1, నవంబర్ 2016, మంగళవారం

వేంకటేశ్వర శతకము - 11వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౧౧)
మహిమపు స్వామి పుష్కరిణి మాన్పు రజోఘము స్వర్ణ చౌర్య దో
ష హరము సేయు మజ్జనము సల్పిన మాత్రమ సత్వరమ్ముగ
న్నిహపర సౌఖ్య దాయకము నింపుగ దర్శన పాన సంగమా
ద్యహరహ పుణ్య కృత్యముల నక్షధ రాచ్యుత! వేంకటేశ్వరా!                 96.

శరణము లెల్ల దుఃఖముల శార్ఙ్గధ రాంచిత పాదపద్మముల్
తరణము లిభ్భవాంబుధుల దాట రమావిభు నామకీర్తనల్
తురగము లక్షయస్థలికిఁ దోయజ నాభు సుపూజనావళుల్
కరములు మోడ్చి మ్రొక్కెదను గైటభ ఖండన! వేంకటేశ్వరా!                    97.

అక్షము లేని తేరున విహారము ధారుణిఁ జేయ శక్యమే
పక్షము లున్నఁ గాని భువిఁ బక్షులు పైకెగు రంగ శక్యమే
చక్షువు లున్నఁ గాని కన శక్యమె మేదినిఁ బ్రాణి కోటికి
న్నక్షయు జ్ఞాన యోగమున నైహిక ముక్తులు వేంకటేశ్వరా!                   98.

అమర సహస్ర భోగ చతురానన షణ్ముఖ కీర్త నాతిరి
క్తము సిరి వాస భూషితము తామరసాక్ష మనో వికాస శై
లము ధన హేమ ధాన్యద విరాజిత మిద్ధర వేంకటాద్రినిన్
సముచిత రీతిఁ గొల్చెదము సన్మతి నిత్యము వేంకటేశ్వరా!                     99.

శిష్ట జనాళి రక్షక విశేష కృపారస సిక్త వీక్షణా
దుష్ట జనాళి శిక్షక సదుద్భవ పాలన నాశ హేతుకా
కష్టతరానివార్య భవ ఖండన కార్య నిమగ్న దైవమా
తుష్ట సుభక్త సేవిత సదుజ్వల విగ్రహ వేంకటేశ్వరా!                              100.

శ్రీకర! భక్త సంచయ వశీకర! పాప వినాశ కారకా!
నాక నివాస నిర్జర గణప్రభు పూజిత పాదపద్మ! ప
ద్మాకర భాసిత క్షితిధరాలయ! మాధవ! భూరమా కరా
నేక సుమార్చితాంఘ్రియుగ! నిన్ను నుతించెద వేంకటేశ్వరా!                   101.

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత
శ్రీ వరాహ పురాణ ప్రామాణిక
వేంకటేశ్వర శతకము.
-*-

4 కామెంట్‌లు:

 1. శతక మంతయు బూర్తిగ జదువ దెలిపె
  భక్తి భావము కలిగెడు పధ్ధతి యును
  స్వామి మహిమ లు పుష్కర స్నాన ఫలము
  లాది గానెన్నియో వింత లాశతకము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నయ్య శాంతము చదివి పద్య కుసుమాలతో వ్యాఖ్యానించినందులకు మిక్కిలి ధన్యవాదములు.

   తొలగించండి
 2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  భక్తి భావ సమన్వితం, మనోహర పద ప్రయోగ విరాజితం, ఆహ్లాదకరమైన ధారాశుద్ధి కలిగి మీ శతకం రంజింపజేసింది. దీనికి ప్రకటించే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  (అస్వస్థత కారణంగా మీ శతకాన్ని పూర్తిగా చదువలేదు. అక్కడక్కడ చూడడం జరిగింది. కాస్త స్తిమితపడ్డ తరువాత నింపాదిగా పరిశీలించి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అస్వస్థ తరచూ బాధించుచున్ననాప్యాయముగా శతకము ను నిరంతరముగా ప్రచురించి నందులకు నమస్సుమాంజలులు. మీకు వీలు కలిగినప్పుడు నిశితముగా పరిశీలించి దోషము లున్న తెలుప గోర్తాను.

   తొలగించండి