10, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4939

11-11-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అనుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా”

(లేదా...)

“అనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్”

22 కామెంట్‌లు:

  1. పెనుమాయవదలిశంకరు
    డనయముమాలకుతలనిడిడాసెనువానిన్
    మౌనియై దైవముజూచుచు
    అనుజునిపదములకుమ్రొక్కెనగ్రజుడౌరా

    రిప్లయితొలగించండి
  2. పనిగొనిమాలభావమునపారముఁజూచెనుశంకరుండహో
    తునియలునయ్యెసందియము తోడసముద్భవమందెయర్ధమున్
    వినయవివేకసంపదను విజ్ఞుడుతాపసి వెల్గెమేథతో
    అనుజునిపాదపద్మముల కగ్రజుడే ఘటియించెనంజలిన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    కనవచ్చిన బలరాముడు
    కునికెడు కృష్ణయ్యలోన గుర్తించి హరిన్
    తన ప్రభుఁడను వివశమ్మున
    ననుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా!

    చంపకమాల
    మును బలరాముడున్ గనఁగఁ బ్రొద్దున వచ్చియుఁ గృష్ణమూర్తినిన్
    గునికెడు వేళ విష్ణువుగ గోచరమై పులకింపఁ జేయఁగన్
    తన ప్రభువంచు పారవశతన్ సుమముల్ గొని భక్తితోడఁ దా
    ననుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్!

    రిప్లయితొలగించండి
  4. తనను కడచి కీర్తిబడయ
    తనువు యుబికినంతనె దన తంబుని ప్రేమన్
    తన మనమందలి మెప్పుగ
    ననుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా

    రిప్లయితొలగించండి
  5. అనుజుండయ్యప మాలను
    పనిగొనిధరియించె దీక్ష భక్తిగ గొని, దే
    వునిగా భావించి మదిని
    యనుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా

    రిప్లయితొలగించండి

  6. జనని పృథను జేరి వినయ
    మున భీముండు తెలిపె పుణ్యచరితుడౌ
    ఘనమైన నేక కుండలు
    ననుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా.


    అనుకుడు కీచకున్ దునిమి యాలిని కాచిన వాడు వాయునం
    దనుడు వచించె తానిటుల తమ్ముడు క్రీడికి రాజసూయమున్
    ఘనుడని యగ్రపీఠమున కారణజన్ముని బిల్వ యొంటిపో
    గనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్.

    రిప్లయితొలగించండి
  7. అనుజుడగు కుంభకర్ణుడు
    పెనంగి మరణించెనుగద భీకర పోరున్
    ఘనుడగు పౌలస్త్యుడు తా
    ననుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా

    అనుజుడు పోరుసల్పునని యగ్రజుడే తగ నిర్ణయింపగా
    పెనకువ నందుపోరెనట భీకర రూపుడు కుంభకర్ణుడే
    ఘనతర యుద్ధమందడగి కాష్ఠముచేరగఁ గాంచి బాధతో
    ననుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. జననమెఱుంగలేని తఱి ఛాత్రునిగా విలు విద్యఁ జూపగన్
      ఘనుడని సూతనందనుని క్ష్మాపతి చేసిన నంగ రాజుగన్
      వినయ విధేయతల్ మెఱయ వీడని నెయ్యముఁ జూపెఁ గర్ణుడే
      అనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్!!

      (కర్ణుడు ధర్మరాజుకు అగ్రజుడు కాబట్టి దుర్యోధనునకు కూడా అగ్రజుడే)

      తొలగించండి
  9. అనుజుఁడు దీక్షఁ జేకొనగ నయ్యప దేవర యాలయంబుకున్
    జని యట మాలధారణము సల్పగ నర్చకవర్యు సన్నిధిన్
    దనయనుజుండు దీక్షఁగొనె దైవముతో సరిసాటి యంచునా
    యనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్

    రిప్లయితొలగించండి
  10. కం॥ మనమున నలజడి హెచ్చఁగఁ
    దనువు పడయుఁ గలతనిద్ర తరగని కలలన్
    గనఁబడెఁ గలలో వింతగ
    ననుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా

    పరుశురామునకు అన్నలు ఒక్కొక్కరుగా

    చం॥ తనయుఁడు తండ్రి మాట జవదాటక నన్నలఁ దల్లి నెల్లరన్
    దునుమఁగఁ దండ్రి కోరమనఁ దుష్టినిఁ బొంది వరమ్ము లెన్నియో!
    తనయుఁడు నన్నలందరకు దానముఁ గోరి గ్రహించఁ బ్రాణమే
    యనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్

    (తల్లిని కూడా బ్రదికించుకున్నాడనేది అంతర్లీనమండి)

    భరతుడు లక్ష్మనునకు

    చం॥ అనిశము నగ్రజన్మునకు నాసర తోడుగ నుండి పాయకన్
    వినయముఁ జూపి సేవలను విజ్ఞత నొందుచుఁ గాంచి ధన్యుఁడై
    మనుఁగడ నిర్వహించఁగను మాన్యుఁడ వైతివి యంచు గొప్పగా
    ననుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్

    రిప్లయితొలగించండి
  11. తనదు కరాగ్రమ్మున నా
    ఘనగిరిఁ గృష్ణుండు మోయఁ గమనీయముగం
    గని మ్రొక్కె భీతి శక్రుం
    డనుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా


    కనికర మొప్పఁ గష్ట తర కానన వాసులఁ బాండవేయులం
    గన నుత దీన రక్షకుఁడు కంస నిషూదనుఁ డక్కజమ్ముగం
    దన కడ కేఁగుదెంచఁ గని తద్వసుదేవ కుమారుఁ గూడి తా
    ననుజుని పాద పద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్

    రిప్లయితొలగించండి
  12. తనువును చాలించె ననుచు
    మునుకొని కన్నీటి తోడ పొదలుచు మిగులన్
    కను గొని శవమును దాకుచు
    న గ్రజు పదములకు మ్రొ క్కె నగ్ర జు డౌ రా!

    రిప్లయితొలగించండి