3, డిసెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 160

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ!
దీనిని పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. వన్నె చిన్నెల ఒయ్యారి, నన్ను జేరి
  కలువ పూలను బోలిన కన్నుదోయి
  కలిపి, కవ్వించు సమయాన , చలువ ఱేడు
  వెన్నెల గురియ నావిరుల్ వెడలెనయ్యొ!!!!!

  రిప్లయితొలగించండి
 2. ఇప్పుడు గారంటీగా మీరు "అజ్ఞాత రాజు" అనిపించుకొన్నారు (నవ్వుతూ). రమణీయంగా వుంది పద్యము.

  రిప్లయితొలగించండి
 3. అజ్ఞాతగారూ కృష్ణశాస్త్రిని మించిపోయారు. పూరణ చాలా రమ్యంగా ఉంది. మీ పూరణకు విపరీతముగా నా పూరణ : :

  అలరుకోలల మేనుకు నగ్గి పుట్ట
  అహితదృష్టికి కంతుడు దహన మయ్యె
  చండరూపము శివమూర్తి తాండవింప
  వెన్నెల గురియ నావిరుల్ వెడలెనయ్యొ

  రిప్లయితొలగించండి
 4. పూలగంప దాలిచి మల్లె మొగ్గ నవ్వు
  విరియ మోముఁ బూలమ్ముచు వీధులందు
  ముద్దబంతి వోలె వెడలు ముదిత వెంట
  వెన్నెల గురియ నా విరుల్ వెడలె నయ్యొ!

  రిప్లయితొలగించండి
 5. రవిగారూ మీ పూరణ అందంగా ఉంది. ఎందుకైనా మంచిది, కొన్నాళ్ళు పూలు కొని యింటికి తీసుకు వెళ్ళకండి.

  రిప్లయితొలగించండి
 6. భలే ఉన్నాయి సర్ మీ పూరణలు మాబోటి పామరులను కూడా రంజింప చేస్తూ!. రవి గారి పూరణలో నా విరుల్ అని విడిగా చదువుకోవాలాండీ.. "ఆ పూలు" అన్న అర్ధంలో? పై రెండు పద్యాలలో "ఆవిరి" అనే అర్దంలో అనుకొంటా. వావ్..
  పూలమ్మే వాళ్ళు కూడా స్పెషల్ గా ఉంటారు లేండి ఆయన చెప్పినట్లు.

  రిప్లయితొలగించండి
 7. అన్ని పూరణలు చాలా సరసంగా ఉన్నాయి.
  రవి సమస్యపాదంలో పదాన్ని విరిచిన తీరు సెబాసో

  రిప్లయితొలగించండి
 8. పదవి విరహాగ్ని సైపలే నిది నిజమ్ము,
  వేచి వెన్నెల పులుగులా కాచు కొంటి
  పంపకాలని, రాదాయె పదవి యకట!
  వెన్నెల గురియ నావిరుల్ వెడలెనయ్యొ!

  రిప్లయితొలగించండి
 9. కన్నెబుగ్గలు గులాబి వన్నెదాల్చె,
  వనితకన్నులు నెలరాజు వంకలయ్యె!
  చిన్నగా వెన్నులోరాగ సెగలుబుట్టె,
  వెన్నలగురియ నావిరుల్ వెడెలెనయ్యొ!

  రిప్లయితొలగించండి
 10. సరసమైన సమస్యకు ధీటుగా సరసమైన పూరణలు! అందరికి అభివందనాలు, అభినందనలూనూ.

  @నరసింహ మూర్తి గారు, నిజమేనండోయ్. పూలు కొంటే పరిస్థితి ఇలా అవుతుంది.

  "సుంత సరసమెరుగడయ్యు ఇంతి మీద
  ఇంత ప్రేమయేల కలిగె వింత నేడు!"
  ఓప జాలని మనమున నొక్క వైపు
  వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ!

  ఆ తర్వాత మగని మనఃస్థితి ఇది.

  చిన్ని సౌందర్య భావన చేటు యౌనె?
  విరులమాల నయ్యదిఁ గొప్పు దురుమ వలదె?
  రీతి గాదిది తనువునఁ రేయి జిలుగు
  వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ!

  @కొత్తపాళి గారు: "చిన్నదాన, ఓసి చిన్నదాన, ఆశ పెట్టేసి పోమాకె కుర్రదాన" అని ఓ పాట ఉండేది. ఓ కాయగూరలమ్మి వెనకల కుర్రాళ్ళు వెంటబడుతూ పాడేపాట. (కత్తిరిక్కా, వెళ్ళ కత్తిరిక్కా - తమిళం). ఆ పాట గుర్తొచ్చి ఇలా. :))

  రిప్లయితొలగించండి
 11. అన్ని పద్యాలూ గుభాళిస్తున్నాయి. అందరికీ నమ"స్సుమాలు."
  శంకరయ్య గారింట పెళ్ళి అవగానే పూలతోట పెట్టినట్టున్నారు.
  రవిగారూ! ఒక చిన్ని (నాటక) అంకమే రచించేశారే!

  రిప్లయితొలగించండి
 12. వలపు విరులను గైకొని ముదము తోడ
  చెలియ చెక్కిలి మీటుచు సరస మాడ
  బుసలు గొట్టుచు పైపైన విరిగి పడగ
  వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ !.

  రిప్లయితొలగించండి
 13. మైత్రేయి గారూ నమస్కారము. గురువుగారు శంకరయ్య గారి శంకరాభరణములో పద్యాలను పండితులతో బాటు నా బోటి పామరులు కూడా వ్రాస్తారు. తెలుగు భాషపై అభిమానము ఉంటే చాలు. ఒక్కసారి ప్రాత ఛందస్సు పాఠాలు తిరగ వేసి వ్రాయడము మొదలు పెట్టండి. మాస్టారు తప్పులు దిద్దుతుంటారు. మనము నేర్చుకొంటుంటాము.

  @రవి గారూ మీ పుష్ప సరాగ మాల బాగుంది.

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాత గారూ,
  చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు చెప్పినట్లు మీ పూరణ రమణీయంగా ఉంది. ధన్యవాదాలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణకూడ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రవి గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారు చమత్కరించినట్లు మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  మైత్రేయి గారూ,
  పూరణలు మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.

  కొత్తపాళీ గారూ,
  ధన్యవాదాలు.

  మిస్సన్న గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణతో నిజంగానే సెగలు పుట్టించారు. ధన్యవాదాలు.

  రవి గారూ,
  బ్రహ్మాండం. మీకు ధన్యవాదాలు తెలుపుకొనడం తప్ప ఇంకేమీ వ్యాఖ్యానించలేను.

  మందాకిని గారూ,
  ధన్యవాదాలు.

  రాజేశ్వరి గారూ,
  మంచి భావంతో పద్యం చేప్పారు కాని మూడు పాదాల్లోను యతి తప్పింది. సవరించే ప్రయత్నం చేయండి.

  రిప్లయితొలగించండి