3, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4665

4-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు”
(లేదా...)
“యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

25 కామెంట్‌లు:

  1. పామరుల కర్థమగురీతి వ్రాయుటకయి
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు
    గ నుడువ సహజమయ్యెను , గాని యటుల
    వలను కాకున్న గద్యమే వ్రాయనొప్పు

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. తేటగీతి
      మాటలన్నవి ఛందాన మంత్రములగు
      గానమాధుర్యమున్ బంచు గతులు గలుఁగ
      జతులనఁగ లయలొల్కు పద్ధతులఁ దప్పు
      యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు

      మత్తేభవిక్రీడితము
      నుతులన్ బొందెడు రీతి మాటలను మంత్రోచ్ఛారణంబౌనటుల్
      గతులన్ గూర్చఁగ ఛందమంచితము సద్గానామృతంబొల్కెడున్
      జతులై శ్రోతల మంత్రముగ్ధులుగ మార్చన్, లోపభూయిష్టమౌ
      యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్!

      తొలగించండి
  3. వచన కవితలు వ్రాసెడు వార లనరె
    యతులు ప్రాసలు లేని పద్యములు మేలు చక్క నైనట్టి భావాలు సాధ్య మైన విధముగా వ్యక్త పరచంగ వీలు గలుగు

    రిప్లయితొలగించండి

  4. పద్యముల వ్రాయ నేర్పెడు పండితులకు
    తెలుపు చుంటిని నేనిట తెలుసు కొనుడు
    తొలుదొలుత వ్రాయు వారికి దుష్కరమగు
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు.

    రిప్లయితొలగించండి
  5. యతులుప్రాసలు లేనిపద్యములుమేలు
    ననుచుభావింతురేగద నవ్య కవులు
    గతినిదప్పినసృష్టిలోకైతజెప్ప
    కళ్ళెమెంచనిగుఱ్ఱంబు కానబడును

    రిప్లయితొలగించండి

  6. క్షితిలో బద్యము శాశ్వతమ్ముగ నికన్ జీవింపగా జేయ సు
    వ్రతులన్ జేర్చుక బోధసేయు గురువుల్ పాటింపు డీ పద్ధతిన్
    వెతలన్ గూర్చెడి పద్ధతుల్ విడుచుచున్ విద్యార్థి కిన్ కష్టమౌ
    యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  7. అతివేగంబునమారుకాలముననాయాసంబుతానొల్లకే
    ప్రతిభల్జూపిరిపండితోత్తములునవ్యాంశల్, జనుల్మెచ్చగా
    మతితోజూచినభావమున్నతముతామైకంబుసృష్టించుగా
    యతులున్బ్రాసలులేనిపద్యములుయోగ్యంబుల్గదామెచ్చగన్

    రిప్లయితొలగించండి
  8. తే.గీ. Il
    ఛందమున పద్య రచనము బంధనమని
    పదములకు శృంఖలములింక వలదటంచు
    తలచి శ్రీశ్రీ మహాకవి పలికెనిటుల
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు

    రిప్లయితొలగించండి
  9. సముచితము సమస్యాపూరణము మొదలిడు
    క్రొత్త కవులకు దర్పము కూర్చు విధము
    తొలుత సులువుగా పూరింపఁ దుష్కరమగు
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతిభావంతులు వ్రాయుచుంద్రు కఠినంబౌ పద్య కావ్యంబులన్
      మతిపోవున్ గవి క్రొత్తయైన యెడలన్ మర్మంబులన్ జూపగా
      చతురుండై యలవాటు కల్గువరకున్ సంక్లిష్ట భూయిష్టమౌ
      యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్

      తొలగించండి
  10. గతిని దప్పిన నవయువ గణములకును
    అతలకుతలపు సాహిత్య మలరు గాన
    వెతలు బడనేల చందస్సు వెలుగులకును
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు

    రిప్లయితొలగించండి
  11. మత్తేభము:
    అతులంబౌ పదబంధనమ్ములను తామత్యంత సంక్లిష్టమౌ
    యతులుం బ్రాస గణాల చట్రములలో నంకించి పద్యంబులన్
    ధృతితో వ్రాయుటకన్న సత్కవివరుల్ హృద్యంబుగా వ్రాయగన్
    యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  12. తె.గీ:యతులు,బ్రాసలు గల్గు కావ్యము లెల్ల
    సంప్రదాయమ్ము నిల్పుచు శాంతి నొసగు
    యతులు బ్రాసలు లేని పద్యములు మేలు
    కొలుపు సమసమాజసృష్టి సలుపు కొరకు.
    (ప్రాచీనాథునికకవిత్వాలు రెంటి లోనూ మంచి ఉన్నది అని.)

    రిప్లయితొలగించండి
  13. మ:మతిలోనన్ రస మింత లేక,విధి,కర్మంబంచు ఛందమ్ములన్
    యతులన్,బ్రాసల మేకు ట్లదిమి పద్యమ్ముల్ కడున్ వ్రాయ బ్ర
    స్తుతులన్ జేతుమె!ఛందమే కవితయే! సారస్యమై యొప్పుచో
    యతులున్ బ్రాసలు లేని పద్యములు యోగ్యమ్ముల్ కదా మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  14. Rectified poems




    (1) తే.గీ: యతులు,బ్రాసలు గల్గు కావ్యమ్ము లెల్ల
    సంప్రదాయమ్ము నిల్పుచు శాంతి నొసగు
    యతులు బ్రాసలు లేని పద్యములు మేలు
    కొలుపు సమసమాజసృష్టి సలుపు కొరకు.
    (ప్రాచీనాథునికకవిత్వాలు రెంటి లోనూ మంచి ఉన్నది అని.)
    (2)మ:మతిలోనన్ రస మింత లేక,విధి,కర్మంబంచు ఛందమ్ములన్
    యతులన్,బ్రాసల మేకుల ట్లదిమి పద్యమ్ముల్ కడున్ వ్రాయ బ్ర
    స్తుతులన్ జేతుమె!ఛందమే కవితయే! సారస్యమై యొప్పుచో
    యతులున్ బ్రాసలు లేని పద్యములు యోగ్యమ్ముల్ కదా మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. తే॥ జనుల కుపజాతి పద్యము వినఁగ ముదము
      కలుగుఁ గన్నడ భాషలో గనము యతియు
      యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు
      మేలనుచుఁ దనియుదు రేమొ యోలలాడి

      మ॥ యతులన్ గన్నడ భాషయందుఁ గనమే యైనన్ విరాజిల్లెఁగా
      నుతియించంగను జ్ఞానపీఠ ఘన సన్నుతిన్ యశో రాజమై
      ప్రతి పద్యంబుప జాతిదైనఁ గనమే ప్రాసంబు నవ్వాటిలో
      యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్

      కన్నడ భాషలో అత్యధికంగా 8 జ్ఞానపీఠ పురస్కారములు వచ్చాయండి. ప్రొ వినాయక్ కృష్ణ గోఖాక్ గారి క్రింద నేను పనిచేసాను. కన్నడక్కె యతి యిల్ల కోణంగె మతి యిల్ల అని నానుడి. కన్నడకు యతిలేదు దున్నపోతుకు మతిలేదు అని అర్థము. కన్నడ భాషలో కూడ ఉపజాతి పద్యాలున్నాయండి. ఆదృష్టితో పూరించానండి.

      అయ్య నాకు తెలిసినంతవరుకు మత్తేభము 3వ పాదములో జాతిది+యైన లో ఇత్వసంధి వైకల్పికమని జాతిదైన చేసాను. అది తప్పై జాతిది యైన మాత్రమే సబబైతే క్రిందిది సరిపోతుందండి. సబబా కాదా తెలియజేయ మనవి


      మ॥ యతులన్ గన్నడ భాషయందుఁ గనమే యైనన్ విరాజిల్లెఁగా
      నుతియించంగను జ్ఞానపీఠ ఘన సన్నుతిన్ యశో రాజమై
      ప్రతి పద్యంబుప జాతి పద్యమన నే ప్రాసంబు లేకుండునే
      యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్

      తొలగించండి
  16. (3)మ:"యతులున్ బ్రాసలు లేని పద్యములు యోగ్యమ్ముల్ కదా మెచ్చగన్!
    స్థితులన్ మార్చెద నే "నటంచు బలికెన్ శ్రీశ్రీ,మహా దీప్తి తో
    యతులన్ ,బ్రాసల గ్రుమ్మరించె నతడే,ఆశ్చర్య మౌ రీతిలో
    యతులన్,బ్రాసల కంద పద్యముల దా నందమ్ము గా వ్రాసె గా!
    (ఛందస్సుల సర్ప పరిష్వంగం అని ఆక్షేపించిన శ్రీశ్రీ గేయాలలొ కూడా యతిప్రాసలని అందరి కంటే ఎక్కువ గ్రుమ్మరించాడు.సిరిసిరి మువ్వ పేరుతో కందపద్యాలే రాశాడు.)

    రిప్లయితొలగించండి
  17. యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు
    మేలు కావవి, యరయంగ మృత్యు సమము
    ప్రాస,యతులవి ముఖ్యము పద్యములకు
    జీవ శక్తిని గలియుండు చివరి వరకు

    రిప్లయితొలగించండి
  18. వేల లేనట్టి సంద్రము నేల ముంచుఁ
    గట్టు బాటులు లేకున్నఁ గలుగు లయము
    సొంపు నింపారఁగాఁ బరికింప నెట్లు
    యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు


    ధృతి నూనం దగు రాజ కార్యముల నిర్దేశింపఁ దద్దేశ భూ
    పతి కెన్నండును దేశ రక్షణము సంభావింపఁగా నొప్పు సం
    తతమున్ శాంతినిఁ గోరు మార్గ మిలలో ధర్మ్యంబు ఘోరావ హో
    ద్యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్

    [ప్రాసము = ఈటె; పద్యము=మార్గము]

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రాస,యతులు పద్యమునకు ప్రాణమైన
    పద్యమే ప్రాణము తెలుగు భాషకంద్రు
    యతులుఁ బ్రాసలు లేని పద్యమ్ము మేల
    టంచు పలుకుట భావ్యమా? యన్ని లక్ష
    ణములతో నుండవలెను హృద్యముగ రచన.

    రిప్లయితొలగించండి
  20. వ్రాయు తలపున్నను మదిని వ్రాయ వలదు
    యతులు ప్రాసలు లేని పద్యములు, మేలు
    సర్వ లక్షణోపేతమౌ చక్క నైన
    పద్యములను వ్రాయుటెపుడు వసుధ యందు.

    రిప్లయితొలగించండి