17, అక్టోబర్ 2020, శనివారం

సమస్య - 3518

 18-10-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,  

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె"

(లేదా...)

"సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా"

79 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కారుల నందునన్ తిరిగి గట్టిగ కోతలు కోసి యాదటన్
  పోరుచు నెన్నికల్ తనరి పొందుగ దుడ్డును పంచ పూర్తిగా
  కారగ కండ్లనున్ జలము కంపము నొందుచు నోడిపోవగన్
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా...

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తాత దండ్రుల నుండియు దక్కినట్టి
  ఆస్తి సంపదలను కానీ నగవు లందు
  ఖర్చుపెట్టి తుదకు తన గ్రామమందె
  చిట్టివలస గుబేరుడు గట్టె లమ్మె.

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోరగ నాంధ్రదేశమున కొండొక నేతయె వోట్లకోసమై
  జోరుగ నప్పులన్ పనిచి చోరుల కెల్లను దేవళమ్ములన్
  తూరుపు దిక్కునన్ తిరిగి తుంబుర నారద కీర్తనమ్ములన్
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా...

  రిప్లయితొలగించండి
 4. శేరున నెనిమిదవ వంతు‌ పేరు తెలుపు,

  యితర దేశ నివాసము నేమి పలుకు,

  అర్ధపతి యనగ నెవరు నమరు‌ లందు,

  వంట చెరుకమ్మె ననెడి పదము నకు స

  మాన మగు మారు పదమేమి మాకు తెల్పు

  చిట్టి, వలస,కుబేరుడు, కట్టెలమ్మె,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   "తెలుపు మితర... పలుకు మర్థపతి..." అనండి.

   తొలగించండి
 5. పడిన కష్టము నకువచ్చె ఫలితమేమొ
  సిరులు తనయింట కూరెను శీఘ్రముగను
  మరుసటేడున మరియేమిజరిగె నేమొ
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె!!

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  నేరములెన్నొ చేసి., యవినీతిని సొమ్మును గూడబెట్టి బం...
  గారపు గిన్నెలో దినెడి కాంచనరాజు కరోన సోకగా
  చేరగ వైద్యశాలకు విచిత్రము లక్షలులక్షలై జనన్
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరుగ తండ్రి యిచ్చిన నిధిన్ సరియోచన చేయకుండగన్
  మేరనుమీరి హేలలకు మెండుగ ఖర్చుయొనర్చి సాగగా
  భూరిగనున్న సంపదయె బుగ్గినిగల్సి మహత్వమంతయున్
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కర్చొనరించి/కర్చు నొనర్చి.." అనండి.

   తొలగించండి
 8. తేటగీతి
  దేవ సభలోనఁ గౌశికు డేవగించి
  యా హరిశ్చంద్రుని పరీక్షకనుచుఁ గోరి
  దానము, నిడుముల వడగ బూనినంత
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె!

  ఉత్పలమాల
  మేరలు లేని పంతమున మేదిని సత్యము బల్కు రాజనన్
  జేరి త్రిశంకు పుత్రునకుఁ జింతలుఁ గూర్చగ కౌశికుండటన్
  దారను బేరమమ్మి తనె తప్పక కాటికి కాపరయ్యెగా!
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తానె'ను 'తనె' అనరాదు. "భార్యను నమ్మి తానపుడు తప్పక..." అందామా?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. భార్యను నమ్మి తానపుడు అంటే ప్రాస భంగం.

   సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

   ఉత్పలమాల
   మేరలు లేని పంతమున మేదిని సత్యము బల్కు రాజనన్
   జేరి త్రిశంకు పుత్రునకుఁ జింతలుఁ గూర్చగ కౌశికుండటన్
   దారను బేరమమ్మి విధిఁ దప్పక కాటికిఁ గాపరయ్యెగా!
   సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా!

   తొలగించండి
 9. తేరగ శేషశైలమున తేకువమీరుచు
  నెర్రదుంగలన్
  చోరుడు చాకచక్యమున జోరుగ నమ్ముచు కూడబెట్టగా
  దారులగాచి రక్షకులు దాచిన దంతయు జప్తుజేయగా
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టెలమ్మెరా!

  కట్టెలు కొట్టే అలవాటు ప్రకారం 😎😎

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పట్టుబడక చందనమును బిట్టుగూర్చి
   పట్టుబడిన లంచమిడుచు దిట్టయయ్యి
   నట్టినింట సిరులునిండ కొట్టికొట్టి
   చిట్టివలస కుబేరుడు కట్టెలమ్మె

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు !🙏🙏🙏

   తొలగించండి
 10. నోట్లు రద్దు యనంగను కోట్లు బోయె
  కొత్త పన్ను చట్టంబుతో కొంత బోయె
  ఆదట కరోన పీడించ నంత బోవ
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రద్దు+అనంగ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "రద్దని యనగను" అనండి.

   తొలగించండి
 11. పాడు వానలు ముంచెత్త పంటలన్ని
  పేదగామారెనక్కటా పెద్దరైతు
  కాల మహిమను తెలియగజాలరెవరు
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
 12. కవి వతంసుడు శ్రీనాధు చివరి బ్రతుకు
  సత్యమును నమ్ము రాజు విషాద చరిత
  చూడ చూడగ వేదాంత జాడలౌను
  చిట్టివలస గుబేరుడు గట్టెలమ్మె.

  రిప్లయితొలగించండి
 13. పన్నులెగవేసి తీరుగ పట్టుబడిన
  జప్తుచేసిరి మేలుగ చిక్కినంత
  చిట్టివలస గుబేరుడు గట్టెలమ్మె
  గడ్డి తిననేలనదియెట్టిగౌరవమ్ము !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిల్ల పాపల రీతిగా పెంచుననుచు
   తెచ్చెను సవతిని సతికి తోడుగాను
   కొంపగుల్లాయెనన్నియు కొల్లగొట్ట
   చిట్టివలస గుబేరుడు గట్టెలమ్మె

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. (చిట్టివలస పేరతో శ్రీ కాకుళం జిల్లాలో ఒక గ్రామం ఉన్నట్లు తెలుసు గాని అక్కడేమి జరుగుతుందో తెలియదు)

  తెలుగునాట వర్షములెడ తెరపి లేక
  కురియ దోటలో చెట్లన్ని కూలి పోయె
  పండ్ల బేరము సలుపుట బదులు నేడు
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
 15. సమస్య :
  సౌరులు దప్పి చిట్టివల
  సన్ ధనదుండయొ కట్టె లమ్మెగా

  ( తొలితరపు చలనచిత్రనాయకుడై గాయ
  కుడై సంగీతదర్శకుడై దర్శకుడై నిర్మాతయై మితిమీరిన దానశీలతవల్ల దారిద్ర్యబాధి
  తుడైన పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు )

  పేరును బొందె త్యాగయగ
  వేమన పోతన రామదాసుగా ;
  మేరలు లేని దానముల
  మెండుగ జేసిన నాగయార్యుడే
  చేరని మిత్రబాంధవుల
  చేతల రోయుచు ధీరశాంతుడై
  సౌరులు దప్పి , చిట్టివల
  సన్ , ధనదుండయొ కట్టె లమ్మెగా !
  ( ధనదుడు - కుబేరుడు )

  రిప్లయితొలగించండి


 16. వాడు దేశములు తిరిగె బాగు గాను
  సంపదను కూడబెట్టె బసాలు చేయ
  ఖర్చు నీళ్లవలెను జేబు ఖాళి యయ్యె
  చిట్టి! వలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 17. కందోత్పల యయయో !


  వ్యయమా సతిదయొ నసమ
  న్వయ! సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుం
  డయొ కట్టె లమ్మె! రామ
  య్య!యొకింత విను మయొ! కథ యయయొ కాదయ్యో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. నేనె పాలకుడ ననుచు నిక్కె నతడు
  కన్ను కానక నడపిన కార్యములను
  కోర్టు కేసుల సంపద కూలిపోగ
  చిట్టి! వలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
 19. కాల మొక రీతి నుండక కక్ష గ ట్ట
  జగము నందలి మార్పులు సహజ మనగ
  చిట్టి వలస కుబేరుడు గట్టె లమ్మె
  నను ట వింతయె కాదందు రవని జనులు

  రిప్లయితొలగించండి
 20. మేరలు దప్పి రావణుడ మేయబలిష్ఠుడుఁ జచ్చె నాజిలో
  దారులు దప్పి కౌరవులు దాహరణీయనికృష్టులై రిలన్
  ధారణఁ దప్పి నట్టి యవధాని శిరోవనతుండునై నటుల్
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా"

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి

 21. దానధర్మాలు సత్రాలు ధరణియందు
  దేవళమ్ములఁగట్టించి తీరుగాను
  సొమ్ములన్నియు గోల్పోయి సొమ్మసిల్లి
  చిట్టి వలస కుబేరుడు కట్టెలమ్మె

  రిప్లయితొలగించండి
 22. వలసకార్మికుడొక్కడుపనులులేక
  పూలనమ్మినచోటనేబేలయగుచు
  బ్రతికిచెడికుచేలుండైనస్వాభిమాని
  చిట్టివలసఁగుబేరుఁడుగట్టెలమ్మె

  రిప్లయితొలగించండి
 23. ఘోరకరోనరక్కసికిగూడునుగూడునుగుడ్డలన్నియున్
  దూరముగాగదానమునుదారతసల్పువదాన్యుకైవడిన్
  బారినబంధుమిత్రతతిపాఱుడొకండునుజీవనంబుకై
  *సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా*

  రిప్లయితొలగించండి
 24. భూరిధనమ్ము కాంచనము భూములవెన్నియొ కల్గినట్టి వ్యా
  పారిని వారకాంత వల పన్నుచు వానియుపార్జన మ్ము దు
  త్తూరపు ప్రేమజూపుచును దోచ బికారిగ మారి శోకియై
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా

  రిప్లయితొలగించండి
 25. కోరికతీర సొమ్ములను కూర్చగ వచ్చను యాశతోడుతన్
  చేరిన ముల్లెమొత్తమును చేర్చి వణిజ్యము లోన పెట్టగా
  ధారుణమయ్యె వర్తకము ద్రవ్యము చెచ్చెర తగ్గిపోవగా
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా

  రిప్లయితొలగించండి
 26. భాగ్యనగరమందునగల వర్తకుండు
  వారకాంతలమరుగ, సంపదలనెల్ల
  తరుణి దోచుకొన బ్రతుకు తెరువు కొరకు
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
 27. ఉ:

  కారము లేని కూర నుడికారము లేని శుభప్రసంగమున్
  కోరలు లేని పాము సుతి గూడని జీవన యానమందునన్
  సారము లేక యుండునని చక్కగ దెల్పిరి నీ పదంబుగన్
  సౌరులు దప్పి చిట్టి వలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 28. ఏమిపాపముజేసెనోనేమొకాని
  ధనికుడయ్యునుముదుసలిదనమునందు
  కర్మవశమున దనదగుగ్రామమైన
  చిట్టివలసగుబేరుడుగట్టెలమ్మె

  రిప్లయితొలగించండి
 29. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం..

  *తే గీ*

  కోట్లు కోట్లుగ నొక్కడు కూడబెట్టి
  ప్రేమలోనికి దించగ భామయొకతి
  గుల్ల సేయగ నాతని ఇల్లు కూడ
  *"చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏😊

  రిప్లయితొలగించండి
 30. నారిగ పుట్టె శ్రీదుడన నాటి మహానటి వెల్గి పోయినన్
  జోరుగ దార బోయుచును సొమ్ముల, నష్టము లంద నంతటన్
  దారులు వీడ నామెను వితానము సోకగ వేగ మ్రాన్పడెన్ !
  "సౌరులు దప్పి చిట్టి వలసన్ ధనదుండయె కట్టెలమ్మగా!"
  (శ్రీదుడు = కుబేరుడు; వితానము = శూన్యము)

  రిప్లయితొలగించండి
 31. రండు మెండుగ నెండెఁ గొనుం డనుచును
  బక్క చిక్కి డొక్క లణఁగు నొక్క పురుషుఁ
  డక్కుబేరు పేరున్న వాఁ డప్పురమ్ము
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  భూరిధనుండు చిట్టి పరిపూర్ణ నయజ్ఞ కృపా హృదబ్జుఁడున్
  నేరక యిచ్చి దానములు నెమ్మి సతమ్ము దరిద్రుఁ డయ్యెనే
  గౌరవ మంద స్వీయ పురిఁ గాక వశమ్ము పురాన్యమందుఁ బో
  సౌరులు దప్పి చిట్టి వలసన్ ధనదుం డయొ కట్టె లమ్మెరా

  [వలసన్ = వలస యేగిన చోటులో]

  రిప్లయితొలగించండి
 32. బోరునవర్షముల్ గురిసిపృధ్వినిపంటలుదేలిపోవగా
  ధారుణిభాగ్యవంతుడయితత్ఫలమందకశోకతప్తుడై
  సౌరులుదప్పిచిట్టివలసన్ ధనదుండయొకట్టెలమ్మెరా
  సారసగర్భునిన్గృతులుసాధ్యముకాదుగనేర్వనేరికిన్

  రిప్లయితొలగించండి
 33. ఉత్పలమాల
  పేరిమి రాజ్యముల్ గెలిచి వేడుకఁ గంకుడుఁ బిల్చి గారమే
  పార సుయోధనున్ మయ సభన్ విడిదింటిగ జేసి, యీర్శమై
  కూరచ జూదమోడుచును గోల్పడ సర్వముఁ గానకేగె సూ!
  సౌరులు దప్పి చిట్టివలసన్ ధనదుండయొ కట్టె లమ్మెరా!

  రిప్లయితొలగించండి
 34. గట్టి పట్టుదలను జేరి చిట్టివలస
  చిట్టిబాబు మొదలిడెను చిన్న కొట్టు
  పట్టె భాగ్యము పదుగురు బల్కిరింక
  చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె

  రిప్లయితొలగించండి
 35. ద్రవ్యమక్రమార్జనచేసిదాచియుంచ
  దొంగయొక్కడ ద్దానిని దోచు కొనగ
  తెలిసి విలపించుచు మదిని తిట్టుకొనుచు
  చిట్టి వలస గుబేరుడు గట్టెలమ్మె.

  రిప్లయితొలగించండి