5, డిసెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 161

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?
దీనిని పంపించిన రవి గారికి ధన్యవాదాలు.
నిజానికి రవి గారు "ఇడ్లీ" అంటే దుష్కరప్రాస అవుతుందని, కవి మిత్రులకు ఇబ్బందిగా ఉంటుందనుకొని "ఇడిలీ" అన్నారు. కాని నాకు మీరంతా సమర్థులనే నమ్మకంతో "ఇడ్లీ" అన్నాను.

88 కామెంట్‌లు:

  1. ఎడ్లకు కాణము వోలెను
    వడ్లను దంపంగ నేల వరి యన్నముకై
    గ్రుడ్లను నే దిన జాలను
    ఇడ్లీలే చాలు మనకు నితరములేలా

    రిప్లయితొలగించండి
  2. ఎడ్లన్ బండికి పూనిచి
    వడ్లన్ గొనిపోవుచుంటి వచ్చెద త్వరగా
    నడ్లే అన్నము కాదిక
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్నగారూ మీ పూరణ శభాష్. బండి పూచడం మా పల్లెటూరులో విన్న పదము తప్పో ఒప్పో తెలియక వదిలేసా ! అందఱూ నన్ను విశాఖజిల్లా వాడినని హేళన చేస్తారేమోనని. పూనుచు సరియైన మాట మాట. సమస్యను కొంచెము మార్చి వ్రాసాను మరోసారి.

    గొడ్లకు గడ్డియె దెలియును
    రెడ్లకు దొరతనము నొందు రీతులు దెలియున్
    వడ్లకు దంపుడె దెలియును
    ఇడ్లీలే నాకు దెలియు నితరము లేలన్ ?

    రిప్లయితొలగించండి
  4. నరసింహ మూర్తిగారూ అభినందనలు. కొద్దిగా మార్చి వ్రాసినా మీ రెండో పద్యం ఇంకా బాగుంది. మరి నా రెండో పూరణ కూడా చిత్తగించండి.

    ఇడ్లీల్ దుష్కర మౌనని
    అడ్లే కుండగను వారు అంటిరి ఇడిలీ
    మడ్లే మీ శిష్యులు మరి
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  5. ఇంకో పూరణ కూడా చెప్తాను. ఎవరూ ఏమనుకోవద్దు.

    దొడ్లో గొడ్లను కట్టితి,
    వడ్లన్ దంచితిని, పెట్టి వచ్చితి గుడ్లన్
    రెడ్లింట, వద్దు ఆమ్లెట్
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  6. ఎడ్లనుపూజించిరి,వరి
    మడ్లనుదున్ని,మనరైతు మహనీయులు,మే
    ల్వడ్లను దెచ్చిరి యిండ్లకు,
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా!
    (వృక్ష సంబంధ మైన ఆహారమే మేలు,జంతు సంబంధ మైన కంటె
    అను భావనతో పూరించాను.)

    రిప్లయితొలగించండి
  7. లడ్లా స్వీట్లవి పడదుర
    గ్రుడ్లా వద్దుర అరుగవు కుక్షికి బరువై
    గుడ్లను కన్నీరు దిరుగు
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  8. హరి గారి పూరణలో ఒక వృద్ధుని ఆవేదన ద్యోతకమై హృదయాన్ని కదిలించింది. సరదాగా ఇచ్చిన సమస్యను పూరణలో బరువెక్కించడం అన్నది, కవి ప్రతిభా పాటవానికి దర్పణం పడుతోంది. హరి గారికి నా హృదయ పూర్వక అభినందనలు!
    శంకరయ్య గారు, హరి గారు తమ పోస్టల్ అడ్రస్ మెయిల్ చేస్తే, నా ’వరాహ శతకము’ ప్రతులను పంపిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారి మెప్పుకోలు భేష్, పూరణ ఇతివృత్తం ఏదైనా అన్య భాషా పదాల వల్ల మాధుర్యమే సమసిపోతుంది...శ్రేష్ఠ కవుల మనోగతం కూడా ఇదే.

      తొలగించండి
  9. హరి గారి పూరణ గురించి ఆచార్య ఫణీన్ద్రగారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. హరిగారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఆచార్య ఫణీంద్ర గారు,

    మీకు నాయందు గల అభిమానానికి మరియు మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నేనీరోజు పద్యాలు వ్రాయగలుగుతున్నానంటే మీరు ఓపికతో ఇచ్చిన సూచనలు, సలహాల వలననే. మీకు తప్పక మెయిలు పంపించగలను.

    మిస్సన్న గారు,

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. లడ్లను కొనితిన గోరితి
    గ్రుడ్లని తెలిసిన పిమ్మట కలవర పడినే !
    లడ్లూ గ్రుడ్లేల వలదని
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా ? !
    -------------------------------------
    యెడ్లతొ దున్నిన పొలమున
    వడ్లను దంపించివండి తినినచొ బహు మేలనగన్ !
    గ్రుడ్లూ పాలూ కంటెను
    ఇడ్లీలే చాలు మనకు నితరములేలా ?

    రిప్లయితొలగించండి
  12. telugu lo shankarabharanam blog nizamga chaduvarulaku chakkani kalaksepam,sahitya prerananu kaligistunnadi. bhasha-bhavam-nadaka-yathi veekshakulaku manasikanandanni-madhurayanni-maruvaleni padyalanu andisthunna blog nirvahakulu kandi shankaraiah gariki namassumalu. balu-balaji.

    రిప్లయితొలగించండి
  13. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, డిసెంబర్ 06, 2010 7:16:00 AM

    అందరికీ నమస్కారములు.
    శంకరాభరణం బ్లాగు లో పూరణలు, చర్చలు చాలా విజ్ఞానదాయకంగా ఉన్నాయి. ముఖ్యం గా గత వారం పది రోజులుగా రకరకాల భావాలతో పూరణలు ఒకటిని మించి ఒకటి ఉంటున్నాయి.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులంతా తమ పూరణలను అందించడమే కాక, ఇతర కవుల పూరణలను చదివి విశ్లేషించి, ప్రశంసించడం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. నాకు శ్రమ కూడా తగ్గుతున్నది. అందరికీ ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మొదటి పూరణ, సమస్యము మార్చి చేసిన పూరణ రెండు బాగున్నాయి. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ పద్య ప్రవాహం "అడ్లేకుండా" ప్రశంసనీయంగా కొనసాగుతున్నది. మీ మూడు పద్యాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం శ్లాఘింపదగింది.

    హరి గారూ,
    డా. ఆచార్య ఫణీంద్ర గారి ప్రశంసకు పాత్రమై, మిస్సన్న గారి ఆమోదం పొందిన మీ పూరణను నేను ప్రత్యేకంగా ఏమని వ్యాఖ్యానించను? ధన్యులు మీరు. మీకు నా నమోవాకాలు.

    రాజేశ్వరి గారు,
    మంచి ప్రయత్నం. అభినందనలు.
    మీ మొదటి పద్యంలో రెండవ పాదంలో యతి, మూడవ పాదంలో గణం తప్పాయి. దానిని ఇలా సవరించాను.
    లడ్లను కొని తినఁ గోరితి
    గ్రుడ్లని తెలిసిన పిమ్మటఁ గుందితి నయ్యో!
    లడ్లూ గ్రుడ్లేల వలయు
    నిడ్లీలే .......
    ఇక రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం ఉంది. "వడ్లను దంపించి వండ బహు మే లనఁగన్" అంటే సరిపోతుంది.

    బాలాజీ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. నా పూరణ .....
    ( ఈ సమస్యలోని దుష్కర ప్రాసకు ఇంగ్లీషు పదాలను ఎక్కువమంది ఆశ్రయిస్తారనుకున్నాను. కాని నా అభిప్రాయం తప్పని నిరూపించారు కవిమిత్రులు. ఆ ప్రయత్నం నేను చేసాను)

    ఫుడ్లేదు, లేదు షెల్టరు
    షెడ్లో కాసింత ప్లేసు చిక్కెను బ్రదరూ,
    బెడ్లైటు వెలుఁగుచుండఁగ
    నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  16. గురువుగారూ మీ పూరణ అద్భుతం. నాకొక్క సందేహం. కందంలో సమస్య ప్రాసాక్షరం గురువైతే మిగిలిన మూడు పాదాల ప్రాసాక్షరాలు కూడా గురువులు అవాలా? ఇక మాలో మేము యెంత వ్యాఖ్యానిన్చుకొన్నా మీ వ్యాఖ్య మాత్రం మాకు బహుమతిలా భావిస్తూంటాము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా ఎరుకలో కందములో పాద ప్రథమాక్షరాలకే ఆ నియమం కానీ ప్రాసాక్షరాలకా నియమం లేదు. కందము భగణంతో మొదలు పెట్టి రెండవ పాదం " గగ" గణంతో మొదలు పెట్ట వచ్చు. అప్పుడు మొదటి పాద ప్రాసాక్షరం లఘువు, రెండవ పాద ప్రాసాక్షరం గురువు అవుతాయి.నియమ భంగముండదు.

      తొలగించండి
    2. మిస్సన్న గారి ప్రశ్నను నేనప్పుడు చూడక సమాధానం ఇవ్వలేదు. మీ సమాధానం బాగుంది. ధన్యవాదాలు.

      తొలగించండి
  17. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, డిసెంబర్ 06, 2010 7:55:00 AM

    గురువు గారికి నమస్కారములు.
    మీ ఇంగ్లీష్ పదాల పూరణ బాగుంది. చిన్నప్పడు మా మావయ్య చెప్పిన ఒక పేరడీ గుర్తుకు తెచ్చింది.
    "తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" కి పేరడీ "ఎస్కేప్ అయి తిరుగువాడు ఎఫీసియంట్ సుమతీ" అని (సరైయిన చంధస్సు గుర్తు లేదు, క్షమించగలరు)

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    కందంలో ప్రాసాక్షరం గురు లఘువులలో ఏదైనా ఉండవచ్చు. కాని మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు అక్షరం గురులఘువులలో ఏది ఉంటే మిగిలిన పాదాల్లోను అదే ఉండాలి. అంటే కందం మొదటి పాదాన్ని గురు లఘువులలో దేనితో ప్రారంభిస్తామో మిగిలిన పాదాలనూ దానితోనే ప్రారంభించాలి.
    ఉదాహరణకు .....
    ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాస కావ్యంలో గణపవరపు వేంకట కవి ఏకాక్షర కందపద్యాన్ని చూడండి.
    కైకోకీకా కెకుకై
    కోకాకా కింకకూకి కూకకు కోకీ
    కాకుకకు కేకికేకిక
    కూకోకొక్కూకకింకకో కైకౌకా.
    ( దీని అర్థం మాత్రం ఇప్పుడు నన్ను అడక్కండి )
    పై పద్యంలో ప్రాసాక్షరం మూడవ పాదంలో లఘువు, మిగిలిన పాదల్లో గురువుగా ఉంది. అన్ని పాదాల్లో ప్రాసాక్షరానికి ముందు గురువుంది.
    అదే విధంగా నేను రాసిన ఏకాక్షర కందపద్యాన్ని చూడండి.
    నిన్నా? నన్నా? నాన్నన?
    ని న్నైనను, నాన్న నైన నే నెన్నను, నే
    నన్నను నాన్ననె, నిన్నా?
    ని న్నన నన్నన్న! నాన్ననే నే నన్నన్.
    పై పద్యంలో ప్రాసాక్షరం రెండు పాదాల్లో గురువుగా, రెండు పాదాల్లో లఘువుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  19. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.
    మీరు చెప్పిన పేరడీ "ఎస్కేప్ అయి తిరుగువాడు ఎఫిషీయెంటౌ" అన్నా "ఎస్కేప్ అయి తిరుగువాడు ఎఫిషెంట్ సుమతీ" అన్నా ఛందస్సు సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  20. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, డిసెంబర్ 06, 2010 9:46:00 AM

    ధన్యవాదాలు, గురువు గారూ.
    మీ ఏకాక్షర కందపద్యం అమోఘం.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ నా ప్రశ్నకు సవివరమైన విశ్లేషణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ నా చిన్ని బుర్రలో ఇంకో సందేహం ఉండి పోయింది. ప్రాసాక్షరానికి ముందు ఉండే అక్షరము స్వతహాగా గురువు అయితే మిగిలిన పాదాల్లో కూడా సహజ గురువు మాత్రమె ఉండాలి. అంటే ఉదాహరణకు మొదటి అక్షరానికి తర్వాత ఉండే ద్విత్వాక్షరము లేదా సంయుక్తాక్షరం వల్ల ఏర్పడే గురువు కాకూడదు. ఇది సరి ఐనదేనా? ఇప్పుడు "వాక్కు, చెక్కు, ముక్కు, రక్కు" వీటికి ప్రాస మైత్రి ఉంటుందా?

