13, డిసెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1262 (ముఱుగు కూపమున మునుఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ముఱుగు కూపమున మునుఁగ ముక్తి గల్గు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. ఇష్ట మైనది నేదైన కష్ట మనక
  తాను వలచిన చెలి గాన తలచు రంభ
  అతిశ యమ్ముగ బలుకుచు నాద మఱచి
  ముఱుగు కూపమున మునుగ ముక్తి గల్గు

  రిప్లయితొలగించండి
 2. సకల దేహాదిరోగంబులొకటిగాగ
  వచ్చిచేరును చూడ విపత్తు వోలె
  ముఱుగు కూపమున మునుఁగ,ముక్తి గల్గు
  శివుని తపమొనరించిన చింతవీడి

  రిప్లయితొలగించండి
 3. కొండలెక్కితి దీక్షతొ కోరి కోరి
  పంబ జేరితి నయ్యప్ప భక్తి గొలువ
  నదిన స్నానము జేయంగ నాచు కంపు
  ముఱుగు కూపమున మునుగ ముక్తి గల్గు!

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  =============*================

  రాక్షస తతు లెల్లను,మేటి-రాజకీయ
  నాయక గణము లెల్లను-నరక మనెడి
  ముఱుగు కూపమున మునుగ-ముక్తి గల్గు
  జనుల కనవరతమ్ము నీ-జగతి యందు!

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  పురుగులము జీవితమ్మను మురుగుకూప
  మున మునుగ ముక్తి కలుగున? మూర్ఖుల మయి
  మరచినారము నిన్ను యో పరమపురుష !
  కరుణ జూడు మొసంగుము చరణ సేవ

  రిప్లయితొలగించండి
 6. దేవ దేవుని మహిమలు దెలియ తరమె?
  స్వామి కరుణామృతముఁగ్రోలు సజ్జనుండు
  పుణ్య జలముల మునగెడు మునక కాదు
  ముఱుగు కూపమున మునగ ముక్తి కలుగు

  రిప్లయితొలగించండి
 7. శ్వా స యాడక మరణించు సామి ! మఱి ని
  ముఱు గు కూ ప మున మునుగ ముక్తి కలుగు
  భక్తి శ్రధ్ధల బూజించ భవుని ధరను
  పాప పుణ్యాల ఫలితమే వరుస జన్మ

  రిప్లయితొలగించండి
 8. జన్మ సంసార బాధలు సంతరించు
  విషయ సుఖ పూరితంబయి ప్రియము గూర్చు
  మురుగు కూపమున మునుగ; ముక్తి కలుగు
  జ్ఞాన భక్త్యాది యోగ మార్గముల నూన

  రిప్లయితొలగించండి
 9. పరమ పావని గంగలో పాడు జనులు
  సర్వ కాలుష్యముల గల్పి సంచరించ
  పుణ్య ప్రదమని కాశీకి పోయి జనులు
  ముఱుగు కూపమున మునగ ముక్తి కలుగు!?

  రిప్లయితొలగించండి
 10. చిత్త మందున హరినామ జింత విడక
  నరక భాధల నందున నదురు బడక
  స్వర్గ సుఖములు గోరని సద్గుణులకు
  ముఱుగు కూపమున మునుగ ముక్తి గల్గు

  రిప్లయితొలగించండి
 11. దుష్ట కర్మలు జేసిన నిష్టముగను
  పడును తప్పక మనుజుడు పాప మనెడు
  ముఱుగు కూపమున; మునగ ముక్తి కలుగు
  సత్య సన్మార్గ సత్కార్య సాగరమున.

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  తాను వలచింది రంభ, మునిగింది గంగ అన్న సామెతను పూరణలో చక్కగా ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.
  ‘ఐనది + ఏదైన’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  సమస్యను ప్రశ్నార్థంకంగా మార్చి చక్కని పూరణ చేశారు. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  డిసెంబర్, జనవరి నెలల్లో పంబానది మురికి కూపంలాగానే కనిపిస్తుంది. ఏం చేస్తాం? పెద్ద పాదం చేసివచ్చి ఆ అలసట తీర్చుకొనడానికి అందులో మునగాల్సిందే... బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సమస్యను రెండు పాదాల్లొ ఇమిడ్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘నిన్ను + ఓ’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘మరచినాము నిన్నిప్పు డో పరమపురుష’ అందామా?
  *
  సహదేవుడు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  చివరి పాదంలో యతి సందేహాస్పదంగా ఉంది. జ్ఞ-గ లకు యతిమైత్రి ఉన్నట్టు లేదు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘నామ చింత’ అని సమాసము చేయరాదు. ‘నామ చింతన నిడి’ అందాం.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.

  యతి మైత్రి గురించి మీకే అనుమానము వస్తే ఎలా?

  జ్ఞ కు క ఖ గ ఘ చ చ జ ఝ న ణ శ ష స లతో యతి మైత్రి చెల్లును అనుటలో నాకు ఎట్టి సందేహమును లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. జైశ్రీరాం.
  శంకరార్యా!ఆర్యులారా! శ్రీమద్భగవద్గీతా జయంతి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
  సాహితీ ప్రియులారా!
  Bhuvana vijayamu is been organized at satish dhavan auditorium, iisc ,Bangalore on 14th evening 4.00pm.
  Mallapragada Srimannarayanamurty - Timmarasu,
  Dhulipala Mahadevamani- Peddana,
  Garikapati - Tenali Rama Krishna
  Palaparti Syamalananda - Timmana
  Kommu Subrahmanyavaraprasad - Bhattumurti
  Kota Vankata Lakshmi Narasiha - Dhurjati,
  Errapragada Rama Krishna - Madayyagari Mallana,
  Kovela Malayavasini - Molla,
  Ganesh - Lolla Lakshmi Dharudu,
  T.V Narayanarao - Krishna Deva Rayalu
  Dr. Garikipati Narasimha Rao garu is going to perform "Ashtavadhanam"
  at RV Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore,
  on 15-Dec-2013 at 10:00 AM.
  Arranged for a live streaming of the event.
  The link is
  http://new.livestream.com/shaalelive/14dec2013
  Short link : http://bit.ly/1gw2FLE

  One can also look up www.live.shaale.com for the webcast..
  The recording will be done in Full HD, but live streaming may only be in 240p quality...

  This is due to the poor network signal strength in the auditorium..
  But, in any case, a Full HD video will be hosted on the same website after the event.
  Don`t miss.
  జైహింద్

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
  నా పద్యములో సవరణ

  పసిడి ముద్దను దెచ్చి యాభరణముగను
  కంకణము జేయ పలుమరు కాల్చి వ్రేల్చి
  మురికిపోవరసాయనములను ముంచ
  ముఱుగు కూపమునమునగ ముక్తి కలుగు

  రిప్లయితొలగించండి
 16. బాల్య యవ్వన ప్రాయమ్ము బాగు, కాని
  రోత పుట్టించు దేహమ్ము పాతదైన
  రొంప దగ్గులు గలిగించు కంపరమ్ము
  దేహము మురికి కూపమ్ము మోహము విడి
  భాహ్య సుఖముల గోరక భక్తి తోడ
  నట్టి దేహమ్ములోనుండు నాత్మ గాన
  మురుగు కూపమున మునుగ ముక్తి గల్గు

  రిప్లయితొలగించండి
 17. పండిత నేమాని వారూ,
  వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  మా యింట యతిప్రాసల గురించి పరిశోధక గ్రంధం ఒకటుంది. వృద్ధాశ్రమానికి వచ్చే సమయంలో దానిని నావెంట తెచ్చుకొనలేదు. అది ఉంటే నాకెంతో ఉపకరించేది.
  ఆంధ్రభారతి వారి సైటులో అనంతుని ఛందస్సులో జ్ఞావడి కేవలం జ్ఞ-న-ణ లకు మాత్రమే యతిమైత్రిని చెప్తున్నది. జ్ఞతో చఛజఝశషసక్ష లకు యతిమైత్రి సర్వవిదితమే. కాని కవర్గతో జ్ఞకారానికి మైత్రి విషయంలో నాకింకా సందేహంగానే ఉంది. గుండు మధుసూదన్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటే ఏవో పూర్వకవిప్రయోగాలున్నాయన్నారు కాని సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీని గురించి మరింత లోతుగా పరిశీలించాలనుకుంటున్నాను. మీరు చెప్పింది కూడా పరాస్తం చేయదగినది కాదని భావిస్తున్నాను.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  "జ్ఞ" వర్ణాన్ని వ్రాసేటపుడు తెలుగులోనూ, దేవనాగరిలోనూ ముందుగా "జ"వర్ణాన్ని వ్రాసినా, "గ"వర్ణమునే (గ్జ్న అని) పలుకుతున్నాము. అందువల్లనే తెలుగులో “గ్యానం”, “గేనం” వంటి వ్యవహారరూపాలు, హిందీలో “గ్యాన్” అన్నవి వచ్చాయి. ఈ విధంగా గ-వర్ణం వినబడుతున్నందువల్ల క-ఖ-గ-ఘ లకు "జ్ఞ"వర్ణంతో యతి సాధ్యమయింది.

  తిక్కన గారు శాంతిపర్వం (4-255)లో మొదటిసారిగా -

  జ్ఞానము కేవలకృప న
  జ్ఞానికి నుపదేశవిధిఁ బ్రకాశము సేయన్.

  అని ప్రయోగించినందువల్ల దానిని రక్షించేందుకు అప్పకవి "ఇడుదురు ప్రబంధముల నొక్కయెడ విశేషవళు లనుచు సోమయాజులు వాడు కతన" అని దానిని వ్యవస్థీకరించి, "విశేషవళి" అని పేరుపెట్టాడు. ఆ తర్వాత కవులు పెక్కుమంది ప్రయోగించారు.

  1) జ్ఞానేంద్రియజ్ఞాన + కళ లౌరుసౌరుగా (కాశీఖండం)
  2) ... ... ... (స్తంభోపలోట్టంకితాం),
  కదృఢేష్టాక్షర కృష్ణరాయనృప సం + జ్ఞాస్మత్కృతాముక్తమా, ల్యద (ఆముక్త. 4-290)

  వంటివి ఉన్నాయి.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 19. శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శ్రీ (డా.) మురళీధర్ గారికి ఆశీస్సులు.

  యతి మైత్రి గురించి శ్రె శంకరయ్య గారికి వచ్చిన సందేహమును శ్రీ మురళీధర్ గారు తీర్చేరు. చాల సంతోషము. ఒక్కొక్కప్పుడు ఇట్టి సందేహములు వచ్చుట వాని గురించి చర్చలు జరుగుట కూడ మంచివే.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. ఏల్చూరి మురళీధర రావు గారూ,
  నా కడుపులో చల్ల పోశారు మీ సోదాహరణ పూర్వక వివరణతో... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మరియోకపూరణ

  ముఱికి ముఱికను సీదరము వలదయ్య
  ముఱికి పంకములో తమ్మిపూలు బుట్టు
  ముఱికిబీదల సేవయే హరికి సేవ
  మురుగు కూపమున మునుగముక్తి గల్గు

  రిప్లయితొలగించండి