9, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3482

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్" 

(లేదా...)
"దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్"

48 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  కర్మలు మాని వైదికపు ఘాతుక చర్యల సంతసించుచున్
  నిర్మల మానసమ్మువిడి నీరజ నేత్రల వెంబడించెడిన్
  శర్మల శాస్త్రులన్ దునిమి శౌర్యము జూపుచు నిద్ధరిత్రినిన్
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  (1977 - 2011)

  ధర్మపు శాస్త్రముల్ విడిచి ధైర్యము గైకొని వంగభూమినిన్
  కర్మల కట్టిపెట్టుచును కంఠము లెత్తుచు గోలజేయుచున్
  మర్మములన్ని నేరుచును మార్క్సుల వాదము నభ్యసించెడిన్
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్

  రిప్లయితొలగించండి
 3. శర్మము గోల్పోదురు ప్రజ
  దుర్మతి రాజైన; గనిరి తోషమును బ్రజల్
  నిర్మల చిత్తుడు రాముడు
  ధర్మము బాటించువాడు తండ్రియె కాగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధర్మపు పోకడలేకయె
   నిర్మించగ నొక్కపురము నెక్కొన నఘమున్
   దుర్మతుల రాజ్యమందున
   దుర్మతిరాజైన గనిరి తోషమును బ్రజల్

   తొలగించండి
 4. (వ్యంగ్యము)

  ఉ||
  కార్మికులెల్లరున్ విషమగాథల బోలు పథంబునేగగన్
  ఘర్మజలంబులేరులుగ కార్చిరి వారు కరోన వల్ల యే
  ధర్మవిభుండు వారి ఘనదైన్యపరిస్థితినుండి దీసె? ఛీ!
  దుర్మతి రాజుగాగ బరితోషము గైకొనిరెల్లవారలున్!

  ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 5. సభాపర్వము నుండి శాంతిపర్వము వరకు సంక్షిప్తముగా..

  ఉ||
  నిర్మలమైన రాజ్యసభ నిందలపాలయె ధర్మమీగుటన్
  కర్మఫలంబిదేయని వగన్ వనవాసముజేసి పాండవుల్
  వార్మణసైన్యమున్ కురువిభావళి జంపగ స్వర్గవాసిగా
  దుర్మతి రాజు గాగ బరితోషము గైకొనిరెల్లవారలున్

  ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 6. ఉత్పలమాల;
  ------------
  నిర్మలమైనమానుషులు,నీచపువృత్తులుజేయరెన్నడున్
  కర్మలు జేయ సాయపడి,గాయమొనర్చకజూడరెప్పుడున్
  ధర్మము వీడి నేతలిక,దారుణచర్యలు జేయబూనగా
  దుర్మతిరాజుగాగ బరితోషముగైకొనిరెల్లవారలున్
  +++++++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 7. కర్మమని బాధనొందిరి
  దుర్మతి రాజైనఁ ; గనిరి తోషమును జనుల్
  నిర్మల మానస మొందిన
  ధర్మజ్ఞుడు తమకు దొరికె ధణిగా ననుచున్

  రిప్లయితొలగించండి
 8. దుర్మతులే దళ పతులట
  నిర్మల చరితవ్యు లేరి నేరపు నరులే
  ఖర్మనుకొన నొకపూటకు
  దుర్మతి రాజైన గనిరి తోషమును ప్రజల్

  రిప్లయితొలగించండి
 9. ఖర్మము! వోటును యమ్మిన
  కర్మగ యధములు వెలసిరి కసితో సభలన్
  మర్మము గానకనాడిరి
  దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్

  రిప్లయితొలగించండి
 10. సమస్య :
  దుర్మతి రాజు గాగ బరి
  తోషము గైకొని రెల్లవారలున్

