6, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4668

7-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కడుపు నిండెను తీర దాకలియె సుంత”
(లేదా...)
“కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో”

22 కామెంట్‌లు:

  1. ఉచితముగ మంచి భోజనమొసగి నంత
    కడుపునిండెను ; తీర దాకలియె సుంత
    యైనను ధనమునార్జించుటందు , నాకు
    కడుపు నిండుటకంటెను కావలె నిధి

    రిప్లయితొలగించండి
  2. తినగ పిజ్జాను పాస్తాను ద్రేన్పు వచ్చె
    కడుపు నిండెను తీర దాకలియె సుంత!
    యేమి జంకుఫుడ్డో! వశ! యేమి ఇటలి
    మాయయో! జిలేబీ తెల్పుమా మడతుక!

    రిప్లయితొలగించండి
  3. పరముజేరంగ నిరతముపాటుబడగ
    కంటికగుపించడాయెనుకలిగెవెతలు
    శాంతిలేనిదిసంసారసాగరమ్ము
    కడుపునిండెనుఁదీరదాకలియెసుంత

    రిప్లయితొలగించండి
  4. మేత కొదువ లేక మేసిన నేత తలపులన్....

    తేటగీతి
    పీఠమెక్కినదాదిగ పృధ్విపైన
    తరతరములెల్లఁ దిన్నను తరగనంత
    దోచగలిగిన దెల్లను దోచ నెకడ
    కడుపు నిండెను? తీర దాకలియె సుంత!

    చంపకమాల
    పడసిన పీఠమడ్డునిడి స్వార్థ పరత్వమె ధ్యాసకాగ మే
    లడిగిన వారితో తరతరమ్ములు తిన్నను తగ్గనంతగన్
    ముడుపుల లాగుచున్ గనుల, భూముల దోచియు కోరినంతగన్
    కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్య. యో!

    రిప్లయితొలగించండి
  5. అడుగుటనయ్యెహోటలునహంగునవచ్చెనుపళ్లెరమ్ములో
    ఉడకనివంటలాయెడనునుంచినపేరులవింతరీతులన్
    తడబడితింటిమేగదరదర్పమునిండెననంతభాండమున్
    కడుపునునింపుకొన్ననుసుఖంబుగనాకలితీరదయ్యెయో

    రిప్లయితొలగించండి
  6. పదవి నాశించి సాధించెపంత మూని
    ధనము నార్జింప సమకట్టె తపన తోడ
    తృప్తి పడ డయ్యె కోరిక తీర లేదు
    కడుపు నిండెను దీరదా కలి యె సుంత

    రిప్లయితొలగించండి
  7. చం.

    కడవల తోడ రక్తమును గంఠము గ్రోయగ మాంసభక్షణన్
    దడిసిన నాల్క రాక్షసుల దంతములున్ భయపెట్టు ప్రాణులన్
    బడలిక లేని తాటక, కబంధ, విరాధ, బకాసురాదులే
    *కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో!*

    రిప్లయితొలగించండి

  8. కటిక పేద పలికె నిట్లు కవివరేణ్యు
    తోడ పద్యములవి మాకు కూడు నిడునె?
    యట్టి మధుర కైతలనిట యాలకింప
    కడుపు నిండెను, తీర దాకలియె సుంత.


    పిడికెడు బువ్వలేదనుచు వేదన చెందెడు పేదవానికిన్
    విడువక పద్యరాజముల వీనుల విందుగ జెప్ప వాడనెన్
    గడు మధురంపు పద్యములు కమ్మదనమ్ముల నాలకించుచున్
    గడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో!

    రిప్లయితొలగించండి
  9. ముడుపులు లేక యేపనులు ముట్టడు
    డబ్బుల యాశ యెక్కువై
    విడవుక పేదసాదలను విత్తముకై
    కడు బాధపెట్టుచున్
    కడుపును నింపుకొన్నను సుఖంబుగ
    నాకలి దీరదయ్యయో!
    విడువక యట్టి దూర్తులకు వేగమె
    శిక్ష నొసంగ మేలగున్.




    రిప్లయితొలగించండి
  10. ధనలాలసుని యంతరంగము....

    ప్రజల సొత్తుకై కోరిక ప్రబలమాయె
    దుష్ట కృత్యముల నొడమి దోచి దాచి
    పూర్తి చేసితి కడుపార బోజనమును
    కడుపు నిండెను తీర దాకలియె సుంత

    పుడమిని గానవచ్చుధన పుంజము సాంతము నాదు లక్ష్యమై
    యొడుపుగ కొల్లగొట్టగల యోధుడ నేనని చెప్పుకొందురే
    విడువక పట్టుబట్టిమరి విత్తము బొక్కుచు కోర్కె మీరగా
    కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో

    రిప్లయితొలగించండి
  11. కాయ కష్టము జేసినా కాసు లేక
    కబలమొక్కటి జిక్కక కలతనొంది
    తనివిదీరగ నీటిని త్రాగి త్రాగి
    కడుపు నిండెను తీర దాకలియె సుంత

    రిప్లయితొలగించండి
  12. నూకలకు చేతిలోనొక్క రూకలేదు
    క్షుత్తుతో కుక్షియొక యగ్ని గుండమాయె
    మంటచల్లార్చ ద్రావఁగ మంచినీరు
    కడుపు నిండెను తీర దాకలియె సుంత

    రిప్లయితొలగించండి
  13. ఇడుములపాలయెన్ బ్రతుకు యెన్నడు తీరునొ లేమి మాధవా
    తడబడి తూలె మేను వితతంబగు నాకలి చిచ్చురేపె నే
    నెడపఁగ క్షుత్తు గ్రోలితినొకింత జలమ్ము కుళాయి చెంత, నా
    కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:పేదలను గొట్టి,లంచముల్ పెక్కు పట్టి,
    పన్ను లెగ వేసి,తిన పంచభక్ష్యములను
    కడుపు నిండెను, తీర దా కలియె సుంత,
    సుంత యైన పేదల కిత్తు సంతసమున.
    (కలి అంటే కలిపురుషుడు అనే అర్థం లోనే కాక పాపము అనే అర్థం లోనూ వాడతారు.తీరదు+ఆ+కలి=ఆ పాపం తీరదు.)





    రిప్లయితొలగించండి
  15. తే॥ అన్న పానాదుల నొసఁగ మిన్న గాను
    గడుపు నిండెను., తీర దాఁకలియె సుంత
    ధనపిపాస దరికిఁ జేర దానవుఁడగు
    నరుఁడు నుచ్ఛనీచములన్ని మరచి పోవు

    చం॥ అడఁగద యన్న పానముల నాఁకలి మానవ మాత్రు లైనచో
    కడుపును నింపుకున్నను., సుఖంబుగ నాఁకలి దీరదయ్యయో
    ముడివడ ధాత్రిలోన ధన మోహమునందునఁ దృప్తి యన్నదే
    కడకు కనంగఁ జాలమయ కాంచుచు సత్యము సంతరించుకో

    రిప్లయితొలగించండి
  16. చం:మడిని వహించి,కమ్మ నగు మామిడి పప్పును,నూరు మిర్చి నే
    నడిగిన యంత నేయియును,నా పయి వర్రని యావకా
    యయున్
    కుడువగ నున్న భోజనము గోరెద,నా కమృతమ్ము తో దివిన్
    కడుపును నింపుకొన్నను సుఖమ్ముగ నాకలి తీర దయ్యయో!


    రిప్లయితొలగించండి
  17. ఏమి చిత్రమో తినినను జామ పండ్లు
    కడుపు నిండెను తీర దాకలియె సుంత
    తినిన వన్నియు నెటవోయె తెలియ దయ్యె
    మాయ గానుండెఁదలఁపగ మర్మ మెదియొ

    రిప్లయితొలగించండి
  18. కర్మ భూమి యైన భరత ఖండ మందు
    వాడ వాడలఁ బరికింప బడుగు ప్రజకుఁ
    గూడు లేకున్న నక్కట కుడువ నీరు
    కడుపు నిండెను దీర దాఁకలియె సుంత


    తడఁబడ కుండ బాసలను దద్ద యొనర్చి గ్రహించి పీఠమున్
    విడువక యెట్టి మార్గమును విత్తము నింపుగఁ గూడఁబెట్టుచుం
    గడుపులు గొట్టి లోకులకుఁ గాసుల తోడుత బొక్కసమ్ము నాఁ
    గడుపును నింపుకొన్నను సుఖంబుగ నాఁకలి దీర దయ్యయో

    రిప్లయితొలగించండి
  19. ముడుపులునెన్నియోగొనుచు మోసముఁజేయుచు నెల్లవారినిన్
    కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో
    బడుగుల బాధఁదీర్పగను బద్ధులమౌచుచు సేవఁజేయుచో
    విడువకయాది దంపతులు వేడ్కను నిత్తురు పాయసాన్నముల్

    రిప్లయితొలగించండి
  20. శంకరాభరణం అయ్యవారు బహు బిజీ లాగున్నారు! సమీక్షలు కానరావటము లేదు

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    స్వార్థపూరిత మనసుతో జనుల ముందు
    మంచిగా నటించుచు వారి మదిని దోచి
    కోట్ల సంపాదనమ్మును కూడబెట్ట
    కడుపు నిండెను;తీర దాకలియె సుంత.

    రిప్లయితొలగించండి