15, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5214

16-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన”

(లేదా...)

“మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా”


20 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
భయమిక లేదు కర్షక తపమ్ములు పండెను చూడు శీర్షమె
త్తి యిపుడు కారుగాలమున తీవ్ర రవి ప్రభలాగి వచ్చెన
య్య యెదల దోచు రీతులను హాయిని పంచి చిర్జల్లు చిల్కగన్
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
వానలేదంచు తపియించె వసుధమిగుల
రాకరాక మచ్చితివీవు ప్రజలుమెచ్చ
కుండపోతగ వర్షింప గోరినంత
మొయిలు పైపైనఁ! బులకలు భూమిపైన!

చంపకమాల
దయగనవేలనో వరుణ! దైన్యము గాంచవె తల్లడిల్లగన్
నియమిత కాలమీ ఋతువు నేరకయుంటిమి నీదురాకకై
చయముగ వచ్చితీవు చలచల్లని గాలుల స్వాగతమ్మనన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా!

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sitharamayya Solasa చెప్పారు...

వాన కురిసెను దండిగ వసుధపైన
సదనమున కొకరుగ వ్యాధి జవిగొనంగ ,
మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన 
వగచ నింగికి నేలకు వావి కలదె ?

విరించి చెప్పారు...


వర్షములు లేక రైతులు బాధపడెడి
తరుణమందున నురుములు మెరుపు లవియె
మొదలగుచును భారముగను కదులు చుండ
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన.


భయపడి రయ్యొ కర్షకులు వర్షము లన్నవి లేక నచ్చటన్
మెయియది వ్రయ్యలయ్యెనని మిక్కిలి బాధను చెందు వేళలో
బయలును మేఘడంబరము ప్రాయణమౌచు మృదుత్వమందునన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వేడి గాడ్పులు భువిపైన విచ్చలుగను
జనుల నుక్కిరిబిక్కిరి సలిపి వెడలె
స్వాస్థ్యమును గూర్చ నరుదెంచె జలమునుఁగొని
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దయితునితో సమాగమము దక్కని ప్రేయసి యూరుపో యనన్
దయ విడనాడి వేసవిని తద్దయు నూష్మము సందడించగన్
రయముగ నంతరిక్షమున రంజన గూర్చుచు మానవాళికిన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా

M.B.G.TILAK చెప్పారు...

భయమునఁ గృషీవలురచట వర్షములకుఁ
స్వయముగ పరికింపఁ దొడగె శబ్దగుణము
హొయలుగ తరలు మబ్బులు ద్యోతకమయె
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన

భయపడు కర్షకాళి తమ పంటలకున్ దగు నీటి కోసమై
స్వయముగ వీక్షసేసిరట సత్పధమందున వాన జాడకై
హొయలుగ సాగుచున్నవట వ్యోమమునందున మేఘమాలికల్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వరుణ దేవుడు క రు ణించి వర్ష మొ సగ
నిర్ణయించి న వేళ లో నిర్మ లంపు
గగన మందున దట్ట మై కాను పించె
మొ యిలు పైపై న పులకలు భూమి పైన

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ వర్షమరుదుగన్ గురియుచు హర్షమునిడు
గనఁగ రాయల సీమను కలత తొలగ
రయమగ కురియు చుండఁగ
రైతు మురియు
మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన

చం॥ నియతిగ వాన కుర్వగను నెమ్మిని గాంచుచు మోద మందరే!
దయఁగనె దైమమీ పగిది ధన్యతఁ గాంతుమటంచుఁ దెల్పరే
మొయిలు గమించెఁ బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా
రయమున వాన తాకిడికి రాయలసీమను హర్ష మొందగన్



గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

టైపాటు సవరణతో తేటగీతి
తేటగీతి
వానలేదంచు తపియించె వసుధమిగుల
రాకరాక వచ్చితివీవు ప్రజలుమెచ్చ
కుండపోతగ వర్షింప గోరినంత
మొయిలు పైపైనఁ! బులకలు భూమిపైన!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:వర్ష కాలాన గలిగెను హర్ష మనగ
మెరుపు రూపాల విరిసెను మురియ జగతి
మొయిలు పైపైనఁ బులకలు, భూమిపైన”
నెమలి యది గని తమి దీర నృత్య మాడె.

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్కెను భూమి పై భళా !

చం.మా :

కయిత జనించె శ్రీహరి దిగంగ బిరాన గజేంద్రు రక్షకై !
మొయిలును బోలు దేహమును మోహన రూపుని గాంచ ధన్యమే !
దయితను గూడి రాగ భువి రక్షణ సేయ దశావతారియై
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్కెను భూమి పై భళా !

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:"రయముగ గాలి వీచిన తిరమ్ముగ నిల్చునె మేఘ?" మంచు సం
శయమును లేక యక్షు డొక చక్కని ప్రేమను దెల్పె భార్యకున్
మొయిలు గమించెఁ బైపయినఁ, బుల్కలు గల్గెను భూమిపై భళా!
దయ గల ప్రేమకావ్య మది తట్టె మహాకవి కాళిదాసుకున్
(ఆకాశం లో మేఘం పోతుంటే భూమి పైన ఒక మహాకవికి పులకింత కలిగి మేఘసందేశకావ్య మైంది." గాలి వీస్తే చెల్లా చెదరయ్యే మేఘం ప్రేమసందేశాన్ని చేరుస్తుందా?" అనే ప్రశ్న కూడా యక్షునికి కలగ లేదు.ప్రేమావేశం లో ఉన్న వాడికి వివేకం ఉండదని కూడా కాళిదాసే అన్నాడు.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వింత గాదె కడలి నీరు విన్నుఁ జేరి
తిరిగి వసుధా తలమ్మునఁ గురియు చుండు
నింపుగఁ గదలాడుచు నుండు, నింప నీరు,
మొయిలు పైపైనఁ, బులకకు భూమి పైన

[పులక = అనాస చెట్టు]


కయితల సున్నితత్వ మఁట కానఁగ రా దది వింత చేతలం
బయికి ముదమ్ము దోఁపఁగను బర్వెను దుఃఖ చయమ్ము లోపలన్
హొయ లడరంగ బాహ్యమున నుల్లము నందుఁ జెలంగె వంతలే
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా

[పులు+కలు= పుల్కలు; చిన్న రాయి]

Dr H Varalakshmi చెప్పారు...

పయిపయిఁబల్కులే, మురళి పాటల మోహము రేపుచుందువే !
అయినను వచ్చువారలని, యామని రాత్రుల రాసకేళికన్
దయితలు గోపకాంతలు ముదంబున నమ్మియు చెంత చేరగా
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్కెను భూమి పై భళా !

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

*


గగన సీమలో నిండగ కారుమబ్బు
మెరిసె నింద్ర ధనుసచట మేటి గాను
నెమలిపురివిప్పి నాట్యమునెమ్మినాడ
మొయిలు పైపైన బులకలు భూమిపైన


బల్లూరి ఉమాదేవి

ప్రియముగముద్రికన్గొనుచువేగము గాను సమీరు డేగగన్
జయజయ. ధ్వాన ముల్ సురలు సంతస మొప్పగ చేయుచుండగన్
రయమునదాటిసాగరమురాగముతోడనొసంగినంతనే
*“మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా”*


పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

కారు మేఘము లంతయు క్రమ్ముకొనగ
చల్లనైన గాలులు వీచ మెల్లగాను
వర్ష సూచన కనిపించ వసుధలోన
మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన.