6, డిసెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 162

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు.

24 కామెంట్‌లు:

  1. మేని ఛాయను పెంచును మేలి పసుపు
    కూర్మి సౌభాగ్యమందించు కుంకుమమ్ము!!!
    కాంత సింగారమును పెంచు కజ్జల సహ
    కారమొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!!!

    * (కజ్జలము=కాటుక)

    రిప్లయితొలగించండి
  2. కనులు చూపును గోల్పోయె,గాంచలేము
    దారి తెన్నుల,మాపైన దయనుగురియ
    నిండు!దారిజూపి,ముదమునిడు చిరుసహ
    కార మొసగు జల్లదనమ్ము కన్నుగవకు!!!

    రిప్లయితొలగించండి
  3. క్రోధమది కెంపుజేయును రోదనమ్ము
    నిచ్చునిడుగడ గర్వమ్ము నెత్తికంపు
    మూయు చిట్లించు ధ్వేషమ్ము దయయును సహ
    కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు.

    రిప్లయితొలగించండి
  4. ఒరులు సౌఖ్యమ్ముగా నుండ నోర్వలేడు
    కనలి కండ్లనిప్పుల బోసికొనును పాపి!!!
    పరుల పాలిట ప్రాప్తించు బాధలు నప
    కారమొసగు జల్లదనమ్ము కన్ను గవకు!!!!

    (పై అఙ్ఞాతనే----ఇంకో రకమైన ' కారం ' తో !!!)

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి నమస్సులు. మిత్రులకు అభినందనలు :

    మిత్ర సంపద వసుధను మేలు యనెడి
    సత్కవీంద్రుని వాక్కులు సత్య మవగ
    పద్య సుమములు వెదజల్లు పరిమళ మమ
    కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

    రిప్లయితొలగించండి
  6. వీధివీధిలో భిక్షకై వేడుకొనగ
    దొరకలేదెట నొక రొట్టె తునకయైన
    కోర మృష్టాన్నమును; సద్ది కూడు, గొడ్డు
    కార మొసఁగు జల్లదనము కన్నుఁ గవకు

    రిప్లయితొలగించండి
  7. వేడి పైత్యపు బాధల వృద్ధి గొడ్డు
    కార మొసఁగు, జల్లదనము కన్నుఁ గవకు
    పచ్చ కప్పుర మిడునట్లు స్వాదు భోజ-
    నమిడు నారోగ్య భాగ్యము నరున కెపుడు.

    రిప్లయితొలగించండి
  8. భార మెంతైన నించుక బదులు నీక
    పద్య పూరణ గావించు పధము గురువు
    పగలు రేయైన శ్రమియించి ప్రీతి తొసహ
    కార మొసఁ గుఁ జల్లఁ దనమ్ము కన్నుఁ గవకు.!

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాతగారు,ఫణిప్రసన్నకుమార్ గారు,మిస్సన్న గారు, హరి గారు మంచి పూరణ లిచ్చారు. మంద పీతాంబర్ గారి పూరణలో ఆర్ద్రత నిండుకొని అందము యినుమడించింది. చాలా బాగుంది. వారము దినముల క్రితము డాలసులో రమణమహర్షి అంధుల పాఠశాల విద్యార్ధులు నృత్యప్రదర్శన నిచ్చారు. ఆ స్పందనతో నేను వ్రాసుకొన్న పద్యము

    పున్నెమ యయె ప్రతి రాతిరి
    కన్నుల చీకటిని పోయ కాదని బ్రతుకున్
    వెన్నెల నిత్యము గాంచెడి
    చిన్నారుల హృదయ దీప్తి చిందెను వెలుగుల్.

    అంధులు, వికలాంగుల సం రక్షణ సంస్థల అవసరము చాలా ఉంది.

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి గారితో పూర్తిగా ఏకీభవిస్తాము.మంచి పద్యము చెప్పారు

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    హరి గారూ,
    మిస్సన్న గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ అందరి పూరణలు నిర్దోషంగా, మనోహరంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ ......
    క్షారమున కేది తెలుఁగులోఁ గల పదంబు?
    పట్ట పగ లెట్టి మేల్గూర్చుఁ జెట్టు నీడ?
    ప్రకృతి యందముల్ దేనికి రక్తిఁ గూర్చు?
    కార; మొసఁగుఁ జల్లఁదనమ్ముఁ; గన్నుఁ గవకు.

