20, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4948

21-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును”
(లేదా...)
“దుష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై”
(ఛందోగోపనము)

16 కామెంట్‌లు:

  1. నిన్నటి దివసముల నిందకు భయపడి
    చెడ్డ చలుపకుండె చెలిమరులకు ,
    నేటి కాలమందు నెయ్యులకెపుడు దు
    ష్కృతమొనర్చు వాఁడె కీర్తిఁ గనును

    రిప్లయితొలగించండి
  2. సతతమువిందులన్సుదతి సంగమమందున నిచ్ఛజేయుచున్
    మతములపేరిటన్ప్రభవమందుచుదుష్టమునైనభావముల్
    జతగనిసజ్జనాదులనుచాలగహేయముగాగజూచుదు
    ష్కృతమునొనర్చువాడె ఘనకీర్తినిబొందు వివేకవంతుడై

    రిప్లయితొలగించండి
  3. కురుక్షేత్ర మహా సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ:

    ఆటవెలది
    గతమునెంచకుండ కవ్వడి! మోహమా?
    ధర్మ నాశనమ్ము దగదటన్న
    ధార్తరాష్ట్రులెంచ దూర్తులఁ దునుమ దు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును!

    చంపకమాల
    గతమునెరుంగ కుండగ నకారణ మోహము నందు జిక్క గొ
    ప్పతనమె? యర్జునా! రణము ప్రాణహరమ్ముయు నైన బాధ్యతా
    యుతముగ మెత్తురెల్లరిల నున్నత ధర్మము నిల్పనెంచి దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై!

    రిప్లయితొలగించండి

  4. చీత్కరించు టదియె స్థిరమైన కీర్తిగ
    తలచుచుండు నట్టి ఖలుడొకండు
    పలికె నిట్లు తనదు చెలికాని తోడ దు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును.


    మతిజెడి నట్టి వాడొకడు మద్యము గ్రోలుచు తోటివారితో
    సతతము వాదులాట దినచర్యగ గల్గిన శుంఠ పల్కె సూ
    నృతమని సజ్జనుండ్రకపనిందలు తప్పవు కూళ్ళమారి దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై.

    రిప్లయితొలగించండి


  5. అతిశయ మేమి కాదు సరి యైన దృశాను చేతచిక్కనా
    యతకుడు మారు తథ్యమిది హంసునెఱంగగ భక్తుడై సదా
    గతి పథమందనెంచుచు సుఖమ్ముల రోసి విరాగియౌను దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై.

    రిప్లయితొలగించండి
  6. పదవి కొరకు పడెడు బాధలే బహుళము
    కల్లలెపుడు పల్కి కరుణ జూపి
    పాడు పనుల తోడ పదవిని గెల్చి దు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును

    కృతకపు నీలిరాగమనఁ గేవల మెన్నిక కోసమేకదా
    సతతము చూపుచుంద్రు మన సంఘము నందున నేతలెల్లరున్
    మితముగ మేలుచేసి మరి మ్రింగుచు నుందురు భాగ్యమెల్ల దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై

    రిప్లయితొలగించండి
  7. ప్రజల సేవ కొఱకు ప్రాణాల న ర్పించు
    స్వ చ్చ మైన నేత వసుధ యందు
    కాన రాడు కాని కలి కాల మందు దు
    ష్కృ త మొన ర్చు వాడె కీర్తి గనును

    రిప్లయితొలగించండి
  8. సతతము దైవచింతనము సాధుజనావళి సంగమమ్ము కా
    మితములపై విరక్తియు నమేయ దయాగుణశీలుడై సదా
    హితమును గూర్చు నార్తులకు, నెన్నఁడు దుష్టుల దౌష్ట్యమాప దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై

    రిప్లయితొలగించండి
  9. ఎల్లవేళలందు నెల్లలు లేనట్టి
    సద్గుణముల రాశి సత్య రతుఁడు
    పేదసాదలయెడ పేర్మితో నైన దు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును

    రిప్లయితొలగించండి
  10. ఆ॥ దనుజ రాజ్యమందుఁ దనరుచు సజ్జన
    హింస నెరప ఘనుఁడు హీన గుణమె
    మెచ్చు జగతి యందు విచ్చలవిడిగ దు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును

    చం॥ సతతము దైత్యమూకలకు సజ్జన హింసయె లక్ష్యమై చనున్
    వితతిగ నాచరించఁగను వీరుఁడు శూరుఁడుగాఁ జెలంగడే
    మతిగతి హీనమై పరఁగ మాన్యుఁడు దానవ రాజ్యమందు దు
    ష్కృతము నొనర్చు వాఁడె ఘన కీర్తినిఁ బొందు వివేక వంతుఁడై

    వితతి విరివి నిఘంటువు సహాయమండి

    మరొక పూరణ

    చం॥ అతులిత భక్తిఁ జూపు ధరహాసము మోమునఁ గాంచుఁ జూడఁగన్
    సతతము పాపకార్యములఁ జక్కగఁ జేయుచు సాగు మేటిగన్
    జతురత తోడ వర్తిలును జాగ్రతఁ దాల్చి చరించు నట్టి దు
    ష్కృతము నొనర్చు వాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె:దుష్టసంఘమందు,ద్యూతసంఘమునందు
    జార సంఘమందు జేరి నీవు
    భారతమ్ము జెప్ప పేరొంద వచటదు
    ష్కృత మొనర్చువాఁడె కీర్తిఁ గనును”

    రిప్లయితొలగించండి
  12. చం:హితమును జెప్పు తమ్ముని సహింపక నన్నొక శత్రువంచు నీ
    మతిని దలంచి యిట్టు లవమానము జేతువె? లంక లోన దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు, వివేకవంతుఁడై
    హితమును జెప్ప వానరుల హీనము జేయడు రాము డెన్నడున్
    (అని విభీషణుడు రాముని కి రావణునికి గల భేదాన్ని వివరించాడు.రాముడు హితం చెప్పే వాణ్ని కోతి ఐనా గౌరవిస్తాడు.నువ్వు హితం చెప్పే వాణ్ని శత్రువు
    గా చూస్తావు అని.)

    రిప్లయితొలగించండి
  13. హితమును జెప్పినన్ వినుటకెన్నఁడు నెంచడు యెన్నఁడేని స
    త్కృతము నొనర్చఁడెవ్వరికి కృత్యములందున జూపు మౌఢ్యమున్
    సతతము పాపకర్మముల సల్పుచు నుండెడు దుండగీడు దు
    ష్కృతము నొనర్చువాఁడె ఘనకీర్తినిఁ బొందు వివేకవంతుఁడై

    రిప్లయితొలగించండి
  14. చలుప కున్న నెట్టి సత్కార్యముల నెప్డు
    ప్రజల మేలు నెంచి రమ్యముగను
    ఫల విహీన మైన భంగి స లీల దు
    ష్కృత మొనర్చు వాఁడె కీర్తిఁ గనును


    వితరణ శీలియై భృశము విత్తము నందు దురాశ చూప కె
    ట్టి తరుణ మందు సుంతయును డెందము నందు ఫలించు నట్టి స
    త్కృతము లనేకముల్, పరిహరించి వివేకము తోడ నెల్ల దు
    ష్కృతము, నొనర్చు వాఁడె ఘన కీర్తినిఁ బొందు వివేకవంతుఁడై

    రిప్లయితొలగించండి
  15. హితమును పలికినను నిమ్ముగ వినక నా
    కురుపతు లిట తెచ్చు కొనిరి ముప్పు
    నట్టి ఖలులనింక నణచ నెంచుచును దు
    ష్కృతమొనర్చువాడె కీర్తిగనుము

    రిప్లయితొలగించండి