  (వరగర్వితుడైన హిరణ్యకశిపుని పట్టాభిషే
  కము - రాక్షసజాతి ఆనందాతిశయము )
  " నర్మిలి యీ హిరణ్యునకు
  నల్వయె మెచ్చి వరమ్ములిచ్చెలే !
  చర్మము నొల్తు నా హరికి ;
  చాటుగ దమ్ముని జంపె బందియై !
  ఘర్మజలాలె యింద్రునకు
  గ్రమ్ముకొనన్వలె ; వచ్చి " తంచు నా
  దుర్మతి రాజు గాగ బరి
  తోషము గైకొని రెల్లవారలున్ .
  (నల్వ - బ్రహ్మ ; ఘర్మజలాలు - చెమటలు)

  రిప్లయితొలగించండి
 11. మర్మము లేనిపాలనకు మాన్యత నిచ్చుచు మంచి పంచుచున్
  నిర్మలుడై ప్రజాళికయి నిత్యము సేమము గూర్పనెంచుచున్
  ధర్మము తప్పకుండ నిరతమ్ము నధర్మమునందునిల్వగన్
  దుర్మతి రాజు గాగ బరితోషము గైకొని రెల్లవారలున్

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అర్మిలిలేక నవియుదురు
  దుర్మతి రాజైన; గనిరి తోషమును జనుల్
  శర్మము బంచెడి దొరగల
  మర్మములే లేని దేశమందున సతమున్.

  రిప్లయితొలగించండి
 13. శ్రీరామవనవాసగమన,పితృమరణవార్త తెలిసి మాతామహుల ఊరునుండి వచ్చిన భరతుడు కారకురాలైన తల్లితో ఆగ్రహావేశుడై......

  ధర్మపరస్వరూపలసదాయతలోచనసుందరుండునై
  నిర్మలశాంతచిత్తుడు వినీతుడు దాశరథిప్రతీతుడై
  పేర్మి ధరాత్మజామణినిఁ బెండిలియాడి భవిష్యమందు నో
  దుర్మతి! రాజు గాఁగఁ, బరితోషముఁ గైకొని రెల్లవారలున్.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం

  రిప్లయితొలగించండి
 14. దుర్మతులై చరియింతురు
  దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్
  నిర్మల చరితుడు రాముడు
  ధర్మము తప్పకను ప్రజల త్రాతగ నిలువన్

  రిప్లయితొలగించండి


 15. పొగిడిరి గా మురిపెంపు పొ
  దుగతడటంచున్ జిలేబి! దుర్మతి రాజై
  నఁ గనిరి తోషమును జనుల్
  నగరము కళగట్టెననుచు నమ్ముచు సుమ్మీ


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. ధర్మము తప్పని వాడని
  పేర్మిని జనులాదరింప విజయుం డగుచున్
  శర్మయె, తానట యోడగ
  దుర్మతి, రాజైన గనిరి తోషమును జనుల్

  రిప్లయితొలగించండి


 17. అనఘా! పేరాయెను జం
  పన, దుర్మతి! రాజు గాఁగఁ బరితోషముఁ గై
  కొని రెల్లవారలున్ క
  ప్పనమును చెల్లింప వేసె పన్పు జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. దుర్మతి లో జని యింపగ
  పేర్మిని దుర్మతి యటంచు పిలిచిరి లోకుల్
  ధర్మము తప్పని వాడగు
  దుర్మతి, రాజైన గనిరి తోషమును జనుల్

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  ధర్మము లేదు., నైతికవిధానములేదు.,ప్రజానురక్తిలే...
  దర్మిలి లేదు.,పాపమనుటన్నది లేదిక పాలనమ్మనన్
  నిర్మలమేమి కాదనుచు నీచులు
  జూదరులట్లె చోరులున్
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్"


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. నిర్మలచిత్తుండై స
  త్కర్మలనెప్పుడుసలుపును,కలలోనైనన్
  ధర్మమువీడడు, విడచును
  దుర్మతి, రాజైనఁ గనిరి తోషమును జనుల్

  రిప్లయితొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నిర్మలమైన మానసము నీతియె మృగ్యము కాని లోచనన్
  శర్మపు పాలనంబిడుచు శాంతియె గూర్చుచు సాగుచుండినన్
  మర్మమునైన భాషణపు మాయల గైకొను తత్త్వమెంచునౌ
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్.

  రిప్లయితొలగించండి
 22. ధర్మము నశించు నె ల్లెడ
  దుర్మతి రాజైన : గనిరి తోషమును జనుల్
  నిర్మల చిత్తుడు రాజై
  యర్మిలి పాలనము జేసి యలరె డి వేళన్

  రిప్లయితొలగించండి
 23. కర్మముకాలి యోటరులు కావరికిన్ పరిరక్షణమ్మిడన్
  ధర్మపు బాటవీడె, పరితాపము గూరె ప్రజాళి కప్పు డా
  దుర్మతి రాజు గాఁగఁ, బరితోషముఁ గైకొని రెల్లవారలున్
  నిర్మల చిత్తునోటరులు నిల్పగ నాసనమందు పిమ్మటన్

  రిప్లయితొలగించండి
 24. కె.వి.యస్. లక్ష్మి:

  దుర్మార్గమ్ములు పెచ్చగు
  దుర్మతి రాజైన; గనిరి తోషమును జనుల్
  యోర్మియు పేర్మియు గూర్చుచు
  ధార్మిక పాలనముజేయు ధణి రాజ్యమునన్.
  (ధణి= ప్రభువు;రాజు)

  రిప్లయితొలగించండి
 25. దుర్మార్గులుచరియింతురు
  దుర్మతిరాజైన,గనిరితోషమునుజనుల్
  ధర్మముదప్పనిరాముని
  నిర్మలపరిపాలనంబునెగడుటవలనన్

  రిప్లయితొలగించండి
 26. ధర్మంబెట్టుల నిలబడు
  దుర్మతి రాజైనఁ; గనిరి తోషమును జనుల్
  నిర్మల హృదయుడు రాజై
  ధర్మముఁ సత్యంబహింస ధారుణి వెలయన్

  రిప్లయితొలగించండి
 27. నిర్మలచిత్తుండై స
  త్కర్మలనెపుడాచరించు కలలోనైనన్
  మర్మమెరుంగడు సైపడు
  దుర్మతి, రాజైనఁ గనిరి తోషమును జనుల్

  రిప్లయితొలగించండి
 28. దుర్మతులేభువిన్దనరిదూరుచునుందురుసజ్జనావళిన్
  దుర్మతిరాజుగాగ,బరితోషముగైకొనిరెల్లవారలున్
  ధర్మముదప్పనట్టియలదాశరధీశుడురాజ్యమేలగన్
  నిర్మలమానసంబలరినీతినిమీరకనుండిరేగదా

  రిప్లయితొలగించండి
 29. నిర్మల హృదయుండు సొనిపి
  మర్మ స్థానముల నిశిత మార్గణ చయమున్
  ధర్మరతుఁడు సంపి యనిని
  దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్


  కర్మవశమ్మునం జనఁగఁ గార్య విశారద విక్రముం డహో
  యర్మిలిఁ జూపు తండ్రియె నిజాత్మజుఁ డప్పుడు కోరఁ బౌరులే
  ధర్మపరుండు యౌవనుఁడు ధైర్య యుతుండును రౌద్రి వోవఁ దా
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్

  [దుర్మతి: రౌద్రి పిదప వచ్చుసంవత్సరము]

  రిప్లయితొలగించండి
 30. నిర్మలమౌ మనస్సు గల నేతను గోరెదరెవ్వరేని హే
  దుర్మతి నీవు మారుమిక, దుష్టుల నెయ్యము వీడుచున్ సదా
  ధర్మము నాచరించినను దక్కును పీఠమటంచు చెప్పఁ మారెనా
  దుర్మతి, రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్.

