11, నవంబర్ 2016, శుక్రవారం

సమస్య - 2195 (సిగ్గెగ్గులు లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్"
లేదా...
"సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

78 కామెంట్‌లు:

  1. గురువుగారూ నిన్నటి పూరణ

    మానవ లోకమందు తలమానికమౌ ఘన భారతావనిన్
    సేనల మోహరించి మన జీవన భాగ్యపు రేఖ మార్చి పూ
    ర్ణానకుడాంగ్ల పాలకుడు రాక్షస కృత్యుడు వంచకుండు నా
    మానిని మానముం జెఱచి మన్ననలన్ మ(ప)గవాఁడు పొందెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారు గురువు గారు కాదు నేను.
      మీ పూరణ చాలా బాగుంది. పూర్ణాణకుడనండి. అనకుడు రూపాంతరమైనను సమాసమున వాడరాదు.
      న-ణ లకు ప్రాస చెల్లుతుంది.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సూచనకు ధన్యవాదములు. నా దృష్టిలో మా లాంటి వారందరికీ సూచనలనందిస్తున్న మీరు, శ్యామలరావు గారూ, మధుసూదన్ గారు గురుతుల్యులే. ఈనాటి పూరణ.

      నిగ్గున్ దేల్చగ మేటి రాజ సభలో నేమంపు సంవాదమున్
      వెగ్గంబున్ పలు పండితోత్తముల సద్విఖ్యాతినోడించుచున్
      వగ్గంబుల్ విదితాత్ములొప్ప చదివిన్ వర్ధిల్లు విప్రోత్తమున్
      సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్

      తొలగించండి
    3. ఈ రోజులలో ఆంగ్ల విద్య ముందు వేదము తీసికట్టుగా భావించి అది చదువుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా, అందువలన అలా రాశాను. అన్వయం సరిపోయిందా లేదా అని అనుమానం ఉంది.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. కలియుగ కుచేలుని భార్య ఉవాచ:

      "తగ్గెడి ఆదాయముతో
      నెగ్గుట సంసారమెటుల? నివిగో యటుకుల్!
      దగ్గర గదరా ద్వారక!
      సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్!"

      తొలగించండి
    2. శాస్తి గారు మీ పూరణ బాగుంది. కందము వ్రాయడములో సిద్ధహస్తులయ్యారు.
      సమస్యకు పరిష్కార మేరీతి నిచ్చారు?
      దగ్గర నున్నవి యివియే!
      అంటే అల్పపుటటుకులు సిగ్గు లేక నిచ్చు వాని ననుకోవచ్చుకదా!
      అప్పుడు నిజ కుచేలుఁడవుతాడు.

      తొలగించండి
    3. విజ్ఞులు కామేశ్వర రావు గారు:

      ఇన్నాళ్ళకి తడబడుతూ శ్రమబడుతూ గణ దోషములూ యతిప్రాస భంగములూ తగ్గించి కందపద్యములు వ్రాయగలుగుతున్నానంటే అది శంకరాభరణ మహాత్యం. సంధులూ సమాసములూ జోలికి పోలేను.

      మీ సవరణ అద్భుతం.

      శ్రీ శంకరయ్య గారికీ, మీకూ నా కృతజ్ఞతలు!

      తొలగించండి
    4. నిజం!చాల ఉపయుక్త మైన బ్లాగు నిర్వహణ కదా!

      తొలగించండి
  3. నిగ్గులు వాఱెడి వనితకు
    మొగ్గును జూపుచు ముదముగ మోహము నందున్
    దిగ్గున మనసీయగ చెలి
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    రిప్లయితొలగించండి


  4. ఒగ్గాళంబుల కాలకర్ణి మన భావోద్వేగ రూపంబు గన్
    మగ్గించంగ, మనోహరంబుగను మేల్మాణీక పొన్నారి గన్
    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడు
    న్నిగ్గుల్తేల్చగ, మానవాళి మనసున్నీమంబు తేల్చంగ నౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. పెగ్గుల నెగ్గు జిలేబీ,
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్,
    తగ్గగ మోహము చంచల
    దిగ్గన వీడున్ యలక్ష్మి దీటుగ వలచున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు మీవృత్త పూరణము సుందరముగా నున్నది. మేల్మాణీక పొన్నారి: మాణిక్యమును మాణీక మనడము సరికాదనుకుంటాను. మేల్మాణిక్య అన్న సరిపోవును కాని తర్వాత పొన్నారి యని యాచ్చిక శబ్దము సమసించదు.మేల్మాణిక్య సౌశీల్యయే యన్న నెట్లుండును?

      మీ రెండవ పూరణ ఛందోబద్ధమే. యలక్ష్మి యని యడాగమము రాదు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    గగ్గలమౌ నిజ జీవిక
    నెగ్గుల నేనెపుడు జేయ నీషణ బెంచన్
    దిగ్గున చార్వాకోద్ధతి(ఋణం కృత్వా ఘృతం పిబేత్)
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్!
    పగ్గాల్ బట్టియు నీషణన్ గదిసి వే పాట్లెన్నియో చేయకన్
    మగ్గాల్ బట్టిరి మానమున్ మనుపగా మా పూర్ణ శాలీయులే
    నెగ్గేరే యిట? నీతి నేతి యనుచున్ నిన్ ముంచి నన్ ముంచుచున్
    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీ రెండు పూరణలు మనోహరముగా నున్నవి. అప్పుచేసి పప్పుకూడు లాంటి సామెత చెప్పారు. బాగుంది.
      వృత్తములో చేయకన్ అది ద్రుతాంతము కాదు.చేయరే యన సరి.
      నెగ్గేరే వ్యావహారికము కదా. నెగ్గంజాలిరె యన సరి.
      పూర్ణ శాలీయులు? శాలీసులా లేక పద్మశాలులా?

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (నేత)కాదనక ఉన్నవారే స్వచ్ఛమైన శాలీయులు(పద్మ శాలి వృత్తివారు)ఇతర వృత్తికి మారడం వల్ల .మరిగేకులవారు. ఔతారు(స్వధర్మం నిధనో శ్రేయ.గీతా).ఐతే వారే పూర్ణ పురుషులు.కష్టాలకు భయపడి కుల ధర్మాన్ని కూల్చినారు నా వంటి వారు.అంతా ఐ.టీ.లు కట్టగా మిగిలిందేమున్నది?(పర ధర్మాన్ని బట్టుకొన బాముకొన్నది పాపమే.నాకు నాకులవృత్తిపరుడు ఆరాధ్యుడు."చేనేత వెత"ను జెప్పిన కవిని నేను.కదిలించి నందులకు మీకు కృతజ్ఞతలు.పద్యం చెప్పి కంటి నిండా ఏడ్చాను ఉదయమే.మీ సత్సాంగత్య భాగ్యంవల్ల చెప్పుకున్నానిలా!

      తొలగించండి
    3. ఆర్యా ధన్యవాదములండి మీ వివరణకు. బాగా సున్నిత మనస్కులు మీరు. దేశ కాల పరిస్థితుల బట్టి నడచుకోవాలికద. నా పూరణ కూడ చూడండి. మగ్గముల ప్రస్తావన కలదు. వేగతమ యంత్రకాలములో చేతి పనులకు కష్టమే కదా.

      తొలగించండి
    4. డా.పిట్టానుండి
      ఆర్యా ,చేయకన్. చేయకుండా.వృత్తిని (నేత)కాదనక ఉన్నవారే స్వచ్ఛమైన శాలీయులు(పద్మ శాలి వృత్తివారు)ఇతర వృత్తికి మారడం వల్ల .మరిగేకులవారు. ఔతారు(స్వధర్మం నిధనో శ్రేయ.గీతా).ఐతే వారే పూర్ణ పురుషులు.కష్టాలకు భయపడి కుల ధర్మాన్ని కూల్చినారు నా వంటి వారు.అంతా ఐ.టీ.లు కట్టగా మిగిలిందేమున్నది?(పర ధర్మాన్ని బట్టుకొన బాముకొన్నది పాపమే.నాకు నాకులవృత్తిపరుడు ఆరాధ్యుడు."చేనేత వెత"ను జెప్పిన కవిని నేను.కదిలించి నందులకు మీకు కృతజ్ఞతలు.పద్యం చెప్పి కంటి నిండా ఏడ్చాను ఉదయమే.మీ సత్సాంగత్య భాగ్యంవల్ల చెప్పుకున్నానిలా!

      తొలగించండి
  7. మిత్రులందఱకు నమస్సులు!

    తగ్గించిన సరకుగొనక;
    యెగ్గాడిన మదిని నిడక; యెంగిలి యైనన్
    దిగ్గునఁ దినఁగాను దలఁచు

    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపుంగవులు నిన్నటి పూరణకు నా వివరణ నీ రోజునిచ్చితిని. తిలకించ గోర్తాను.
      ఈనాటి మీ పూరణ చాలా బాగుంది.

      తొలగించండి
    2. కవి పుంగవులు మధుసూదన్ గారు శృంఖలబద్ధ; శృంఖలాబంధ రెండును సంస్కృత నిఘంటువులో చూచితిని యిప్పుడే.

      తొలగించండి
    3. ధన్యవాదాలండీ కామేశ్వర రావు గారూ! నిన్నటి మీ సమాధానమును ఇప్పుడే చూచితిని. సరిగానే తోచుచున్నది. ఏమైనను మరొక్కమారు సంస్కృత భాషాభిజ్ఞుల యభిప్రాయమును కూడ తెలిసికొని వివరించగలరని మనవి.
      మఱొక్కమాఱు ధన్యవాదాలు.

      తొలగించండి
    4. ధన్యవాదములండి.
      शृङ्खलबद्ध : Monier William's Sanskrit-English Dictionary, 2 nd Ed. 1899
      m.
      bound by a chain or fetter MārkP.(మార్కండేయ పురాణము)

      తొలగించండి
    5. డా.పిట్టానుండి ఆర్యా హిందీలో చూచింది శృంఖలాబద్ధ్ గాన .ల. హ్రస్వం కాదండీ సం.తో వచ్చిందే ఆ సమాసం.

      తొలగించండి
    6. ఆర్యా అది దేవనాగర లిపి లో ఉన్న సంస్కృత సమాసము. ల హ్రస్వమే. ద్ధ అకారాంతమే. పొల్లు కాదు.
      ఆ సమాసము మార్కండేయ పురాణము లోనిదని ప్రమాణము చూపించారు ఆ నిఘంటువులో.

      తొలగించండి
  8. ఒగ్గకు ధర్మపు బాటను
    తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా
    దగ్గరకే రానీయకు
    సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారు మీ పూరణ మద్భుతముగా నున్నది. ఒగ్గు పదమునొకసారి పరిశీలించండి. ఇక్కడ సరిపోదనిపించు చున్నది.

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వర రావు గారన్నట్లు అద్భుత పూరణ!అభినందనలు!మొదటి పాదానికి ప్రత్యామ్నాయంగా ఈ పాదాన్ని పరిశీలింప మనవి..
      "మొగ్గుచు ధర్మము వైపునె"
      --జనార్దన రావు.

      తొలగించండి
    3. దోషమును తెలిపిన కామేశ్వరరావు గారికి, చక్కని సవరణ చూపిన జనార్దనరావు గారికి.ధన్యవాదములు.

      సవరణతో....

      మొగ్గుచు ధర్మము వైపున
      తగ్గట్టుగ పేదవారి దయతో గనుమా
      దగ్గరకే రానీయకు
      సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పగ్గియ మాటల బొంకుచు
    దగ్గరు జేరిన ముగుదుల దందన చలుప
    న్నుగ్గించిన నిధిని గులుకు
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరితా వలచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు ద్విత్వ గ తో క్రొత్త పదములతో మీ పూరణ మనోహరముగా నున్నది.
      "దగ్గరు" అనిన దగ్గరజేరు కదా. దగ్గర యనిన సరి యనుకుంటాను.

      తొలగించండి
  10. మగ్గులతో మద్యము గొని
    విగ్గులు ధరియించి వేదవేద్యుల మనుచున్
    బుగ్గిని నుదుటను నిలిపెడి
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    ఉగ్గుడును విడువబోవక
    నెగ్గులు సలుపంగ బోక నితరుల కెపుడున్
    మగ్గము బట్టుటకెన్నడు
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారు గారు మీ రెండు పూరణలు నుత్తమముగా నున్నవి. వాడుక భాషపుటాంగ్లపదము లున్నవి.
      రెండవ పద్యములో యెగ్గులు; యితరుల అనండి. కొట్టక, తిట్టక ఇత్యాదులు కళలు.

      తొలగించండి
  11. కం. తగ్గక నేవిధమైనను
    నగ్గజమగు రీతి ధనము నార్జింపంగన్
    బెగ్గల మొకింత నేరని
    సిగ్గెగ్గులు లేని వారి సిరి తా వలచున్.
    కం. అగ్గలముగ నీతి విడిచి
    ఒగ్గెదరుగ సిగ్గు !సిగ్గు!యోగము కొరకై
    నెగ్గుటె పరమావధియగు
    సిగ్గెగ్గులు లేని వారి సిరి తా వలచున్.
    ****+++++****
    అగ్గజమగు=వలసిన దానికన్న పెద్దదియగు;
    బెగ్గలము=భయము,విహ్వలత;
    అగ్గలముగ=కౄరముగ;
    ఒగ్గు= పూనుకొను
    యోగము = ధనము
    =========

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దనరావు గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి.
      సమస్య పాదము: "సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్"
      "యేవిధమైనను"; "యొగ్గెదరు" అనండి.

      తొలగించండి
  12. నిన్నటి సమస్యకు నా పూరణము
    స్వీకరింప మనవి.

    కానక నుచ్ఛము, నీచము

    జ్ఞాానంబిసుమంత లేక గర్వాంధుండౌ

    వానిని, తన భర్తనె యా

    మానిని మానమ్ము జెఱచి మన్ననలందెన్.

    మానము= గర్వము, జెఱచి= పోగొట్టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారు నిన్నటి మీ పూరణ చాలా బాగుంది. "కానక యుచ్చము" అనండి.
      వ్యతిరేక క్త్వార్థంబున వచ్చిన క ద్రుతాంతము కాదు.

      తొలగించండి
  13. సిగ్గిలడు వెన్న దొంగిల
    ఎగ్గులు తలపెట్టు ధర్మ హీనుల కెపుడున్
    నెగ్గును మదనుని సైతము
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీరావు గారు మీ పూరణమాణిముత్యము. నెగ్గులు అనండి.

      తొలగించండి
    2. శ్రీ కామేస్వరరావుగారూ ధన్యవాదములు మీసూచన మేరకు సవరించిన పద్యము
      సిగ్గిలడు వెన్న దొంగిల
      ఎగ్గులు తలపెట్టు ధర్మ హీనుల కెపుడున్
      నెగ్గులు మదనుని సైతము
      సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

      తొలగించండి
    3. తిమ్మాజీ రావు గారు నేను చెప్పినది రెండవ పాదములో. దొంగిల / నెగ్గులు. పొరపాటున మీరు మూడవ పాదములో చేశారు.

      తొలగించండి
  14. క్రమమాలంకార పూరణ:
    శా. ఒగ్గంబోవగ కార్య సిద్ధి కొరకై యొక్కింత లెక్కింపుమా
    నెగ్గం దిగ్విజయమ్ము జేరదెవరిన్ నేర్పన్నదే సుంతయున్
    మ్రంగ్గంబోవక పాప పంకిలమున మాత్సర్యమే వీడగన్
    "సిగ్గెగ్గుల్; దమలోన లేని మనుజున్; శ్రీ చేరు నెల్లప్పుడున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మీ పూరణ బాగుంది. "మ్రగ్గంబోవక", "పంకిలమునన్" అనుకుంటాను.
      "నేర్పన్నదే సుంతయున్" అన్వయము తెలియుట లేదు.

      తొలగించండి
  15. పగ్గము లెల్లను గైకొని
    బెగ్గడిల జనులు వదలక బేరము లెల్లన్
    డిగ్గున జేయు వినీతుని
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    [వినీతుఁడు = వర్తకుఁడు]


    మగ్గంబుల్ పడి యున్న నింట సిరి సమ్మానింపఁ దా నేర్చునే
    బుగ్గై పోయినఁ బంట కర్షకుని దాఁ బూరించునే విత్తముల్
    నుగ్గుల్ సేయగఁ గొండ లన్నిటినిఁ గన్నుల్ నిండు నీరమ్ముతో
    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. గగ్గోలు వడుచు వీడును
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి! తా వలచున్,
    సిగ్గరియౌ పర ధనమున
    కొగ్గని నీతి పరుని కిడు కోటి శుభంబుల్!

    రిప్లయితొలగించండి
  17. దగ్గరకు న్రా నీయరు
    సిగ్గెగ్గులు లేని మనుజు, సిరి తా వలచున్
    మొగ్గక చెడునల వాట్ల కు
    బిగ్గరగా వేడ మదిని విష్ణుని నెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య విరుపుతో నీ పూరణ బాగుంది. చెడునలవాట్ల దగ్గర సంశయముగానున్నది. "చెడ్డలవాట్లకు" అన్న బాగుండునేమో?

