7, ఫిబ్రవరి 2023, మంగళవారం

సమస్య - 4331

8-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్”
(లేదా...)
“యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో”

20 కామెంట్‌లు:

  1. అమవస రేయి దట్టమగు నా వనమందునఁ ద్రోవ దప్పి సిం
    గమొ పులియో పిశాచమొ యెకాయెకిఁ జంపునొ యంచు భీతిలన్
    రమణులు భర్తలుం గనిరి రమ్యముగా జగదంబ వాస మా
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో!

    రిప్లయితొలగించండి

  2. గమిగాడు పిలిచె నంచును
    శ్రమకు తగినవేతనమ్ము సాధింపగ క
    య్యమునాడనెంచి, యా యు
    ద్యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్.

    రిప్లయితొలగించండి

  3. శ్రమఫల మందలేదని శ్రామికులెల్లరు పస్తులుండగా
    సమరము చేయగా వలయు సంఘటితమ్ముగ నంచు సూరి గే
    హమునకు పిల్వగా తగు సహాయము చేసెడు వాడటంచు ను
    ద్యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో.

    రిప్లయితొలగించండి
  4. విమల మనంబుతోను గడు బీదలకున్
    బ్రతిరోజు సాదమున్
    రమని యొకర్తె వెట్టుననురాగముతో
    గరుణార్ద్ర మూర్తియై
    సుమన మనస్వినిన్ జనులు సూడగ
    మిక్కిలి ప్రేమతోడ నా
    యమ సదనంబు జేరిరతిహర్షమునన్ మహభాగ్యమంచహో

    రిప్లయితొలగించండి
  5. శమదమనియమావళితో
    క్రమముగ వారేగిరి మణికంఠుని జూడన్
    దుముకుటయు‌ నాపుమా "సమ
    యమ"! మందిరమునకు నరిగి రతిహర్షమునన్

    రిప్లయితొలగించండి
  6. గమకించి దేశ భక్తులు
    శమదమముల కోర్చి దేశ సర్వోన్నతికై
    శ్రమదానము సలిపెడును
    ద్యమ మందిరమునకు నరిగిరతి హర్షమునన్

    రిప్లయితొలగించండి
  7. తమకోరికదెల్పగను
    ద్యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్”*
    సమయమిదేయనుచతిహ
    ర్షముతోడనునేతలెల్ల రయముగ గనుమా

    రిప్లయితొలగించండి
  8. కొమలందరు రేయిని దమ
    సమితి యువను వేడుకొనగ సమ్మతి నొసగన్
    తమినందు మూసియుంచు ని
    యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్

    రిప్లయితొలగించండి
  9. రమణీయంబైన సరళి
    కమనీయంబైన నాట్య కార్యక్రమమే
    తమకని భామతెలుప నా
    యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్

    రిప్లయితొలగించండి
  10. సమయము జూచి సల్పెదను చక్కని నృత్యము చిత్రరీతులన్
    దమకము పుట్టు భంగిఁ గన తామిక రండని రంభ పిల్వగా
    నమరుల బృందమెల్ల సుర నాట్యము చూడగ సత్వరమ్ము నా
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో

    రిప్లయితొలగించండి
  11. సమ యము పాటించి సలుపు
    క్రమ శిక్ష ణ పరులు నున్న కార్యపు మనుజుల్
    మమ తలు జూపింతు ర ని ని
    యమ మందిర ము నకు నరిగి రతి హర్ష ము నన్

    రిప్లయితొలగించండి
  12. తము దక్షిణ సాందీపుఁడు
    కుమారుఁ బ్రతికింప మంచుఁ గోర గురునకుం
    గొమరుఁ గొన రామకృష్ణులు
    యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్

    అమలిన వెంగమాంబ యన నన్నుల మిన్నయె యన్నపూర్ణయై
    సముదము రండు సత్వరము సక్కఁగఁ బెట్టుదు నన్న మన్న వే
    కమలిన దేహు లాఁకలికిఁ గారుణి కమ్మున నన్నమెంచి యా
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో

    రిప్లయితొలగించండి
  13. కందం
    సుమనస జగజ్జనని సే
    మములందింప వెలసెనన మా నంద్యాలన్
    నమసులిడ మా యతిథు లా
    యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్

    చంపకమాల
    ప్రముఖమనన్ జగజ్జనని వాసికినెక్కిన నాలయమ్మునన్
    శమనరిపుండు వెల్గ నవనందులమధ్యన నందియాల, సే
    మమరసి బంధుమిత్రులొగి మాలల గైకొని గాంచనెంచి యా
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో!

    రిప్లయితొలగించండి
  14. కందం
    కుమతులు జూదము లోనన్
    నిమీలనమయిన సిరిని గని తనువు చాలిం
    చ మధుర విషము చవిగొనగ
    యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  15. సుమధుర గాన నిర్ఝరిణి సొంపుగ పర్విడునామె గొంతులో
    గమకములందు తేనియలు గాత్రవిశుద్ధిగ జాలువారు స
    ద్విమల యశోవిభూషిత సుధీమణిఁ గాంచ ననేకమంది యా
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో

    రిప్లయితొలగించండి
  16. సమరమునందుశూరులయి శత్రువులన్ కడతేర్చి ప్రీతి రా
    జ్యముగొని పాలనమ్మునిడి చక్కని ప్రజ్ఞను స్వల్ప పాపముల్
    సమయగ పాండవుల్ భటుల సంఘము వారల వెంటచావుతో
    యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో

    రిప్లయితొలగించండి
  17. చం.
    సముచిత రీతినిన్ వినగ సంభవ మయ్యెను రామకృష్ణులే
    కొమరుని గాన్కగా నిడుట కోరిక యొజ్జకు గల్గ నొప్పుచున్
    *యమ సదనంబుఁ జేరిరతి హర్షమునన్ దమ భాగ్యమం చహో*
    యమునికి భక్తిగల్గెను ప్రయాసమె రావము పాంచజన్యమున్.

    రిప్లయితొలగించండి