28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సమస్య - 3294 (చెలువలు సత్కవిత్వమును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"
(లేదా...)
"చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్"

80 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చెలువలు నందమొందుచును చేరువ లేకయె హైద్రబాదుకున్
    పలువురు శంకరాభరణ ప్రాంగణ మందున చేరి నేర్చుచున్
    చిలకల వోలె పల్కగను శ్రేయమె నిట్టుల మాటలాడగన్:👇
    "చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్"?

    రిప్లయితొలగించండి
  2. విలువలు తెలిసిన వనితలు
    తెలివికి నెఱజాణ లంట తీరుపు లిడగన్
    పలువిధ ముల కోవిధు లన
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    రిప్లయితొలగించండి
  3. వలువల విలువలు తెలిసిన
    చెలులే మితిమీరి నడువ చిందులు వేయన్
    కొలువై దిరుగుచు పబ్బుల
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే!!

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కులుకుచు వల్లభుల్ కడకు గూడును చేరగ తప్ప త్రాగి "హిక్"!...
    చెలగుచు భామలెల్లరును చేరువ నున్నది రోకలెత్తుచున్
    పలుకగ పాట పద్యములు పాడియె కాదయె సంశయింపగన్:👇
    "చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్"?

    రిప్లయితొలగించండి
  5. పలికనవెన్నియొ పికభా
    మలు రసపూర్ణకృతులు మొల్లమ సదృశుల్
    ఇల సందియమే లనయా!
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    రిప్లయితొలగించండి
  6. ( రమణీమణులది గృహసామ్రాజ్యమే )
    కలకల నవ్వుచున్ బికశు
    కమ్ముల బెంచెద రంతమాత్రమే ;
    మిలమిలలాడ గూర్చెదరు
    మేలుగ మాలిక లంతమాత్రమే ;
    నిలబడి పిండివంటలను
    నిండుగ చేసెద రంతమాత్రమే ;
    చెలువలు సత్కవిత్వమును
    జెప్పగ నేర్తురె మేలనన్ బుధుల్ ?

    రిప్లయితొలగించండి
  7. చిలుక పలుకుల నెరవరులు
    'చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే !'
    కలుషమగు శంకయగునిది
    సలలిత వాగ్దేవియె యొక సకియయె గాదే !

    రిప్లయితొలగించండి


  8. సెల్ఫుడబ్బా :)



    తలచిన నేర్తురు విడువక
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గల రే
    కలకమ్మిచమక్కుల దా
    ఖలుగా కలదిదె జిలేబి కందివరార్యా!



    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కలకల రావమా పడతుకల్! రసవత్తర జిల్గులా! జిలే
    బులె!సిరిగంధమా?వలయుబూయగవారలె! కౌశలమ్ముతో
    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ, నేర్తురె మేలనన్ బుధుల్,
    పలుకుల కాశిరోమణులె భారతి సంగడిచేడియల్ సుమా!


    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. లలనలు యత్నించినచో
    నలవోకగ కవితలల్లి యలరింతురుగా!
    కలిమియె పరమార్థమనెడి
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే ?

    రిప్లయితొలగించండి
  11. చెలికాడు సరసనున్నను
    పలుభావమ్ములు చెలంగు పాళము నందున్
    వలరస పూర్ణ చమత్కృత
    చెలువలు రనవత్కవితలఁ జెప్పం గలరే.

    రిప్లయితొలగించండి
  12. పలికిన దొక్కకాంత తనభర్త మహాకవిశేఖరుండుగా
    వెలుగుచు నాపెకున్ గవిత విజ్ఞత మీరగ నేర్పుచుండి "నీ
    పలుకులు దోషయుక్తములు ప్రాసలు దప్పెను చూడుమా" యనన్
    "జెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్"

    రిప్లయితొలగించండి
  13. లలితపుకళలన్నింటను
    లలనలదేపెద్దచేయి రాణించంగా
    వలపులవీణేమ్రోగక
    చెలువలురసవత్కవితలుచెప్పంగలరే
    ++++*+++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  14. లలనలు జ్ఞానపూర్ణులయి రాజ్యము లేలెడు నేటి కాలమున్
    తలపుల లోని భావముల ధాటిగ చెప్పెడు స్వేచ్ఛయున్నచో
    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్
    చిలుకలు మాటలాడు తగు శిక్షణ నివ్వ యధార్థమే కదా

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. కలువలసౌరు లమ్మువలె కమ్మగ నుల్లము దాకు జోరు, దు
      వ్వలువను మీరు వన్నె గల పద్యము లల్లెడు సోదరీమణుల్
      పలువురు శంకరాభరణవర్గము నందగ నున్న నిట్లు పల్కెదో?
      చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్?.

      ఇందు వలువల అల్లిక, కలువల సోరు శబ్దార్థముల సూచకములు.

      కవయిత్రులందరకు నమస్సుల తో

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము.

      తొలగించండి
    2. మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. తొలకరిపిలిచినపలుకును
    పలురకముల పరవశించు ప్రతిభనుజూడన్
    కలిపురుషుని యెదిరించక
    చెలువలురసవత్కవితలుచెప్పంగలరే
    ++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  17. కలికికసాధ్యమేదిపలుకావ్యములల్లిరిపూలమాలలో
    లలితరసాలసాలములొరాజమరాళప్రయాణబంధురం
    బలమునుమొల్లజెప్పెగదెయల్లదెరామరసామృతంబెటుల్
    "చెలువలుసత్కవిత్వమునుజెప్పగనేర్తురెమేలనన్ బుధుల్?

    రిప్లయితొలగించండి
  18. పలువురుకైతలురాసిరి
    నలువరమెప్పించినారునౌరాయనగా
    లలితకళలమ్మగృపలలి
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    మహిళాదినోత్సవం.. కవితల పోటీలు..

    లలనలకే ప్రవేశమన రంగుల చీరెల స్వర్ణభూషలన్
    తలుకుమనంగ దాల్చి, వనితల్ పలుకైతలనాలపింపగా
    ఫలితము దెల్పనెంచిన సభాపతి యిట్లనెనింకనెవ్వరేన్
    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్ ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్ ?!
      కలతలు రేపు ప్రశ్న యిది కాదననౌననిన్ కవీశ్వరా!
      చెలువలు వంటమాని పదచిత్రణ జేసిన ముద్ద దక్కునే?
      చెలువలు చెప్పలేరనగ చిత్రము రాత్రికి ముద్దు దక్కునే?!
      ఛలమతిలేని భామినులు సర్వసమర్థులు శక్తిరూపిణుల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి

    3. ముద్ద ముద్దు అదిరెన్ :)



      జిలేబి

      తొలగించండి
  20. అలరులుగురియగనాడుచు
    పలురకముల ప్రతిభ జూపు పరవశమొందన్
    చులుకనయనుమానించుట
    చెలువలురసవత్కవితలుచెప్పంగలరే
    ++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    సందర్భము:
    తేనె సోక నోరు తీయన యగు రీతి
    తోడ నర్థమెల్ల తోచకుండ
    గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము
    మూగ చెవిటివారి ముచ్చ టగును
    అన్నది వినయవతి కవయిత్రి మొల్ల. తేట తెలుగులో కమ్మని కవిత్వం అందరికీ అర్థమయ్యేలాగు చెప్పాలిగాని ఒకవైపు అనువాదం చేస్తూ మరోవైపు సంస్కృతంకంటె ప్రౌఢంగా రచిస్తే ఏం ప్రయోజన మని ఆమె ప్రశ్నించింది. అదీ ఆమె ఉద్దేశ్యం.
    నెల్లూరు మండలానికి చెందిన యీ కవయిత్రి గోపవరం గ్రామంలోని శ్రీ కంఠ మల్లేశ్వర స్వామి అనుగ్రహంతో తాను రామాయణాన్ని రచించినట్టు చెప్పుకున్నది.
    జన సామాన్యానికి దగ్గరగా రామాయణాన్ని తీసుకుపోవా లనే తపన గల మొల్ల...
    చెప్పు మని రామచంద్రుడు
    చెప్పించిన పలుకుమీద చెప్పెద నే, నె
    ల్లప్పుడు నిహపర సాధన
    మిప్పుణ్య చరిత్ర.. తప్పు లెంచకుడు కవుల్..
    అని పలికింది.
    తప్పు లెంచడ మంటే మనకు మహాప్రీతి కదా! రామచంద్రుడే చెప్పు మన్నా డట! అంతకంటే పెద్ద ఒప్పేం కావాలి?
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *ఒప్పు లెంచుడు*

    విలువలు కొలు వగు రఘుకుల

    తిలకుని కథ వ్రాసె మొల్ల తీయదనంబున్

    జిలుకుచు.. నిటు లన నేలా!

    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    28.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. తెలివిగ విద్యలు నేర్చియు
    పలువిధ శాస్త్రము ల యందు భారతి కృపచే
    విలసిత జాణలు గ వెలుగు
    చెలువలు రసవత్కవి త లు చెప్పంగ ల రే !

    రిప్లయితొలగించండి
  23. అందరికీ నమస్సులు 🙏🙏

    *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*

    *కం||* 🌹

    అలిగిన యందము గలుగుట
    పలుకుల యందము గలుగుట వరమది గద, తా
    తలచిన మధురమ్ముగ యా
    *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"!*

    *కం||* 🌹🌹

    చిలిపిగ చూపులు జూచుచు
    కులుకుల నొలకంగ వారు గుబులే బుట్టన్
    చిలికెడి శృంగారంబున
    *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ 🌹🌹🌹

      *కం||*

      విలువల నీయుచు లలనలు
      కలమును తీయక రచనలు కనబడ రావే
      పలుకగ తలచిన నిజమిది
      *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    2. మరో పూరణ 🌹🌹🌹🌹

      *కం||*

      పలికిరి యబలలు కాదని
      పలికిరి నారీ మణులని పదుగురు నెపుడో
      తలచిన వారిట, నెంతది
      *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    3. మరో పూరణ 🌹🌹🌹🌹🌹
      *కం||*

      పలికెడి పురుషులు కవులుగ
      పలికించగ వాణి యమృత పద్యము లెన్నో
      తలచిన యా తల్లియె, నిక
      *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*

      *కళ్యాణ్ చక్రవర్తి , ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    4. మరో పూరణ (6) 🌹🌹🙏🙏

      *కం||*

      కలికాలమునిది నిక్కము
      తలచిన సాధించ గలరు తరుణీ మణు లే
      యలుపెరుగక యత్నించిన
      *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    5. మరో పూరణ ప్రయత్నం 🙏🙏(7)

      *కం ||*

      పలుకవితలు పద్యమ్ముల
      నలవోకగ రాసితిరిగ నారీ మణులే
      నిల నివ్విధముగ నెటులనె
      *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*?

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌷🙏🌷🙏

      తొలగించండి
  24. పలుకుల తల్లినివేడుచు
    సలలిత భాషితములీయ సత్కవిగణముల్
    పలుకగ నీవిధి బాడియె
    చెలువలు రసవత్కవితల జెప్పంగలరే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలిబిలి పల్కులన్ బలికి జిహ్వకునింపగు నోగిరమ్ముతో
      కులుకుల చేతలన్నలరి కుందనబొమ్మగ గోర్కెదీర్చుచున్
      మెలకువ నిద్రలోన దన మేలునుగోరుచు ప్రోత్సహించకన్
      జెలువలు,సత్కవిత్వమును జెప్పగనేర్తురె మేలనన్ బుధుల్ ?

      తొలగించండి
    2. మా నెల్లూరుకు గర్వకారణమైన అలనాటి కవయిత్రీమణులు
      19వ శతాబ్దములో సంస్కృత కవయిత్రి శ్రీమతి వెన్నెలగంటి హనుమాయమ్మ,
      "కవితిలక,కవితావిశారద" బిరుదులు బొందిన శ్రీమతి కాంచనపల్లి కనకమ్మ,
      "కవిరాణి" బిరుదాంకితురాలు శ్రీమతి చిలకపాటి సీతాంబ సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులైన కవయిత్రులు!
      వీరిగురించి పద్యసారస్వత పరిషత్ నెల్లూరువారు ప్రచురించిన
      "విపంచి" పత్రికలో డాక్టర్ శ్రీమతి గిరిజాలక్ష్మిగారి వ్యాసములో చూడవచ్చు.

      తొలగించండి
  25. చెలువపు జిలిబిలి పలుకుల
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    మెలికల ప్రశ్నలకైనను
    సులువుగ కలవరమెరుగక జూపుచు ప్రతిభన్

    రిప్లయితొలగించండి
  26. కలదే నేర్వగ రానిది
    యిలలో సతులకు, పురుషులు యీసున సబబే
    పలుకన్ ?దోషము సుమ్మీ !
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    రిప్లయితొలగించండి
  27. చెలువలు వంటవార్పులు విశేషపు పూజలు చేతు రీ కడన్
    పలువురు మెచ్చ దేశ పరిపాలన బాధ్యత మోతురా కడన్
    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్
    అలరగ పూర్వ వైభవపు హైందవ ధర్మము నేటి రీతులన్౹౹

    రిప్లయితొలగించండి


  28. కందం
    అల వెంగమాంబ తిమ్మక
    సలలితముగఁ బల్కు మొల్ల సాహితి వినరో?
    తెలియక వాగెడు వారికి
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే?

    చంపకమాల
    సలలిత రాగ మాధురుల సాహితి పంచిన మొల్ల, తిమ్మకల్
    బొలతిగ వెంగమాంబ తిరుమూర్తిని తియ్యటి కీర్తనాదులన్
    గొలువఁగ గుర్తురారొకొ? ప్రకోపము జెందెనొ బుద్ధి? వారికిన్
    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్?

    రిప్లయితొలగించండి
  29. కలరెందరెందరో యిల
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం, గలరే
    భళి! బురుషు లెవరయిన పి
    ల్లలఁ గనువారలు బుడమిని లలనలవోలెన్!

    రిప్లయితొలగించండి
  30. చెలువలువ్రాసినపద్యము
    లలరెనుననుచునుబలికెడునార్యా!మీరే
    చెలువలనిట్లనసబబే!
    చెలువలురసవత్కవితలజెప్పంగలరే!

    రిప్లయితొలగించండి
  31. పలుకుట తగునా మీ కిటు
    *"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"*
    లలితో కావ్యము లల్లిన
    వెలదులు భువిలోనగలరు విస్మయ మేలా

    మరొక పూరణ

    ఇలలో నేర్చిరి కొత్తగ
    విలువలనే మరచి తాము విచ్చల విడిగా
    నిలువక నొకచో తిరిగెడు
    *చెలువలు రసవత్కవితలు చెప్పం గలరే.*

    రిప్లయితొలగించండి
  32. తలపఁసమస్య కన్పడెయథావిథి క్రిందుగకందిబ్లాగులో

    చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్

    కలరొకరిద్దరింతులనగా యుమ దేవియుబల్లురమ్మగుం

    డెలదరఁపద్యమల్లిబదులిచ్చెనహోపలుమార్లువేదికన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  33. చెలువలుసత్కవిత్వమునుజెప్పగనేర్తురెమేలనన్బుధుల్
    చెలువులలోనబండితులుసెప్పగలేనిలవారలెందరో
    గలరుమదిందలంచగనుగాకలుదీరిరికావ్యసంపద
    న్నలమనశంకరాభరణమందునమీరునుజూచుచుంటిరే

    రిప్లయితొలగించండి
  34. సలలితపదగుంఫనముల
    పలువిధకవితలబలికెడు భామామణులే
    కలరీయవనినికొల్లలు
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    రిప్లయితొలగించండి
  35. బలిమిని జూపకుండనె సుభాషితలై బిగివారి నెగ్గుచున్
    పలుకుల తోడ నెల్లరు ప్రభావి తులౌట నెరుంగమే ! నెఱిన్
    సులువుగ నేర్చుకొందురు ప్రసూనమువంటి మనస్కులైన యీ
    చెలువలు సత్కవిత్వమును జెప్పగ నేర్తురె మేలనన్ బుధుల్

    రిప్లయితొలగించండి
  36. పలురీతుల నీతు లుడువఁ
    గలరు హలమ్మూనఁ గలరు కాంతామణులే
    చెలువపు శృంగారమ్మునఁ
    జెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే

    [చెప్ప ను + కలరు + ఏ = చెప్పం గలరే; చెప్పఁ గలరు చుమీ]


    బలమునఁ గత్తి పట్టుదురు భామలు భండన విక్రమమ్మునన్
    లలనలఁ దూలనాడకుమ రామ కథా రచయిత్రి మొల్ల నీ
    యిలఁ గనమే సుధా రసల నింపుగ నింపెనె భావ్యమే యనం
    జెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్

    రిప్లయితొలగించండి
  37. సమస్య:
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    కందము

    చెలగన్ సమస్య నేడిట
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    యిలననుచుకందిబ్లాగునఁ
    గలరనిబల్లూరిమాత కవితరచించెన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  38. సమస్య:
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    కందము

    చెలగన్ సమస్య నేడిట
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    యిలననుచుకందిబ్లాగునఁ
    గలదుప్పలపాటికుసుమ కవిత జవాబై

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  39. చెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్?
    చెలువముమీర రామకథ చేడియ మొల్ల కృతంబు కాదె! యిం
    పలరగనెందరోభువినిభామలు వ్రాసిరి సత్కవిత్వముల్
    పలుకులరాణిభారతికృపాకరుణాంబుధిఁ నోలలాడుచున్

    రిప్లయితొలగించండి
  40. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుఫిబ్రవరి 28, 2020 12:43 PM
    సమస్య:
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    కందము

    చెలగన్ సమస్య నేడిట
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    యిలననసీతాదేవియు
    ఝలిపించెన్ పద్యమున్ ప్రశంసింపబుధుల్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  41. సమస్య:
    "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

    కందము

    తలపన్ దగునే విజ్ఞులు
    చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
    పలువురుమెచ్చగననుచున్
    పలికించెడుమాతవాణి పడతిగ నుండన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  42. కం:

    పలుకులు నేర్చిన చిలుకలు
    సులువుగ పలుకును పలుకుల సుత్తిల లేకన్
    లలనలు బడయగ చదువుల
    చెలువలు రసవత్కవితల జెప్పంగలరే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  43. ఇలలోన సహకరింపక
    చెలువలు, రసవత్కవితలఁ జెప్పం గలరే
    పలుశాస్త్రమ్ములు చదివిన
    విలసత్ పండితు లయినను విశ్వము నందున్

    రిప్లయితొలగించండి