14, ఆగస్టు 2020, శుక్రవారం

సమస్య - 3457

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రసికుండని పేడినొక్క రమణి నుతించెన్"
(లేదా...)

"రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్"

59 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    కసరులు కోపముల్ వెతలు కష్టపు మాటలు జీవితమ్మునన్
    నసలు భరించి మొత్తుకొని నందము నొందుచు హాయిహాయిగా
    ముసలితనంబు రాగనహ ముచ్చట లన్నియు పారిపోవగన్
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్

    రిప్లయితొలగించండి
  2. మిసిమి సొగసుతోడఁ నొరుల
    నుసిగొలుపుచు ధనము నంత నూడ్చు వెలది, లా
    లస కనబరచుచు పురుషుఁ న
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    అరసికుడు-మొరటువాడు

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కసితో తిరస్కరించె న
    రసికుండని పేడి నొక్క రమణి; నుతించెన్
    ముసిమిని దక్షత గలిగిన
    నొసపరి నెయ్యము నొలయుచు నొక భామ యటన్.

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రసికుడనంచు చేరుచును రాత్రులు ప్రొద్దులు వేశ్యచెంతకున్
    గుసగుసలాడి బాసలను గుట్టుగ నుండక మాటిమాటికిన్
    విసరగ ముత్యముల్ మణులు వెఱ్ఱిగ మొఱ్ఱిగ రోజురోజునన్
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్

    రిప్లయితొలగించండి
  5. అసమాన పరాక్రమమున
    పసుగ్రహణ సమయమందు పన్నుగ పాగల్
    కసిగా తెగగోసి నిడగ
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పసుగ్రహణ మన్నది దుష్టసమాసం. నిడగ..?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ

      అసమాన పరాక్రమమున
      పసులను మరలించువేళ పన్నుగ పాగల్
      కసిగా తెగగోసి యిడగ
      రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

      తొలగించండి
  6. సమస్య :
    రసికు డటంచు మెచ్చె నొక
    రామ నపుంసకు గంతుకేళిలోన్
    (పుట్టిన పిల్లలు వెంటవెంటనే పోతుంటే
    ఏదోఒక బాగుండని పేరుపెడితే దక్కుతా
    డని " షండకిశోర్ " అని పెడితే అంతా
    బాగుండి ఆ యువకునికి వివాహమైంది )
    పసితనమందె బిడ్డలకు
    బ్రాణము పోవుచునుండ నెద్దియో
    ససి కరవైన నామమును
    చక్కనిబిడ్డకు పెట్టి; రంతటన్
    మిసమిసలాడు యౌవనము
    మీరగ " షండకిశోరు " పెండ్లి కాన్
    " రసికు " డటంచు మెచ్చె నొక
    రామ నపుంసకు గంతుకేళిలోన్ .
    ( ససి కరవైన - బాగులేని ; రామ - కాంత )

    రిప్లయితొలగించండి
  7. మిసిగల యొంపు సొంపులును మించిన చాతురి నవ్యతేజమున్
    కసిగల చూపులున్ తనర గాఢత మించగ కౌగిలించుచున్
    రసమయ రాగకేళికల రంజిలు రామలు మెచ్చిరి; చెప్పజాల; నే
    రసికుడటంచు మెచ్చె నొకరా ! మన పుంసకు గంతుకేళిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ముసిమిని నిచ్చలున్ తనను పొందగు నింపున జూచుచుండుచున్
    పసగల పోడిమిన్ వలపు వాంఛల నెల్లను దీర్చు నాధునిన్
    రసికుడటంచు మెచ్చె నొక రామ; నపుంసకు గంతుకేళిలోన్
    మిసిమిని నిల్పు దక్షతయె మృగ్యమటంచు నొకామె పేర్కొనెన్.

    రిప్లయితొలగించండి


  9. గసిపోసుకొనుచు డొగరె న
    రసికుండని పేడినొక్క రమణి, నుతించెన్,
    వెస బావ యనుచు కెలవున
    కుసుంభపు వెలుముల ముద్దుగులుకగ నతడే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెలవున కుసుంభపు వెలముల ! ఆహా! ఎక్కడ పట్టుకొస్తారండీ పదాలు! నమోనమః! 👏👏🙏🙏

      తొలగించండి


    2. సీతాదేవి గారికి

      నమో నమః


      అందరికీ ఆదరువు ఆంధ్రభారతియే :)

      తొలగించండి

  10. కందాచంప్స్


    ప్రకటము చేయ పసిడి కా
    నుక, రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుం
    సకుఁ గంతుకేళిలోన్ వెస
    చకితమగుచు, గిచ్చి గిచ్చి సరసపు వేళన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. అసదృశమైనమార్గమున నచ్చట లింగము వైద్యసత్తముల్
    దెసలను ఖ్యాతినందు విధి దీపిత విజ్ఞతతోడ మార్చ, మా
    నసము హరించుచుండి తన నాయకుడై యత డేగుదెంచినన్
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్"

    రిప్లయితొలగించండి
  12. ఈ నాటి శంకరా‌భరణము వారి సమస్య

    రసికుండని పేడి నొక్కరమణి నుతించెన్

    ఇచ్చిన పాదము కందము‌ నా పూరణ సీసములో

    ఊర్వసి అర్జునునకు‌ శాపము‌‌ఇచ్చు సందర్భము


    చిరు మీసముల కూడి చెలి పెదవులు నీవు ముద్దాడె దవనుచు మురిసి పోతి,

    ఘనమగు భుజములు కౌగిట బంధించ
    చనుల సలుపరింత సమసి పోవు

    నని తలచితినిగా,ననువుగ రతమును
    సల్పుచు తాపోప శమన మునిడి

    మధురమౌ క్షణములీ మదవతి కినొసంగు
    దువనుచు తలచితి,ద్రోహి,తలచ

    ను రసికుండని,పేడి,నొక్క రమణి నుతిం
    చెనని యీవు‌ మదిలో చింత యేమి

    బడయక మదంబు నొప్పార వెడలి పోవు

    చుండ భావ్యమా, నేనిడు చుంటి నొక్క

    శాపము భువిలో నీవిక షండు డవగు

    దువని యూర్వసి విజయుని తో వచించె

    రిప్లయితొలగించండి


  13. వెసవెస ముద్దులాడను నివేశము చూపుచు ,పూవుబోడి, రా
    వె సకియ! తెచ్చినానిదె కవేలపు కన్నుల దాన యంచు వే
    సి సవరణింప మండముల సిగ్గుల దొంతరి యై నిఖార్సుగా
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. అసదృశ కావ్యమ్మున నవ
    రసములఁ జొప్పించి వ్రాసెఁ బ్రాజ్ఞులు మెచ్చన్
    వెసఁ జదివి మోదమందియు
    రసింకుండని పేడి నొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    ఒక తండ్రి...

    అసలిటు ప్రేమ దోమ యననంతయు వట్టిదె., లక్షలిచ్చు రూ..
    పసిని తృణీకరించి యొక భాగ్యమునందములేని పిల్లకై
    యిసి! పరువెత్తునిన్గనగనిట్టులు సామెత తోచుచుండెరా!
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. వ్యసనము పాలయ్యెనితడు
    వసివాడెను గాని నాడు వాసియుగాంచెన్
    పసగల మార్మిక విద్యల
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  17. నసవెట్టక పాండిత్యపు
    పసనొకపద్యంబునందె ప్రస్థావించెన్
    వెసకావ్యమె జెప్పంగల
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  18. నసవెట్టక పాండిత్యపు
    పసనొకపద్యంబునందె ప్రస్థావించెన్
    వెసకావ్యమె జెప్పంగల
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  19. పసివాడుగాడు యువకుడు
    వెసవేషంబులను దాల్చు వేడుకజేయన్
    నసగా బృహన్నలయనకు
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  20. రసమయ నృత్య మనోహర
    పస దనమును గల్గి నట్టి పార్ధుని గనియున్
    ముసిముసి నవ్వుల ద్రౌపది
    రసికుండని పేడి నొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
  21. పసివాడుగాడు యువకుడు
    వెసవేషంబులను దాల్చు వేడుకజేయన్
    నసగా బృహన్నలయనకు
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి
  22. అసమాన రస పిపాసికి
    రసికాష్టాదశవయస్సువనరుహలోచన్
    దసదిసలుమెచ్చనిచ్చిన
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
  23. అసురలకు ధనమొసంగి స
    రసుడనని పొగడ మనుచును ప్రార్థన సేయన్
    మసురయె తా పదుగురెదుట
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
  24. వ్యసనముతోడను విడువక
    రసమయ గానము యనుచును రాత్రియు పగలున్
    మసలెడి యభిమా నినిగని
    "రసికుండని పేడినొక్క రమణి నుతించెన్"

    రిప్లయితొలగించండి
  25. మిసమిసలాడు దేహమును మెండుగ సంపద గల్గి యున్నచో
    ముసిముసి నవ్వులన్ చిలికి ముద్దుల నిచ్చుచు సానివాడలో
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్
    వ్యసనముఁ బెంచి వారవని తాంగన, సంపదఁ గొల్లగొట్టగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 14.08.2020
      అందరికీ నమస్సులు 🙏

      నా పూరణ యత్నం..

      *కం*

      పస లేదని తలచిన తా
      నిశితమ్ముగ గాంచె నపుడు నిలువున నన్నే
      నస యాపిక రమ్మని యన
      *"రసికుండని పేడినొక్క రమణి నుతించెన్"*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏

      తొలగించండి
  26. కందం
    రసరమ్య నృత్య గతుల వి
    లసిత బృహన్నలయె నుత్తరకు నేర్పగ నా
    నొసలన్ జిందెడుఁ దమిఁగని
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    చంపకమాల
    మిసిమినిఁ జిందు నెచ్చెలియె మెచ్చిన నా వరుడంచుఁ జూపగన్
    బసగల రూపమేది పరువమ్మున నిక్కెడు మీసమేదనన్
    గుసగుస లాడిరా చెలులుఁ గుఱ్ఱనిఁ బేడిగ నూహజేయుచున్
    "రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్"


    రిప్లయితొలగించండి
  27. పసిమి వయస్సునం జెలగు పౌరుషపూర్ణవిలాసపుంస్త్వము
    ల్లసితము నైనఁ గాని ‌సఫలమ్మగు నేలనొ? కాని షండునం
    దసకృదుదగ్రయత్నముననా వెలయాలు తదీయతృప్తికై
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  28. పసివాఁడుతల్లిపయిటను
    పసితనపుచేష్టవలననుపట్టుచులాగన్
    ముసిముసినవ్వులమురియుచు
    రసికుండనిపేడినోక్కరమణినుతించెన్

    రిప్లయితొలగించండి
  29. పసలేనివట్టి క్లీబుం
    డుసిగొలుపునుచేష్టితములనువిదలగాంచన్
    పసిగట్టకవిషయమ్మును
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
  30. అసదృశనటనాకుశలత
    వెసజూపగనర్జునుండుపేడియయగుచున్
    నొసలనుదమినింజూచుచు
    రసికుండనిపేడినొక్కరమణినుతించెన్

    రిప్లయితొలగించండి
  31. రుసరుస లాడఁడు మీఱి యె
    కసక్కెముల నాడు వాఁడు కాదు మఱి సన్ను
    త స దాసమాన సుమనో
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్


    ముసురునఁ జేరు కప్పలు విమోహులు లోకులు స్వార్థ చిత్తులున్
    విసమును బూని తీయనవి పెక్కు వచించిన వాని మెత్తురే
    యసముఁడు విద్యలం దని ధనాశ వచింతురు పండితబ్రువున్
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్

    రిప్లయితొలగించండి
  32. వ్యసనమునర్తనంబుననువంశికమా కళ వంశమందునన్
    అసదృశనాట్యభంగిమలనందరిమన్ననలొందునట్టి యా
    పసిమిమెరుంగుయవ్వనుఁడు పాపమదేమియొ పేడివాడహో
    రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్

    రిప్లయితొలగించండి
  33. అసదృశమైననృత్యముననందరిడెందములోలలాడగన్
    మిసమిసలాడుదేహమునమెప్పునుబొందిననాబృహన్నలన్
    రసికుడటంచుమెచ్చెనొకరామనపుంసకుగంతుకేళిలోన్
    రసమయులైనవారలికరంజిలజేతురుకామకేళినిన్

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    రసికత యంచు నూరు నొక రంగము గూర్చ రికార్డు డాన్సు కై
    సిసువులు గూడి యెల్లరును చిత్రము జూడగ వచ్చి చేర నో
    ముసలియు రంకె లేసె నట ముద్దుకు రూకలు రువ్వు చుండగన్
    రసికడటంచు మెచ్చె నొక రామ నపుంసకు గంతు కేళిలోన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. అసమాన బలుండాతడ
    వసరమున బృహన్నలగ నవతరింప భళా
    పస గలిగిన నాట్య కళా
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్

    రిప్లయితొలగించండి
  36. విసురుచు హాస్యబాణములు విజ్ఞత చూపుచు పల్కులందునన్
    విషయము దాటనీయని కవీంద్రుని మాటల నాలకించి తా
    రసికుడటంచు మెచ్చెనొక రామ, నపుంసకుఁ గంతు కేళిలోన్
    పస నిక చూపలేడనుచు వ్యర్థుడటంచును కుంభ తిట్టెనే.

    రిప్లయితొలగించండి
  37. ముసిముసి నగవుల తోడుత
    నుసిగొల్పుచు నాటవెలది యూరించునుగా!
    మసి బూయుచు ధనమునకై
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి

  38. పిన్నక నాగేశ్వరరావు.

    పస గల శరీరమున్నను
    రసికత లేదని తెలియగ రాతిరి ఘటనన్
    ఎసలారగ పతి మన్నన
    రసికుండని పేడినొక్క రమణి నుతించెన్.

    రిప్లయితొలగించండి