  రిప్లయితొలగించండి
 31. కందం
  ధార్మిక రాముఁ డయోధ్యకు
  నర్మిలి సాధించి సీత నగ్నిపునీతన్
  మర్మమునఁ గూల్చి రావణు
  దుర్మతి, రాజైనఁ గనిరి తోషమును జనుల్

  ఉత్పలమాల
  మర్మము దుష్టశిక్షణన మ్రాకుల పాలొనరించఁ గానలన్
  ధార్మిక రామచంద్రుఁడటఁ దాల్చుచు నగ్నిపునీత సీతనున్
  శర్మముతో నయోధ్యకును,జంపుచు మోహి ని రావణాఖ్యుడౌ
  దుర్మతి, రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్

  రిప్లయితొలగించండి
 32. Office లో తమ పై అధికారి ని బట్టి staff వ్యవహరించే విధానము:

  ఉ:

  మర్మము దెల్సి చాగిలుచు మార్పును గూర్తురు కార్యభారమున్
  ధర్మమునాచరింత్రు నెస తప్పులు లేకయె ప్రాజ్ఞుడైనచో
  కర్మము పొమ్మటంచు వెటకారపు మాటల ధిక్కరించనౌ
  దుర్మతి రాజుగాగ బరితోషము గైకొని రెల్ల వారలున్


  ధర్మము=Duty
  ఎస=చక్కగా
  రాజు= అధికారి/Boss

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 33. ధర్మమునాచరింపడుమదంబుననుచ్ఛమునీచమెంచడా
  దుర్మతి, రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్
  మర్మమెరింగియుక్కడచు మాన్యుడు భూవలయంబునేలగన్
  నిర్మలచిత్తుడై ప్రజలనెల్లర బిడ్డలవోలెచూచుచున్.

  రిప్లయితొలగించండి
 34. కర్మల నాచరించుచునె గర్వము జెందిన జ్ఞాన యోధుడే
  నిర్మలమైనయోచనల నేరక జేసెడు కార్యమయ్యు నా
  మర్మము తెల్సినట్టి మన మంత్రులు వంచన త్రుంచగాను యీ
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్!!

  రిప్లయితొలగించండి
 35. దుర్మతిలోన పుట్టిన సుతుండని దుర్మతి యంచు పిల్చిరే
  పేర్మిని బంధుమిత్రులు, వివేకుడు సద్గుణ శీలుడాతడే
  నిర్మల మౌమనస్కుడగు నేతయటంచు జనాళి కోరగా
  దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్.

  రిప్లయితొలగించండి
 36. దుర్మార్గపుదుష్ఫలితము
  "దుర్మతి రాజైనఁ ;గనిరి తోషమును జనుల్"
  ధర్మాధర్మమెఱింగిన
  శర్మయెసచివుండటంచుజాటింపంగన్

  రిప్లయితొలగించండి
 37. ధర్మపుమర్మమార్యులునుదారముగావచియించిసూక్ష్మమున్
  ధార్మికులెల్లజూపపరద్రవ్యముమానముప్రాణమూడ్చదు
  ష్కర్మముతప్పుకాదనగధూర్తులువంచకులాసభాస్థలిన్
  "దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్

  రిప్లయితొలగించండి
 38. కర్మని విలపించిరి ప్రజ
  దుర్మతి రాజైన గనిరి తోషమున జనుల్
  నిర్మల హృదయుడు నేతై
  ధర్మ ముతో జగతి నేల దక్షుండనుచున్

  రిప్లయితొలగించండి
 39. క: మర్మము నెఱిఁగిన పౌరుడె,
  నిర్మలమగు నీతితోడ నీమము విడకన్,
  ధర్మపు రణమున నోడెను
  దుర్మతి, రాజైనఁ గనిరి తోషమును జనుల్!! 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి