29, డిసెంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 33

ఆమె ఎవరు?
తే.గీ.
ఆలి నొల్లక యున్నవా నమ్మ మగని
నందులోపల నున్నవా నక్క మగని
నమ్మినాతనిఁ జెఱుచుదా నమ్మ సవతి
సిరులు మీ కిచ్చు నెప్పుడుఁ గరుణతోడ.

(చాటుపద్య రత్నాకరము)
1. భార్య వద్దనుకున్న వాడెవడు? ..............................
2. అతని తల్లి ఎవరు? ............................
3. ఆమె మగడెవరు? ............................
4. అతనిలోపల ఉన్నవా డెవరు? .....................................
5. అతని అక్క ఎవరు? .........................
6. ఆమె భర్త ఎవరు? ..............................
7. అతనిని నమ్మిన వాడెవరు? ................................
8. అతని నాశనానికి కారణమైన ఆమె ఎవరు? ...............................
9. ఆమె తల్లి ఎవరు? .................................
10. ఆమె సవతి మీకు కరుణతో సిరులిస్తుంది.
ఆమె ఎవరు?

8 కామెంట్‌లు:

 1. 1. భార్య వద్దనుకున్న వాడెవడు? భీష్ముడు
  2. అతని తల్లి ఎవరు? గంగ
  3. ఆమె మగడెవరు? సముద్రుడు
  4. అతనిలోపల ఉన్నవా డెవరు? మైనాకుడు
  5. అతని అక్క ఎవరు? పార్వతి
  6. ఆమె భర్త ఎవరు? శివుడు
  7. అతనిని నమ్మిన వాడెవరు? రావణుడు
  8. అతని నాశనానికి కారణమైన ఆమె ఎవరు? సీత
  9. ఆమె తల్లి ఎవరు? భూదేవి
  10. ఆమె సవతి మీకు కరుణతో సిరులిస్తుంది. శ్రీదేవి

  రిప్లయితొలగించండి
 2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  సరైన సమాధానం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. నాకొక చిన్న అనుమానం. మైనాకుడికి పార్వతి అక్క అవుతుందా లేక చెల్లలౌతుందా?

  రిప్లయితొలగించండి
 4. ఆలి నొల్లక అంటే - బ్రహ్మచర్యం అనుకోలేదండీ... అసలే రేలంగి గారు ఒల్లనోయ్ మామ నేనొల్లను అన్నారేమో ...

  రిప్లయితొలగించండి
 5. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీరు అడిగాక నాకూ సందేహం వచ్చి "పూర్వగాథాలహరి" చూసాను. అందులో "మేనక సతీదేవిని గూర్చి జపము చేయుచుండెడిది. దేవి ఆమెకు ప్రత్యక్షమై వరము వేడుకొను మనియెను. ఆమెకు నూర్గురు పుత్రులు పుట్టునట్లును, దేవి యామె కుమారితగ బుట్టునట్లును మేనక కోరెను. మేనకకు మైనాకుడు, క్రౌంచుడు మొదలగు పుత్రులును, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అను కుమారితలు బుట్టిరి. అపర్ణయే పార్వతి" అని ఉంది.
  మరో చోట కూడ మైనాకుడు పార్వతికి అన్న అనే ఉంది.
  మీరు అనుకోకున్నా "భీష్ముడు" అని సరిగానే రాసారు కదా!

  రిప్లయితొలగించండి
 6. ఊకదంపుడు గారూ,
  మీ వ్యాఖ్యను కోడీహళ్ళి వారి వ్యాఖ్యగా పొరబడ్డాను. మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 7. మీరు పద్యాన్నివిడమరుస్తూ ప్రశ్నలు ఇవ్వకుంటే బావుంటుందని నా అనుకోలు; ఆలాచేస్తే ఔత్సాహికులు పద్యం అర్ధంచేసుకొనే ప్రయత్నమూ చేస్తారని ఆశ


  నమస్కారములతో
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 8. అయ్యోదానిదేముందండీ... ఈ మాత్రం దానికి మన్నించడమంత పెద్దమాట ఎందుకండి - పైగా గురువులు మీరు .. మీ ఉద్యోగానుభవమంత లేదు నా వయసు.
  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి