11, ఫిబ్రవరి 2020, మంగళవారం

పద్య రచనల పోటీ (అష్టవిధ నాయికలు)పద్యకవులకు స్వాగతం! రండి మరో వినూత్న పధకానికి తెరతీద్దాం!
కవులారా! జడపద్యాలు, చీరపద్యాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో క్రొత్త పుంతలు త్రొక్కిన మనం మళ్ళీ ఇంకో నూతన అధ్యాయానికి తెరతీస్తున్నాం. అవే అష్టవిధనాయికల పద్యాలు.
తెలుగు సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ఎవరికైనా అష్టవిధనాయికల గురించి తెలియకుండా ఉండదు. అష్టవిధ నాయికల వర్గీకరణ మొట్టమొదట భరతముని క్రీ.శ. 2వ శతాబ్దంలో సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రంలో పేర్కొనబడినది. అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలలో తెలుపబడ్డాయి. మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. భారతీయ సాహిత్యంలో జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీత గోవిందంలోను మరియు వైష్ణవ కవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు. అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారులు కూడా తమ కీర్తనలలో పద్మావతి, రాధలను అష్టవిధ నాయికల గుణగణాలను ఆపాదించి కీర్తించారు.
వారే.. 1. స్వాధీనపతిక, 2. వాసకసజ్జిక, 3. విరహోత్కంఠిత, 4. విప్రలబ్ద, 5. ఖండిత, 6. కలహాంతరిత 7. ప్రోషితభర్తృక, 8. అభిసారిక. నాయికల యొక్క స్వరూప స్వభావాలననుసరించి ఇలా వర్గీకరణ చేయడం జరిగింది. ఈనాడు ఆధునిక యుగంలో కూడా అలాంటి గుణగణాలు స్వభావాలున్న నాయికలు ఎంతో మంది ఉన్నారు. ఆ నాయికల గుణగణాలతో, స్వరూప స్వభావాలతో "అష్టవిధ నాయికలు" పద్యాలు ఒక్కొక్క కవిచే ఎనిమిది మంది నాయికలపై ఎనిమిది పద్యాలు వ్రాయించి సంకలనం చేయాలని సంకల్పించాను. పుస్తకం ఖర్చు కూడా రచయితలు పంచుకోవాల్సి ఉంటుంది. రచయితలకు, పాఠకులకు వీలైనంత తక్కువ సొమ్ము ఖర్చు అయ్యేలా చేయడం, పుస్తకాన్ని అందంగా తయారుచేసి పంపిణీ చేయడం నా బాధ్యత...
లబ్ధప్రతిష్టులైన పండితులు, అవధానులు ఈ పద్యాలను చదివి, అవసరమైతే తగు స్వల్పమార్పులు చేస్తారు.
ఈ క్రింద ఇవ్వబడిన గుణ గణాలను ఆధారంగా చేసుకుని, రసవత్తరంగా పాఠకులను ఆకట్టుకునే విధంగా ఒక్కో నాయిక గురించి ఒక్కో పద్యం అంటే మొత్తం 8 (ఎనిమిది) పద్యాలు మీకు నచ్చిన ఛందస్సులో వ్రాయవచ్చు. ఐతే శృంగారం అంతర్లీనంగా ఉండాలి. అన్ని వర్గాల పాఠకులను అలరించేటట్టుగా ఉండాలి. పద్యాలు మాలిక సంపాదకవర్గానికి ఎడిట్/ ప్రచురణ చేసే అధికారం ఉంటుందని గమనించ ప్రార్ధన..
అష్టవిధ నాయికల వర్గీకరణ:
1. స్వాధీనపతిక లేదా స్వాధీన భర్తృక : " one having her husband in subjection " "స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ మరియు సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు. చిత్రకళలో ఈ నాయికను నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు. దీన్ని మనం ఆధునికీకరణ చెయ్యాలంటే భర్తను తన అందచందాలతో, అధికారంతో పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకున్న స్త్రీ, తద్వారా భర్తకు వచ్చే సాదక బాధకాలు మొదలైనవి ఒక పద్యంగా రూపొందించవచ్చు.
2. వాసకసజ్జిక : "one dressed up for union" వాసకసజ్జిక సుదీర్ఘ దూరప్రయాణం నుండి తిరిగివచ్చే ప్రియుని కోసం నిరీక్షిస్తుంది. చిత్రకళలో ఈమెను పడకగదిలో పద్మాలు మరియు పూలదండలతో ఉన్నట్లు చూపిస్తారు. "సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక". ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం నిరీక్షిస్తుంది.
3. విరహోత్కంఠిత: "One distressed by separation" విరహం వల్ల వేదనపడు నాయిక. ఈమె ప్రియుడు పని కారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది.
4. విప్రలబ్ద : "one deceived by her lover" అనుకున్న సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక. ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రపటాల్లో చిత్రిస్తారు.
5. ఖండిత : "one enraged with her lover" ప్రియుడు అన్యస్త్రీని పొంది రాగా క్రుంగునది. నమ్మించిన ప్రియుడు రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక. ఈమెను ప్రియునిపై తిరగబడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు.
6. కలహాంతరిత : "one separated by quarrel" కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక. ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు.
7.ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక: "one with a sojourning husband" ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక. ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక. ఈమెను చెలికత్తెలు పరామర్శిస్తున్నా దుఃఖంతో చింతిస్తున్నట్లుగా చిత్రిస్తారు.
8. అభిసారిక "one who moves alone for her lover" ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక (అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక. ఈమెను ఇంటి ద్వారం దగ్గర లేదా త్రోవలో అన్ని అడ్డంకులను అతిక్రమిస్తున్నట్లు చిత్రిస్తారు.చిత్రకళలో అభిసారికను తొందరలో ప్రియున్ని కలవడానికి పోతున్నట్లు చూపిస్తారు. దారిలో వర్షం, పాములు, తేళ్ళు అడ్డువస్తున్నా సాగిపోయే నాయిక.
నియమ నిబంధనలు ఈ క్రింద ఇస్తున్నాం.
1. ఎనిమిది మంది అష్టవిధ నాయికిలపై ఎనిమిది పద్యాలు మాత్రమే వ్రాయాలి. ఏ నాయిక మీద ఏ పద్యం అనేది స్పష్టంగా పద్యం మొదట్లో రాయండి.
2. ఏ ఛందస్సు లో రాయాలనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.కాని ఎనిమిది పద్యాలు ఒకే ఛందస్సులో ఉంటే బాగుంటుంది.
3. ఇవన్నీ సరిచూసి, నాణ్యమైనవి పుస్తక రూపంలో అచ్చులోకి తీసుకురావడం జరుగుతుంది.
4. మీరు మీ మీ పద్యాలను హామీ పత్రంతో సహా 29-02-2020 లోపు ashtanayika20@gmail.com అనే ఈమెయిల్‌కు పంపండి.
5. మీ సందేహాలేమైనా ఉన్నా ఈమెయిల్లో అడగొచ్చు.
తెలుగు సాహిత్యంలో పదికాలాలపాటు నిలిచిపోయే ఈ అష్టవిధనాయికల పద్యాల రచనకు శ్రీకారం చుట్టండి.
ఈ కార్యక్రమానికి కంది శంకరయ్యగారు సంపాదకులుగా, టేకుమళ్ల వెంకటప్పయ్యగారు సహ సంపాదకులుగా ఉంటారు.

1 కామెంట్‌:

  1. ఆర్యా!ఆధునిక యువతుల గురించి వ్రాయాలా? పురాణ,కావ్యనాయికల గురించి వ్రాయకూడదా?

    రిప్లయితొలగించండి