29, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4957

30-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వానరులకు లేవు వాలములఁట”
(లేదా...)
“వానరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్”

6 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    వంకమారె జీవపరిణామ క్రమమునన్
    దోకలూపుచుండి తుంటరులుగ
    వెనుక చెలఁగినారు! విజ్ఞులౌటన్ మాన
    వా! నరులకు లేవు వాలములట

    ఉత్పలమాల
    జ్ఞానము నందె జీవపరిణామ క్రమమ్మునఁ, దోకలూపుచున్
    హీనపు చేష్టలన్ జెలఁగిరింతకు ముందుగ కోతులంచనన్
    గానల వీడినన్ మఱువఁ గాదొకొ తుంటరి బుద్ధి మాన లే
    వా? నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్!

    రిప్లయితొలగించండి

  2. తెలియకనడిగితివొ తెలిసియె యడిగితివొ
    నా తెలివిని కనుగొన దలచితివొ
    తెలుపుచుంటి వినుము ధీరుడవైన బా
    వా , నరులకు లేవు వాలములఁట.


    శీనడవౌచు నడ్గితివి చెప్పెద నుత్తర మాలకించుమా
    కానగ తొంకలన్నిటికి కాన జరించెడు ప్రాణికోటికిన్
    భానువు నిచ్చుమాట యది వాస్తవ మందు ననాది నుంచి బా
    వా , నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్.

    రిప్లయితొలగించండి
  3. వానరమ్ములకును మానవ జాతికి
    వ్యత్యయమ్ముఁజూడ వాలమొకటె
    వానరములకుండు వాలము, కనుగొంటి
    వా! నరులకు లేవు వాలములఁట

    రిప్లయితొలగించండి
  4. తరగతి గదియందు తెలుగు గురువుగారు
    రక్తిగట్ట నుడవ రామకథను
    వివిధ పాత్రలాడ విద్యార్థులను గూర్చ
    వానరులకు లేవు వాలములఁట

    రిప్లయితొలగించండి
  5. లంకకు చని వడిగ రమణి వైదేహిని
    యచటి ఖైదు నుండి నాదు కొనగ
    రావణు నెదిరించి రణము సలుపుటకు
    వానరులకు లేవు వాలములఁట

    వాలము = కత్తి

    రిప్లయితొలగించండి
  6. వానరుల్ సహాయపడె రామునికిలలో
    వాలముండెనుగద వానరులకు
    మానవులకు మూల మందువా కాంచలే
    వా! నరులకు లేవు వాలములఁట

    వానరజాతి సాయపడె వాలిని గూల్చినవాని కిచ్చటన్
    మానవజాతి మూలమన మర్కటమేనని చెప్పుచుంటివా
    కానిట తోకతో నరులు కన్పడ నొప్పరు గాదె కాంచ లే
    వా! నరజాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్

    రిప్లయితొలగించండి