25, నవంబర్ 2024, సోమవారం

సమస్య - 4953

26-11-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు”
(లేదా...)
“సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా”

17 కామెంట్‌లు:

  1. జనకుపుత్రిక సిగ్గరి జాయగాగ
    పట్టె హస్తంబుతానుగా పావనుండు
    కుసుమ సుకుమార సంపద కూడియున్న
    సీత కరపద్మమునవెల్గె శీతకరుడు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    రామచంద్రునందియు నఖరంజనిఁ గొని
    రామ, చంద్రుని నరచేత రహిని దీర్చ
    పెళ్లి కూతురి రూపాన వేడ్క మీర
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు!

    ఉత్పలమాల
    భూతల నాథులున్ గనఁగ భూతగణాధిపు విల్లు ద్రుంచియున్
    బ్రీతిని రామచంద్రుఁడిడ వేడ్కగ దీరుచు పెళ్లికూతుగన్
    జేతిని రామ చంద్రుని విశేషపు రీతిని క్రొమ్మిఁ దాల్చఁగన్
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  3. చేతమునందు వల్లభుని చెల్వఁపురూపమునుం దలంచుచున్
    సీత చరించుచుండె తనచేతను గైకొని మంకురమ్ము న
    క్షత్రపథమ్మునుండి నిజకాంతుఁడు హాసము సల్పినట్టులన్
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  4. ! సీత మా పక్కింటి అమ్మాయి పేరు )

    తమి సమయమున వేడిమీ దాళలేక
    నాతరుణీ చేరె కమలిని యంకమునకు
    నీర మునకయి చేతుల నీట ముంచగ
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  5. విల్లు నెక్కిడ విరిగెగా పెళపెళమని
    రామచంద్రునికి లభించె రమణి సీత
    పసరు గోరింట నలదగా పండినట్టి
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    ఆతతమైన చాపమట నాతనికిచ్చెను సంప్రసిద్ధినే
    జాతము హర్షమొందెనట జానకికే తగు ఱేఁడు లభ్యమై
    చేతి కురంటకమ్మమరి శ్రీకరమై తనరారుచుండగా
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  6. శ్రీరాముడు సీతకు చైత్రమాసపు వెన్నెల గురించి తెలియజేస్తున్న సందర్భము:-

    చూతము కాకలీరవము సొంపునుఁ గూర్చెను నేడు కానకున్
    నూతన వత్సరమ్మున వినోదముఁ జేయగ వచ్చె పూర్ణుడై
    చేతము చల్లజేయ సతి చిత్త శశాంకునిఁ ముద్దులాడగన్
    సీత! కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా!!

    (చైత్రమాసపు పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రములో ఉంటాడు)

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:రాము శిరమును చేబూని భామ సీత
    పున్నమిన్ దన చేతుల బూని యొడిన
    వెట్టి చుంబన మ్మిడగ కన్ పట్టె నిట్లు
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  8. ఉ:సీత కరమ్ములన్ దనదు శీర్షము జేర్చియు, నామె యాస్యమన్
    శీతకరున్ దృగంచలము చే పరికించెను రాము, డట్టి భూ
    జాత కరంపు టందమును చక్కగ నూహ యొనర్చి చెప్పెదన్
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  9. కార్తికమ్మున వెన్నెల కాయువేళ
    చేతఁబూనెను ముకురమ్ము సీతయపుడు
    నింగిపైనున్న చంద్రుడు తొంగి చూడ
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  10. అంకమున జేరి పవళించు హాయి నందు
    రామ చంద్రుడు గమనించె రమణి కరము
    సీత కర కమలమున వె ల్గె శీత కరుడు
    మిగుల హర్షా న పులకించిమించె నతడు

    రిప్లయితొలగించండి
  11. తే॥ రాముఁడు భవుని చాపము రమణి గాంచఁ
    ద్రుంచ విద్యుల్లత విరియఁ దోషమొంది
    మేనియందు ప్రభలు చిమ్మ మిగుల తనియ
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    ఉ॥ చేతనమొప్ప రావణుని శ్రీశుఁడు గూల్చఁగ మోదమొందచున్
    సీతయె భర్తచెంతకును శీఘ్రము చాగుచు నుండు వేళలో
    ద్యోతక మాయె ద్యుతి యటు తోషము మీరఁగ భవ్యమై సఖా
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  12. జానకీ సతి నిజ భర్త సరస సేరఁ
    జంద్ర బింబ నిభానన స్యయము స్వీయ
    ముఖ మరయ నెంచి తుడువంగ ముకుర మంత
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు


    జాత మహానురాగమునఁ జంద్ర నిభానను రామచంద్రునిం
    బ్రీత మనోంబు జాతమున భృంగ నిభాసిత కుంతలప్రభా
    సీత సరోరుహాంబక స్పృశింప నిజేశుని యాస్యబింబమున్
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా

    రిప్లయితొలగించండి

  13. ప్రణయ రాగాల నొలకించు పాళమంచు
    సిగను మల్లెల దాల్చుచు చేత బట్టి
    దర్పణము నొకటి గన ముదమ్మున నట
    సీత కర పద్మమున వెల్గె శీతకరుడు.


    ఆతత సజ్జనుండు భరతాగ్రజుతో విహరించు వేళ చం
    ద్రాతప మందు తేజరిలు ధారుణమున్న సరోవరమ్ము భూ
    జాతయె గాంచి దోసిటను శంబరమున్ గొన నందు బింబమై
    సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సీత జాడ కొఱకు లంక చేరి హనుమ
    వెదకి జానకిన్ గనుగొని తుదకు వనము
    నందు,వివరముగ విషయమంత చెప్పి
    యంగుళీయకమును మాత కందజేయ
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు.

    రిప్లయితొలగించండి
  15. సాగెను పతివెంట వనికి సతియు తాను
    రాముడున్న ప్రదేశమే రహిని కూర్చు
    ననుచు సంతసమున నుండ నాదరమున
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు

    రిప్లయితొలగించండి