    రిప్లయితొలగించండి
  13. నరసింహ మూర్తి గారూ అంధ బాలల పట్ల మీ స్పందన శ్లాఘనీయం.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారి క్రమాలంకార పూరణ చాలా బాగుంది. మిస్సన్నగారూ కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారి పూరణ చాలా బాగుంది.ప్రహేళికలను గుర్తుకు దెచ్చింది.
    ఇలా కూడా పూరణ చేయవచ్చునన్న పద్దతి తెలిసింది. అందరి పూరణలు బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  16. కల్తి కాటుక వాడిన కనులకు యప
    కార మొసఁగుఁ; జల్లఁదనమ్ముఁ గన్నుఁ గవకు
    వలయు నన్నను వాడుడు వనిత లార!
    కప్పురమ్ముతో జేసిన కాటుకలనె!

    రిప్లయితొలగించండి
  17. కవి చమత్కారం.

    శ్లో. గవీశ పత్ర: నగజార్తి హారీ:
    శశి ఖండ మౌళి;కుమార తాత: !
    లంకేశ సంపూజిత పాద పద్మ:
    పాయాత్ అనాది పరమేశ్వరో వ:
    ఏముందీ చమత్కారం ? అనిపిస్తుంది.
    గవీశ పత్ర:=నంది వాహనం గా గలవాడు,
    నగజార్తి హారీ: = నగజ (పార్వతి) బాధను పోగొట్టిన వాడు,
    శశి ఖండ మౌళి;= నెలవంకను సిగలో ధరించిన వాడు,
    కుమార తాత: !=కుమారస్వామికి తండ్రి అయినవాడు
    (సంస్కృతం లో తాత = తండ్రి)
    లంకేశ సంపూజిత పాద పద్మ:= రావణునిచే పూజింపబడు పాదపద్మాల వాడు,
    పాయాత్ అనాది పరమేశ్వరో వ:= పరమేశ్వరుడు మిము రక్షించు గాక!
    ఇంతే కదా అనిపిస్తుంది.శ్లోకంలో నాలుగు తాళాలు వేశాడు. తాళంచెవి ఇచ్చాడు. దానితో నాలుగు తాళాలు తెరిస్తే శివుడు పోయి విష్ణువు ఆవిష్కృతమవుతాడు.
    ఎలాగో చూద్దాం. ఆ తాళం చెవి " అనాది" అనే మాట.అనాది పరమేశ్వరుడు అంటే ఆది లేని పరమేశ్వరుదు అని. కానీ నిశితంగా గమనిస్తే మరో అర్థం స్ఫురిస్తుంది. ఆది అక్షరం లేని పరమేశ్వరుడు అంటే "రమేశ్వరుడు". రమేశుడు విష్ణువు కదా!అలాగే మొదటి అక్షరంలేని గవీశపత్ర అంటే వీశ పత్ర(వీశ=పక్షిరాజు;గరుడుడు),గరుడుని వహనంగా గలవాడు విష్ణువు, అలాగే ఆద్యక్షరంలేని నగజార్తి హారి అంటే "గజార్తి హారి: అంటే ఏనుగు బాధను హరించినవాడు,ఆద్యక్షరం లేని కుమార తాత అంటే "మార తాత" అంటే మారుని లేక మన్మథుని తండ్రి =విష్ణువు; అలాగే ఆద్యక్షరం లేని శశిఖండమౌళి అంటే "శిఖండ మౌళి ;నెమలిపించము ధరించిన వాడు వ:=మిమ్ము; పాయాత్ = రక్షించు గాక! శివుడు వెళ్ళి విష్ణువు ఆవిష్కృతమయ్యాడు. ఇదే కవి చమత్కారం.

    రిప్లయితొలగించండి
  18. తే.గీ.తరచు కలహించు చుండెడి దంపతులను
    చూచుచు విసిగి వేసారు చుండు మనకు
    కాపురాన ప్రేమానురాగాలును మమ
    కార మొసగు కమ్మ దనమ్ము కన్ను గవకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీరు పరిచయం చేసిన చమత్కార పద్యం నాకు తెలిసినదే. బ్లాగులో ప్రకటించడం వలన చాలామందికి తెలిసే అవకాశం కలిగింది. వీలైతే దీనిని ప్రత్యేక పోస్టుగా బ్లాగులో ప్రకటిస్తాను. ఇటువంటి పద్యాలను ప్రకటించడంలో రమణరాజు గారి 'చిత్రకవితా ప్రపంచం' అనే బ్లాగు ముందున్నది. చూడండి...
      http://chitrakavitaprapancham.blogspot.in/
      ******
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కంది శంకరయ్య గారు !
      మీకు మరీ మరీ ధన్యవాదాలు.

      తొలగించండి
  19. సమస్యా పూరణ.
    సమస్య : " కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలనే." (!!!)
    కుందేలుకు కొమ్ములుంటాయా? పైగా ఐదా ? అదీ కాక మరో వైపరీత్యం కుక్కకు వలెనే అంట.దీన్నెలా సమర్థించాలి? సాధారణమైన అవధాని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీన్ని పూరించాలంటే కాసింత చారిత్రక జ్ఞాన మవసరం.
    డబ్బు ప్రసక్తి లేకుండా మానవ జాతి లక్షల సంవత్సరాలు గడిపింది. వస్తు సేవల వినిమయం వస్తు మార్పిడి ద్వారా సేవల మార్పిడి ద్వారా జరుపుకొనేది. ఈ మార్పిడిలో కొన్ని ఇబ్బందులు తలెత్తటంతో ఒక ప్రామణిక వస్తువు వినిమయ మాద్యం గా అవసరం వచ్చింది.
    అప్ప్పుడు ఒక దశలో గవ్వలు, మరోదశలో ఉప్పు, మరొక దశలో నిప్పు, ఇంకో దశలో గుఱ్ఱాలు,గొఱ్ఱెలు, ఆవులు మొదలైన జంతువులు etc వినిమయ మాద్యంగా ఉపయోగించారు. ఒకప్పుడు ఆల మందలే అసలు సంపద. (మహా భారతంలో ఉత్తర గోగ్రహణం గుర్తుందిగా !)
    అలా ఒకానొక దశలో పసుపు కొమ్ములు కూడా డబ్బుగా ఉపయోగించారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక అవధాని ఒక సందర్భం కల్పన చేసి పూరించాడీ సమస్యని. ఆ సందర్భం:
    ఒకడు ఒక సంత బజారులో తాను వేటాడి తెచ్చిన వివిధ జంతువులను అమ్మకానికి పెట్టాడు. అప్పుడో కొనుగోలు దారుడు బేరమాడి ఐదు పసుపు కొమ్ములిచ్చి ఒక మగ కుక్కను కొన్నాడు. అలాగే ఒక కుందేలును కొనాలని అనుకుంటే ఆ అమ్మకందారుడు ఒప్పుకోలేదు. అప్పుడా కొనుగోలు దారుడు అమ్మకం దారునితో ఇలా అన్నాడు.
    కం. ముందిస్తి పసుపు కొమ్ములు
    పొందికగా నైదు కుక్క పోతుకు; నటులే
    పందెమ్మిడి ఈవేటికి?
    కుందేటికి కొమ్ము లైదు కుక్కకు వలెనే.
    " అయ్యా ! ముందు బేరమాడి ఐదు కొమ్ములకు ఒక మగ కుక్క నిచ్చావు కదా ! అలాగే ఐదు కొమ్ములకిప్పుడు కుందేలును ఇవ్వనంటున్నా వెందుకు?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      ధన్యవాదాలు. దీనిని ప్రత్యేక పోస్టుగా ఈరోజు బ్లాగులో ప్రకటించాను. చూడండి.

      తొలగించండి
    2. ప్రత్యేక పోస్ట్ చూచినాను. ధన్య వాదాలు !

      తొలగించండి
  20. ఏమున్నా లేకున్నా ఈ లోకంలో సమస్యలు పుష్కలంగా ఉన్నాయి, ఉంటాయి.ఉన్న సమస్యలు చాలవన్నట్లు మనం సృష్టించుకునే సమస్యలదనం.అలా నేను సృష్టించు కున్న కొన్ని సమస్యలు.నచ్చినచో కవిమిత్రులకు ఉపయోగపడగలవని నా భావన.
    1)"పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్"
    2)"హారము గొలిచిన నది పది యామడలుండెన్."
    3)"బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్"
    4)"తండ్రీ యని పిలుచునంట తల్లిని సుతుడే."
    5) కవియే చులకన గనయ్యె కలికాల మహో !
    6) "బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే."
    నేను చూచిన ఒక వాస్తవ సంఘటనకు అతిశయోక్తి జోడించి నేను చేసిన పూరణ (6వ సమస్యకు)
    కం. కొండొక వైద్యుడు తనతో
    "మెండగు భోజనము మాను ! మేలగు"ననగా
    తిండిని తగ్గింప నొకడు
    బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే.

    రిప్లయితొలగించండి