13, జనవరి 2025, సోమవారం

సమస్యాపూరణం – 5000 (ఊకదంపుడు)

 ప్రసిద్ధ బ్లాగర్, బ్లాగులోకంలోకి నేను రావడానికి ప్రేరణ నిచ్చినవారు 'ఊకదంపుడు' గారు నా బ్లాగు ప్రారంభంనుండి దీని ఎదుగుదలను పరిశీలిస్తున్నవారు. నా బ్లాగులో నిన్న 5000 సమస్యలు పూర్తయిన సందర్భంగా వారి బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని యథాతథంగా మీముందు ఉంచుతున్నాను....

సమస్యాపూరణం – 5000
- ఊకదంపుడు
జనవరి 12, 2025    
    జూన్ 4, 2010 ఉదయం 6 గంటల 30 నిముషాలు.. పంచాగములో ఉన్నా లేకున్నా ఇదొక శుభలగ్నం. సుమూర్తం. ఎందుకంటే కంది శంకరయ్య గారు ఈ ముహూర్తములోనే తమ బ్లాగులో మొదటి సమస్య నిచ్చారు.
    ఆనాటికి వారివద్ద సరియైన కంప్యూటరు లేదు, వారికి బ్లాగు వ్రాయటమూ తెలియదు. పట్టుదలతో బ్లాగ్ వ్రాయటము, కంప్యూటరు వాడకము నేర్చుకొన్నారు. బ్లాగ్ నిర్వహణని జీతంరాని రెండవ ఉద్యోగముగా భావించారు (అప్పటికే తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసారు). బడిలో అధ్యాపకత్వాన్ని ఎంత దీక్షతో నిర్వహించారో, శంకరాభరణమునూ అంతే దీక్షతో నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. నిజానికి ఆ బడి నయము, బోలెడు సెలవలు. ఈ బడిలో సెలవలు సున్నా.
    మొదట చిన్న చిన్న సమస్యలు ఇచ్చేవారు. వ్రాసే వారిని ప్రోత్సహించటానికి తప్పుల నెత్తిచూపకుండా అభినందించేవారు. తరువాత మెల్లగా తప్పులు వివరించటం, ఆపై చిన్న చిన్న పాఠాలు ప్రకటించటం మొదలు పెట్టారు. ప్రయాణములు, అడపా దడపా వచ్చే జ్వరాదులు, కౌటుంబిక బాధ్యతలు కూడా వీరిని ఏనాడూ సమస్యను ప్రకటించకుండ ఆపలేకపోవటము అంతర్జాలపద్యకవుల అదృష్టము. మెల్లగా సమస్యాపూరణలకే పరిమితము కాకుండా దత్తపదులు, చిత్రానికి పద్యము, పద్యపూరణము, వ్యస్తాక్షరి ఇవ్వసాగారు.
    పద్య విద్యలో ఓనమాలు కూడ తెలియక వీరి వద్ద నేర్చి కవులైనవారెందరో. ప్రవేశం ఉండి తమ పద్యవిద్యను విశేషముగా తీర్చిదిదికొనిన వారింకెందరో. సమస్యాదులను పూరించి ఈ వేదికకి కవనపరిపుష్టిని కలిగించిన లబ్ధప్రతిష్టులైన విద్వత్కవులెందరో.
    వీరు నేడు సాహితీలోకములో ముఖ్యముగా అవధానరంగములో సుప్రసిద్ధులు కావటం కడు ముదావహము. వీరి ఆంధ్రసాహిత్య వరివస్యను గుర్తించి "సమస్యాపృచ్ఛక చక్రవర్తి" అని బిరుదమిచ్చి గౌరవించినవారు అభినందనీయులు. ఈనాడు ఉభయాంధ్రరాష్ట్రాలలో ఎక్కడ అవధానము జరిగినా వీరిని ప్రాశ్నికులుగా పిలవటం పరిపాటి. ఈనాడు మీరు ఏ అవధానిని పలకరించినా వారి మాటలలో శంకరాభరణము ప్రసక్తి వస్తుంది. నేడు వీరి దగ్గఱ అవధానవిద్య నేర్చుకొని అవధానములు చేస్తున్న వారూ ఉన్నారు.
    నేడు శంకరాభరణము ఒక సాహితీ బృహద్విద్యాలయం. అక్కడ ఉన్న సాహిత్యం ముందు తరాలకు కరదీపిక.
    పద్యవిద్యలో అక్షరాలు దిద్దుకోవటం మొదలు సాహితీ పరిశోధన చేసి డాక్టరు పట్టా పుచ్చుకొనటానికి సరిపొయే పంట ఆ కవనక్షేత్రములో పండింది. ఇంకా పండుతూనే ఉంటుంది.
    రండి. శంకరాభరణములో చేరండి.
    పద్యము వ్రాయటం రాకపోతే నేర్చుకోవచ్చు.
    పద్యము వ్రాయటం వస్తే మెఱుగులు దిద్దుకోవచ్చు.
    పద్యకవీశ్వరులైతే మీ కవిత్వముతో వర్ధిష్ణులకు మార్గదర్శనం చేయవచ్చు.

సీ.    ఏగద్దె ఛందంబు నిచ్ఛతో నేర్వగా
        భావించు వారికి పాఠశాల
    యేవేది పద్యకవీశ్వరు లెల్లరు
        ప్రత్యూషముఁ జను సభావిశేష
    మేజాలపుం గూడు సాజముగ వధాన
        విద్యార్థులకుఁ గల్పవృక్షశాఖ
    యేతిన్నె ఆంధ్రభాషాతరుణి నిలచి
        మంగళారతులందు మందిరమ్ము
తే.గీ.    శోభ నట్టి ఠావును శంకరాభరణముఁ
    బట్టుదలతో నెఱపుచున్న పండితవరు,
    సత్కవిన్, స్థితప్రజ్ఞునిన్, సద్గురువును
    కందిశంకరయ్యను గొల్తు! గారవింతు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి