26, సెప్టెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3854

27-9-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చంద్రుఁడొకఁడె కనఁగ సత్యవాక్కు”
(లేదా...)
“చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్”

32 కామెంట్‌లు:

 1. సుతునిఁదెచ్చినట్టిసూన్రుతవ్రతయైన
  చంద్రమతినిఁజూచిచండుడతఁడు
  తాళియున్నదనుచుతగఁబల్కెతాహరి
  శ్చంద్రుడోకఁడెకనఁగసత్యవాక్కు

  రిప్లయితొలగించండి
 2. గగన మందు వెల్గి కనువిందు జేయుచు
  చల్ల దనము నొసగు గల్ల కాదు
  జనుల కెల్ల మామ జనులంత మెచ్చె డి
  చంద్రు డొకడె కనగ సత్య వాక్కు

  రిప్లయితొలగించండి
 3. *చంద్రుఁడొకఁడె కనఁగ సత్యవాక్కు*

  ప్రయత్నం:

  ఇంద్ర సభను గోర నింద్రుఁడు వేడ్కతో,
  "నెవడు సత్య సంధుఁ, డిలను గలడు?"
  ఋషి వశిష్టుఁ దెలిపె, "ఋజువర్తియౌ హరి
  శ్చంద్రుఁడొకఁడె కనఁగ సత్యవాక్కు."

  రిప్లయితొలగించండి
 4. తండ్రి మాట నెపుడు దప్పని శ్రీ రామ
  చంద్రుఁడొకఁడె కనఁగ ; సత్యవాక్కు
  పాలనందు రాజ్య పాలకుడగు హరి
  శ్చంద్రుఁడొకఁడె కనఁగ ,సత్యమిదియ

  రిప్లయితొలగించండి
 5. సంద్రంబంతటిశోకమున్దునిమిభాస్వంతుండురాముండునున్
  సాంద్రంబైనవిరాగభావములుదాసామీప్యమున్గోరగా
  మంద్రంబాయెనురాజ్యకాంక్షపరధామంబున్గనెన్జానకీ
  చంద్రుండోక్కడెసత్యవాక్కనగఁబ్రాశస్త్యమ్మునోందెన్భువిన్

  రిప్లయితొలగించండి

 6. పురుషులందు మేటి పురుషోత్తముడె వాడు
  కీర్తి నందెనతడు క్షేత్రమందు
  ధర్మమూర్తి యనుచు త్యాగశీలిగ రామ
  చంద్రుడొకడె కనగ సత్యవాక్కు.


  చంద్రాలోకము నందు ఛాత్రునకు నాస్వాధ్యాయి యే చెప్పెనే
  చంద్రా! శ్రీహరి మానవుండగుచు తా జన్మించె నీ ధాత్రి దే
  వేంద్రాదుల్ బ్రతిమాలగా దనుజులన్ వేటాడ సూర్యాన్వయా
  చంద్రుండొక్కడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్.

  రిప్లయితొలగించండి
 7. భారత యుద్ధంలో గురువు ద్రోణుని మరణం తర్వాత దుర్యోదనుని ఆవేదన...

  ఆటవెలది
  తొలుత బిగ్గరగనుఁ బలికి 'యశ్వత్థామ'
  కూలెననుచు పిదప కుంజరమని
  మెల్లగనని గురుని మ్రింగిన ధర్మరా
  ట్చంద్రుఁడొకఁడె కనఁగ సత్యవాక్కు!

  శార్దూలవిక్రీడితము
  ఇంద్రాదుల్ బగబట్టి మాకపజయమ్మేపార సంధింప వా
  గేంద్రంపున్గమకాన కల్లనిజమన్ గృత్యాన ద్రోణార్యు ధ
  ర్మేంద్రుండాడగ కూల్చెనర్జునుఁడనిన్! మిర్మిట్ల తద్ధర్మరా
  ట్చంద్రుండొక్కడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆటవెలది
   పరగు చుండ నింగిఁ ప్రత్యక్ష దైవాలు
   కల్లలాడువారి కథలు గనరె!
   ధరణి జనులు మఱువ కిరణుని తదుపరి
   చంద్రుఁడొకఁడె కనఁగ సత్యవాక్కు!

   తొలగించండి
 8. అవని సర్వజనుల కభయంబు నిచ్చెడి
  మాటతప్పనట్టి మనుజుడతడె
  ధర్మరూపుడైన తారకుండగు రామ
  చంద్రుడొకడె కనగ సత్యవాక్కు

  ఇంద్రాదుల్ పరికింపగా మునికి దానీయంగ వాగ్దానమే
  చంద్రుంబోలెడు జక్కనైన ముఖమున్ సౌజన్య మేపారగా
  మంద్రంబౌ మదవారణంపు నడకన్ మౌనంబుగా నేగెనే
  సంద్రంబంత సుశీలతన్ సతిసుతల్ సాయంబుగా నా హరి
  శ్చంద్రుండొక్కడె సత్యవాక్కనగ బ్రాశస్త్యంబు నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు:
   ధర్మ పథము నందు ధరణిని తానుగా
   మనుజు వలెను దోరి మనకు నెల్ల
   నీతి నొసగినట్టి నేతయా శ్రీరామ
   చంద్రు డొకడె కనగ సత్యవాక్కు.

   తొలగించండి
  2. రెండవపాదములో " దోరి " పదమునకు బదులు " మెలగి " అని సవరించడమైనది.

   తొలగించండి
 10. ధీరుడు పలనాటి వీరుడనగ బాల
  చంద్రుఁడొకఁడె; కనఁగ సత్యవాక్కు
  తోడ హింస మాని తొలగదోసెను గాంధి
  దొరల గద్దె మురియ భరత జాతి.

  రిప్లయితొలగించండి
 11. ఆకసంబు నందు నన్ని చుక్కలలోన
  చంద్రుఁ డొకఁడె కనఁగ సత్యవాక్కు
  విశ్వమందు నాకు వేరెవ్వరునులేరు
  నీవు తప్ప నమ్ము నీరజాక్షి

  రిప్లయితొలగించండి
 12. సతిని సుతుని మరియు సామ్రాజ్య లక్ష్మిని
  విడిచి పెట్టి నాడు వెరపు లేక
  సత్య వాక్కు కొరకు సర్వ మొదిలె హరి
  శ్చంద్రుఁడొకడె కనగ సత్య వాక్కు

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

   ఇంద్రాదుల్ సతతమ్ముగా కొలుచునౌ యిందీవరుండీ యిలన్
   ఇంద్రారిన్ దశకంఠునిన్ తను విఘాతించన్ మనుష్యుండునై
   మంద్రంబైన నెఱిన్ ఘటించి నిగరమ్మౌ రీతి నా జానకీ
   చంద్రుండొక్కడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్.

   తొలగించండి
  2. రెండవ పాదమునిట్లు సవరించితిని:
   " ఇంద్రారిన్ దశకంఠునిన్ నడచు నుద్దేశ్యమ్మునన్ మర్త్యుడై "

   తొలగించండి
 14. శార్దూలము:
  సంద్రమ్మందు జనించి షోడశ కళాసంశోభి తుండై గిరీ
  శేంద్రున్ జేరి విశేషమౌ కళనిడన్ శీర్షంబునన్దాల్చెతాన్
  చంద్రా!నీ కిరణమ్ము లెల్లెడల శ్రీశైలీశు దృక్కుల్!శరత్
  “చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్”
  -కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 15. సమస్య :
  చంద్రుం డొక్కడె సత్యవాక్కనగ బ్రా
  శస్త్యమ్ము నందెన్ భువిన్

  ( బడదీదీ , దేవదాసు , శ్రీకాంత్ , పరిణీత వంటి నవలలు రచించి అన్ని భాషలవారికీ తమ కథలేఅనిపింపజేసిన శరత్ బాబు వంటి సత్యవాక్కు
  మరొకడేడీ ! )

  శార్దూలవిక్రీడితము
  ............................

  సంద్రంబున్ దలపించు భావరచనా
  సౌందర్య మేపారగన్
  సాంద్రంబుల్ నిశితంపు మానసికసం
  సర్గాత్మపాత్రంబులన్
  మంద్రంబౌ నవలల్ రచించు ఘనుడౌ
  మాన్యుండు నౌ శ్రీ శర
  చ్చంద్రుం డొక్కడె సత్యవాక్కనగ బ్రా
  శస్త్యమ్ము నందెన్ భువిన్ .

  ( మంద్రంబు - గంభీరము )

  రిప్లయితొలగించండి
 16. ఇంద్రుండొక్కడె స్వర్గలోకమును తానేలంగ నేవేళ ప
  క్షీంద్రుండొక్కడె విష్ణువాహనుడయెన్ కీర్తింపగా నెల్లరున్
  చంద్రుండొక్కడె కౌముదీ విభవమున్ చల్లంగ నిచ్చున్ హరి
  శ్చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
 17. ఇంద్రాదుల్ పరమేష్టికోర హరియే యిక్షోణిపై పుట్టగా
  చంద్రాస్యమ్మున లక్ష్మియున్ బుడమిపై జన్మించితా, భర్తతో
  సాంద్రమ్మందు చరించి కైకొనెను కష్టమ్ముల్, మహీజాత హృత్
  చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
 18. సాంద్రంబౌ తన సత్య సంయమనమున్ సద్వృత్తియున్ గాంచి యా
  చంద్రార్కంబగు నీదు కీర్తి యని విశ్వామిత్రుఁడే మెచ్చె, బ్ర
  హ్మేంద్రాదుల్ మహితాత్ముఁడీతడని శ్లాఘింపన్ ఘనుండా హరి
  శ్చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
 19. వినుము బాల!యిదియ వేయేల శ్రీరామ
  చంద్రుడొకడె కనగ సత్యవాక్కు
  సాటి గలుగు వాని జగమున గానము
  మేటి వీరుడతడు మేదిని సుమ

  రిప్లయితొలగించండి
 20. జనక వాక్యములను జక్కఁగఁ బాలించు
  వాఁడు ధర్మ మెంచు వాఁడు సతము
  సత్య విక్రముండు సద్గుణ నిధి రామ
  చంద్రుఁ డొకఁడె కనఁగ సత్య వాక్కు


  మంద్రస్వాన వచో విరాజి జన సంభావ్యుండు సత్కీర్తి రా
  జేంద్రశ్రేణి కరార్చితాంఘ్రి యుగ భూమీశుండు రాకా శర
  చ్చంద్రాభానన సుప్రసిద్ధ పర మేక్ష్వా కూద్వహుం డా హరి
  శ్చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
 21. శా:

  చంద్రుండే గద మూలమౌ గ్రహగతిన్ సాగింప నాలోచనల్
  చంద్రుండే గతి నిగ్రహించు జనులన్ సంధింప దోషమ్ములన్
  చంద్రుండీ విధి నిర్వహింప సబబే ! చాలింపు మారాడనై
  చంద్రుండొక్కడె సత్య వాక్కనగ బ్రాశస్త్యమ్ము నొందెన్ భువిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 22. చంద్రుండై మన నందమూరి వెలిగించన్ జిత్ర లోకమ్ము నా
  చంద్రార్కంబుగ నక్కినేని రవిగా సాక్ష్యంబులై యుండగా
  మంద్రంబౌ వర ఘంటసాల గళమే మాధుర్యమై సూర్యుడున్
  జంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదంలో "యుండగా" బదులు "యొప్పగా" అని సవరించి చదువుకొన ప్రార్థన.

   తొలగించండి
 23. ఇంద్రుండాదిగ దేవతల్ బొగడ యాయీశుండునాయాహరి
  శ్చంద్రుండొక్కడె సత్యవాక్కనగ బ్రాశస్త్యమ్ము నందెన్భువిన్
  సాంద్రంబొప్పెడు మానసంబున దగన్ఋసాకార రూపుండునై
  చంద్రుంబోలుచు, మంద్రగర్జనముతో శాసించు భూమీశుడే

  రిప్లయితొలగించండి
 24. చంద్రుండా కసమందు వెల్గుచు
  నిడున్ సంప్రీతి తో వెన్నెలన్
  ఇంద్రండా సురనాధు దేవతల నిం
  పార పాలించు, రా
  జేంద్రుండంతట బేరుగాంచె
  నిలలో నేమందు రాజా హరి
  శ్చంద్రుం డొక్కడె, సత్య వాక్కనగ
  బ్రాశస్త్యంబు నందెన్ భువిన్.

  రిప్లయితొలగించండి
 25. సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించుట.

  బింద్రన్ క్యాన్సరు వ్యాధిబాధిల త్వరన్ మేలైన వౌద్యంబుకై
  సంద్రంబుల్ తను దాటి వెళ్ళె, నయమై స్వాస్థ్యంబు చేకూరె లే,
  చంద్రాఖ్యుండు నశించిభాసిలు విధిన్;సంక్షీణ
  తన్ గెల్చు, యీ
  చంద్రుం డొక్కఁడె , సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్

  రిప్లయితొలగించండి