9, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1258 (భక్తి లేనివాఁఢు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భక్తి లేనివాఁఢు పరమ భక్తుఁఢు గద!
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. సంతత మనన్య భక్తితో స్వాంతమందు
    నిష్ట దైవమున్ లెస్స సేవించుచుండి
    తన్మయత్వమ్ము నొందుచు దాంభికమగు
    భక్తి లేని వాడు పరమభక్తుడు కద

    రిప్లయితొలగించండి
  2. పరుల మెప్పును పొందగ విరులు దెచ్చి
    రజత పాత్రల నిండుగ నంజు లుంచి
    దొంగ పూజలు జేసెడి దొరల కంటె
    భక్తి లేనివాఁ డు పరమ భక్తుఁ డుగద

    రిప్లయితొలగించండి
  3. మిగుల దుర్మార్గు డ నబడు మేదిని మఱి
    భక్తి లేనివాడు , పరమ భక్తుడు గద
    ధరను బ్రహ్లాదు డ నువాడు!ధార్మి కుడును
    రాక్షస కుల భూ షణుడు ను, రమ్య దేహి .

    రిప్లయితొలగించండి
  4. రాక్ష సాధము లెల్లరు రణము చేసి
    హరిని యోడించ యత్నించి హరుని జేరె!
    వారు నిత్యము జపియించె వాని పేరె!
    భక్తి లేని వాడు పరమభక్తుడు కద

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    దాంభికభక్తిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘రజతపాత్రలలోఁ బదార్థములనుంచి’ అందామా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    టేకుమళ్ల వెంకటప్పయ్య గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కొద్దిగా అస్వయలోపం ఉన్నట్టుంది. మీ పద్యాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందేమో...
    రాక్ష సాధము లెల్లరు రణము చేసి
    హరిని నోడించ యత్నించి హరుని జేరు
    కొనుచు నిత్యము శూలిని కొలిచిరి, హరి
    భక్తి లేని వాడు పరమభక్తుడు కద.

    రిప్లయితొలగించండి
  6. టేకుమళ్ల వెంకటప్పయ్య గారి పూరణ స్ఫూర్తితో....

    శైవ వైష్ణవ భేదముల్ స్పర్థఁ బెంచు
    కాలమున నున్నదఁట నమ్మకమ్ము విష్ణు
    భక్తి లేనివాఁడు పరమభక్తుఁడు గద
    పరమశివునకు శూలికి ప్రమథపతికి.

    రిప్లయితొలగించండి
  7. అమల హృదయాంతరంగుడై యనుదినంబు
    చిత్త శుద్ధితో హరిని పూజించు వాడు
    సద్గుణో పేతుడగువాడు చంచలమగు
    భక్తి లేనివాఁ డు పరమ భక్తుఁ డుగద.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    మూడడుగుల నేలను దానముగను గొనుచు
    భూమి నింగిని గొలిచిన వామనునకు
    శిరము వంచెను గద బలి సిరుల పైన
    భక్తి లేని వాడు పరమ భక్తుడు గద


    రిప్లయితొలగించండి
  9. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    చంచలభక్తిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సిరులపైన భక్తిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    భాగవతుల కృష్ణా రావు గారి పూరణ
    భుక్తికై గాక వెచ్చించె ముక్తి గోరి
    రామ మందిరమునకని రాజధనము
    భక్త గోపన్న.యైహిక వా౦ఛ లందు
    భక్తిలేనివాడు.పరమ భక్తుడు గద

    రిప్లయితొలగించండి
  11. భాగవతుల కృష్ణారావు గారూ,
    రామదాసు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చిత్రసీమల నటియించు చేరి నటులు
    చదువు లేనట్టి వ్యక్తియాచార్యుడగును
    సొమ్ములున్నట్టి మనిషి భిక్షమ్మునెత్తు
    భక్తిలేని వాడు పరమ భక్తుడు గద.

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘నటియింత్రు’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరుగారూ ! ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో...

    చిత్రసీమల నటియింత్రు చేరి నటులు
    చదువు లేనట్టి వ్యక్తియాచార్యుడగును
    సొమ్ములున్నట్టి మనిషి భిక్షమ్మునెత్తు
    భక్తిలేని వాడు పరమ భక్తుడు గద.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    =============*=================
    ముక్తినొందక జగతిని మూల్గు చుండు
    భక్తి లేని వాడు,పరమభక్తుడు కద
    వరము లొంది జగతి వీడు వడివడిగను
    పరమ సుఖము నొందుగ బ్రహ్మ పట్నమందు!

    రిప్లయితొలగించండి