26, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1275 (చదువు రానివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
చదువు రానివాఁడు శాస్త్రవేత్త.

36 కామెంట్‌లు:

  1. చదివి నోడి కంటె చాకలి మేలంట
    మహిని గెలువ నేడు మాయ లందు
    యుక్తి గలిగె నేని యోగి పుంగవు డంట
    చదువు రాని వాడు శాస్త్ర వేత్త

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఈ మధ్యనే నెలరోజుల క్రితం వార్త !
    కరీంనగర్ పట్టణమున
    రేడియోలు, టీవీలు బాగు చేసే మెకానిక్కు
    నీటితో మోటారు సైకిలు నడిపి నట్టు !

    అందుకే" తెలివొకడి సొమ్మా " అన్నారు :

    01)
    ___________________________________

    ప్రేరణము :
    ఇంధనంపు విలువ - లెక్కువౌ చుండుటన్
    వేగవాహనమును - వింతగొలుప
    రేడియోల నెన్నొ - పాడైన, సరిజేయు
    మేటి యొంటి నడిపె - నీటితోడ !

    పూరణము :
    నేటి చదువు లెల్ల - నీటి మూటలు జూడ !
    తిండి పెట్టలేవు - తిరము నిడవు !
    చదువు లేల నయ్య - ఙ్ఞానంబు ముఖ్యమ్ము !
    చదువు రానివాఁడు - శాస్త్రవేత్త !
    ___________________________________
    వేగవాహనము = వేగముగా కొనిపోవు నది (మోటారుసైకిలు)

    రిప్లయితొలగించండి
  3. కలియుగంబులోన ఘనుడౌచు వెలుగొందు
    విత్తమున్నవాడు వివిధగతుల
    నీతిదూరుడైన నేతగాయశమందు
    చదువురానివాడు శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రపఠనమేల సంకల్పశుద్ధితో
    దీనజనులసేవలోన సతము
    మగ్నుడౌచు హరిని మానసంబున నిల్పు
    చదువురానివాడు శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  5. చదువురానివాడు శాస్త్రవేత్తయటన్న
    చదువుకొన్నవాని సంగతేమి
    టన్న సత్య మాత డవివేకి యైనచో
    వ్యర్థమతని విద్య వసుధలోన.

    రిప్లయితొలగించండి
  6. మానవాళి మేలు మఱువక నెన్నడూ
    వృద్ధి పథము నెంచి పేరు పొంది
    దూర దృష్టి గలిగి, దోషయుతంబగు
    చదువు రాని వాడె శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి
  7. పొలము పనులజేయు పోలయ్య కనిపెట్టె
    సరళ పద్ధతులను సాగునందు
    పట్టుదలయె వలయు పట్టాలు కాదయ్య
    చదువురాని ' వాడు ' శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  8. అరయ నుచితమౌనె? తరతమ భేదాలు
    చదువురానివాడు, శాస్త్రవేత్త,
    నిమ్ను,డున్నతుండు, నిరుపేద, ధనికుండు
    సర్వజనులు భువిని సములు గాదె.

    సాధుహృదయులార! సంఘాని కర్థంబు
    చిన్న, పెద్ద మరియు స్త్రీలు, పురుషు
    లవనివారలైన యన్నిజాతులవారు
    చదువురానివాడు, శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    ధోని MBA వారికి ఐఐఎంబి లో క్లాసు తీసుకొని యందరి మన్ననలు పొందే
    =============*============
    చదువు రాని వాడు శాస్త్ర వేత్త యనుచు
    చదువు జెప్ప మనిరి మదుపరులకు,
    బుద్ధి బలము తోడ సుద్దు లెల్లను జెప్పి
    దోచు కొనెను మదిని (మతులు) ధోని యపుడు !

    రిప్లయితొలగించండి
  10. జగన్ పై
    =============*============
    చదువు రాని వాడు శాస్త్ర వేత్త యనుచు
    జేరి మ్రొక్కు చుండె సిరుల కొరకు,
    నీతివిడచి నడచు నేత లెల్లరు గూడి
    జయము బలుకు చుండె జగతి కెల్ల !

    రిప్లయితొలగించండి
  11. పామరుడైన కాళిదాసు మహా కవి పండితుడని రాజుకు దెలుపుట
    =============*============
    పలుకు బలుకులకును పరమార్థమును జెప్పి
    పామరులకు గావు బలుకులనుచు,
    చదువు రాని వాడు శాస్త్ర వేత్త యనుచు
    జేరి మ్రొక్కు చుండె సిరుల కొరకు !

    (గావు=అర్థముగావు,శాస్త్ర వేత్త= మహా పండితుడని)

    రిప్లయితొలగించండి
  12. చదువురానివాడు శాస్త్రవేత్తౌ నెట్లు?
    కష్ట పడుచు మిగుల నిష్టముగను
    జదువు కొన్న వాడె శాస్త్రీయ జ్ఞానంబు
    సకల జనులు మెచ్చు శాస్త్ర వేత్త.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    అనుభవమ్ము నేర్ప పనులను సాధించు
    చదువు రానివాడు. శాస్త్ర వేత్త
    పనులయందు మెలకువలను కనిపెట్టి
    ప్రగతి కొరకు పాటు పడిన వాడు

    రిప్లయితొలగించండి
  14. విద్య లెన్నొ జదివి విద్వాంసు డయినను
    కలుష చిత్తు డయిన కలదె ఘనత
    హలము చేత బూని హాలికు డయ్యెను
    చదువు రాని వాడు శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి
  15. కొత్త వంగడములు గొప్పగా కనిపెట్టి
    పేరు తెచ్చు కొనెను పేద రయితు
    శక్తి యుక్తు లున్న సాధించు విజయాలు
    చదువురాని వాడు శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి





  16. చదువు నేర్వగానె శాస్త్రజ్ఞు డౌనొకో
    అవిరళకృషి,యనుభవమ్ము,
    నవసరమ్ము గాదె,వ్యవసాయమును జేయు
    చదువురానివాడు శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    కావ్యములను కొన్ని కంఠస్థమును జేయ
    పండితుండు గానె బరగుచుండ
    డాక్టరేట్ల గుర్తు డాంబికులకె సొత్తు
    చదువురాని వాడు శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చదివినోడు’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ ఐదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మరువక’ కళ. ద్రుతాంతం కాదు. కనుక ‘మరువక యెన్నడు’ అనాలి. ‘ఎన్నడూ’ అన్నదాన్ని ‘ఎన్నడు’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శాస్త్రవేత్త + ఔన్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘శాస్త్రవేత్త యగునె’ అందాం.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘మెలకువలనెన్నొ కనిపెట్టి’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘అవిరళకృషి, శ్రద్ధ, యనుభవమ్ము’ అందామా?
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చదువు రాని వాడు శాస్త్ర వేత్త యగుట
    కల్ల , చదువు ముఖ్య మెల్ల రకును
    చదువు లేని వాని జవటగ భావింతు
    రుర్వి జనులు నిజము శర్వ పుత్ర !

    రిప్లయితొలగించండి
  20. మరొక పూరణ

    జ్ఞానియైన వాడు మౌనముద్ర వహింప
    చదువు రాని వాడు శాస్త్రవేత్త
    విశ్వశాంతి యనక విద్వంసమునె గోరి
    మాన్యులైరి జ్ఞానశూన్యు లిపుడు

    రిప్లయితొలగించండి
  21. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  22. Guruvugariki Dhanyavadamulu. tamari suchita savaranato naa padyam:


    మానవాళి మేలు మఱువక యెన్నడు
    వృద్ధి పథము నెంచి పేరు పొంది
    దూర దృష్టి గలిగి, దోషయుతంబగు
    చదువు రాని వాడె శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి

  23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    వృక్ష రాజ మెచట వెలయుచు నుండదో
    నాముదంపు జెట్టు ఖ్యాతి గాంచు
    పాఠశాల లేని పల్లెలందున జూడ
    చదువు రాని వాడు శాస్త్ర వేత్త

    రిప్లయితొలగించండి
  24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. సంఘమొక్కటి యభివృద్ధి సాగెనన్న
    యెల్లవారల కృషి యుండునిందులోన
    సకల వృత్తుల వాడును, పాలకుడును,
    చదువు రానివాఁడు, శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి
  26. గురువు సంకల్ప శుద్ధితో కొఱత లేక
    నిత్య సాధన చేయించి నేర్పనెంచ
    నొక్కనాటికి వేదిక నుఱికి వచ్చి
    కర్ణపేయంబుగా బాడె గార్ధభమ్ము

    స్వార్థపరతతో గూడిన చపలచిత్త
    ముగల వారకు, పోగాలములిక దాపు
    రించినట్టి వారకు , బుద్ధి లేని యట్టి
    తాపసులకు పూజ్యుడు కదా దశముఖుండు

