9, ఫిబ్రవరి 2020, ఆదివారం

సమస్య - 3276 (రావణునిన్ సంహరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్"
(లేదా...)
"రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

83 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    రాహుల్ గాంధీ చీదఱ:

    రావలె భాజపా యనుచు రాజ్యము చేయగ భారతావనిన్
    కోవెలలందు మ్రొక్కుచును కోరిక తీర్చగ రామభద్రునిన్...
    దీవెనలంద గోరుచును దిల్లిని నాడెడి రామలీలలో
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై...

    రిప్లయితొలగించండి
  2. భావంబున హరిని నిలిపి
    పావన జీవనముఁ గడుపు వరమౌనిన్ సం
    భావింపకయె తృణీకృత
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్.

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ముప్పాళ రంగనాయకమ్మ మనోగతము:

    చావన భీతినొందుచును చక్కగ మార్చుచు పార్టినిన్ భళా
    చేవయె లేక సోదరుని చెంతను వీడుచు యుద్ధభూమినిన్
    పోవుచు రామునిన్ కడకు మోదము నొందుచు గూఢచారిగా
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై...

    రిప్లయితొలగించండి
  4. అందరికీ నమస్సులు 🙏

    విభీషణుడు రాముడికి రహస్యం చెప్పిన సందర్భం లో ..

    *నా పూరణ ప్రయత్నం*

    *కం||*

    బ్రోవగ రాముని యాతడు
    లేవుగ మార్గములు మనకు లేవిక యనుచున్
    నీవిల్లిక నాభికనుచు
    *"రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయం. అన్వయలోపమున్నది.

      తొలగించండి
    2. ధన్యోస్మి ఆర్యా .. నాకు కూడా అలాగే తోచినది.. మరల ప్రయత్నించెదను ..🙏🙏🙏

      తొలగించండి
  5. నావలె జ్ఞానసంపదకు నట్టగువా డొకడుండునా భువిన్
    ధీవిభవంబునం దెరుగ దెల్పెద నేను శకారవంశ్యుడన్
    చేవలు గల్గువాడనని చెప్పె నొకండు సభాంతరమ్మునన్
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై"

    నట్టు=స్థానము

    రిప్లయితొలగించండి
  6. భావా తీతమనో హారిన్
    సేవించుట భాగ్య మన్న చేవయె లేకన్
    తావర గర్వమున మునుగు
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మొదటి పాదంలో గణభంగం. రావణుని చంపిన రాక్షసుడెవరు? స్పష్టత లేదు.

      తొలగించండి
  7. ( రామాయణ, భాగవత, భారతాల నుండి
    గురువు ప్రశ్నలు-శిష్యుల సమాధానాలు )
    “రావడి బాపగన్ బ్రజకు
    రాముడు గూల్చిన దెవ్వరిన్ సుధా ?
    కేవలుడైన బాలు పయి
    కెత్తుకపోయిన దెవ్వరో మధూ ?
    వావిని విస్మరించుచును
    వాగిన చైద్యుని కృష్ణు డేమనెన్ ? "
    " రావణునిన్ " " దురాత్ముడగు
    రాక్షసు డొక్కడు " " సంపె నల్కమై "
    ( రావడి -ఉపద్రవం; కేవలుడు -భగవంతుడు; చైద్యుడు -శిశుపాలుడు )

    రిప్లయితొలగించండి
  8. దైవమగు రాముడు దునిమె
    రావణునిన్ ; సంహరించె రాక్షసుఁ డలుకన్
    కావరమున పలు జనులన్
    యే విధమున జూడ జావె యేకము నేడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణబాగున్నది. అభినందనలు.
      'జనులన్+ఏ' అన్నపుడు యడాగమం రాదు. "కావరమున పలువురు జనుల । నే విధమున..." అనండి.

      తొలగించండి
  9. రావణుడగు రఘురాముడు
    రావణునిన్ సంహరించె, రాక్షసుఁ డలుకన్
    పావనిజానకిమాతను
    భావింపకపరసతియనిబంధించుటచే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [రు+ణిచ్+ల్యుట్, రావయతి భీషయతి శత్రూన్] శత్రువులను భయపెట్టువాడు.(ఆంధ్రభారతి నిఘంటువు)

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. రావణ సుతుండు, ఘోరా
      రావమొనర్చి చని వనచరగణము నెల్లన్,
      ఠేవన నుపమించుచునా
      రావణునిన్, సంహరించె రాక్షసుఁ డలుకన్

      తొలగించండి
  11. ఆవహము నేమి జేసెను

    పావను బాణం,బెవరట ప్రహ్లాదుండున్,

    దేవుడు శపించు నేలన్,

    రావణునిన్ సంహరించె,రాక్షసు,డలుకన్

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    [రావణుని వీడి, శ్రీరామునిఁ జేరిన విభీషణు నధిక్షేపించుచు, మేఘనాదుఁడు రావణునితో "నీ తమ్ముఁడు విభీషణుఁ డా రామునిఁ జేరి, బ్రతికియుండఁగనే నిన్నుఁ జచ్చినవానిగఁ జేసె!" నని పలికిన సందర్భము]

    "చేవయె చచ్చి, యన్నవును శ్రేష్ఠుఁడవౌ నిను వీడి, యా నరున్,
    దైవమటంచు నెంచియు, సతమ్ము భజింప విభీషణుండు తాఁ
    గావరమెక్కి, చేరెఁ గద! గణ్యుఁడవై యిట మన్కియుండఁగా,

    రావణు! నిన్! దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మఱియొక పూరణము:

      [రామరావణ సంగ్రామమున నొక రక్కసుఁడు, బలహీనుఁడైన యొక వానరునిఁ జంపిన వైనము]

      చేవయె లేక బక్కనయి, చేతను నాయుధమేమి లేక, తా
      నావహమందు రక్కసుల నంతముఁ జేసెదనంచుఁ బూనియున్
      బోవుచునున్నయట్టి యొక మోరమెకమ్మునుఁ జూచి, యెంచుచున్

      రావణునిన్, దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. పావని సీతను దుర్మతి
    కావరమున దెచ్చుట నపకారమె యనుచున్
    భావించి ముప్పు తొలగగ
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని సమస్యకు పరిష్కారం? రాక్షసుడు రావణుని చంపడం?

      తొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    లంకలోని గజముల కాపరి...
    (ఆ పేరుబలం అలాంటిది మరి..) 😊
    రావగభీరతన్ గజము రంజిల దానికి పేరు బెట్టితిన్
    రావణుడంచు., బుద్ధి సెడె., రౌద్రము హెచ్చెను గర్వమయ్యె., నన్
    మావటిగా దలంపదు., ప్రమాదము జాతికటంచు నెంచుచున్
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై"!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ

      ఆ వనితాలలామను ధరాత్మజ బూతను సీతఁ దెచ్చి., యెం...
      తో విసిగించుచుంటివిది యుక్తమె ?! రాక్షసజన్మచేత త్వ..
      త్సేవకవృత్తి యడ్డుపడె ఛీ! యని చింతిలి స్వప్నసీమలో
      రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  15. కావఁగ సుజనుల రాముడు
    రావణుని న్ సంహరించె : రాక్షసు డ లుకన్
    చేవను జూపియు పోరున
    చావును వరియించె తాను సాహస యుతుడై

    రిప్లయితొలగించండి
  16. కావరమున బల్కెనొకడు
    రావణునిన్ సంహరించె రాక్షసు డలుకన్
    ఆ వనజాక్షుడు రాముడు
    రావణునిన్ సంహరించె రాజసమొప్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాఠాంతరం
      కావరమున బల్కెనొకడు
      రావణునిన్ సంహరించె రాక్షసు డలుకన్
      దేవత లానందింపగ
      రావణునిన్ సంహరించె రాముం డలుకన్

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా,నమస్సులు!!

      తొలగించండి
  17. కావగ రాఘవులన్, మై
    రావణునిన్ సం హరించె;'రాక్షసు 'డలుకన్
    ఠేవను హనుమను దూరెను
    భావిత సంగ్రామ జనిత భయ విహ్వలుడై.

    రాక్షసుడు=దశకంఠ రావణుడు.

    రిప్లయితొలగించండి
  18. భూవరుడా శ్రీరాముడు
    రావణునిన్ సంహరించె; రాక్షసుఁ డలుకన్
    ఆ వనితామణి సీతను
    కావరమున చెరను బెట్ట కామాంధతతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణబాగున్నది. అభినందనలు.
      "కామాంధుండై" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  19. పావనమగు రామకృతిని
    భావుకముగ నచ్చువేయ పద్యము నందు
    న్నీవిధి పడినది తప్పుగ
    రావణునిన్ సంహరించె రాక్షసు డలుకన్!!!

    రిప్లయితొలగించండి
  20. రావణు మరణరహస్య
    మ్మావహమందున విభీష ణాఖ్యుం డా సీ
    తావల్లభునకు తెలుపుచు
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్

    రిప్లయితొలగించండి
  21. ఆవనజాక్షుడు రాముడు
    రావణునిన్ సంహరించె ; రాక్షసుఁ డలుకన్
    గావరమేపారంగా
    దేవత యగు సీత బట్టి తీసుకు పోవన్.

    రిప్లయితొలగించండి
  22. చేవ దనరంగ నిశ్చిత
    భావ నిమగ్నాంతరంగ బల దర్పితులై
    యా వానరము లెదిర్చిన
    రావణునిన్, సంహరించె రాక్షసుఁ డలుకన్


    దండకారణ్య మందలి మునులు రాముని తో మొఱపెట్టుకొను సందర్భము:

    భూ వలయంబు దైత్య జన పూరిత తర్జిత మయ్యె నక్కటా
    కావఁగ నీవ దిక్కు సుమి కంజనిభాంబక! దండకాటవీ
    పావన దేశ వాస తను భాసిత విప్రుని ఘోర భీతి వి
    ద్రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై

    [భీతి విద్రావణుఁడు = భీతిని తఱుము వాఁడు; (రక్కసుఁడు చంపునన్న భయము)]

    రిప్లయితొలగించండి
  23. ఆవేశముతోవచ్చిన
    నోవానరము నెదిరించి యాహవమందున్
    భావించుచు మెప్పించగ
    రావణునిన్, సంహరించి రాక్షసుడలుకన్

    రిప్లయితొలగించండి
  24. స్వర్ణలంకాధీశుని వీరాభిమాని, రావణబ్రహ్మ వధానంతరము శ్రీరాముని నిందిస్తూ....

    ఉత్పలమాల
    సేవకు రాండ్రనిచ్చి కుజ చిత్తము మారెడు దాక నోపికన్
    గేవలముంచి తోటఁ దన కేలను దాకని యుత్తముండు మా
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై
    దేవుఁడటంచు మానవులు దిత్యుని రామునిఁ గొల్చు టెందుకో?




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఇక్కడ 'రాక్షసు' డంటే క్రూరుడని భావమా?
      'దేవుఁ డటంచు మానవులు తేపకు రామునిఁ గొల్చు టెందుకో" నాకొక సమస్య సిద్ధమయింది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. మనకు మనం నమ్మిన వాళ్లకు హాని చేసిన వాళ్లను కోపంతో వాడు రాక్షసుడని అంటాముకదా! అలా ఆరాక్షసాధముడు రావణుని మీది అభిమానంతో శ్రీరామచంద్రుని రాక్షసుడని సంబోధించాడు.

      తొలగించండి
  25. ఆవహమందునరాముడు
    రావణునిన్ సంహరించె,రాక్షసుడలుకన్
    బావనియగుసీతమ్మను
    గావరముననొడిసిపట్టె గామముతోడన్

    రిప్లయితొలగించండి
  26. నా విద్యార్థికిఁ జెప్పితి
    "రావణునిన్ సంహరించె రాముం డలుకన్"
    తా విని యిట్టుల వ్రాసెను
    "రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్"

    రిప్లయితొలగించండి
  27. ఈ నాటి శంకారా భరణము వారి సమస్య


    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్


    ఇచ్చిన పాదము కందము నా పూఱణము సీసములో


    ఒక ఉపాధ్యాయుడు రామాయణమును ప్రశ్నల రూపములో సీసములో సంధిస్తె అతని శిష్యులు
    దీటుగా తేట గీతిలో సమాధానము యిచ్చుట


    (పం)క్తి మొత్తంబునన్ (పా)పములు పెరిగె
    (న)ని దెల్పె నెవరికి (నా)కసదులు,

    (చె)ప్పుము రయముగ (శ్రీ) రామునకు నా ద
    (శర)ధున కున్నటి (వరు)స యేది,

    (పొల)ముదున్నుచు నుండ (హల)ము మాటున పుట్టి
    (న)ట్టి వహంతము (నా)మమేది,


    (తా)రా పధములోన (తా)టకి కనిపించ
    (రాము)డు రయముగ (నేమి) జేసె,


    (ము)క్కు జెవులు పోయె,(మో)హనాంగిని బట్ట
    (మని) శూర్ప ణఖ నెవ(రిన)డి గెనుగ

    (చె)ట్టు మాటునదాగి (చిం)కిలీ కంబును
    (రాము)డు ఘనముగ (నేమి) జేసె,

    (పంపు)ము దూతను, (చంప) రాదనెను వి
    (భీ)షణుండు,నెవరా వి(భీ)ష ణుండు,

    (వ)లదని వదలుచు , (వా)లము కాల్చగా

    (చేసె) నేమి పని కీ(నాశ)మపుడు

    (జల)ధి దాట దలచి (శిల)లు దెచ్చిన వాన
    (రులు) జేసె నేమిటో (సులు)వు గాను

    (ల)క్ష్మణుండు రణ స్ధ(ల)ము లోన మూర్చచెం
    (ద)గ కాచె నెవడు ము(దం)బు తోడ

    (ప)తి కనుమానము (ప)డదన్నుదలచి నా
    (సీ)తమ్మ తల్లేమి (జే)సె నపుడు

    (వ)నవాసము ముగించి (వ)చ్చిన రఘురాము
    (ని)కి తన రాజ్యంబు (నె)వరు నొసగె


    హరికి , తనయుడు, సీతమ్మ, శరము తోడ
    ద్రుంచె ,రావణునిన్ , సంహరించె, రాక్ష
    సుఁ ,డలుకన్ గాల్చె లంకను, నడవ కట్టె,
    పవన సుతు,డగ్నిలోదూకె ,భరతు డపుడు


    పంక్తి = భూమి,నాకసదులు=దేవతలు
    వహంతము= బిడ్డ,
    చింకిలీకము,కీనాశము = కోతి,
    పడదన్ను = పోగొట్టు
    నడవ =వారధి

    రిప్లయితొలగించండి
  28. ఆవహరంగమందుననమానుషరీతినిభీకరంబుగా
    రావణుజంపెగాదెయటరాముడుబాహుబలంబుతోడుతన్
    రావణునిన్ దురాత్ముడగురాక్షసుడొక్కడుసంపెనల్కమై
    యీవిధమైనవాక్యమునునేవురుహేళనజేయవ్రాసిరే!

    రిప్లయితొలగించండి
  29. స్వర్ణలంకాధీశుని వీరాభిమాని, రావణబ్రహ్మ వధానంతరము శ్రీరాముని నిందిస్తూ....

    కందం
    సేవకురాండ్రఁ గుజ కొసఁగి
    గేవలమొక తోటనుంచి కేలన్ దాకన్
    లేవని దేవుఁడనక మా
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ (రాముం) డలుకన్

    రిప్లయితొలగించండి
  30. భావిత రావణాసురుని వంశమువాడొక లంకవాసి యా
    పావన రామచంద్రునికి బంటగు వానరు నావహంబునన్
    చేవను జూపగాదలచి చేగొని ఖడ్గము,సంస్తుతించుచున్
    రావణునిన్ ,దురాత్ముడగు రాక్షసుడొక్కడు చంపెనల్కమై

    రిప్లయితొలగించండి
  31. భావము పరదారలపై
    సేవింపగ దృష్టిలేదు ,సేమము గనమే
    నీవిక భారము యనుచున్
    రావణునిన్ సం హరించె, రాక్షసుడలుకన్.

    రిప్లయితొలగించండి
  32. చావును గోరి తెచ్చుకునె సాధ్విని కాముకుడై, మదిన్ సదా
    కోవెలజేసి శంకరుని కొల్చెడు భక్తుడె యైన నెచ్చలీ
    నీవిది యాలకింపు నిశి నేనొక స్వప్నము గంటి నందులో
    రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై

    రిప్లయితొలగించండి
  33. రామ రావణ యుద్ధానంతరం మండోదరి ఇలా విలపిస్తోంది....

    రావణ!బ్రహ్మవై ధరను రంజిలినావయ కోవిదుండవై
    పావని నేల దెచ్చితివొ!పాపము పండెనొ!యావహించెనో
    రావణు,నిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు! సంపె నల్కమై
    భూవరుడైన రాముడల భూమిజ కోసము నిన్ను ప్రాణమా!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  34. చిరు ప్రయత్నం ..🙏

    చావుని దెచ్చుకు వచ్చితి
    నీవిక నెఱుఁగుము యనుచునె నిజమును దెలిపెన్
    బ్రోవగ, సీతను విడువక
    *"రావణు, నిన్, సంహరించె, రాక్షసుఁ, డలుకన్"*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  35. పావని యెదిర్చ సభలో
    రావణునిన్,సంహరించె రాక్షసుడలుకన్
    కావరముతోడ నొకవృ
    ద్ధవానరంబును రణమున తలవక జాలిన్

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్"

    సందర్భము:
    క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి
    కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణష్యతి
    (నా భక్తుడు శీఘ్రంగా ధర్మాత్ము డౌతున్నాడు. శాశ్వత శాంతిని పొందుతున్నాడు. నా భక్తుడు నశింపడు..అన్నాడు గీతలో..)
    వాలి ధర్మాత్ముడు కాడు. కాబట్టి భక్తు డయ్యే అర్హత లేనివాడు. సుగ్రీవుడు మిత్రుడైనాడు. భక్తుడైనాడు రామునికి. అతనికి శత్రువైనాడు వాలి. కాబట్టి చంపదగినవాడైనాడు.
    భక్త లక్షణం భగవంతుని ముఖ్య కర్తవ్యం. అందుకే రాముడు వాలిని సంహరించినాడు.
    త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానర పుంగవః
    రామేణ నిహతః సంఖ్యే శరేణైకేన వానరః
    (వాలి ఎవరో నీకు ముందే తెలుసు. వాలిని రాముడు యుద్ధంలో ఒక్క బాణంతో చంపినాడు. సుం.కాం.51-11)అని హనుమంతు డన్నాడు రావణునితో లంకలో సభలో.
    కిష్కింధలో వాలి వధ జరిగినప్పుడు క్షణాలమీద ఆ వార్త రాజ్య మంతటా పాకిపోయింది. ఎందుకు.. ఎలా.. ఎవరు.. అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తోచినట్టు వారు ఊహించుకున్నారు.
    ఒక బావా మరదళ్ళ సంభాషణ మీ పూరణం.
    "వాలి జిత రావణుడు. అంటే రావణునే జయించినవాడు. ఆ వాలిని ఒక రాక్షసుడు కాబోలు చంపినాడు" అని మరద లంటే..
    "కాడు. వా డొక నరుడేనే పిచ్చి మొగమా!" అని బావ పలికినాడు రాముని గురించి...
    రావణుడే ఒక పెద్ద రాక్షసుడు. వాలిని చంపినవా డింకా పెద్ద రాక్షసుడు కావచ్చు... అని ఆమె అభిప్రాయం. అందుకే అలా అడిగింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *నరుడే!*

    "పోవే! వా డొక నరుడే
    నే! వనితా!" యనియె బావ..
    యిటు మరద లనన్
    "బావా! ఆ వాలిని, జిత
    రావణునిన్ సంహరించె రాక్షసుఁ డలుకన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    9.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి