండి
  9. సందర్భము శివుడు - హాలహల భక్షణము.

    ఆలోల జలధి లోపల
    బుట్టిన గరళమును భక్షించె భవుడతి బ్రీతిన్
    జగమున శివునికి సాటి మరి గలడ
    సీ, తా పతియన జంద్రశేఖరుడు గదా!


    శుభోదయం,
    నా ఈ ప్రయత్న దోషములు సరిజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ మూడవ పాదాలలో గణదోషం. రెండవ పాదంలో యతి తప్పింది. "...గరళమును మ్రింగె పురరిపు డెలమిన్। జగమున శివుని సరి గలడ।సీ..." అనండి.

      తొలగించండి
    2. ఆలోల జలది లోపల
      బుట్టిన గరళమును మ్రింగె పురరిపు డెలమిన్
      జగమున శివుని సరిగలడ|
      సీ తా పతి యనగ జంద్రశేఖరుడు గదా!

      తొలగించండి
  10. ధన్యోస్మి🙏
    సరి చేసుకొనెదను. మీ ఆశీస్సులు సదా కోరుతూ,

    యజ్ఞ భగవాన్

    రిప్లయితొలగించండి
  11. మాతాసీతవరించెను
    *"సీతాపతి యనఁగఁ; జంద్రశేఖరుఁడు గదా"*
    భూతపతి త్రిపురహరుడును
    మాతాహైమావతిపతి మరునునిదున్మెన్

    రిప్లయితొలగించండి
  12. మాతాసీతముఖాబ్జభృంగమగు రామాఖ్యుణ్ణిగొండాడెదన్
    మాతాహైమవతీశ్వరుండిడుతసంపన్నాత్మసంశుద్ధినిన్
    మాతారుక్మిణివల్లభుండుహరియేమర్థించెగంసాదులన్
    *"సీతావల్లభుఁ; డిందుశేఖరుఁడు ;వాసిం గాంచెఁ గంసారిగన్"*

    రిప్లయితొలగించండి
  13. ప్రీతి గ రాముని బిలు తురు
    చేత ము రంజిల్ల నెటుల ?చెలువ ము గాగ న్
    మాత గిరి జా పతి యెవరు ?
    సీతా పతి యనగ ;చంద్ర శేఖరు డు గదా !

    రిప్లయితొలగించండి
  14. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    సీతాపతి యనఁగఁ జంద్ర శేఖరుఁడు గదా

    సందర్భము:
    "చేతో మోదము.. అంటే మనసు కానందం.. అందరూ యీయగలిగింది అదే!
    శీతాద్రి యల్లుడు అంటే శివుడు. కేవలం చేతో మోదమే కాదు యెంతో ప్రీతితో తన శరీరంలోని అర్ధ భాగాన్ని కూడ పంచి యిచ్చాడు తన శ్రీమతియైన పార్వతికి. అలా పంచి యీయగలిగినవా డాత డొక్కడే!
    అందుకని భర్త అంటే చంద్ర శేఖరుడే సుమా!"
    అని శ్రీ రాముడు సీతాదేవికి చెబుతూ వున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ప్రీతిగ తన మేన సగము

    చేతో మోదంబుతోడ శ్రీమతి కిచ్చెన్

    శీతాద్రి యల్లు డొకడే

    సీతా!..." పతి యనఁగఁ జంద్ర శేఖరుఁడు గదా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    28.2.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  15. ఖ్యాతిని పొందెను రాముడు
    సీతాపతి యనఁగ, జంద్రశేఖరుడు గదా
    ప్రీతిని సగ దేహంబున
    మాతను జేర్చుచు తిరిగెడి మా జనకుండే

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    ఈశ్వర ఉవాచ...
    శ్రీరామ రామ రామేతి...


    చేతో మోదము గూర్చు రామకథ ప్రాచేతః ప్రణీతంబు , శ్రీ
    సీతావల్లభుఁ డిందు శేఖరుఁడు , వాసిం గాంచెఁ గంసారిగన్
    ప్రీతిన్ భాగవతమ్మునందతడె శ్రీ విష్ణుస్వరూపమ్ము , తత్
    ఖ్యాతిన్ దెల్పినదిందుశేఖరుడు దివ్యంబైన మంత్రమ్ముగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఎందు" శేఖరుడు సార్?
      "ఇందు" శేఖరుడు వోయ్!

      తొలగించండి

    2. మైలవరపు వారి బుర్రే బుర్ర !

      ఆహా ఎందు శేఖరుడు !

      అన్నిట్లోనూ శేఖరులు మా మైలవరపు మురళీ కృష్ణులు !


      జిలేబి

      తొలగించండి
  17. ప్రీతిగ నిటులనె చంద్రుని
    మాత యభినయించు తన కుమారుని గాంచన్
    'సీతాపతి' నాటకమున
    సీతాపతి యనగ జంద్రశేఖరుఁడు గదా !

    రిప్లయితొలగించండి
  18. రాతిన్నాతిగమల్చెనెవ్వడుధరారాతిన్ వధించెవ్వడున్
    భూతేశుండును గౌరివల్లభుడు సమ్మోహంబుగూల్చెవ్వడున్
    మాతాదేవకిగర్భసంభవుడు దుర్మార్గ్రుండ్ర నిర్జించియున్
    *"సీతావల్లభుఁ; డిందుశేఖరుఁడు ;వాసిం గాంచెఁ గంసారిగన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వధించె నెవ్వడున్, గూల్చె నెవ్వడున్' అనడం సాధువు.

      తొలగించండి
  19. కందం
    పాతకముల బాపునతడు
    సీతాపతి, యనఁగ చంద్రశేఖరుఁడుగ దా
    నాతిని వరాననాయని
    ప్రీతిగ రఘురాము నామ వేడుక దెలిపెన్

    రిప్లయితొలగించండి
  20. నా పద్యములో ప్రాస మరచితిని గురువర్యా.
    క్షంతవ్యుణ్ణి

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



    ప్రీతిన్ గొల్చిన , నే మహామహుడు పాలించున్ సదా భక్తులన్ ?

    భూతేశుం డయి , ప్రోవ దివ్యుల విషంబున్ గ్రోలె నెవ్వారలో ?

    ఖ్యాతిన్ గాంచె బవిత్ర యాదవ కులోద్యత్కాంతు డేరీతిగా ?

    సీతావల్లభు | డిందుశేఖరుడు | వాసిం గాంచెఁ గంసారిగా |


    [ కాంతుడు = చంద్రుడు ]


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  22. పోతన యనగా రక్కసి
    పూతన కడుపున ముదముగ బుట్టిన వాడే
    పాతకుడేగద పార్థుడు
    సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ ఈ పలుకులు ఎవరివన్నట్టు?

      తొలగించండి
  23. తాత తన మనుమరాలు సీత తో

    తాతా! యింత ఘనమయిన
    భూతలమున పుట్టినట్టి భూతగణముకున్
    నేత యెవరంటివిగదా
    సీతా! పతి యసగ జంద్రశేఖరుడు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గణమునకున్' అనడం సాధువు.

      తొలగించండి
    2. 🙏🏽 గురుదేవా
      తాతా! యింత ఘనమయిన
      భూతలమున పుట్టినట్టి భూతగణంబున్
      త్రాత యెవరంటివిగదా
      సీతా! పతి యసగ జంద్రశేఖరుడు గదా!

      త్రాత= కాచువాడు

      తొలగించండి
  24. ఖ్యాతిన్ శైవ ధనుస్సు ద్రుంచి శుభముల్ గైకొన్న వారెవ్వరో?
    భూతాత్ముండును,సర్ప భూషితుడు,శంభుండెవ్వడో చూడగన్?
    పంతంబొప్పగ మేనమామను వధింపన్ కృష్ణుడెట్లాయెనో?
    సీతా వల్లభు;డిందు శేఖరుడు; వాసింగాంచె కంసారిగన్.

    రిప్లయితొలగించండి


  25. జిలేబి లాంటి పెండ్లాము దాటి తాళ లేక ఎక్కడికి పోయేడో ఆ పతి :) సన్నాసుల్లో కేమన్నా పోయేడా :(


    ఏ తావున గలడో ఓ
    సీతా, పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!
    యేతావాతా గీసిన
    గీతను దాటడు పొడవడు గిడవడు గదుటే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. శిష్యునితో గురువుగారు

    శీతనగంపు నివాసిగ
    చేతనమందున దలపకు చిన్మయుడతడే
    భూతాత్ముడు పావన సుర
    సీతాపతి యనగ జంద్రశేఖరుడు గదా!

    సీత = గంగ (ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి


  27. మాతా సాచివిలోకితంబుగ సదా మామీద జూపన్ కృపన్!
    తాతాచార్యుల శిష్యురాలిని నమః ! తాత్పర్యమున్ చేర్చుచున్
    నేతావున్ విడగొట్టి పూరణను నేనీమారు చేయన్ వెసన్
    "సీతావల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఎట్లా విడగొట్టాలో మొదటి పూరణలో చూపారు కదా!

      తొలగించండి
  28. ఖ్యాతినిగనె సతికిని తా
    ప్రీతిగ సగమిచ్చి మేను ప్రియ ధవుడగుచున్
    ఏతావాతా దేలెను
    సీతా! పతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  29. మా తారకుడాతడు శ్రీ
    సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా
    తాతలు దండ్రులు జెప్పిరి
    నాతో శివకేశవాయనగ నొక్కరనిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి


  30. ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
    త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
    వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
    సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!


    హమ్మయ్య!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి


    2. మా "ఇందు శేఖరుడు కూడా మురళీకృష్ణుల వారి యెందు శేఖరుడే :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గూఢోత్ముండు'?

      తొలగించండి
  31. సీతయనన్ గంగౌటను
    సీతాపతియనగజంద్రశేఖరుడుగదా
    సీతకుబతిరామునిగా
    జేతనమునరూఢియయ్యెశేషగిరీశా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆహా! సుబ్బారావు గారు రెండే పాదాల్లో సమస్య ను కొట్టేసారు !

      అదురహో!


      జిలేబి

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  32. ఈ వారము ఆకాశవాణి సమస్య యేమిటీ ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *"బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"*

      తొలగించండి


    2. అదియిది యన్ని నీదు తలపైన ధురంబుగ నెత్తుకొంచు నీ
      మది కలగుండవన్ బతికి మాడుట గొప్పయకో తలోదరీ?
      కుదురుగ యోచనల్ గనుచు కోవిద, మచ్చిక కాకపోయినన్
      బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత, కల్గు జయంబు లెల్లెడన్!


      జిలేబి

      తొలగించండి


  33. మోతాదు మించెనో నరు
    డా! తాగుచు తందనాల డబడబ యేలా!
    లాతపు గొట్టు తగు! నెటుల్
    సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. ఆతత కృపా రసాన్విత
    చేతో వర దేవదేవ చిన్మయ వపు వా
    భూతప్రే తాధ్యక్షుఁడు,
    సీతాపతి! యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా


    నీతిన్ వీడి శిశు వ్రజ క్షయము సంధింపంగ దుష్కార్య సం
    వీతా త్మాధముఁ గంసుఁ జంపి భువి నొప్పెం జిన్ని కృష్ణుండు సు
    ప్రాతఃకాల దినేశ సన్నిభుఁడు, సంభావించి వీక్షించగన్
    సీతా వల్లభుఁ డిందు శేఖరుఁడు, వాసిం గాంచెఁ గంసారిగన్

    [సీత = గంగా దేవి]

    రిప్లయితొలగించండి
  35. ఖ్యాతిన్ పొందెగతమ్మునందునెవరోయంజిష్టు వంశమ్మునన్?
    సీతాద్రిన్ వసియించుచుండు నెవరో చెన్నౌకళత్రమ్ముతో?
    ప్రీతిన్ గొల్లలతోడనుండి హరి యేపేరున్ ప్రసిద్ధిన్ గొనెన్?
    సీతావల్లభుఁ, డిందుశేఖరుఁడు, వాసిం గాంచెఁ గంసారిగన్


    రిప్లయితొలగించండి
  36. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కోతుల్ మూకను నెవ్వడయ్య కొని చేకూర్చెన్ మహాసేతువున్?
    ప్రీతిన్ నాతికి నెవ్వడిచ్చె తననున్ వెంటాడ దేహార్ధమున్?
    చేతుల్ తోడను మేనమామ దునుమన్ శ్రీకృష్ణుడేమాయెరా?
    సీతావల్లభుఁ ;..డిందుశేఖరుఁడు;...వాసిం గాంచెఁ గంసారిగన్!

    రిప్లయితొలగించండి
  37. శీతాద్రిన్ బరవళ్ళు ద్రొక్కుచును దాచిందాడు గంగమ్మనే
    భూతాధీశుడు క్రీడగా దురుమునన్ బూవోలె బంధింపగా
    సీతావల్లభు డిందుశేఖరుడు వాసింగాంచె; గంసారిగా
    గీతాచార్యుడు వాసిగాంచెగద శ్రీకృష్ణాఖ్యుడై యిద్ధరన్
    సీత = గంగ

    రిప్లయితొలగించండి
  38. "భూతలవాసపు నీతికి
    సీతాపతియనగ"!జమమద్రశేఖరుడుగదా"
    "జాతక చక్రపుమార్పుకు
    దాతగు"సద్భక్తియున్న తరుణమునందే!

    రిప్లయితొలగించండి
  39. వాతసుతుకు పరమాప్తుడు
    సీతాపతియనగ ,చంద్రశేఖరుడు గదా
    భూతపతిగ వెలుగొందుచు
    నాతికి యరమేనొసంగి నర్తించు సదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాతసుతుని పరమాప్తుడు' అనండి.

      తొలగించండి
  40. రాతిన్నాతిగ జేసినట్టి ఘనుడా రాముండెవండంటి నే?
    బూతిన్ దాల్చి శశానమున్ దిరుగు సంపూజ్యుండెవాడో సదా?
    గీతాచార్యుడు వాసుదేవుని జనుల్ కీర్తించిరే రీతిగన్ ?
    సీతావల్లభుఁ, డిందుశేఖరుఁడు, వాసిగాంచెఁ గంసారిగన్.

    రిప్లయితొలగించండి
  41. సమస్య.
    సీతా పతి యనఁగ చంద్రశేఖరుఁడు కదా!

    నా పూరణ.
    ఖ్యాతిగ తనలో సగముగ
    మాతను పార్వతిని దాల్చె మన్ననను శివుం
    డీతీరున కలరెవ్వరు?
    సీతా! పతి యనఁగ చంద్రశేరుఁడు కదా!
    🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
    చింతా రామకృష్ణారావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చింతా వారూ,
      ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మీ దర్శనం బ్లాగులో? ధన్యవాదాలు!
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  42. చంద్రశేఖరులను పొగిడి జై శ్రీమన్నారయణ‌ అంటే యెలాగండీ చింతా వారు :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  43. ఖ్యాతిని పొందెను రాముడు
    సీతాపతియనగ ,చంద్రశేఖరుడు గదా
    శీతాచలపుత్రిని తా
    ప్రీతిని పెండ్లాడి తనకు వేడుక కూర్చెన్.

    రిప్లయితొలగించండి
  44. భూతలము నందు రాముఁడె
    "సీతాపతి యనఁగఁ;; జంద్రశేఖరుఁడు గదా"
    భౌతిక శాస్త్రమున ఘనుఁడు
    జాతికి నోబెల్ ను దెచ్చె, జగతిన ఘనమౌ!

    రిప్లయితొలగించండి