26, సెప్టెంబర్ 2018, బుధవారం

సమస్య - 2800 (తాతకున్ దండ్రికిన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె"
(లేదా...)
"తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్"

71 కామెంట్‌లు:

  1. ముత్తుకూరున పెరుగుచు సత్తువుగనె
    యింట నుయ్యి లేకుండగ నింపుగాను
    చెరువు గట్టున శ్రేణిగ మరుగు లేక...
    తాతకున్ దండ్రికి దనకు దార యొకతె :)

    దార = నీటిచాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాతయు తండ్రియున్ సుతుడు దారుణ రీతిని నొక్కరొక్కరున్
      నీతులు నేర్పుచున్ గడుసు నేతలు కాగనె పాఠశాలలో
      ప్రీతిగ నొక్క బెత్తమదె పిల్లల చేతులు వాయగొట్టుచున్
      తాతకుఁ దండ్రికిన్ దనకు తన్వి యొకర్తుక దార యయ్యెడిన్ :)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సత్తువు గనె। నింట.." అనండి.

      తొలగించండి
    3. 🙏

      నా వృత్త పూరణ లో:

      నేనూ, మా నాన్నగారు, మా తాతగారు ఉపాధ్యాయులమే...బెత్తాలు వేర్వేరులెండి..

      తొలగించండి
    4. 👌🏻👏🏻🙏🏻💐
      చిత్రము కాదుగా తమరి చేతిన బెత్తము చిందు వేయగన్!!
      😀

      తొలగించండి
    5. మా ముత్తుకూరు పాఠశాలలో బెత్తాన్ని పిల్ల తో పోల్చేవారు మా తెలుగు పండితులు: 👇

      "ఏమిరా? నీకు చింతావారి పిల్ల కావాలా, వేపా వారి పిల్ల కావాలా?"

      తొలగించండి
    6. శ్రీ విట్టు బాబు గారూ:

      మరోలా అనుకోకండి..."చేతిని" సరి యనుకుంటాను. ఈ "ని, న, ను" గురించి సతతం తప్పులు చేస్తుంటే నాకు క్రింది వ్యాఖ్య శంకరాభరణం పూర్వపు పుటలో కనిపించి నా బాధను నివృత్తి చేసినది:👇

      **************************

      "డా. విష్ణు నందన్
      ఏప్రిల్ 21, 2015 8:26 PM

      శంకరాభరణ కవి మండలికి సప్తమీ విభక్తిని గురించిన ఒక చిన్న సూచన -అకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ను" కారమును, ఇకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ని" కారమును , ఉకారాంత పదముల సప్తమీ కొరకు "న" కారమును ఉపయోగించవలసి ఉంటుంది.

      తద్వ్యత్యయం బాగా ప్రాచుర్యంలో ఉంది - శంకరాభరణంలో కూడా. ఉదాహరణకు - కవి మండలి యందు అనడానికి కవి మండలిన అని కాకుండా, కవి మండలిని అనాలి; ధరణిన కాదు, ధరణిని అనాలి, అలాగే చంద్ర మండలమున , రాజలోకమున అనాలి (ఇవి రెండూ ఉకారాంత పద సప్తమీ కి ఉదాహరణలు) ... ఇత్యాది ! ఆయా పదాంతములను పోల్చుకుని తత్సంబంధి సప్తమీ ప్రత్యయం వాడితే సరిపోతుంది.

      ఓడ ' ను ' జరిగే ముచ్చట కనరే అందరికీ తెలిసిందే ( అకారాంత పద సప్తమీకి ఉదాహరణ ) , మాన్యులు శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో - ఇతి నతయః !"

      తొలగించండి
    7. ప్రభాకరుల వారికి ప్రణామాలు.

      హమ్మయ్య చాలా స్పష్టంగా అర్థమైంది. ధన్యవాదాలు.
      😀🙏🏻💐

      తొలగించండి
    8. శాస్త్రి గారు నీరము తత్సమము, నపుంసకము. స్త్రీ సమములకు ప్రథమా విభక్తి ప్రత్యయము రాదు.
      ఆచ్ఛికములందే స్త్రీ,క్లీబ పుంసమములు.

