8, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4966

9-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”
(లేదా...)
“శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్”

14 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
మూడురంగుల జెండాను ముదము గనుడు
నడుమన నశోకచక్రమ్ము నాదు దృష్టి
శాంతనవునిపై సంధించు చక్రి కరఁపు
శస్త్రమే! శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె!!

ఉత్పలమాల
వస్త్రము మూడు వర్ణముల భారతజాతి పతాకమై గనన్
వస్త్రము నందశోక స్మృతిఁ బంచెడు చక్రము నాదు దృష్టిలో
నస్త్రము పట్టనన్ హరియె నాపగ సూనుని నాప నెత్తెడున్
శస్త్రమె! శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్!!

Sitharamayya Solasa చెప్పారు...

ఆంగ్ల పాలన నెదిరించి యన్య దేశ
వస్త్రముల బహిష్కరణకై వాడిన యతి
యుక్త దూది వడక నుపయోగపడిన
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె

విరించి చెప్పారు...


పూర్వ మనిని సైనికులు కపోతములకు
కంఠమందునణ్వాస్త్రము గట్టి వదల
శత్రుమూకల దునిమిన సారసమను
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె


శాస్త్రమెఱంగునట్టి యపసర్వులు పార్వపు కంఠమందు న
ణ్వాస్త్రము గట్టి దానిని విపక్షుల యాయతనమ్ము పైకి నో
యస్త్రము వోలె దొమ్మి తరి యంపి వినాశము జేసిరైరి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

బాపు భారతి దాస్యముఁ బాపుకొరకు
శాంత్యహింసల బూనెను శస్త్రమట్లు
రక్తపాతము లేనట్టి రణము నందు
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె

అస్త్రముఁ బూనలేదు తనయాయుధముల్గన శాంత్యహింసలే
వస్త్రము మేనిపైన మన బాపు ధరించినదుత్తరీయమే
శస్త్రము రాట్నమై భరతజాతికి దెచ్చె స్వతంత్ర దీప్తి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

శాంతియుతమైన దీక్షయే శస్త్రమనుచు
నస్త్ర సన్యాసులై నిరాహారులైరి
గాంధి చూపిన మార్గమే గమనమనగ
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె

అస్త్రములన్ ద్యజించిరిట నభ్యవహార్యము వీడుదీక్షతో
వస్త్రబహిష్కృతమ్మె మన భారత పౌరుల శస్త్రమాయెగా
శాస్త్రమహింసయేననుచు సాత్వికులైజనులుద్యమించగా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఆంగ్ల దొరలను దరు మంగ నాయుధ ముగ
శాంతి సమరము సాగించి జయము నందె
గాంధి గారి య హింస యే ఘన తరంపు
శష్ట్ర మే శాంతి చిహ్నమై సన్నుతి గ నె

జిగురు సత్యనారాయణ చెప్పారు...

శాస్త్రి కుమార్తె నామమది శాంతి, పరీక్షకు పాఠశాలలో
దస్త్రము నివ్వగా నడిగెఁ దండ్రిని "రైతుల లాంఛనమ్మునున్"
శాస్త్రమెఱుంగు తండ్రి యనె "సాధనమయ్యది లాంగలమ్ముగా
శస్త్రమె శాంతి! చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్"!!

లాంగలము = నాగలి

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:పెట్టుబడి శ్రమజీవుల పొట్ట గొట్ట
వారి కండ యయ్యెను సామ్యవాద మొకటె
సుత్తి తో జత గూడిన కత్తి యనెడు
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”
(కత్తి-సుత్తి)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ ఉగ్రవాదముఁ బెంచెడి యగ్రజులకు
బుద్ధి గరప శాంతికి విఘ్నముఁ గను జనుల
పీఁచమడఁచ వేరు విధము విధియుఁ గనక
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె

ఉ॥ అస్త్రముఁ బూని శాంతినిట నంతముఁ జేయ నశాంతి సృష్టికిన్
దస్త్రము వ్రాసి నిత్యమటు తత్పరులై చను దుష్టమూకలన్
శస్త్రము వీడి కూల్చుటయు సాధ్యమె యెంచఁగ దేశరక్షకై
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:వస్త్రములన్ విదేశ పరిపాలక వర్తకమెల్ల బాపగా
వస్త్రము నేయు దారమును భారత వాసులె జేయుడంచు నే
యస్త్రము లేక రాట్నముల నందు డటంచు వచించ గాంధి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

భండ నాంత రోపద్రవ ఖండి తాంగ
వీర వీక్షణ ఫలితము భరత భూమి
శూర వరలోక గణ్యు నశోకు వీత
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె


అస్త్ర విహీను సన్నుత మహాత్ము నిజేక కటిస్థ శుద్ధ స
ద్వస్త్రుని భవ్య గాంధి కుల వర్యు దురాక్రమ ణారి వర్గ భృ
చ్ఛస్త్ర విఘాత లాఘవము సత్య వరాగ్రహ సిద్ధ సుప్రభా
శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్

subbarao చెప్పారు...

దుష్ట జనములు దేశాన విస్తరించి
దేశ సంపద నంతయుఁ దోచుకొనగ
భరత మాతను రక్షింప ప్రముఖ మైన
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

తెల్లవారిని తరుమగ దీక్ష తోడ
సత్యమే యాయుధమ్ముగ సాగి గాంధి
యెట్టి శస్త్రము లేక నహింస యనెడు
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె.