4, నవంబర్ 2016, శుక్రవారం

కాశీయాత్ర (ఖండకావ్యము)

                           రచన - పోచిరాజు సుబ్బారావు
 

కన్నకొడుకగు కిరణును గలుపుకొనుచు
విజయ, జామాత లిరువురు వెంట రాగ
కాశి కేగితి విశ్వేశు గనుట కొఱకు
హాయి  గొలిపెను  యాత్ర మా కందఱకును.

కాశికాపురమున గనువిందు గావించె
కనకమయపు  దేహకాంతి తోడ
నన్నపూర్ణ  తల్లి, యభయ మీయంగను
భక్తకోటి కెల్ల రక్తి నుండె.

చూసితి దుర్గా మాతను
జూసితి మఱి యాంజనేయు జూసితి గపులన్
జూసితి వీణాధారిని
జూసితి నే గవల మాత జూడ్కుల కింపౌ.

విశ్వనాధుని జూడంగ వేల కొలది
భక్త జనములు వత్తురు ప్రతిదినమ్ము
వారి నందర బ్రోవను వాసముండె
కాశి యందున తిరముగ గాలు డచట.

ఘాటు లరువది నాలుగు గలవు కాశి
నందులో మణికర్ణిక యధికతరము
తాన మాడిన దొలగును దప్పు లన్ని
కల్ల కాదిది నిజమునే బల్కుచుంటి.

కాలభైరవ దర్శన కాంక్షతోడ
పరుగు పరుగున బోవంగ ప్రభువు దరికి
సరిగ జూడంగ జాలము జనము మధ్య
ప్రణతు  లిడుదును నా కాలభైరవునకు.

చింతించ దగిన  విషయ
మ్మంతయు నిక చెత్త యుండె నా పుర మందున్
గుంతల మాదిరె వీధులు
నంతయు నా శివుని లీల లాహా యరయన్.

చీరల  విషయము జూసిన
భారమ్మే లేక యుండి బహు తేలికగా
నీరము తడిసిన చెడక బె
నారసులో పట్టు చీర నాణ్యతతోడన్.

శివుని యాజ్ఞయే లేనిచో చీమయైన
కుట్ట దందురు పండితు లట్టు లయ్యె
నాజ్ఞ గలుగగ భర్గుని యాత్మనుండి
వెడల గలిగితి మయ్య యా విభుని దరికి.

పండ్లలో గన యాపిలు పండు మఱియు
నాకు కూరల యందున నలరు నట్టి
పాల కూరను వదిలితి బ్రమద మలర
దుంప లందున చిలగడ దుంప కూడ.
కాశి యందున విడిచితి  గంగలోన.

9 కామెంట్‌లు:

  1. మీ కాశీ యాత్ర కన్నులకు కట్టినట్టుగా చక్కగా వర్ణించారు. చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  2. కనుల కగపడె నిటఁ గాశికా పురమది
    అన్న పూర్ణసహితు నాది భిక్షుఁ
    దర్శనంబునయ్యె తరియించె జన్మము
    పూర్ణసద్గుణాఢ్య పోచిరాజ



    రిప్లయితొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు పూర్తిగాను
    కాశియాత్రను లిఖియించి ఘనత బెంచె|
    విశ్వ నాథుని వినువీధి విశ్వమందు
    అన్నపూర్ణమ్మ లాశీస్సు లందినారు.

    రిప్లయితొలగించండి
  4. నాదుకవితకుస్పందించినగవుతోడ
    నింపుగొలిపెడుసందేశమిచ్చినట్టి
    మీరలందరకుహృదయపూర్వకముగ
    జేయుచుంటినినతులను,స్వీకరించ
    గోరుచున్నానుమిమ్ములనార్యులార!

    రిప్లయితొలగించండి
  5. మేము కూడా కాశీ యాత్ర చేసి ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదు. నా అనుభూతిని ఒక్క మాటలో చెప్పాలంటే...అహం కాశీం గమిష్యామి...తత్రైవ నివసామ్యాహం...కాశి.కాశి.కాశి. ఊరి శుభ్రత అనేది సహజవాటికలలో అంతే. అమెరికా శుభ్రంగా ఉంటుంది. కానీ కాశీలో ఉన్న మానసిక ఆనందం అక్కడ లేదు కదా. తెల్లవారు ఝామున లేచి గంగలో మునిగి కేడారేశ్వర స్వామికి స్వహస్తాలతో అభిషేకం చేసుకొనే అదృష్టం ఎక్కడా లభించదు. అందరూ చెప్పినంత మోసం అక్కడ కనపడలేదు. హిందీ వస్తే ఇంకా మంచిది, నాకు అది బాగా ఉపయోగపడింది. లేకపోయినా పరవాలేదనిపించింది. అక్కడి జిలేబీ, కచోరీ, తేనీరు రుచియే వేరు. మధోయి పాన్ మరింత రుచి. చెమటలు పట్టించింది. మాఘ మాసంలో అయితే అసలు సిసలైన పాన్ దొరుకుతుందట. కాశీయాత్ర తరువాత నేనొక హిందువుగానే పుట్టటమే అదృష్టం కాదు, హిందువుగానే కాశీ లో తనువు చాలించాలన్న కోరిక బలం పుంజుకొన్నది.
    విశ్వేశం మాధవం డుండిం దండ పాణిం చ భైరవం!
    వందే కాశీం గుహాం గంగాం భవానీం చ మనికర్నికామ్!!

    రిప్లయితొలగించండి
  6. అలతి పదాలలో కాశీయాత్ర విశిష్టత వివరించిన మీ పద్యాలు చాలా బాగున్నాయి సర్...

    రిప్లయితొలగించండి
  7. కాశీదర్శన భాగ్యము
    రాశీభూతంబయితగు రమ్యతగూర్చెన్
    ఈశానుని దయగనుడో
    వాశింగన్నట్టిమిత్ర వైభవమందన్.

    గంగాతరంగ సంగమ
    సంగీత ధ్వానములను సరసతమీరన్
    పొంగిన మీదగు భక్తిని
    రంగుగ మాకుంబనుచుట రసధునియయ్యెన్.

    వీనుల విందై యలరుచు
    సోనలపొందై చెలగుచు సుహృన్మణీ!
    తేనెలతొనలౌపదముల
    మీ నవ పద్యాళిజూడ మీరును సుధలన్.

    రిప్లయితొలగించండి