26, నవంబర్ 2024, మంగళవారం

సమస్య - 4954

27-11-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె”
(లేదా...)
“ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై”

16 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
ప్రవరుని వలచి యన్యులు వలదటన్న
సరళి కామినిగానొప్ప తరుణమెరిగి
మరుల గంధర్వుడల రూపుమార్చ నయ్యె
ద్విజుఁడు! మోహాంధుఁడై వరూధినినిఁ గూడె!

మత్తేభవిక్రీడితము
సుజనుండై ప్రవరుండు నప్సరను దా చూడంగ వైముఖ్యుడై
నిజ పత్నీవ్రతుఁడౌచు వైదొలఁగగన్, నిర్నిద్ర గామింపగన్
ద్యజితన్ పొందెడు గాంక్ష వైళమని గంధర్వుండు రూపెత్తనై
ద్విజవర్యుండు! దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై!

BMahalakshmi చెప్పారు...

కోరె గంధర్వుడామెనుకూర్మితోడ
సమయమెంచుచుతాఁజూచె శమమువీడి
విప్రుడాయెను ప్రవరుడౌ వేషమెంచి
ద్విజుడుమోహాంధుడైవరూధినినిగూడె.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అంద చందాలు గలిగిన యా వరూధి
గాంచి వలచి గంధర్వుడు కాంక్ష చేత
మహిత ప్రవరాఖ్యురూపుడై మాయకారి
ద్విజుడు , మహాంధుడై వరూధినిని గూడె

Sitharamayya Solasa చెప్పారు...

అల్ల సాని పెద్దన్నగా రల్లిన మను
చరితమున ప్రవరాఖ్యుడు చనె హిమగిరి
పైకి , యచట గనబడిన వనితను గని
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సుజనుండౌ ప్రవరాఖ్యుఁడా దివిజకున్ క్షోభమ్ముఁ గల్పించుచున్
నిజవాసంబునకేగె సల్ప నిరతిన్ నిత్యార్చనల్ గీమునన్
కుజనుండౌ ఖచరుండు విప్రునిగ సంకోచింపకన్ మారి యా
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై

M.B.G.TILAK చెప్పారు...

నిజగృహమునకు ప్రవరుడు నిష్క్రమింప
వంచకుండు గంధర్వుడే వచ్చెనటకు
మాయ రూపున బ్రవరుడై మాయకాడు
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె

నిజభక్తిన్ హుతభుక్కుఁ వేడి మరలెన్ నిర్దోషిగా విప్రుడే
గజ కైలాటకుడై చనెన్ బ్రవరుడై గంధర్వుడే తాఁ ఝష
ధ్వజ సూచీముఖతాడితుండు జవమున్ దత్కాల శైలూషుడై
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాంధుఁడై

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వలచిన వరూ ధిని విడిచి ప్రవరుండు
తిరుగు ముఖమైన గమనించి తెలివి గలిగి
మారి గంధర్వు డ య్యె డ మాయదారి
ద్విజుడు మోహా o ధు డై వరూ ధిని ని గూడె

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ అజుని వ్రాతయు తప్పునె సుజనులఘముఁ
జేయ నెంతురె మోహముఁ జేర నగునె
యేల పరిహాసపు పలుకు లేల నెపుడు
ద్విజుఁడు మోహాంధుడై వరూధినినిఁ గూడె

మ॥ కుజనుల్ నాటకమందు హాస్యమునకై ఘోరంబునౌ పోకడల్
సుజనుల్ నొచ్చెడు రీతిఁ బెట్టుటయు సంశోధించి వక్రించుచున్
నిజముల్ పాయికమేగదా తెలియకన్ నేమమ్ముఁ జూపించిరే
ద్విజవర్యుండు దిరస్కరింపక వరూధిన్ గూడె మోహాందుఁడై

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జయము లెన్న నెవ్వరి కైన సంశయమ్ము
లని నెఱుంగక దైవోపహతుఁడయి కట
సంతత సమ రాకాంక్షి సుక్షత్రియుండు
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె

[వరూధిని = సేన]


నిజ దేశంబున కేఁగ నా ప్రవరుఁడే నిశ్చింత నిష్కాముఁడై
విజయం బందితి నంచు డెందమునఁ దృప్తిం జెంద నన్నాతియే
నిజ రూపంబు వహింప కత్తఱి వెసన్ నిర్లజ్జ మాయామయ
ద్విజ వర్యుండు తిరస్కరింపక వరూధిన్గూడె మోహాంధుఁడై

వరూధిని పేరు గనుక వరూధి గాఁ గుదించి వరూధిన్గూడి యన నగును.
న్యాయానికి వరూధినిన్ గూడి యన వలెను.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వలచి వచ్చిన వనితను వలదటంచు
భూసురుండేగెను నిజనివాసమునకు
ద్విజునిగా మారె యక్షుఁడువిదనుఁగోరి
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

కాంత పైన గంధర్వుడు కన్ను వేసి
వలపు ప్రకటించి యవమానపరచ బడియు
ప్రవరుడున్ లేనపుడు మాయ ప్రవరుని వలె
ద్విజుడు మోహాంధుడై వరూధినినిఁ గూడె.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:నే వరూధిని ననుకొను నెలత యొకతె
కులము జెరుపుచు నర్చకున్ వలన వేసె
ప్రవరుడా యేమి మన గుడి బాపనయ్య?
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె
(నిన్న బిజీ లో సమస్య చూడ లేదు.ఆలస్యపు పూరణకు మన్నించండి.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...



ఆంధ్రభారతి లో వరూధి కి అర్ధాలు ఇవి .ఇవి కూడా అర్ధం కావటం లేదు.
కవచధారి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990    
కత్తలీడు, పరివరుడు, వొందడీడు, వరూధి, వర్మి, వర్మితుడు, సజ్జుడు, సన్నద్ధుడు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

రథికుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)
తేరుకాడు, పత్త్రి, ప్రవేత, రథి, రథిరుడు, వరూథి, శతాంగుడు.
వరూథి : వావిళ్ల నిఘంటువు 1949 Report error(s)
సం.వి.న్‌.పుం.
1. సారధి.
2. అపాయమునుండి తప్పించు పురుషుఁడు.
విణ. (న్‌.ఈ.న్‌)
1. కవచము కలవాఁడు.
2. కప్పుకలది.
3. సంరక్షించునది.
4. సేనచేఁ బరివేష్టింపఁబడినది.
5. రథికుఁడు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వరూధిని పదమును జూడండి.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

వలచితి ననిచెంతకు చేరి పైబడగనె
వలదటంచువారించుచు పలికి చనగ
*“ద్విజుఁడు, మోహాంధుఁడై వరూధినినిఁ గూడె”*
ప్రవరునివలెవేషముమార్చివచ్చియొకడు