    మాతను లోకమాతయగు మానిని గౌరిని పార్వతీసతిన్
    నూతన జన్మ నెత్తి పలు నోముల నోచిన కన్యకామణిన్
    పోతను పోసినట్టి యొక పున్నెపు రాశిని,యాదిదేవుడా
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    ఆత్మబంధువులేనంచు యందరకును
    తలను నాలుకవై నీవు మెలగుచుండ
    వారు వీరను భేదపు భావము విడి
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

    సంఘమొక్కటి యభివృద్ధి సాగెనన్న
    యెల్లవారల కృషి యుండునిందులోన
    సకల వృత్తుల వాడును, పాలకుడును,
    చదువు రానివాఁడు, శాస్త్రవేత్త

    రిప్లయితొలగించండి
  27. గురువు గారూ,
    మన్నించగలరు. ఊళ్ళో లేక వ్రాయదగిన అన్ని పూరణలూ ఇపుడే పంపుతున్నాను.
    ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  28. చదువు లెన్నొ చదివి సారమ్ము నెఱుగని
    జడుని వలన నేమి జరుగు మేలు ?
    ఉన్నరూపు నెఱిగి యుచితముగ నడచు
    చదువు రానివాఁడు శాస్త్రవేత్త !

    రిప్లయితొలగించండి
  29. లక్ష్మీదేవి గారూ,
    బ్లాగు పట్ల మీకున్న అభిమానానికి సంతోషం, ధన్యవాదాలు.
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ‘చదువురాని..." పూరణలో ‘సాగెనన్న నెల్లవారల..’, ‘వృత్తుల వారును’ అనండి.
    ‘తాపసులకు..." పూరణలో ‘వారకు’ అన్నారు. అది ‘వారలకు, వారికి’ అనాలి కదా.
    ‘మాతను పెండ్లియాడి..." పూరణలో ‘రాశిని, నాదిదేవుఁడా..." అనండి.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారూ,
    మీ సవరణలన్నీ శిరోధార్యము.
    మరి వారికి అంటే వ్యావహారికము అవుతుందేమో కదా? జనులకు అని మారుస్తాను.

    స్వార్థపరతతో గూడిన చపలచిత్త
    ముగల జనులకు, పోగాలములిక దాపు
    రించినట్టి జనులకు, బుద్ధి లేని యట్టి
    తాపసులకు పూజ్యుడు కదా దశముఖుండు

    మాతను లోకమాతయగు మానిని గౌరిని పార్వతీసతిన్
    నూతన జన్మ నెత్తి పలు నోముల నోచిన కన్యకామణిన్
    పోతను పోసినట్టి యొక పున్నెపు రాశిని,నాదిదేవుడా
    మాతను బెండ్లియాడి జనమాన్యు డనంబడి పొందె సన్నుతుల్

    సంఘమొక్కటి యభివృద్ధి సాగెనన్న
    నెల్లవారల కృషి యుండునిందులోన
    సకల వృత్తుల వారును, పాలకుడును,
    చదువు రానివాఁడు, శాస్త్రవేత్త

    ఓపికతో పాత పద్యాలనుపరిశీలించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. మరొక సవరణ

    స్వార్థపరతతో గూడిన చపలచిత్త
    ముగల జనులకు, పోగాలములిక దాపు
    రించినట్టి సుంతయు బుద్ధి లేని యట్టి
    తాపసులకు పూజ్యుడు కదా దశముఖుండు

    రిప్లయితొలగించండి

  32. SANKARAYYAGAAROO,NAMASTEA,
    అవును.ఒక గణాన్ని మరచిపోయాను.'అవిరళకృషి,శ్రద్ధ,యనుభవమ్ము 'అని సరి చేస్తున్నాను.సవరణ సూచించినందుకు,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. విద్యలేమిలేక ,వినయమ్ముతోడుత
    సైన్సు విధులజూపు ,చతురులున్న
    వేదవేత్తలున్న విశ్వాన ,పరికింప
    చదువురానివాడు ,శాస్త్రవేత్త.

    రిప్లయితొలగించండి
  34. చదువు లేనివాడు సాగించు బిజినెస్సు!
    చదువురాక రాజ్య సచివుడగును!
    కళలయందు నేర్పు గలిగిన వాడెపో ,
    చదువురాని వాడు శాస్త్రవేత్త!!

    రిప్లయితొలగించండి
  35. చదువుకున్నవాడు సంస్కారి కాలేక,
    సాటిజనులనెల్ల చావగొట్టు!
    భూత దయను పంచు బుద్ధి మంతుండైన,
    చదువురాని వాడు శాస్త్రవేత్త!!

    రిప్లయితొలగించండి