      తొలగించండి
    9. సరదాగా వ్రాశానండి "యొకతె" కి దార (నీటి చాలు) అనే అర్ధము అన్వయించుటలో సారు అభ్యంతరం పెట్టుదురేమోనని భయపడుతూ. కానీ క్రింద చూస్తే వారి పూరణ కూడా ఈ అర్ధంతోనే వ్రాశారు :)

      ఇక ఈ వ్యాకరణ విషయాలు నా బుర్రకి ఎక్కవు. ఎప్పుడో చిన్నప్పుడు మా చెల్లెలు ఉమాదేవి తన తెలుగు పరీక్షకు చదువుతుంటే "స్త్రీసమము" అనే మాట యాదాలాపంగా విన్నదే. దాని అర్ధం తెలియనే లేదు :)

      తొలగించండి
  2. కంద పద్య సమస్యః-

    "తాతకున్ దండ్రికిఁ దనకు దార యొకతె"

    రిప్లయితొలగించండి
  3. ఆతతమైన వంశమున నద్భుతరీతిని ప్రేక్షకాళిలో
    జోతల నందుకొన్న నటశోభితవంశము నందునన్ బృహ
    న్నేతలవంటి వారలకు నేత్రపు పర్వపు చిత్రసీమలో
    తాతకు దండ్రికిన్ దనకు తన్వియొకర్తుక దారయయ్యెడిన్ .

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    శ్వేత మహాప్రకాశమున వెన్నెలతో , మరి రాజహంసతో
    ప్రీతిగ బోలినట్టి యొక పిల్ల , యశస్సుమనోహరాంగి , మా
    జాతికి కాంతయయ్యెనని చాతురితో కుశుడిట్లు చెప్పె మా
    తాతకుఁ దండ్రికిన్ దనకు తన్వి యొకర్తుక దార యయ్యెడిన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉంది.
      అందించిన మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  5. తొలుత సుతుడు మాయింటిలో కలుగుచుండె
    పదితరమ్ములనుండియు ప్రథితముగను
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె
    పూర్వజన్మ సుకృతమంచు బుధులు చెప్ప
    దార: క్రమము, వరుస

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      'దార' శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ధరను పాలించు భూపతి తాత యపుడు
    వార సుడుగాన తనతండ్రి పరగ ప్రభువు
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె
    గౌరి శాపము తలదాల్చు గౌరవ మున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మధ్యలో ఈ గౌరీశాపం ఎక్కడిది? ఏమా కథ?

      తొలగించండి
    2. గురువులకు నంస్కారములు
      శివుని తేజస్సును భూమాత స్వీకరించి నందున పార్వతి శపిస్తుంది." నీవు నా అనుమతి లేకుండా శివతేజస్సును స్వీకరించావు గనుక నీవు తండ్రికీ , తర్వాత వారసుడుగా వచ్చు కొడుక్కీ [భూపతి}భార్యవె అవుతావు, అనేక రూపాలుగా అంటె బీడు భూములనీ , పల్లపు భూములనీ , ఇలా రకరకములుగా ఉంటావు అనిశపిస్తుంది

      తొలగించండి
  7. భూతసమస్తకోటులవి పుట్టుట కే సతి హేతువో!, సము

    ద్భూతములెల్ల నే జనని పోషణలందు సుఖించు, నే జగ

    న్మాతయె సర్వజీవులను దానె లయించునొ?, దానె సర్వమై,

    తాతకుఁ దండ్రికిన్ దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్,

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  8. పంతులొక్కడె బడిలోన పాఠమివ్వ
    తాతకున్ దండ్రికిఁదనకు;-దారయొకతె
    వానికిన్ దీర్ఘ మాంగల్యం బంధురముగ
    నొసట కుంకుమ!ముత్తైదు పస నొసంగ.

    రిప్లయితొలగించండి
  9. తే.గీ.
    సంశయము లేదు లేరుగా వంశమందు
    బహుళ భార్యలు గల భర్త, వారు వీరు
    ఏకనారి ప్రతివ్రతులెంచి చూడ
    తాతకుం దండ్రికి దనకు దారయొకతె

    రిప్లయితొలగించండి
  10. (1)
    తాతతోఁ దండ్రితో యాత్రఁ దరలుచుండ
    దాహ మయ్యెను, గనవచ్చె దాపున నొక
    పురము, నీరమం దడుగఁగఁ బోయసాగెఁ
    దాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె. (దార = నీటి ధార)
    (2)
    తాత జనించె నెప్పుడొ హితమ్ముగఁ బుష్యమిలోన, వేడ్కతో
    నాతని పుత్రుఁడున్ జనన మందెను బుష్యమిలోననే సుమా,
    ప్రీతిగ నాతఁడున్ సుతునిఁ బేర్మిఁ గనెం గద పుష్యమిన్ భళా
    తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి! యొకర్తుక దార యయ్యెడిన్.
    ("ఓ మగువా! ముగ్గురిదీ ఒకే నక్షత్రం" అని భావం)

    రిప్లయితొలగించండి
  11. (చేపూరి శ్రీరామారావు గారికి ధన్యవాదాలతో...)

    ఆతత శౌర్యవిక్రముఁడునై రఘు వుర్వి జయించి యిచ్చినం
    బ్రీతి నజుండు భూపుఁడయి వెల్గెను, పంక్తిరథుండు నేలె, వి
    ఖ్యాతిని రాజ్యలక్ష్మికి సుఖంబుగ వల్లభుఁ డయ్యె రాముఁడున్;
    దాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి! యొకర్తుక దాయ యయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2800
    సమస్య :: తాతకుఁ దండ్రికిన్ దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్.
    సందర్భం :: రాజులను భూపతి, భూభర్త, భూకాంతుడు, భూనాథుడు అని కీర్తించడం కవిసమయం. సూర్యవంశమున ప్రభవించిన దశరథ భూపతి, శ్రీ రామచంద్ర భూపతి, కుశ భూపతి క్రమంగా అయోధ్యా నగర లక్ష్మికి నాథులై ప్రజారంజకంగా పరిపాలన గావించారు. కాబట్టి అయోధ్యా నగర లక్ష్మి ఒక్కతే ముగ్గురికీ దార అయ్యింది అని ఊహించి చెప్పే సందర్భం.

    ఆతత కీర్తులన్ దశరథాఖ్యు డయోధ్యకు నాథు డయ్యె, వి
    ఖ్యాతిని రాము డంతట మహాత్ము డయోధ్యకు నాథు డయ్యెగా,
    పూతుడు నంతటన్ కుశుడు పూజ్యు డయోధ్యకు నాథు డౌట నా
    తాతకుఁ దండ్రికిన్ దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-9-2018)

    రిప్లయితొలగించండి
  13. ఏక పత్నీ వ్రతం బు మా కిష్ట మయ్యు
    మనుట నాచార ముగ నుండి మాన్య మగుచు
    వచ్చు చుండెను లోకంబు మెచ్చు కొన గ
    తాతకు oదండ్రి కి దన కు దార యొక తె

    రిప్లయితొలగించండి
  14. ప్రాత గృహస్థు డాప్రభువు పాటిగ పత్నుల నెన్న బాడియై
    చేతల పైననేబ్రతుకు చెల్ల కుటుంబము నీడ్వ వీలుగా
    నూతములయ్యె నా మనికి యోర్చెను యిద్దరు పత్నులుండి రా
    తాతకు తండ్రికిన్;దనకు తన్వి యొకర్తుక దార యయ్యెడిన్
    కోతలు గోసి త్రాగితిను కుఱ్ఱ విడాకుల గోరె నిత్తరిన్

    రిప్లయితొలగించండి
  15. ఖ్యాతిని వెల్గు బ్లాగునది కారణభూతము కాగ నేనికన్
    బ్రీతిగ శంకరాభరణ ప్రేరణ తోనె రచింపఁ బూరణల్
    ఘాతము వోలె నిచ్చిరిది కారణ మేమియొ కంది శంకరా!
    *"తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్"*

    రిప్లయితొలగించండి
  16. అతడి యవ్వయు నమ్మయు నరుగ దివికి
    భార మంతయు పడెనౌర భార్య మీదె
    వండి వార్చియు సేవింప వలసి వచ్చె
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె

    రిప్లయితొలగించండి
  17. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    తాతకు దండ్రికిం దనకు దన్వి
    యొకర్తుక దార యయ్యెడిన్
    =========================
    తన తాతకు తండ్రికి తనకు ఒకతియె
    భార్యగ దొరికినదనుటలో అసంబద్దతె
    సమస్యగ పరిగణించ
    ==========================
    సమస్యా పూరణం - 266
    ==================

    తాతకు దక్కె చేసిన కర్మగ -
    తండ్రికది విపణిలో కొనగ
    కొడుకు దోచె ఇతరులదనగ -
    పుణ్యము వారికి ఎవరిది వారిగ
    చచ్చి వారేగిరిగ నాకమునకు -
    రంభకై కుతిగ వెతికెడిన్
    తాతకు దండ్రికిం దనకు -
    దన్వి యొకర్తుక దార యయ్యెడిన్

    ====##$##====

    (విపణి =మార్కెట్) (నాకము = స్వర్గము)
    (కుతిగ=కుతూహలంగా) ( దన్వి = స్త్రీ)
    (యొకర్తుక = ఒకతిగ) ( దార = భార్య)

    ====##$##====

    చచ్చి స్వర్గమునకేగి దేవ వేశ్య రంభ
    తో సుఖించుటకై పుణ్యములను చేయవలె,
    అట్టి పుణ్యమును తాత మంచి కార్యములు
    గ పొందితె , కొడుకు దానిని మార్కెట్లో కొన్నా
    డు , మనవడు ఏకంగా ఇతరుల పుణ్యము
    ను దొంగిలించాడు.

    పుణ్య ప్రాప్తికి మార్గములవి యెన్నియో
    యని తలపోయు పామరులున్నారని భావం.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    --- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  18. డా .పిట్టాసత్యనారాయణ
    లేమి నేర్పదె నీతి నిలింపుకైన
    రాముడానాడు లేడొకొ రాజె యైన
    సాధ్వి యొక్కతె మనువుకు చాలు ననగ
    తాతకు దండ్రకి దనకు దార యొకతె!

    రిప్లయితొలగించండి
  19. భూతవిభుండు. శర్వునకుఁ బొందిక నిర్వురు భార్యలౌ, జగ

    త్రాతకు నీశుకున్ సతు లుదారగుణాత్మలు శ్రీధరిత్రులౌ,

    చేతములుల్లసిల్లఁ దగుఁ జేడియ లిద్దరు నిద్దరైరి, యా

    తాతకుఁ దండ్రికిం ; దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  20. రాము నాదర్శముగ గొను రాజ్యమందు
    నేక పత్నీవ్రతమ్మది యెల్లరకును
    యనుసరింప దగినదౌట కనుగొనంగ
    తాతకుం దండ్రికి దనకు దార యొకతె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతను జాయగాగొనిన శ్రీరఘురాముడు మార్గదర్శిగా
      భూతలమందునన్ భరతభూమిని భామినొక్కతిన్
      చేతనమందునన్ గొనుట జీవితసూత్రముగా దలంచగన్
      తాతకు దండ్రికిన్ దనకు దన్వి యొకర్తుక దారయయ్యెడిన్

      తొలగించండి
  21. అవ్వ యెవరని యడుగంగ యనిత యనియె
    నమ్మ యెవరని యడుగంగ యనిత యనియె
    నాలి యెవరని యడుగంగ యనిత యనియె
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె"
    (యనుచు తలపోసి నవ్వుకొని రచటి వారు)

    రిప్లయితొలగించండి
  22. రామ చంద్రుడు అస్వమేద యాగము చేయ దలచి నప్పుడు భార్య రహితుడు యాగమునకు పనికి రాడు కాబట్టి మరల వేరొక పెండిలి చేసుకొమ్మని రాముని సోదరి శాంత పలుకుతుంది . ఆప్పుడు రాముని మనసు బాధపడి తాను ఏక పత్నీ వ్రతుడను యనుచు చెప్పి సోదరితో కటువుగా మాట్లాడి తన నిర్ణయమును దేవతా మందిరములో గల తన పితృ దేవతల విగ్రహములకు విశదీకరించు చున్నాడని భావన.



    అశ్వమేధ యాగము జేయ నాలి లేదు
    నాకు , వేరొక వనితతో నాదు పెండ్లి
    జరప తలచె నా సోదరి శాంత యాగ
    నిర్వహణముకై, నియమము నేను గల్గి
    నట్టి వాడ ,సీతకు దప్ప నాదు మనము
    నెవ్వరికి నివ్వ జాలను, నిర్ణయ మిది
    ఘనత నొప్పు దేవతలార యనుచు తెలిపె
    తాతకుం దండ్రికిఁ, దనకు దార యొకతె
    యనుచు మరల పలికె వినయముగ రామ
    భద్రుడు తనదు పూర్వుల పతిమ లెదుట

    రిప్లయితొలగించండి
  23. తాతకట పక్ష వాతము తండ్రి కాలు
    విరిగె, తనకు తగ్గని విష జ్వరము సోక
    ప్రేమ మీరగ సేవించె విసుగు లేక
    తాతకున్ దండ్రికిఁ దనకు దార యొకతె.

    రిప్లయితొలగించండి
  24. చిత్రసీమననాయికచిత్రముగను
    తాతకుతండ్రికిదనకుదారయొకతె
    యగుచునలరించుజనులనునప్పుడపుడు
    వివిధరకములవేషాలువేయుచుంద్రు

    రిప్లయితొలగించండి
  25. గృహముఁ దీర్చి దిద్దెడు నేర్పు కీర్తిఁ బడసి
    పేర్మి బుద్ధులు గఱపుచుఁ బిల్లలకును
    బోషణమ్మునఁ దల్లినిఁ బోలి నామె
    తాతకుం దండ్రికిఁ, దనకు దార యొకతె


    ప్రీతి సెలంగ మానవతిఁ బెండిలి యాడితి మెచ్చ నెల్లరున్
    జ్ఞాతులు దర్ప జాతులయి సంపద నెల్లను దోచి నంతటన్
    నీతిఁ గనంగ లేక చన నీతి పథమ్మున నిల్ప నెమ్మినిం
    దాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్

    [తార = కనుగ్రుడ్డు]

    రిప్లయితొలగించండి
  26. తాతకుదండ్రికిన్దనకుదన్వియొకర్తుకదారయయ్యెడ
    న్బాతవిచిత్రముల్లరయభామలుగూడనుమూడువేషము
    ల్దాతకుదండ్రికిన్దనకుదారగవేయుచురక్తిగట్టుచు
    న్బ్రీతినిగల్గజేసిడిరిప్రేక్షకులందఱుహాయనంగగా

    రిప్లయితొలగించండి
  27. "మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడండీ - మొన్ననే ఒక రెండు మూడేళ్లకింద ముప్పై దాటాయి, పెళ్లి చేద్దామనుకుంటున్నాము.. ఒక రెండు వారలు మాత్రమే సెలవులుట" - అన్న ఒకతల్లిప్రశ్నకుబుధునుత్తరం

    చూతమె సప్తమాధిపతి సోముడనన్ శుభ మైన సీ! రిపు
    వ్రాతము కొల్వుదీరుటను భాగ్యము, లాభము జన్మమందునన్
    జాతకుఁడూనినన్ మనువు జాలము నౌననిఁ జెప్పుము వానికిన్
    దాతకుఁ దండ్రికిం; దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  28. గురువు గారి కి నమస్సులు
    ఏకపత్నీ వ్రతము నకు నెల్ల రు నుతు
    లుసలుప కలియుగమున నాంధ్ర
    చలనచిత్ర మున బహుళ చరిత యగును
    తాతకున్ దండ్రికి తనకు దార యొక తె.

