12, ఆగస్టు 2021, గురువారం

సమస్య - 3810

13-8-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్”
(లేదా...)
“నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్”

25 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇటీవల వార్తాపత్రికలలో చదివిన 'ప్లాస్టిక్ బియ్యము' పిల్లల హాస్టల్ కు సరఫరా చేసిన వార్త ఆధారంగా...

      ప్లాస్టిక్ వ్యర్థాలకు మట్టిలో కలవడానికే మిలియన్ల సంవత్సరాలు పడుతుందంటారు....

      కందం
      రూకలు మ్రింగుచు పిల్లల
      కాకలి సంక్షేమ గృహములందునఁ దీర్చన్
      చేకూర్చిరి కృత్రిమ మౌ
      నూకలు, నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

      ఉత్పలమాల
      ఆకలి తీరదింటయని యమ్మలు నాన్నలు చేర్చ పిల్లలన్
      రూకల మ్రింగుచున్ వసతి రోసిన వారికి కృత్రిమమ్ములౌ
      చీకటి బియ్యమున్ బనిచి జేబులు నింపఁగ! వంటవండఁగన్
      నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్!!


      తొలగించండి
    2. ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మ తో:

      కందం
      చేకొని మేటి ప్రతిజ్ఞల
      వాకొందురె సంధికంప పతులిటులన్నా!
      చేకుఱ శుభమీ ధోరణి
      నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్!!

      ఉత్పలమాల
      కోకలనూడ్చ నా సభ వృకోదరుఁడాడినవౌ ప్రతిజ్ఞలన్
      గూకటి వేళ్ళతోఁ బెరుకఁ గోరుటె సంధి ప్రయత్నముల్! గృపన్
      జేకుఱ శ్రేయముల్ గనుమ శ్రీకర! ధర్మజుఁ జిత్త ధోరణిన్
      నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్!!

      తొలగించండి

  2. నీకిచ్చిన కాసులనే
    గా కోరితి తీర్చ మంచు కాలమె దాటెన్
    జేకూరనె లేదందువు
    నూకలు నానుటకు వలయు నూరు యుగమ్ముల్?

    రిప్లయితొలగించండి
  3. వాకొన సతి దన కోరిక
    నూకొట్టకనున్న మగనికుపవాసంబే
    సాకులు మితిమీరును మరి
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  4. సమస్య :

    నూకలు నానిపోవుటకు
    నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్

    ( " ఇప్పుడు మమ్ము గెలిపిస్తే మీరు నిశ్చింతగా
    జీవించే మార్గాల నాలోచిస్తా " మంటున్న రాజకీయనాయకులతో ఒక ఓటరు )

    ఉత్పలమాల
    -----------
    " ఆకలి తోడ బీదరిక
    మందున మ్రగ్గెడి పౌరశేఖరుల్ !
    జేకొని చేయనుంటిమిక
    చిత్రపు కార్యము లెన్నియెన్నియో !
    మేకొని మాకు గెల్పులను
    మేలుగ నిం " డన నొక్క డిట్లనున్ :
    " నూకలు నానిపోవుటకు
    నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్. “

    రిప్లయితొలగించండి
  5. చేకోనిబియ్యముచౌకగ
    ఆకోనివండగతలపడియాశగచూడన్
    నాకనుదోయినినీళులు
    నూకలునానుటకువలయునూఱుయుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  6. ఆకలితో బాధపడుచు
    శోకమునన్ గుములు వారి చూడక నేతల్
    రూకల నాశించు దరిని
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

    రిప్లయితొలగించండి

  7. నే కరుణించి యిచ్చితిని నిక్కపు మిత్రుడవంచు నమ్మి గా
    దే కలి కాలమియ్యది విధేయత మర్చితి వోయి యెప్పుడున్
    జేకురలేదటంచు సట జేయుట మేలనొ యారకించుమా
    నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్?

    రిప్లయితొలగించండి
  8. ఆకలివేసినతినలే
    మీకల్తీనూకలోని మేకుల నెపుడున్,
    సోకులరాల్లివికావుగ
    నూకలు, నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  9. కాకులవలె కలకాలము
    చీకాకుల జిక్కుకొనెడి జీవికి తుదకున్
    శ్రీకైవల్యము జేరగ
    నూకలు నానుటకు వలయు నూరు యుగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆకాంక్షించిన తరుణమె
    చేకూరదు శౌరి జూపు చేయుము తపమున్
    నీ కలలందలి వాంఛల
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  11. ఉ:

    పోకడ లెంచి లోకమున పుట్టును బుద్ధి భ్రమింపజేయగన్
    వ్యాకుల మంద జేతురట వాక్చతురత్వము తోడు గూడగన్
    చీకటి రాజ్జ్య మేలునిట చిత్రము నేపని జేయుటన్న, హే
    నూకలు నాని పోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  12. ఆకలిడొక్కల పేదలు
    యాకులమందుచు గడుపఁగ నాకలములతో
    లోకులు యిచ్చిన కల్తీ
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లౌకిక జీవితమ్ము విడి లక్షణమైన పరంపదమ్ముకై
    వీకగ నెత్తితిన్ భువిని వెన్నుని జూడగ జన్మలెన్నియో
    పాకము చెందె నాతపము వాసిని నేడిట మోక్షమెంచునౌ
    నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  14. ఆకలి వేళమీర తమ కన్నము కావలె నంచు తల్లినిన్
    వ్యాకుల పెట్ట పిల్లలును, వైనమదేమియొ గాని మెల్లగా
    ప్రాకుతుసాగె కాలము,గబాలున వంటను జేయ కుండలో
    నూకలు, నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్.

    ఆకలి సమయంలో కాలము ఎక్కువగా గడిచినట్లు తోచును... "నూరు యుగంబులు" అతిశయోక్తి.

    రిప్లయితొలగించండి
  15. కం॥
    పాకముకయి నొక రేతిరి
    నూకలు నానుటకు వలయు ; నూఱు యుగమ్ముల్
    నీకిడినకూడ జాలదు
    నీకై నిన్ను దెలుసుకొను నిశ్చయ మందున్

    ఉ॥మా॥

    పాకము జేయ నిక్కముగ బట్టును పూర్తిగ ఱేయియంతయున్
    నూకలు నానిపోవుటకు ; నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్
    నీకయి నిన్ను దెల్సుకొను నిర్ణయ మందున దప్పకుండగన్
    నేకతమాడి జూడుమది యెంతయు సత్తుగ దోచునెప్పుడున్

    ఏకతమాడు = ఆలోచించు
    సత్తు = సత్యము

    రిప్లయితొలగించండి
  16. రూకలుపెక్కుగ గైకొని
    చీకటి బాజారు లీల చిక్కులనిడగా
    పాకము కుదరదె, చైనా
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  17. "కాకులలెక్కలువేయుట
    గాక నిమిషమొకయుగముగ గణియించినచో
    నూకలు నానెడు కాలము?"
    "నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్"

    రిప్లయితొలగించండి
  18. భీకరమైన తప్పులను వెంబరవిత్తుగ మాఱి చేసితిన్
    చేకుఱె పాడుపుట్టుకలు చేసిన పాపములన్నిచుట్టగా
    శ్రీకరుడైన శ్రీహరిని చిత్తము నుంచితి, ముక్తి నొందగా
    నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  19. ఏ కాల మందయిన ము
    ప్పోకల మూఁగకు నుడివి నపుడు నాలుక పైఁ
    బ్రాకటముగ వాక్కులు నా
    నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్


    వాకులు తాఁకఁ జిత్తమును బాటున కేర్పడ మచ్చ లచ్చటం
    బోకకుఁ బట్టు నేండ్లు శతముల్ ధరలోన నదెట్టు లన్నచో
    వాకిలి లోనఁ జల్లగను బాఱఁగఁ దప్త దృఢాయసంపుఁ బె
    న్నూకలు నాని పోవుటకు నూఱు యుగమ్ముల కాల మయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  20. హా కలికాలమందు గననన్నిట కల్తియె వాడుకాయెగా
    రూకల కోసమై యకట లోకుల ప్రాణములే పణంబుగా
    పోకడపెట్టనేలనిటు పూర్తిగ నాసిరకంపు బియ్యమున్
    నూకలు నానిపోవుటకు నూఱు యుగమ్ముల కాలమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  21. మాకనపాలెపు యువకుని
    రూకలు చేజాఱిపోవ రొప్పుచు మిగులన్
    నాకము వినబడ యిటులనె
    నూకలు నానుటకువలయు నూఱుయుగమ్ముల్

    రిప్లయితొలగించండి
  22. మాకనపాలెమందుగల మామిడి రంగయ పూటపూటకున్
    రూకలు లెక్కపెట్టుచును రూప్యము లన్నియు లేనిచోనికన్
    నాకసమంతయున్ హడలు నట్లుగ భీకరనాదుతోననెన్
    నూకలు నానిపోవుటకు నూఱుయుగమ్ముల కాలమయ్యెడిన్

    రిప్లయితొలగించండి