12, జనవరి 2025, ఆదివారం

సమస్య - 5001

13-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కచుని సుతునిఁ జంపెఁ గైటభారి”
(లేదా...)
“కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

6 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    బ్రహ్మశాపముండ బర్బరీకుని మీద
    కృష్ణమూర్తి చేతి కృత్యమగుట
    లోక శుభమనుచు కురుక్షేత్రమున ఘటో
    త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ప్రచలిత బ్రహ్మ శాపమున బంకజనేత్రుడు బర్బరీకుఁ దే
      ఱుచ ననివార్యమై, బలికి రూఢిగఁ దానుగ నొప్పినంత కో
      రుచుఁ దన శీర్షమే యనిని లోకన జేయగ, వీరునిన్ ఘటో
      త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో!

      తొలగించండి
  2. దురమునందు నాడు ద్రోణ సుతుడు ఘటో
    త్కచుని సుతునిఁ జంపెఁ ; గైటభారి
    శాపమిడె నతనికి జాడ్యముతోడుత
    పెక్కు వత్సరములు ప్రేముడించ

    రిప్లయితొలగించండి

  3. బలములేని వారి పక్షమున్ జేరెద
    వీరు విరలనెడి భేదమెంచ
    ననుచు చెప్పినట్టి యగ్రగుడగు ఘటో
    త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి


    వచనము చేసె బర్బరుడు భండన మున్ బల హీన పక్షమం
    దు చెలగువాడనంచు తనతో వచియించిన వాడు గాంచగా
    విచలిత మానసమ్ముగల వీరుడు వీడని యెంచుచున్ ఘటో
    త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో.

    రిప్లయితొలగించండి
  4. ఉచితవిధానమున్ జరుగ యుద్ధము కౌరవవంశమందు, నూ
    ని చతురయుక్తి యాదవు డనిన్ జననీయక బర్బరీకు, న
    క్తచరుశిరంబునున్ వరముగాఁగొని మాన్పగ శాపమున్, ఘటో
    త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో!

    రిప్లయితొలగించండి
  5. బర్బరీకుడెంచె బవరము సేయగా
    మార్గమందునిల్పె మాధవుండు
    అడిగినట్టివరము నాతడొసగ ఘటో
    త్కచుని సుతునిఁ జంపెఁ గైటభారి

    అచలితమైన పంతమున నాతడు సాగెను యుద్ధభూమికై
    సుచరితుడాతనిన్ నిలిపి సూక్ష్మముఁ గైకొనె మారురూపమున్
    విచలితుడైన సౌరథుడు వింతగ నీయ వరంబటన్ ఘటో
    త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము బ్రీతితో

    రిప్లయితొలగించండి