23, ఆగస్టు 2021, సోమవారం

సమస్య - 3820

24-8-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు”
(లేదా...)
“మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్”

44 కామెంట్‌లు:

  1. బ్రహ్మ సృష్టిని యసురులు రాక్షసులును
    వికృత రూపముల్ గలవారు; విధుఁడు మరుఁడు,
    పెరిగి తరుగుచు కవులనోటరిగి వెలుగు,
    వలపు నెరపెడు దేవుడు, వరుస గాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సృష్టిని నసురులు... దేవులు వరుసగాను" అనండి.
      'నోటరిగి'?

      తొలగించండి
    2. నోట+ అరిగి=నోటరిగి
      వేల సంవత్సరాల నుండి కవులు చంద్రుని వర్ణించగా వర్ణించగా వారి నోళ్ళలో కూడా అరుగుదల చెందాడని చెప్ప ప్రయత్నించాను గురువుగారు! ఏదైనా ఎక్కువగా వాడితే అరిగి పోతుంది కదా అని అతిశయోక్తి గాల వుంటుందని అకున్నానండీ!
      ఇలా మార్పు చేసాను గురువు గారు!

      బ్రహ్మ సృష్టిని నసురులు రాక్షసులును
      వికృత రూపముల్ గలవారు; విధుఁడు మరుఁడు,
      పెరిగి తరుగుచు నింగిని వెలుగు వాడు,
      వలపు నెరపెడు దేవుడు, వరుస గాను.

      తొలగించండి

  2. తనదు గర్భముం బుట్టిన తనయు లనుచు
    స్తన్యమిచ్చుచు బెంచెడి తన్వికెపుడు
    సుందరులుగానె కనిపింత్రు, సూషణ కిల
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు.

    రిప్లయితొలగించండి
  3. పొగులగనేల కుబ్జలటు పొల్పుగనెంతటి మేలొనర్చినన్
    మిగుల వికార రూపులని మెచ్చరు; కంతు జయంతుఁ జంద్రునిన్
    పొగడెదరందరందమున బోల్చగ వారల సాటి లేరనిన్
    జగతిని బాహ్యరూపమె ప్రశస్తముగా గణియింతురక్కటా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  4. చందమామకుమచ్చయచాలచేటు
    మనసుమాయకులొంగునుమరునివలన
    మనిషిమటుమాయమౌనుగామర్మమరయ
    వికృతరూపముల్గలవారువిధుడుమరుడు

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    మిగుల వికారరూపులని
    మెచ్చరు కంతు జయంతు జంద్రునిన్

    ( ప్రసన్నవదనులు , దరహాసవదనులు
    అందరకు ఆదరపాత్రులవుతారు )

    చంపకమాల
    ------------

    మొగముల శాంతహాసముల
    ముచ్చటలొల్కగ నింపుకోవలెన్ ;
    సెగల మొగాలవారలను
    " చీ " యనుచున్ గలి రాహు కేతులన్
    మిగుల వికారరూపులని
    మెచ్చరు ; కంతు జయంతు జంద్రునిన్
    మొగపు బ్రసన్నతన్ నగవు
    ముందుగ గాంచుచు మెచ్చు లోకమే .

    రిప్లయితొలగించండి
  6. మగువలు యందకత్తెలును మాన
    సమందున రూప హీనులన్
    మిగుల వికార రూపులని మెచ్చరు,
    కంతు జయంతు చంద్రులన్
    సుగుణ విశాలకాయులను సుందర
    రూపు గలట్టి వారలన్
    జగమున మెచ్చుచుందురతి జవ్వను
    లందరు పాడియేగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "మగువలు నందకత్తెలును..." అనండి.

      తొలగించండి
  7. క్రమాలంకారంలో --
    ఎట్టి రూపాలు దైత్యుల కిమిడి యుండు?
    పెరిగి తరుగుచు నుండెడి వేల్ప దెవరు?
    మనుజు లందున బుట్టించు మరుల దెవరు?
    వికృత రూపముల్ గలవారు : విధుడు : మరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వేల్పెవండు... మరుల నెవరు" అనండి.

      తొలగించండి

  8. మగువల యూహలందునొక మర్త్యుని రూపము నిల్పుకొన్నచో
    మిగిలిన పూరుషాళి గన మింకిరిపుట్టును వాస్తవమ్మిదే
    జగతిని సుందరుం డ్రనుచు జాతి నుతించిన నేమి వారలన్
    మిగుల వికారరూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  9. చం:

    అగుపడ కుండు నా మరుడు నంతము నొందగ శంభు శాపమున్
    దిగబడు చందురుండు, నట దీరగ శాపము, కృష్ణ పక్షమున్
    జగ మెరుగంగ నివ్విధిని సారము సర్వ మెఱుంగు వారలై
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతు చంద్రునిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. విగళితమానసాకరులువేగమచూపగవిచ్చుకత్తులన్
    ఖగపతివాహనుండునటగానడుచూడగధామమందునన్
    తగవదిలేదువారికినితాండవమాడగరంగభూమిలో
    మిగులవికారరూపులనిమెచ్చరుకంతుజయంతుచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  11. మరులు గూర్చును మారుని విరిశరంబు
    విరహమునుపెంపు జేయును విధుని హేల
    ఒకఁడనంగుఁడు క్షీణించు నొకఁడు గాన
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు

    రిప్లయితొలగించండి
  12. పున్న మివెలుగు నిడిగాని , పూల శరము
    వదలి గాని , గామమొసగు వారలయ్యు
    క్షయము నొందొకండు ,మరి నకాయుడొకడు
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు

    రిప్లయితొలగించండి
  13. సృజన సహజమగు విధాత సృష్టి లోన
    కలరు కలరోయి నతిభయంకర వికార
    వికృత రూపముల్ గలవారు; విధుఁడు మరుఁడు
    లోకమలరించు సుందర రూపు వారు

    రిప్లయితొలగించండి
  14. అంతులేనివికృతచెష్ట పంతమైయ్యె
    కామవాంచలుకలిగించు కరుణలేక
    అందమునెలనయ్యదిమచ్చ చందమేంది
    వికృతరూపుల్ గలవారు విధుడు మరుడు
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  15. పగలును రేయిమానవులు పైమెరుగుల్గని మోసపోదురే!
    వగలనురేపు మన్మథుడు వాడి శరంబులవా డనంగుడే
    సెగలను పెంపుజేయు శశి క్షీణశరీరుడుకాదె? కోవిదుల్
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్

    రిప్లయితొలగించండి
  16. తగిలిన వాడె మారుడనిఁ దల్చి మనమ్మున వాని తోడుతన్
    మగువలు మున్గి ప్రేమమున మక్కువఁ జూపుచు నుందు రెప్పు, డీ
    జగతినిఁ దాను మున్గినది జాహ్నవి యంచు విరాళిఁ బంచుచున్
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్

    రిప్లయితొలగించండి
  17. తేటగీతి
    క్రోథమెగయగ నరసింహ రూపమందుఁ
    జెండె నా త్రిజగన్మోహనుండు దైత్యు,
    నసుర మూకల దునుమాడు యవసరమున
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు

    చంపకమాల
    రగిలిన వైరభావమున రాక్షసుజంపె నృసింహరూపుడై
    సొగసరి విష్ణుమూర్తి! యది చోద్యమె క్రోథము జూపువేళలన్?
    జగమున దుష్టులన్ దునుమ సాగుచు మోమున క్రౌర్యమద్దినన్
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      మొగమున నగ్గికన్నుఁ గన పుఱ్ఱెలు మాలగ నాగ భూషలున్
      దిగువన భస్మమున్ దనువుఁ దీర్చిన శూలి దిగంబరుండనన్
      నగజను గాంచి తల్లి, యనె "నాదగు దృష్టి శుభంకరున్ గనన్
      మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్"

      తొలగించండి
  18. నగవులు జిందెడిన్ ముఖము నల్లనిమేనున మౌక్తికావళిన్
    సొగసుగ కేకిపింఛమును జొప్పిన శీర్షము సోగకన్నులన్
    సగుణపు బ్రహ్మతత్త్వమగు శౌరిని దల్చెడి గోపికాంగనల్
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతుజయంతు జంద్రునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విగుణములన్నవే గనని వీరుడు సత్యపరాక్రముండు
      మౌ
      నిగణ మనంబులన్ వెలుగు నిత్యుడు దైత్యవిరోధి
      పాలనన్
      జగదభిరాముడై దనరు జానకినాథుని గాంచినంతనే
      మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతు
      జంద్రునిన్

      తొలగించండి
    2. మొదటి పద్యమున
      నగవులుజిందు నెమ్మొగముగా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. రాహుకేతువు లిరువురు రహినిజూడ
    వికృత రూపముల్ గలవారు ,విధుడు మరుడు
    వారి వారల వృత్తుల నారితేరి
    జగము నందున బ్రఖ్యాతులగుట వినమె?

    రిప్లయితొలగించండి
  21. జగతిని రాహుకేతువుల చందము జూడగ దానవాంశమై
    మిగులవికార రూపులని మెచ్చరు,కంతుజయంతు చంద్రునిన్
    మగువలు మెచ్చుకొందురిల మాన్యులునందపురాసులంచు,రే
    బగలును వారినెప్పుడును భామల మానసచోరులౌటనే

    రిప్లయితొలగించండి
  22. తలపనొకనికి మచ్చలె తనువునిండ
    తనువు లేకనె తిరుగును దానొకండు
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు
    ననుచు మధుపాన మత్తుఁడొకండు పలికె

    రిప్లయితొలగించండి
  23. మచ్చ యొక్కని కుండంగ మధ్య మందుఁ
    గాయ మక్కట కరువయ్యెఁ గంతునకును
    వింత వారి గణించిన వెఱ్ఱితనమె
    వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు


    ధగ ధగ కాంతు లీను నిజ దర్శన సుందర భర్మ వర్ణ దే
    హి గురు విధేయు శక్ర జలధీశ యమానల బృంద సన్ను తే
    ద్ధ గుణ గణాఢ్య పూరుషునిఁ దన్నిష ధేశు నలాఖ్యుఁ గాంచినన్
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్

    రిప్లయితొలగించండి
  24. చం:

    నిగమములందు వర్ణితము నీదగు జోక మనోహరమ్ము నై
    నగముల నేలు దైవముగ నాకము జేర్తు వటంచు భక్తితో
    తెగ గొరికెల్ల బంధములు తేరగ నీకృప నొందు వారలై
    మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతు చంద్రునిన్

    జోక=ఆకారము
    తెగ గొరుకు=త్రుంచు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. శంకరయ్య గారు మెచ్చరు కంతుజయంతుచంద్రునిన్ అన్న ప్రయోగం చిత్రంగా ఉంది. మెచ్ఛరు కంతజయంతచంద్రులన్ అంటే మరింత బాగుంటుందేమో యోచించండి.

    రిప్లయితొలగించండి