1, ఫిబ్రవరి 2026, ఆదివారం

సమస్య - 5369

2-2-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్”
(లేదా...)
“సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్”

4 కామెంట్‌లు:

  1. కందం
    దంపతులు సుగుణముల మది
    నింప సదాచారములకు నెలవను రీతిన్
    సొంపుగ సంతుకు సుకృతపు
    సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్

    ఉత్పలమాల
    దంపతులైన వారు మదిఁ దప్పక సద్గుణ సంప్రదాయముల్
    నింపగ సత్ప్రవర్తనలు నెక్కొను ధామమనంగ సర్వులున్
    సొంపుగ సంతుయున్ సుకృతశోభితులౌచును సాగ పుణ్యపున్
    సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్

    రిప్లయితొలగించండి

  2. సంపదల గోరి పాపపు
    కుంపటి మోయంగనేల గూఢాత్మునిదౌ
    యింపగు సత్కృప యనెడిన్
    సంపద లధికమ్ము గాఁగ సద్గతి దక్కున్.


    సంపద లన్న జూడ నఘ సాగరమందున ముంచునట్టి యా
    సంపదలేల చేతనుని సత్కృప యున్నను చాలు నయ్యదే
    యింపును గూర్చునంచు పరమేశుని పైగల నమ్మకమ్మనే
    సంపద లెక్కువైనపుడె సద్గతి నందెద రెల్ల మానవుల్.

    రిప్లయితొలగించండి
  3. చెంపలు పగులు నధర్మపు
    సంపద లధికమ్ము గాఁగ ; సద్గతి దక్కున్
    ఇంపుగ నెల్లసమయముల
    నింపుగ నజుని పయి దృష్టి నిలిపిన యెడలన్

    రిప్లయితొలగించండి
  4. వంపులు లేని వర్తనయు
    వంకలు జూపని కార్యదక్షతన్
    బెంపు వహింప నేర్పున ల
    భించిన దానిని గాచువైనమున్
    నింపి మనమ్ము నందు కమ
    నీయత నెక్కొన రమ్య సౌహృదీ
    సంపద లెక్కువైనపుడె
    సద్గతి నందెద రెల్ల మానవుల్!

    రిప్లయితొలగించండి