22, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4950

23-11-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తమ్ములై రహించెఁ దమ్మిపూలు”
(లేదా...)
“తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్”

15 కామెంట్‌లు:

  1. గ్రామసరసమందు కనవచ్చు పద్మముల్
    స్వల్ప కాలమందు వ్యాప్తిజెంది
    కమ్మని పరిమళపు కమనీయ పారిజా
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమ్మని బిల్వగా వెడలి రంజిలు చున్న సుమంబులన్ గనన్
      నమ్మగలేని దృశ్యమది నాకను దోయికి విందుకూర్చెగా
      కమ్మనిదౌ పరీమళము క్రమ్ముచు నుండిన దివ్య పారిజా
      తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్


      తొలగించండి
  2. ఆటవెలది
    బాల భరతుని దగు వత్సలతను గాచి
    తలి శకుంతలకును తపనఁ దీర్చ
    కణ్వునాశ్రమమునఁ గనగ వనితల చే
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు

    ఉత్పలమాల
    అమ్ముని కణ్వునాశ్రమము నాదరణమ్మును జూపినంతటన్
    కమ్మగ సాగె జీవితము కౌశికు సూనకు బిడ్డతోడుగన్
    జెమ్మగిలన్ గనుల్ చెలుల సేవల స్వచ్ఛతఁ జూప వారి చే
    తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  3. అరుణ కిరణజాల మడరగ చెరువునన్
    మినుకుమినుకు మనుచు మెరిసెనీరు
    తిమిర రిపునకిచ్చు దీటైన సుస్వాగ
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు

    రిప్లయితొలగించండి
  4. కొమ్మలపైనఁ గాకములు కూయుచు నెల్లర మేలుగొల్పగా
    నిమ్ముగ నాకసమ్ముపయి హేలగ దీపిలు నంబుజాప్తునిన్
    రమ్మని స్వాగతమ్ము ననురక్తిగ దెల్పుచు సందడించు స్వాం
    తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  5. సరసనగల కొలను జలము తోడ నెరయ
    పెక్కు తోయజములు విక్కి విరిసి
    యుండె , గాలి వీచ నొకటి కొకటి చేరి
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు

    రిప్లయితొలగించండి

  6. బాలభాస్కరుండు ప్రాగ్దిశ నుదయింప
    పూపకాంతిసోకి పుడమి తాను
    పులకరించు వేళ కొలనులో గన కపో
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు.


    రమ్మని పక్షిరాశులిట ప్రార్థన జేయగ నాలకించి తా
    జిమ్మని చీకటిన్ దునిమి సీరుడు ప్రాగ్దిశ నేగు దెంచగా
    నిమ్మగు పూపకాంతులవి హేమను తాకిన వేళలో కపో
    తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  7. తమ్మి లకోరి తాక ముదితమ్ముగఁ జూడగ ముద్దులాడి యో
    ష్ఠమ్ములు సూడ చక్కని కుచమ్ములు రమ్య కపోల నేత్ర భా
    గమ్ములు కంబుకమ్ము చుబుకమ్ము లలాటము మోము పాద
    స్తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్!!

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ నిరతము కొలనటను నిర్మలమై యుండ
    కొండ కోనల దరి నిండుగాను
    ధవళ వర్ణమొదవి తనరఁగ పైన దా
    తమ్ములైరహించెఁ దమ్మిపూలు

    ఉ॥ గమ్మున నిర్మలత్వమును గాంచుచుఁ గూమము కొండకోనలన్
    నెమ్మది తోడ నిండుగను నిత్యము రాజిలు చుండ దీటుగాఁ
    దమ్మి సుమంపు సుందరత తావులు వైచుచుఁ జక్కగాను దా
    తమ్ములుగా రహించెఁ గన దామరపూలు మనోహరమ్ముగన్

    కూమము కొలను దాతము శుద్ధమైనది నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  9. కాల గమన మందు జరిగిన మార్పులో
    వింత లె న్నొ జగతి వెలుగు జూసె
    శాస్త్ర వేత్త కృషికి సంక రమై నట్టి
    తమ్ము లై రహిo చె దమ్మి పూలు

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:కమలదళము తోడ కయ్య మేర్పడ మత
    తత్త్వ మనుచు దాని దలచె బాబు
    కలహ మెల్ల తీరి కలువ సంధియె ప్రశాం
    తమ్ములై రహించెఁ దమ్మిపూలు”

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఇమ్ముగ నున్న యా కొలని కెంతయు నందము దేగ కల్వలే
    య మ్మహనీయ శోభ కొక యందము గూర్చుచు జేరె కొన్ని ప
    ద్మమ్ములు,రెంటి పోలికలు దగ్గర నుండుట కల్వ పూలకున్
    తమ్ములుగా రహించెఁ గనఁ దామరపూలు మనోహరమ్ముగన్”
    (ఆ కొలనులో కలువలు,తామరలు ఉండి వాటి పోలికల వలన అన్నదమ్ముల లాగా కనిపిస్తున్నాయి.)

    రిప్లయితొలగించండి
  12. రాత్రిఁ బుట్ట నుత్పలమ్ములు తమ్ములు
    పుట్ట రాత్రి గడచి ప్రొద్దు వొడువ
    నుచిత మిట్లనంగ నుత్పలమల కిలఁ
    దమ్ములై రహించెఁ దమ్మిపూలు


    ఇమ్ముగ మెత్తనౌ విరుల కీ కఠినత్వము వచ్చె నెట్టులో
    యమ్మకచెల్ల సుంత గమనార్హము స్త్రీ పురు షాలి కింపుగాఁ
    బమ్మఁగఁ జేయ మోహము నవారిత రీతిని ధాత్రి మారు వం
    తమ్ములుగా రహించెఁ గనఁ దామర పూలు మనోహరమ్ముగన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఉదయమంద భాస్కరుండు ప్రాగ్దిశ యందు
    వెలుగులు విరజిమ్మ విశ్వమంత
    కొండ ప్రక్కన గల కొలనునందు వికసి
    తమ్ములై రహించెఁ దమ్మి పూలు.

    రిప్లయితొలగించండి
  14. కమలములునుమరియుకలువలు వికసించి
    సందడెంతొచేయసరసునందు
    గట్టుపైన మొలచి కదలుచు నట ప్రశాం
    *“తమ్ములై రహించెఁ దమ్మిపూలు”*

    రిప్లయితొలగించండి