12, డిసెంబర్ 2013, గురువారం

(టివిడాల్) వేంకటేశ్వర సుప్రభాతము


(టివిడాల్) వేంకటేశ్వర సుప్రభాతము
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

మత్తకోకిల:
మేలుకో కమలా మనోహర! మేలుకో పురుషోత్తమా!
మేలుకో సరసీరుహేక్షణ! మేలుకో మధుసూదనా!
మేలుకో భువనాధినాయక! మేలుకో శుభదర్శనా!
మేలుకో హరి! సుప్రభాతము మేలుకో టివిడాల్ పతీ!

తరలము:
సరసిజాప్తుడు కన్నువిందుగ స్వర్ణదీప్తుల జొక్కగా
కరము వెల్గె జగమ్ము లెల్లను కంజముల్ వికసించె నో
పరమ పూరుష! నీదు సేవకు వచ్చిరొప్పుగ వేలుపుల్
సురవరస్తుత! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

విజయ భూషణ! పాడుచుండిరి వేదసూక్తుల భూసురుల్
గజవరావన! నిన్ను గొల్వగ కంజజుం డరుదెంచె నో
త్రిజగదీశ్వర!  పద్మినీప్రియ! దివ్య మంగళ విగ్రహా!
సుజనపాలక! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

నిగమ శీర్ష వనీవిహార! వినీల గాత్ర సుశోభితా!
ప్రగతి దాయక! దేవ దేవ! శుభంకరా! కరుణాకరా!
ఖగవరాంచిత వాహనా! శ్రిత కల్పభూరుహ! శ్రీధరా!
సుగుణ రాజిత! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో

శుభ గుణోజ్జ్వల! పుష్కరేక్షణ! సూరిబృంద సువందితా!
అభయదాయక! భక్త లోక సమర్చితాంఘ్రి సరోరుహా! 
త్రిభువనాధిప! శిష్టరక్షక! శ్రీరమారమణీ ప్రియా!
శుభ నికేతన! వేంకటేశ్వర! సుప్రభాతము మేలుకో 

2 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    సుప్రభాతపు శుభో దయానికి పూజ్య గురువులకు ప్రణామములు

    రిప్లయితొలగించండి
  2. ఈ సుప్రభాతమును బ్లాగులో ప్రచురించిన శ్రీ కంది శంకరయ్య గారికి మరియు స్పందించిన శ్రీమతి రాజేశ్వరి గారికి అభినందనలు మరియు శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి