1, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4959

2-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాసకృతము గాదందురు భారతమును”
(లేదా...)
“వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్”

25 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
సర్వవేద సమ్మిలితమ్ము నుర్విజనుల
వ్రాత మార్చెడు దివ్యంపు గీత గలుఁగఁ
గృష్ణమూర్తి సత్కృప లేక కేవలమ్ము
వ్యాసకృతము గాదందురు భారతమును

ఉత్పలమాల
ధీసచివుండు గోపకుల తేజము శౌరి జగద్గురుండుగన్
వాసిగ వేద సారమును బంచగ గీతగ మానవాళికిన్
న్యాసము సేసి వ్రాసెనన నంబుజలోచనునండలేనిదే
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్!

Sitharamayya Solasa చెప్పారు...

పంచ పాండవులు తనకు పౌత్రులనుచు
నెరిగి గూడ వారి వెతల నెటుల వ్రాయ
గలిగెనా యని కొందరు కవులడపడి
వ్యాసకృతము గాదందురు భారతమును

విరించి చెప్పారు...


బాదరాయణుని కృతియా పరమ పావ
నమగు రామాయణము తెలుపుమది, లోక
మందు జయసంహితగ దేనినందు రనగ
వ్యాసకృతము గాదందురు, భారతమును


వ్రాసెన బాదరాయణుడు? రాముడరణ్యము నందు నుండగా
మోసముచేసి రావణుడు మోహముచే చెఱ బట్టె నంచునా
వాసిగడించినట్టి సతి పావని గాథను గాంచి చెప్పిరే
వ్యాసకృతమ్ము గాదనుచు, భారతమున్ గణియింత్రు పండితుల్.

M.B.G.TILAK చెప్పారు...

భారతము నాంధ్ర భాషలో వ్రాసివారు
ప్రాజ్ఞులైన ముగ్గురు కవివర్యులిచట
తెనుగున బరిపుష్టంబైన దివ్యరచన
వ్యాస కృతము గా దందురు భారతమును

వ్యాసుడు పల్కగా వినుచు వ్రాసెను భారతమున్ గణేశుడే!
వ్రాసిరి భారతమ్మునిటఁ బ్రాజ్ఞులు ముగ్గురు తెన్గు భాషలో
ప్రాసల రమ్యతన్ దెనుగు భాషను వ్రాసిన గ్రంథరాజమే
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:వ్యాసుడు వ్రాసె భారతము పంచమవేదపు దృష్టి తోడ నా
వ్యాసకృతమ్మునే తెలుగు భాషకు దెచ్చుచు కావ్య రోచులన్
భాసము గా కవిత్రయము వ్రాసెను,కావ్యపు దృష్టి శ్రేష్ఠ మా
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్”

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

అనువ దించిరి తెలుగున
ననుచు నుండ
సంస్కృత o బున నున్నట్టి చక్క నైన
గొప్ప గ్రంథము లభియింప కొందరి లను
వ్యాస కృతము గాదందురు భారతంబు

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ తెలుఁగు చలనచిత్రములును దేట పరచ
తెలుఁగు భారతముఁ పఠించి వెలుఁగుఁ గనుచుఁ
దెలిసికొనిన గీర్వాణము తెలియని ప్రజ
వ్యాసకృతము గాదందురు భారతమును

ఉ॥ వ్రాసిరి యాంధ్రభారతము వాసిగ మార్పులు కూర్పులెన్నియో
దోసిటఁ బట్టి భవ్యముగఁ దోషము నొందుచు మెచ్చ దక్షులున్
ధ్యాసగ నాంధ్రభారతపు తావిని తన్మయులౌచు మూర్కొనన్
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

హరియె వ్యాసుని చిత్తమందధిగమించి
పార్వతీపుత్రు దంతమ్ము పర్వులెత్త
ప్రకటితమ్మాయె నీభువిన్ భారతమ్ము
వ్యాసకృతము గాదందురు భారతమును

Dhanikonda Ravi Prasad చెప్పారు...

)తే.గీ:జైమినియె భారతము వ్రాయ చదువరేల?
జయ మనెడు చరిత్రమును వ్యాసముని వ్రాసె
ననుచు కొందరు వచియింతు రవ్విధమున
వ్యాసకృతము గాదందురు భారతమును

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

భాసముగా నఖర్వమగు భారతమున్ వెలయింప నుర్విలో
వ్యాసుని గూర్చె మాధవుఁడు, వ్రాయసగానిగ శ్రీగణేశునిన్
వ్రాసినవాడు భారతము వ్యాసుడనందగ దివ్విధంబుగన్
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కవులడపడి' ?

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వాట్సప్ సమూహంలో సమీక్షించిన పూరణలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించగలరు.

Sitharamayya Solasa చెప్పారు...

🙏
అపుడు = సందేహపడు

Sitharamayya Solasa చెప్పారు...

అడపడు = సందేహపడు

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

భరత వర్ష చరిత్రను భారత మని
పరిగణింప నాధునికులు పంత మూని
యెఱుగ కున్నఁ బురాణము లింత యేని
వ్యాస కృతము గాదందురు భారతమును


ధీ సముఁ డీ ఋషీంద్రునకు దేవ జగమ్మున నైన నుండునే
వ్రాసిననుం బురాణములు పన్నుగఁ బెక్కులు తృప్తి నందఁడే
వ్యాస మహర్షి కన్యునకు నారయ శక్యమె వ్రాయ నిట్టు ల
వ్యాస కృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

దాశరథిచరిత్రమ్మది ధరణి యందు
వ్యాస కృతము కాదందురు, భారతమును
వ్యాసభగవానుడు తెలుప వాసిగాను
వారణాస్యుడు రచియించె భక్తితోడ