    ఇక మీ ఏకాక్షర కందం పరమాద్భుతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు తెలిసినంత వరకు ప్రాసమైత్రి ఉంటుంది.ఉదాహరణగా ప్రామాణిక పద్యాలు లభిస్తే లేదా స్ఫురిస్తే ఉటంకిస్తాను.

      తొలగించండి
  22. శంకరయ్య గారు,
    నిన్న నెట్ చూడ్డం వీలుపడక ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నాను, ఆలస్యంగా. "ఇడిలీ" అన్నది సుకర ప్రాస అని కాదండి. నా ఉద్దేశ్యం - ఈ క్రింది పద్యం ద్వారా చెబుతున్నాను.

    కడు గొప్ప పేరు, శౌర్యము
    ఒడుపగు విద్యయు, వినయము ఒకటీ వద్దోయ్.
    ఇడుములు బాపగ నొప్పు ప
    యిడి లీలే చాలు మనకు నితరములేలా?

    అయినా "ఇడ్లీ" లే భేషైన పూరణలొచ్చాయి కాబట్టి ఇదే బావుంది. నా వంతు.

    బ్రెడ్లూ జామూ దెచ్చును
    డెడ్లీ వ్యాధగు షుగరును. టిఫనుకు రోజూ
    లాడ్లీగా సాంబారూ
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    అందరు కవులకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ మీ పూరణ,ఏకాక్షర కందము చాలా బాగున్నాయి. రవిగారూ పూలగంపలో యీ సారి మీరు పంపిన ఇడ్లీలు మధురంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  24. మా మిత్రుడు తెలుగు పండితుడు తిరునగరి కృష్ణమాచార్య్లు నిన్న దారిలో కలిసి, నా బ్లాగు గురించి విని, ఈ సమస్యకు రోడ్డు పైనే ఆశువుగా చెప్పిన పూరణ ..
    ఇడ్లీ శాకాహారం
    బిడ్లీ చట్నీలు గలియ నింపుగ నుండున్
    ఇడ్లీ కడు చౌక కనుక
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  25. ఇడ్లీ ఇండియ ఫుడ్డే !
    ఇడ్లీ ఘీ కారపుపొడి యెంతో రుచియౌ !
    ఇడ్లీ కి సాటి లేవిక !
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి
  26. గుడ్లట్లుగ సేవించుచు
    వడ్లన్నము కూరలమర వంటల దినగా
    నడ్లగు జీర్ణాశయమున;
    నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?
    - "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  27. గుడ్లట్లుగ సేవించుచు
    వడ్లన్నము కూరలమర వంటల దినగా
    నడ్లగు జీర్ణాశయమున;
    నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?
    - "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  28. సమస్యాపూరణ సాధనోపకరణం "శంకరాభరణం"
    నిర్వాహకులకు నమస్కారాలు!
    సంప్రదాయ కవిత్వౌత్సాహికులకు మీ ఆదరం ప్రశంసనీయం.
    సమస్యల్లో "అన్య దేశ్యాలు" తెలుగు సారస్వతాన్ని అపహాస్యం చేసే ప్రమాదముంది గమనించగలరు. అలాంటి భావనోద్దీపక బ్లాగు "శంకరాభరణం" కాకుండా వుంటుందని ఆశిస్తూ...

    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  29. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ సలహాను తప్పక ఆచరణలో పెడతాను. ధన్యవాదాలు.
    ఇక మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. మిస్సన్న గారి సందేహానికి-ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువే లఘువైతే లఘువే అన్నది మాత్రమే నియమం.దీర్ఘాక్షరం హ్రస్వాక్షరం అని చూడాల్సిన పని లేదు.నియమం ఇంతే అయినా- నాలుగు పాదాలలో నూ ప్రాస పూర్వాక్షరాలు దీర్ఘాలో లేక హ్రస్వాలో అయితేనే బాగుంటుంది.ఇక రాంభట్ల వారికి-ఏవో ఇటువంటి పద్యాలు కొన్ని సరదాగా మణిప్రవాళంలో ఉన్నంత మాత్రాన భాష మైల పడిపోదు.పద్యాలను రసికులను ఆస్వాదించనీయండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజం.ఎన్నో అవధానాల్లో కూడా అప్పుడప్పుడు మణిప్రవాళాలు చెప్పారు కదా !

      తొలగించండి
  31. శంకరాభరణము సాహిత్య వేదిక
    తెలుగు కవులనెల్ల తీర్చిదిద్ద
    పద్యరచనసేయ పరమావకాశంబు
    ఆత్మతృప్తి నిచ్చు ఔషధంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోపాలుని మధుసూదన రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.

      తొలగించండి
  32. గుడ్లేమో క్రొవ్విచ్చును
    లడ్లేమో మందమిచ్చు లఘువుగలేకన్
    గుడ్లను లడ్లను విడుతము
    ఇడ్లీ లె చాలుమనకు ఇతరములేలా

    రిప్లయితొలగించండి
  33. మలివయసున నడివయసున
    పలువరుసలె కలుగని శిశు పసివయసుననూ
    నలతను కలిగిన తనువుకు
    ఇలఘనఫలముదరమునకు ఇడు నెపుడిడ్లీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోపాలుని మధుసూదన రావు గారూ,
      మీ పూరణ, దాని ననుసరించిన పద్యం రెండూ బాగున్నవి. కాకుంటే వ్యావహారిక పదాల ప్రయోగం ఉంది. (సమస్య అలాంటిది, తప్పదు కదా!)

      తొలగించండి
  34. గ్రుడ్లప్పగించి చూడకు
    గ్రుడ్లేలను దెచ్చితీవు గురువగు నాకున్
    వడ్లే సాత్విక ధాన్యము
    ఇడ్లీలే చాలు మనకు నితరములేలా ?

    రిప్లయితొలగించండి
  35. నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం -2037
    సమస్య : యమునెక్కిలులాయములు విహారము సల్పున్
    కం . యమహా నెక్కి యువకులుర
    యమునన్ వీధులలొచేరి యువతుల నవమా
    నము చేయ పల్కెజనులున్
    యమునెక్కిలులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
  36. ఇది పూరణ కొరకు కాదు.క్షమించాలి.ఇది చూడగనే గతంలో నేను వ్రాసిన "కందాల విందు" అనే పాతిక పద్యాల సంకలనము నుండి ఒకటి గుర్తుకు వచ్చింది.
    కం.హాడ్లీని మించు బౌలరు
    వడ్లకు సరి ధాన్యము మరి వజ్రపు సరియున్
    ఎడ్లకు సమ శ్రమ జీవులు
    ఇడ్లీలకు సాటి టిఫినులిలలో గలవే?
    -గుఱ్రం జనార్దన రావు

    రిప్లయితొలగించండి
  37. జనార్దన రావు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ప్రతిరోజు సమస్యాపూరణలో ఎందుకు పాల్గొనకూడదు మీరు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. ప్రయత్నిస్తాను.నా స్థాయికి ఎక్కువేమోనని సంకోచించాను.

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      'స్థాయి' గురించి ఆలోచించకండి. స్థాయికి కొలబద్ద ఏది? ఈ బ్లాగులో అందరి పద్యాలను ఒకసారి పరిశీలించండి. మీకు అన్ని స్థాయీల ఉదాహరణలు లభిస్తాయి.

      తొలగించండి
  38. కం. గాంగేయుని సమ వీరుని
    కంగారును బోలు మృగము గానము జగతిన్
    షాంగైని మించు నగరము
    గోంగూరకు దీటు వచ్చు కూరయు గలవే ?
    ("కందాల విందు" సంకలనము నుండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కందం నిజంగానే విందు చేసింది. పై పద్యం
      'వంకాయ వంటి కూరయు
      పంకజముఖి సీతవంటి భామామణియున్...' పద్యాన్ని గుర్తు చేసింది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు. ఆ చాటు పద్యమే నాకు స్ఫూర్తినిచ్చినది.
      కం. బాంగ్రా నృత్యము వంటిది
      కాంగ్రా సమ హిల్ రిసార్టు కనమెందైనన్
      సంగ్రామమున కిరీటికి
      జాంగ్రీ రుచులకను సాటి జగతింగలవే ?

      తొలగించండి
  39. జనార్దన రావు గారూ,
    మీ తాజా పద్యం బాగుంది.
    'రుచులకును'... 'రుచులకను' అని టైపయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చమత్కార, పేరడీ పద్యాలు వ్రాయడంలో మీ ప్రావీణ్యం ప్రశంసింపదగింది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు సర్! పోస్ట్ చేశాక టైప్ తప్పు చూచాను.ఎడిట్ చేద్దామంటే తెలియలేదు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు సర్! పోస్ట్ చేశాక టైప్ తప్పు చూచాను.ఎడిట్ చేద్దామంటే తెలియలేదు.

      తొలగించండి
    4. కం. బల్గేరియ సమ దేశము
      కల్గదుగా లోక మందు కనబడదెందున్
      బిల్గేట్సు సంపదకు సరి
      మల్గూబా మామిడి సరి మధురమ్మేవీ?

      తొలగించండి
    5. కం. బల్గేరియ సమ దేశము
      కల్గదుగా లోక మందు కనబడదెందున్
      బిల్గేట్సు సంపదకు సరి
      మల్గూబా మామిడి సరి మధురమ్మేవీ?

      తొలగించండి
  40. కం.గర్జనలో సింహములను
    దౌర్జన్యము చేయుటందు ద్రౌణిని నీచున్
    ఆర్జనలో బిల్గేట్సును
    కార్జము కూరకును మించి కల్గునె భువిలో ?

    రిప్లయితొలగించండి
  41. కం.బ్రిస్బేన్ పుర సౌందర్యము
    ఆస్బెస్టాజు నకు సరియు నగుపడవెందున్
    డిస్బర్సుమెంటు దినమును
    బిస్బేలా బాతు సాటి బిర్యానీయే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పద్యాలు బాగుంటున్నవి. అభినందనలు.
      సమస్యాపూరణలు చేయండి. ఈ పేజీ క్రిందిభాగంలో ఉన్న 'హోమ్'ను క్లిక్ చేస్తే ఈనాటి సమస్య కనిపిస్తుంది.

      తొలగించండి
  42. సుద్దులు చాలబల్కి, రణశూరులమంచు స్వకీయ లబ్ధికై
    హద్దులు దాటి రాజ్యముల నాక్రమణమ్మొనరించు శత్రువున్
    గద్దెలనెక్కనీక రణకౌశలమున్ చవిజూపి గుండెల
    న్నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్

    నెట్వర్క్ ప్రాబ్లెమ్ వల్ల చేరని నిన్న మొన్నటి సమస్య, దత్తపది పూరణలు

    కలలు గన్న తల్లి గళము విప్పగలేక
    శిలగ మిగిలిపోయి చేర శయ్య ,
    మాట వచ్చె పెండ్లి మనుమరాలికికాగ ;
    కలలు గనెడి శిలలు పలుకగలవు

    వ్రజకుల సంభవ, మురహర,
    గజరక్షక, శశివదనుడ, కంసారి, యదో
    క్షజ, రుద్రరూప, వామన! ,
    నిజరూపము జూడబోవ నెందును నీవే !

    రిప్లయితొలగించండి
  43. శ్లో. మృత్పిండ మేకం బహు భాండ రూపం
    సౌవర్ణ మేకం బహుభుషణాని !
    గోక్షీర మేకం బహు ధేను జాతం
    ఏకాపరాత్మా బహుదేహ వర్తీ !!
    ఈ అపురూపమైన, మనోహరమైన శ్లోకం చదివినప్పుడు నాలో కలిగిన స్పందనను అదే ఛందస్సులో ఈ విధంగ వెలువరించాను.
    . *******-----------*******
    శ్లో.అత్యంత శ్రేష్ఠమ్మపురూప భావం
    శ్లోకాల కెల్లన్ మకుటాయ మానం !
    ఉల్లాస మొప్పన్ మది పాడె గీతం
    లాలాల లాలాల లలాల లాలా !!

    రిప్లయితొలగించండి
  44. ఒకసారి ఒక అవధానంలో పృచ్చకుడు అవధానిని 'దోసె, పూరీ,వడ,సాంబారు 'పదాలతో శివ పార్వతుల కల్యాణాన్ని ఒక మత్తేభ వృత్తం (పద్యం)లో వర్ణించ మనగా ఆ అవధాని చెప్పిన పద్యం

    మ.జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్య మొప్పారగన్
    నడయాడెన్ ఘలు ఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి పా
    వడ అట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి ఆ
    పడతిన్ పార్వతి బెండ్లి యాడితివి సాంబా!రుద్ర ! సర్వేశ్వరా!

    రిప్లయితొలగించండి
  45. కం. వెలసెను గల్ప తరువు గను
    వెల కట్టగ వీలులేని విధముగ దోపన్
    ఇలలో మనకిక నెవ్విధి
    తులసీ మాతను గొలిచిన దురితము లబ్బున్ ?

    రిప్లయితొలగించండి
  46. "ఒకసారి ఒక అవధానంలో పృచ్చకుడు అవధానిని 'దోసె, పూరీ,వడ,సాంబారు 'పదాలతో శివ పార్వతుల కల్యాణాన్ని ఒక మత్తేభ వృత్తం (పద్యం)లో వర్ణించ మనగా ఆ అవధాని చెప్పిన పద్యం"


    ఆ అవధానివరేణ్యు లెవరు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురేంద్రనాథ్ గారూ,
      నాకైతే ఆ అవధాని ఎవరో తెలియదు. గుఱ్ఱం జానార్దన రావు గారే చెప్పాలి.

      తొలగించండి
  47. రెడ్లిండ్లన్‌ చిన్నప్పుడు
    నడ్లు విరగ దంచినట్టి నాణ్యమ్మైనన్
    వడ్లుండగ రెడ్డి యనెను:
    "ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?"

    రిప్లయితొలగించండి
  48. గ్రుడ్లవి మాంసాహారము
    బ్రెడ్లేమో చప్పగుండు బ్రేక్ఫాస్ట్ నకున్
    మెడ్లే పెసరట్టుప్మా,
    ఇడ్లిలే చాలు మనకు యితరము లేలా ?

    రిప్లయితొలగించండి


  49. గ్రుడ్ల మిటకరించవలదు!
    వడ్లను దంచుము జిలేబి వడివడిగానన్
    లాడ్లీ, ఫలహా రమన
    న్నిడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  50. విశ్వ భాష లందు విలువైనది తెలుగు
    తెలుగు తీపితీపి తేనెలూరు
    మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి
    తెలుగు జదువు వారు దేహి యనరె?

    రిప్లయితొలగించండి
  51. దుర్బలురను కడు దీనుల
    నర్భకులను బ్రోవ రాడె యాదేవుండున్
    ఆర్భాటమ్ములె ప్రియమగు
    దౌర్భాగ్యము నిచ్చి బ్రోచు దామోదరుడే.

    రిప్లయితొలగించండి
  52. శర్మము గలిగించుచునే
    వర్మము వలె నిలుచు విద్య వటులందరికిన్
    ధర్మము దప్పినచో మరి
    దుర్మార్గము కాదు గురుల దూషించినచో.

    రిప్లయితొలగించండి
  53. ఆశు కవిత్వము-పద్యాలు.
    భారత దేశంలోని అతి ఎత్తైన "జోగ్" జలపాతము నాలుగు ధారలుగా (Cascades) క్రిందకు దుముకుతుంది. వాటికి నాలుగు పేర్లు బెట్టారు. "రాజా" ; "రాణి" ; " జాకి" ; రాకెట్".పెద్దది రాజా, చిన్నది రాణి, యింకా చిన్నది జాకి.మరొకటి కొళాయి నుండి వేగంగా నీటిధార (Jet of water)దూకినట్లుగా దుమికే జలపాతపు ధార రాకెట్.
    ఆ రాకెట్ ధార లాగ పద్యాన్ని ఒక్క గుక్కలో దూకించ గలిగే ఆశుకవులు అరుదుగా ఉంటారు.ఒక భీమకవి, ఒక శ్రీనాథుడు, ఒక తెనాలి రామకృష్ణ, ఒక రుద్రకవి,ఒక అల్లసాని, ఒక అడిదము సూరకవి , మరి కొందరు. చాలామంది పద్యాన్ని ముక్కలు,ముక్కలు గా అల్లి అతికే వారే. కాబట్టి ఎక్కువగా పీసు కవులే కానీ, ఆశు కవులు కాదు.
    రెండు, మూడు దశాబ్దాలుగా పద్యాలు వ్రాసే అలవాటు నాకూ ఉన్నది. అత్యధికము పద్యాల కొరకు పదాలు ఏర్చి, కూర్చి, పేర్చి, మార్చి, తీర్చి దిద్దినవే.అంటే గింజుకుని,పుంజుకుని వ్రాసినవే. అయితే ఒకే ధారగా వచ్చిన పద్యాలు కొన్ని మాత్రమున్నాయి.వాటిలో రెండింటిని మిత్రులతో పంచుకోవాలని ఇది వ్రాస్తున్నాను.
    ఇరవై యేళ్ళ క్రితం ఒక కాలేజ్ లో ఒక ఫంక్షన్ సందర్భంగా డిన్నర్ ఏర్పాటు చేయాలను కున్నారు. అదెలా ఉండాలనేది స్టాఫ్ రూం లో చర్చ జరుగుతూంది.అంటే శాకాహారమా? లేక మేకాహారమా? అని ! ఒక్కొక్కరినీ అభిప్రాయం అడుగుతున్నారు. నా వంతు వచ్చే సరికి నాలో ఒక పద్యం రూపు దిద్దుకున్నది.నా అభిప్రాయాన్ని ఈవిధంగా పద్య రూపంలో చెప్పాను.
    ****}{}{****
    "మనసున లేని నవ్వు మొగమాటముకై వచియించు పల్కులున్
    కనులకు విందు లేమియును కానల కేగిన పూరుషోత్తముల్
    పనిగొని చేయు స్తోత్రములు పండిత వర్యుల సంకుచిత్వమున్
    తునుకలు లేని భోజనము తొల్చెడి ముళ్ళివి నామనంబునన్."
    *****
    దాదాపు అదే సమయంలో ఒక సహోద్యోగి (ఇప్పుడు దివంగత మిత్రుడు;Departed friend) అబ్దుల్ వాహిద్ అనే అతను బక్రీద్ సందర్భంగా స్టాఫునందరినీ పిలిచి మరపు రాని విందు ఇచ్చాడు. నేను భోంచేసి చేతులు కడుక్కునే సమమయంలో ' అతనికి పద్యరూపంలో ధన్యవాదాలు చెప్పాలనే' ఆలోచన వచ్చి ఈ విధంగా చెప్పాను.
    సారా స్టాఫును పిల్చియు
    వేరెవ్వరు చేయ లేని విధముగ దోఫన్
    నోరూరెడి దావతు నువు
    వారేవా ! యిస్తివయ్య ! వాహిద్ భయ్యా !
    ***)()(***

    రిప్లయితొలగించండి
  54. ఆకాశవాణి,హైదరాబాదు కేంద్రం వారి
    10-02-2018 నాటి సమస్య కు పూరణ:
    సమస్య :
    "కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్."
    ***)()(***
    లోకుల తీరు వింతగును లోతుగ జూచిన నొక్కొకప్పుడున్
    చౌకగు వాటినే వలచి చక్కని వన్నియు త్రోసి పుత్తురే !
    హా!కలికాల మందున నిది యచ్చెరువౌ గద యక్కటక్కటా !
    కాకుల పాట కమ్మన పికమ్ముల పాట కఠోరమయ్యెడిన్.
    ****)()(****

    రిప్లయితొలగించండి
  55. ఏ కొలువు గోరె నానాడు వేమన కవి?
    యేమి యాశించె పోతన యెన్నడైన ?
    నేర్చి నారు దాని మనకు నేర్పినారు
    కొలువె తుది లక్ష్య మైనట్లు తెలుగునకును
    తీయ నైనదౌ ఘనమైన తెలుగు నేర్చు
    కొనుమనుచు బల్క దేలిక కొలువు లేవి?
    పదవు లేవి యని యనుచు బ్రశ్నలేల?

    రిప్లయితొలగించండి
  56. గ్రుడ్లూ మాంసము రెడ్లకు
    బుడ్లకు తోడుగ నొసగవె భూరిగ కిక్కుల్
    దొడ్లా వారిది పెండ్లిని
    ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?

    రిప్లయితొలగించండి