    రిప్లయితొలగించండి
  29. పెద్దలయెడ గౌరవమును వెలువరచని
    ఈ దినములనందున గూడ యిమ్ముగ తన
    తాతకుం దండ్రికి దనకు దార యొకతె
    చిక్కెననుచు మెండుగ సంతసించెనతడు

    తనకు=వణకు,కంపించు

    రిప్లయితొలగించండి
  30. దేవిలుండగ పలువురు దేవులకును
    రాజ రాజులకును పలు రాణులుండ
    మానవుడు నీతి పాటించి మసలుచుండ
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె

    రిప్లయితొలగించండి
  31. నాతిని జూపెదన్ గనుడు నామది దోచిన సుందరాంగినిన్
    జాతిమతాంతరమ్మనెడి సాకును జూపుచు నడ్డగించినన్
    భీతిల బోను మీకికను పెండిలి యాడెదనంచు చెప్పెనే
    తాతకుఁ దండ్రికిన్, దనకు తన్వి యొకత్తుక దారయయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  32. సీతను బోలినట్టి ఘన శీలము చంద్రునివంటి యందమున్
    పోతను దేహమంతటయుఁ బోసినయట్లుగ స్వర్ణ కాంతులన్
    ద్యోతకమౌ శరీరమున తోయజనేత్రి లభించెనెట్టులో
    *"తాతకుఁ దండ్రికిం, - దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్"*
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె

    సందర్భము: ఒక డిలా అంటున్నాడు.
    " మా తాత కైనా ఒక్కతే భార్య! మా తండ్రికైనా ఒక్కతే భార్య! వారి దారిలో నడిచే నాకూ ఒక్కతే భార్య! ఏం చేస్తాం! తప్పదు కదా!"
    వాడి ఆంతర్య మే మంటే.. 'తప్పనిసరి పరిస్థితిలో నాకూ ఒక్కతే భార్య.. లేకపోతే మరోదాన్ని పెళ్ళాడే వాడిని..' అని.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దార యొక్కతే సుమ్మి మా తాతకైన!
    దార యొక్కతే సుమ్మి మా తండ్రికైన!
    తనకు నొక్కతే మరి యింకఁ
    దప్ప.. దనెను..
    తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    26.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  34. చేతమునందు బ్రహ్మసతి చేరగ మిక్కిలి ప్రేమ తోడుతన్
    ఖ్యాతి ఘటిల్లె సంసరణమంతయు పండిత వంశమంచు నా
    భాతి పరంపరల్ మిగుల వన్నియ పెట్టుచునిల్చి మోములో
    తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  35. వచనకవితలనందించుపఠిమగాంచ?
    తాతకుందండ్రికి దనకుదారయొకతె
    వారసత్వపు శక్తికి వాణిదయయె!
    గలస మాయిమమటికబ్బెను మలచునట్లు!

    రిప్లయితొలగించండి

  36. నటులుగా ఖ్యాతి నందిన నందమూరి
    వారి వంశమునందున వాసిగాను
    తాతకుం దండ్రికి దనకు దార యొకతె
    యనుచు దలచెను మనవడు హాళి తోడ.

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులకు నమస్కృతులు.
    తీవ్రమైన జ్వరం కారణంగా నేనీరోజు మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  38. అయ్యో! విశ్రాంతి తీసుకోండి గురువుగారూ! 🙏🙏

    రిప్లయితొలగించండి
  39. జాతులు మార్చుచున్ వడిగ జంద్యము నూనుచు వోట్లకోసమై
    కోతలు కోయు డింపులుకు కొండొక రీతిని జన్మబద్ధమై
    నీతులు లేని కాంగ్రెసహ నెత్తిని జేరుచు గాంధివంశపున్
    తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్

    రిప్లయితొలగించండి