6, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4964

7-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్”
(లేదా...)
“కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్”

17 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

ఇంచుక రుచి లేకుండిన
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె ? లవణమున్
కొంచెముగ నక్కరైనది
మించక , తగినంత యెనచ మేలుగ నుండున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మంచితనముతో పని జరి
పించనగును యెట్టులయిన, ప్రేముడిలేకన్
వంచనయే ధ్యేయముగా
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్

విరించి చెప్పారు...


అంచిత కార్తిక మాసము
పంచన గల కారడవిన వంటల కొఱకే
తెంచి పటువు మరువ నటన్
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్.


అందరు గూడి కార్తికము నామలకమ్ము పొడన్ భుజింపగా
కుందిల మేగిపాచనము గోత్రము నందున జేయనెంచుచున్
పొందికగాను జట్టి గొనిపోవుచు క్షారము మర్చి రచ్చటన్
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మందుడొకండు కష్టపడి మాధవ పూజనుఁ జేసి కోరె గో
విందుని తాను మార్చగను వ్రేలును బెట్టినదెల్ల పైడిగన్
ముందర వచ్చు బాధలను మూర్ఖుడెరుంగ తరంబె చూడగన్
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్!!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కొందరు మూర్ఖమానవులు కోట్లు గడించి వివేకహీనులై
యందరితోడ వారలనయంబు విరోధముతో చరింత్రు పెం
పొందిన యాభిజాత్యమున బూని గణింపరు పేదసాదలన్
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కాంచన ముకు లవ ణ ము నకు
నంచిత ము గ సామ్య మేమి యవనిని చూడన్
వంచన గా బలు క దగు నె
కాంచన ము నొసంగి యు కొన గలమె లవణ మున్?

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ మంచిగ స్వస్థత వెలుఁగద
యెంచిన లవణములు మేను నిముడ సమముగన్
గొంచెము తుల్యత తరుగఁగఁ
గాంచనము నొసంగియుఁ గొన గలమె లవణమున్

ఉ॥ పొందఁగ స్వస్థతన్ జనులు పొందుట క్షారము లెన్నొమేనులోఁ
బొందిక గాను దుల్యముగ ముఖ్యమటంచునుఁ దెల్పె శాస్త్రమే!
పొందిక తగ్గి తుల్యతయుఁ బొందకఁ బొందఁగ సాధ్యమేనొకో!
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్

మానవ దేహానికి కొన్ని లవణముల నుండి లభించే ధాతువుల సమతుల్యత అత్యావశ్యకమండి. హెచ్చు తగ్గులతో తుల్యత లోపించి నపుడు వైద్యము ఖరీదు చాలా ఎక్కువ. ముఖ్యమైన ధాతువులు సోడియం కాల్షియం పొటాషియం క్లోరైడ్ అయొడైడ్ ఫాస్ఫేట్ అండి. ఇవి లవణములు లేక ఉప్పులనుండి లభిస్తాయండి. ఈదృష్టితో వ్రాసానండి.

Thanishq Grandhi చెప్పారు...

చందోబద్దమైన పద్యాన్ని రాయాలా అండి?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ముంచునను రక్తపీడన
మెంచి నిషేధించినంతనే, యుత్పత్తిన్
ద్రుంచంగ, విపణి వీధుల
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్?

ఉత్పలమాల
ఎందరొ రక్తపీడనము నెంచక వాడుచు గుండె జబ్బులన్
గుందఁగఁ గోరి తెచ్చుకొను ఘోర విపత్తు నిషేధమాపునన్
విందువు మాటతో విపణి వీధుల నమ్మ తయారి మానినన్
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అంచితముగఁ బద్యమ్ముల
నుంచిన యట్టి పద తతిని నొప్పగు వరుసం
బంచుట కిదియె ప్రమాణము
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్

[పద విభజన: కాంచనము గొనఁగలమె లవణమున్ ఒసంగియు]


విందులు భూషణమ్ములు వివేక విహీనుఁడ పెక్కు లిచ్చినన్
సుందరి నీ వశం బగునె చూపిన నాశలు మిక్కుటమ్ముగన్
మందమతీ తలంపకు శ్రమమ్మును సద్గుణవంతురాలినిం
గొంద మటన్న వీలగు నొకో లవణమ్ము సువర్ణ మిచ్చినన్

[లవణమ్ము(న్)= లావణ్యము గల దానిని]

subbarao చెప్పారు...

మంచికి రోజులు గావివి
పెంచిరి సామానులన్ని భీకర ముగనే
గాంచగ భావిని జెప్పుము
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్

M.B.G.TILAK చెప్పారు...

కొంచెము పైకంబని భా
వించుట సరియగునె? వస్తువే లేనియెడన్
సంచిత ధనమెంతైనను
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్

వందలు వేలుగా నిచట పల్కుచునుందురు నిబ్బరంబుతో
పొందగ వచ్చునేదయిన పోడిమి కల్గిన నెల్లవేళలన్
జిందులు వైచినన్ గడకు చిక్కునె బండము? చందమామపై
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్

subbarao చెప్పారు...

కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్
వందన! యేమిపల్కితివి? బంగరు నీయగ సాధ్యమౌనె?యీ
చందము మాటలాడగను సాహస మొందగ భావ్యమౌనె? హా
కుందన మిచ్చికొందురట కూడునె చెప్పుమ యీధరాస్ధలిన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:"పొందగ దేని నైన నొక పుట్టెడు సొమ్ము నొసంగె దైవ మే"
యందువు గాని శ్రామికుల యందునె లక్ష్మి వసించు కూలివా
రందరు "నుప్పు జేయ"మని యన్న సముద్రుని మంచి చేసుకన్
కొందమటన్న వీలగునొకో లవణమ్ము సువర్ణమిచ్చినన్
(ఎంత సొమ్ము ఉన్నా శ్రమ చేసే వాడు ఉంటేనే కొనగలం.అది లేకుంటే ఉప్పు కూడా కొన లేము.లక్ష్మి అనేది శ్రమ నుంచే వస్తుంది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

1)కం:ఎంచక దైవము నెన్నడు
కొంచెము గోరాను విడని కొమరుడు కాదా?
యెంచకు మతమున జేర్చగ
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్?
(లవణం నాస్తికవాది గోరా గారి కొడుకు . ఆయన్ని మతం లో చేర్చాలని చూడకు.కోటి రూపాయలు ఇచ్చినా ఆయన్ని కొన లేవు.
నిన్న ప్రయాణం లో సమస్య చూడ లేదు.ఆలస్యపు పూరణకు మన్నించ వలసినది.)