8, డిసెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 164

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. తిలకించితి 'నీనాడు' ను
    బులిపించెను నాదు జిహ్వ పొందుట కొఱకై
    పలురకముల వడలన్! కదె
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.

    (ఈరోజు ఈనాడు పత్రికలో పలురకాల వడలు పరిచయం చేయడం జరిగింది. ఆ అంశాన్ని తీసుకుని పూరించాను. అలా అని అపార్థం చేసు కొనేరు. నేను శాకాహారిని మాత్రమే నండోయ్.)

    రిప్లయితొలగించండి
  2. పులియైనను పిల్లైనను
    చలియనుచూ వణకి చచ్చు, సమిధలు గాల్చన్
    నెలసరికి ఎచ్చు వెచ్చము
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగులున్

    మాకు చలికాలములో హీటింగు బిల్లులు అదురుతుంటాయి.

    రిప్లయితొలగించండి
  3. ఈ దినములలో సమిధ ఎలెక్ట్రిసిటీ, కాకపోతే గాస్ కదండీ !

    రిప్లయితొలగించండి
  4. కలికాలముగద చూడగ ,
    పలువింతల గానగలము పగలునురేయిన్,
    కలచెదిరెను,పదవూడెను,
    చలికాలమున వడదెబ్బ చప్పునరగిలెన్!

    (కిరణ్ కూర్పులో పదవులూడిన మంత్రుల స్థితి, పూరణకు వస్తువు)

    రిప్లయితొలగించండి
  5. కలువకనుల జవరాలా!
    పలుకగ జాల! చవులూరు వడల సురుచులన్.
    చెలియరొ! నీచేతి చలవ!
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.

    రిప్లయితొలగించండి
  6. తిలకించగ తరుణుల లాస్యము
    పులకించెను తనువు మనము పరవశమొందన్ !
    వలపులు విరియగ మనసున
    చలి కాలమున వడదెబ్బ చప్పునఁదగిలెన్ !

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి నమస్కారములు.
    వొక చిన్న సందేహము " మ " వర్గ యతి " మ-య-ర-ల-వ-శ-ష-స-హ = లు చెల్లును " అని చదివాను అది ఎలా ?
    ఇవన్ని ఒక అక్షరానికి మరొక అక్షరం సరిపోతుందా ? లేక " మకి - య ,రకి = ల ,అలా చూడాలా ? లేక " అ " ..కారమునకు " అ " కారము గనుక అన్ని దేనికైనా మరొకటి సరి పోతుందా ? తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  8. కలలో నైనను పోరన్
    దలవకు ముద్దుల తరుణితొ,తగ వాడెదరో
    చెలగి న్నానాయధముల్
    చలికాలమున ‘వడ’దెబ్బ చప్పునఁ దగిలెన్.
    మనవి: చలికాలంలో మీ ఆవిడ వడ వేస్తానంటే మాత్రం ఈ పద్యం తలచుకోండి, నవ్వు నటిస్తూ (స్వానుభవం).

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ హీటింగ్ బిల్లుల "వడదెబ్బ" అదిరింది. మంచి పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    నిజమే. పదవు లూడిన వారికి, పదవు లాశించి పొందలేని వారికి ఈ చలికాలంలో "వడదెబ్బే". బాగుంది. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    విరహ తాపాన్ని వడదెబ్బతో పోల్చారు. బాగుంది.
    కాని మొదటి పాదంలో గణదోషం, రెండవ పాదంలో యతిదోషం ఉన్నాయి.
    "తిలకించ తరుణి లాస్యము
    పులకించెను తనువు మనము మోహము గలిగెన్" అంటే సరిపోతుంది.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది.
    "పోరన్ దలవకు" కంటే "పోరన్ దలపకు" బాగుంటుంది. "తొ" ప్రయోగం చాలామంది పద్యరచనలో చేస్తుంటారు. ఇది తప్పు. అది "తో". దానిని హ్రస్వం చేయరాదు. "తరుణితో" అనే తృతీయార్థంలో "తరుణిని" అని ద్వితీయాన్ని ప్రయోగింపవచ్చు. "నానాయధముల్" అనేది టైపాటా? అది "నానాయుధముల్" కదా?

    రిప్లయితొలగించండి
  10. నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ రెక్కడ చదివారో గాని అది పూర్తిగా తప్పు.
    "మ"వర్గ యతి అనేది లేదు.
    "మ"కు "మ" తోనే యతి చెల్లుతుంది.
    "పు ఫు బు భు" లకు "ము" తో యతి చెల్లడం పోలిక యతి. దీనినే "మువిభక్తి యతి" అంటారు. దీని ప్రకారం ము-మూ-మొ-మో లకు పు-పూ-పొ-పో-ఫు-ఫూ-ఫొ-ఫో-బు-బూ-బొ-బో-భు-భూ-భొ-భో లకు యతి చెల్లుతుంది.
    అనుస్వారంతో కూడిన ప-ఫ-బ-భ లకు అంటే ంప-ంఫ-ంబ-ంభ లకు "మ"తో యతి చెల్లడం "బిందు యతి".
    "ర"కు "ఱ" తోను, "ల"కు "ళ"తోను యతి చెల్లుతుంది. ఇది అభేద యతి.
    ప-ఫ-బ-భ లకు "వ"తో యతి చెల్లడం కూడ అభేద యతి.
    అ- య లకు, చ-ఛ-జ-ఝ లకు శ-ష-స లకు యతి చెల్లడం సరస యతి.

    రిప్లయితొలగించండి
  11. ధన్యవాదాలండీ, మాష్టారు గారు. క్రొత్త పాఠం నేర్చుకొన్నాను.

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ .......
    కలికాలం బియ్యది వె
    న్నెల వేడిగఁ దోచు; కాల నియమము దప్పెన్
    గలఁచెను తీవ్రాతప మది
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ యీ దినము పాఠము మా అందఱికీ చాలా ఉపయోగకరమైనది. మీ పూరణలు కూడా మాకు లాభకరమైనవి. మీకు సదా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గారు,నమస్కారం.
    యతుల గురించి మీరు వివరించిన విషయాలు
    మాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.అలాగే
    రేఫముతో గూడిన అక్షరాలు ఎప్పుడు లఘువులుగా
    ఉంటాయి,ఎప్పుడుగురువులౌతాయి వాటి పూర్వ హ్రస్వాలు
    ఏ సందర్భములోగురువులుగా మారుతాయి.వివరిస్తే నాకూ
    తరచుగా వచ్చే సందేహాలు తొలుగుతాయి.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి నమస్కారములు. సందేహాలను చక్కగా వివరించి చెప్పినందుకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  16. చలి దెబ్బ మూలద్రోసెను
    చలికాలమున; వడదెబ్బ చప్పునఁ దగిలెన్
    మలి యెండాకాలమ్మున
    కలికాలపు వొంటి తీరు కష్టమె నాకున్!

    రిప్లయితొలగించండి
  17. కం.చెలి వండిన గారెలనే
    చులకన జేసెను మగండు చోద్యమ్మనుచున్
    అలిగిన సతి వడ విసరగ
    చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్.

    రిప్లయితొలగించండి
  18. వలపులతో తిరుపతి వడ
    చెలి ఫ్రిజిలో నిడగ నేను చెకచెక తినగన్
    విలవిల వణికించెడి యా
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

    రిప్లయితొలగించండి
  19. కలుగగ పుట్టెడు బుద్ధులు
    బలుపుగ తెలగాణనందు భండన జేయన్
    సలుపగ తల నాయుడికిట
    చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

    రిప్లయితొలగించండి