      తొలగించండి
  18. అగ్గలమగుయోట్ల కతన
    పగ్గములన్ బట్టి స్వచ్ఛ పాలనటంచు
    న్నొగ్గుచు లంచములకు నే
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    రిప్లయితొలగించండి
  19. పగ్గంబుల్ధనదాహలోభములకున్ బంధించ కెల్లప్పుడున్

    నిగ్గుల్దేలి యధర్మవర్తనమునన్, నిర్భీతి దుర్నీతియున్

    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్

    తగ్గేదెప్పుడొ ! యిట్టి వింత యిల, శ్రీ ధర్మంబు పాటించదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ భావము సరిగా బోధ పడలేదండి.
      పగ్గంబుల్ ధనదాహ లోభములకున్ బంధించక ?
      నిర్భీతి దుర్నీతియున్ సిగ్గెగ్గుల్ దమలోన లేని ?

      తొలగించండి
  20. గ రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    సి గ్గెగ్గుల్ దనలోన లేని మనుజున్

    ……… శ్రీ చేరు నెల్లప్పుడున్ |

    పగ్గెన్ బూనెను మోది నల్ల - ధనులన్

    ……… నాశ౦ బొనర్ప౦గ | దా

    నెగ్గెన్ , మార్చుచు , రూప్య కాకలములన్ |

    ………… నిగ్గారు నీ కార్యము

    న్నగ్గి౦చ౦ దగు | దేశ మ౦దు గల

    … .... నన్యాయార్జ కానేకులున్

    గగ్గో లొ౦దిరి | నే డగున్ క్షణికమే

    ……… కష్ట౦బు లెన్ను౦డినన్


    { పగ్గె బూనెను = ప్రఙ్ఞ బూనెను ; ధని =

    కుబేరుడు: నల్ల - ధనులన్ = నల్ల కుబేరులను

    కాకలము = కాగితము ; రూప్య కాకలములన్

    = రూపాయ కాగితములను , కరెన్సిని ;

    నిగ్గారు = మేలగు ; అగ్గి౦చ౦ దగు =

    కొనియాడ దగు ;

    ఆర్జకుడు = స౦పాది౦చు వాడు ;

    అన్యాయార్జక + అనేకులు = అన్యాయముగ

    స౦పాది౦చు ననేకులు ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారు మీ పూరణ చాలా బాగుంది.
      రూప్యమనిన వెండి, వెండినాణెము. అది రూపాంతరము జెంది (ఆంగ్లేయుల నోట్లో పడి) రుపీ (Rupee)లేక రూపాయి అయి మన కాగితపు ద్రవ్యమయిన దనుకుంటాను.

      తొలగించండి
  21. అగ్గంబౌ యడియాసతోసతత మన్యాయమ్ముగా పాలనా
    పగ్గమ్ముల్ గొనుచున్ గరీబు జనులన్ వంచించు దుర్మార్గుడౌ
    సిగ్గెగ్గుల్ దన లోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
    యెగ్గుల్ బొందుచునుంద్రు సుమ్మ బడుగుల్ హేయంపు సంసారమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది. పాలనా పగ్గమ్ముల్ దుష్ట సమాసము. దీర్ఘము కూడ రాదు.
      బికారి జనులన్ అనండి.

      తొలగించండి
    2. ఈ సవరణ పరిశీలించి, తప్పైన తగిన సూచన నివ్వ ప్రార్థన.
      అగ్గంబౌ యడియాసతోసతత మన్యాయంపు మార్గమ్ములో
      పగ్గమ్ముల్ గొనుచున్ బికారి జనులన్ వంచించు దుర్మార్గుడౌ
      సిగ్గెగ్గుల్ దన లోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
      యెగ్గుల్ బొందుచునుంద్రు సుమ్మ బడుగుల్ హేయంపు సంసారమున్

      తొలగించండి
    3. సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది.

      తొలగించండి
    4. సత్యనారాయణ రెడ్డి గారు మీ సవరణ బాగుంది.

      తొలగించండి
  22. దగ్గరగునుదారిద్రము
    సిగ్గెగ్గులు లేనిమనుజు, సిరితా వలచున్
    నెగ్గుచు పలువురి యెదలను
    వగ్గుల మన్ననల పొందు వారినె గదరా!

    గగ్గోలెందుకు సత్ప్రవర్తన యు సంస్కారమ్ములన్ నేర్చుచున్
    తగ్గింపన్ వలె నీతి బాహ్యపనులన్ , దారిద్రమే నిల్చునే
    సిగ్గెగ్గుల్ దనలోన లేని మనుజున్ , శ్రీచేరు నెల్లప్పుడున్
    వగ్గుల్ జెప్పిన సుద్దులన్ వినుచు సద్భావమ్మునే గల్గినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు మీ రెండు పూరణలు బాగున్నవి. సమస్యకు పరిష్కారము కొంత కృత్రిమముగా కన్పించు చున్నది.

      తొలగించండి
  23. పగ్గము పట్టెడు వాడై
    నిగ్గక పనిజేయ గలుఁగు నేర్పరి యగుచు
    న్నొగుచు, శ్రమించుటందున
    సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారు నిగ్గక పని జేయ గలుగు ? నొగుచు / ఒగుచు ? మీ భావము కొంచెము వివరించ గలరు.

      తొలగించండి
    2. కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.
      మూడవ పాదంలో న్నొగ్గుచు అని వ్రాయబోయి టైపాటు దొర్లింది.

      సవరించిన పూరణ:

      పగ్గము పట్టెడు వాడై
      నిగ్గక పనిజేయ గలుఁగు నేర్పరి యగుచు
      న్నొగ్గుచు, శ్రమించుటందున
      సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

      భావము: యజమానిగ యుంటూ అతిక్రమించకుండా (నిగ్గక=మీఱక) పనిజేయగలిగిన నేర్పరి, పూనిక తో సిగ్గెగ్గులు లేకుండా శ్రమించు మనుజుని సరి వరిస్తుందని తెలుపు ప్రయత్నములో లోపమున్న ఎడల దయతో వివరించ ప్రార్థన.

      తొలగించండి
    3. బాగుందండి. యీ భావముతో పూరణ బాగుంది.
      నిగ్గు= మీఱు అంటే అతిశయించు. మంచిగుణము. నిగ్గుచు అంటే బాగుంటుంది.

      తొలగించండి
    4. కామేశ్వరరావుగారికి ధన్యవాదములు.

      సవరించిన పూరణ:

      పగ్గము పట్టెడు వాడై
      నిగ్గుచు పనిజేయఁ గలుఁగు నేర్పరి యగుచు
      న్నొగ్గుచు, శ్రమించుటందున
      సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

      తొలగించండి
  24. ఎగ్గొట్టిబాకిలన్నియు
    రగ్గుల వ్యాపారమందు రాణించుటచే
    మ్రగ్గక మనిషిగ మారుచు
    సిగ్గులు లేని మనుజు సిరితా వలచెన్|
    2.రగ్గుల్ నమ్ముచు రాటుదేలె చలియే రాజిల్లగా వింతగా
    సిగ్గెగ్గుల్ దమలోనలేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
    కగ్గల్లందున కామితార్థముగ సౌఖ్యంబుంచె వ్యాపారమే
    నిగ్గుల్ దేలెను నేర్పుకూర్పులచె మన్నించంగ శ్రీదేవియే


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు సమస్య పాదము: "సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్"
      మీ రెండు పూరణలు ఛందోబద్ధములే.

      తొలగించండి
  25. శ్రీ కామేశ్వరరావుగారికి నమస్కారములు
    నే నూహించి వ్రాసిన భావము>>>>>>>.

    నిత్యము ధన దాహమును లోభమును తాళ్లతో బంధించిక,
    అధర్మ ప్రవర్తనమున నిర్భయమున అవినీతిలో ఆరితేరిన >>అను సంధానముతో......... కాకపోతే దుర్నీతియున్ గాక దుర్నీతిలో
    అనాలి. దుర్నీతిలో అంటె సరిపోతుందా? తెలియ జేయ మనవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీనారాయణ గారు మీ భావ మవగత మయినది.బాగుంది. తగ్గేది అనడము వ్యావహారికము.
      ఈ సవరణ చూడండి మీ భావము పూర్తిగా వ్యక్తమైనదేమో.

      పగ్గంబుల్ ధనదాహలోభముల వేబంధించ కెల్లప్పుడున్
      నిగ్గుల్దేలనధర్మవర్తనమునన్, నిర్భీతి దుర్నీతునిన్
      సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్
      తగ్గున్నెన్నడు ! యిట్టి వింత యిల, శ్రీ ధర్మంబు పాటించదా ?

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. నెగ్గంజాలక చద్వుసంధ్యలిలలో నేతృత్వ మొప్పారగా
    పగ్గాల్లేనివి యాశలెప్డు మనమున్ పట్టించి పీకించగా
    జగ్గన్మోహన రూపుడై వెలుగుచున్ జంజాటమే లేనిచో
    సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి