5, ఫిబ్రవరి 2023, ఆదివారం

సమస్య - 4329

6-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్”
(లేదా...)
“తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్”

14 కామెంట్‌లు:

  1. కందం
    మునియౌ కొండంత శివుఁడు
    ననలము ముక్కంట గురువ, నలరుల శరముల్
    ధనువున సంధించిన కం
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్


    మత్తేభవిక్రీడితము
    గుణదీప్తిన్ వెలుగొందు మౌనివలెనే కొండంతదైవమ్ము ము
    మ్మొనవాల్దాలుపునుండ పూశరము సమ్మోహమ్ము గూర్పంగ ము
    క్కనునందగ్నియె ధాటిగన్ జెలఁగ దత్కాలంబునన్ వేగ కం
    తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్!

    రిప్లయితొలగించండి
  2. వనిలో నే గెడు వేళను
    గను పించగ సింహ మొకటి గజ గజ లాడే
    మనిషికి కంపంబై భీ
    తుని లో బెను కొండ భయముతో డాగె గనన్

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు మురళీకృష్ణ గారి సవరణతో... వారికి ధన్యవాదాలతో...

    మును శైలంబులు స్వేచ్ఛగా నెగురుచున్ బుట్టింప నుత్పాతమున్
    ఘన పక్షంబులఁ ద్రుంచ దేవపతి., మైనాకుండు భీతిం జనెన్
    దనకున్ రక్షణ గోరి వార్ధి మునిగెన్ నానాపగాశ్రేణికాం
    తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనఘుండై పెనుగొండ సాంబశివ రావన్నట్టి నామంబునన్
      మను నొక్కండు తెనాలిలోన, నతనిన్ మాత్సర్యబుద్ధిన్ హతం
      బును జేయన్ సమకట్ట శత్రువులు, ముప్పున్ గాంచి ప్రాణార్థియై
      తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్!

      తొలగించండి

  4. తునుమాడగ వచ్చు ఘనా
    ఘనుని గని భయంబు తోడ గంపించుచునా
    ఘన మైనాకుండు జలప
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్.


    మునులే వేడిరటంచు నాగ్రహముతో బూతక్రతుండే వడిన్
    దునుమాడంగ దలంచుచున్ గదల బీతుండౌచు మైనాకుడే
    యనుకూలుండగు గంధవాహనుని సాయంబందగా నంబుభృ
    త్తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్.

    రిప్లయితొలగించండి

  5. తనయుడు తినె మన్నని క్రో
    ధనమున నోరు తెరువుమను తరుణము నందున్
    జననియె గాంచెను నందం
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్.

    రిప్లయితొలగించండి
  6. శనికిన్ భయపడి దాగెను
    పెను వృక్షపు తొర్రలోన వృషవాహనుడే
    తన చలి పెనుగొండై శాం
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్

    రిప్లయితొలగించండి
  7. ఘనమగు సునామి రాగా
    ఘనత వహించిన వసుమతి తలకెడవులయ్యెన్
    దనుజారులకు నదీకాం
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్

    రిప్లయితొలగించండి
  8. అనుదినముపాత కక్షలు
    పెనగొని భీతిల్లజేయ బెనుగొండ హరిన్
    మనుగడకే ముప్పగునని
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనయన్న రామచంద్రుఁడు
      వనములలో నిడుమలుబడ పరితాపమ్మే
      పెనుగొండగ మారఁగ భర
      తునిలోఁ బెనుగొండ భయముతోడాఁగెఁ గనన్

      తొలగించండి
  9. ధన నేరమ్మునకై దా
    పనమున కాయాధి నేత వచ్చిన యంతన్
    మనమున నప్పుడు ధనవం
    తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్

    మును కన్పట్టిన ధైర్య మెల్లయును సంపూర్ణమ్ము విధ్వంసమై
    తను వెల్లం జలియింప మీఱ నెద సంతాపమ్ము ఫా లాంబక
    మ్మును దా విప్పఁగ శంకరుం డెడఁదలో ముక్కంటి వీక్షింపఁ గం
    తుని లోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్

    రిప్లయితొలగించండి
  10. అనిశంబున్ హరి యర్చనంబునకు నే యఱ్ఱాఁకయున్ లేక తా
    నొనగూర్చంగ నదేమి శాపమొ యిపుండొక్కింత యస్వస్థతన్
    దనదైవంబును పూజసేయుటకు తాత్సారంబు గల్గంగ భ
    క్తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్

    రిప్లయితొలగించండి
  11. ఘనమౌ పర్వత కోటి జీవులకిడన్ కన్నోటు నట్టాడుచున్
    తునుమన్ కొండల రెక్కలన్ పయనమై తోరంపు కోపమ్ముతో
    న నిలింపాధిపు డేగుదెంచ కని విన్నాణమ్ము మిన్నేటి కాం
    తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్

    రిప్లయితొలగించండి