13, డిసెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 168

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దారి తప్పువాఁడు ధర్మవిదుఁడు.

13 కామెంట్‌లు:

  1. ధరను జూడ గలవు, దారులు పెక్కులు,
    హరిని జేర, జార ,సురను గ్రోల!
    ముక్తి దారి బట్ట ,ముప్పను గలిగించు
    దారి తప్పు వాడు!! ధర్మ విధుడు!!!

    రిప్లయితొలగించండి
  2. చెడ్డవాని బిలిచి చెప్పగ ధర్మము
    రాను రాను మారె తాను యెంతొ
    పుణ్యకార్య బుద్ధి పుట్టగ; యాచెడ్డ
    దారి తప్పు వాడు; ధర్మ విధుడు.

    రిప్లయితొలగించండి
  3. దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను
    దారి మరచినంత తప్ప నగును
    దారి వెతికి వెతికి దరిజేరకున్నను
    దారి తప్పు వాడు; ధర్మ విధుడు.

    రిప్లయితొలగించండి
  4. ధృతరాష్ట్రుడికి భీష్ముని హితబోధ

    "శకుని మాట బట్టి స్వజన నాశనమును
    కోరు నీదు సుతుని దారి తప్పు
    వాడు ధర్మవిధుడు వాసుదేవుని యండ
    పొంద గలుగు ధర్మ నందనుండు"

    రిప్లయితొలగించండి
  5. పరుల హింస బెట్టి పరిహసించుట చెడు
    దారి, తప్పు! వాఁడు ధర్మవిదుఁడు
    జూపు ద్రోవను చన నోపలేడు! కనుక
    దయ వీడ కుంట ధర్మ పథము!

    రిప్లయితొలగించండి
  6. నీతి నియమ మన్న నిష్టూరమే నేడు
    మంచి మాట యనగ పడదు గనుక
    దారు లెన్నియున్న తనదారి రహదారి
    దారి తప్పు వాడు ధర్మ విదుఁడు.

    రిప్లయితొలగించండి
  7. ఒప్పు నగునె హింస తప్పదు ననుచును
    ఉద్యమాలు యెంత ఒప్పు యైన
    హింస పథము నడచి ధ్వంసమ్ము చేసిరో
    దారి తప్పు వాఁడు ధర్మ విదుడు !

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    హరి గారూ,
    పద్యం చూస్తే బాగుంది. కాని భావమే నన్ను దారి తప్పించి గమ్యం కనిపించకుండా చేస్తోంది :-)

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    సర్వోత్కృష్టమైన పూరణ మీది. ధన్యోస్మి! సమస్యగా ఇచ్చిన పద్య పాదాన్ని పద్యం మధ్యలో ఇరికించిన మీ నైపుణ్యం అభినందనీయం. ధన్యవాదాలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి పూరణ నందించారు. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఉద్యమాల నేపథ్యంతో మీరు రాసిన పద్యం బాగుంది. అభినందనలు. కాకుంటే రాకూడని చోట్ల "యడాగమాలు" వచ్చి పానకంలో పుడకల్లా ఇబ్బంది పెట్టాయి.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ మిస్సన్న పద్యం మీద మీరేమీ వ్యాఖ్యానించలేదు.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    నిజమే సుమా! మీ పూరణను ఎలా మిస్సయ్యానబ్బా? బహుశా .. మీ పేరులోనే "మిస్" ఉండడం వల్లనేమో :-)
    అద్భుతమైన పూరణ. సమస్య పాదాన్నికి మీరిచ్చిన విరుపు అమోఘం. ఇంత మంచి పూరణను అంచించిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. పై పూరణలో నేననుకున్న భావం ఇది. లోపాలు మీరే చెప్పాలి.

    దారి తప్పుటెల్ల తప్పుకాదెచటను

    దారి తప్పుట అనేది పెద్ద నేరం కాదు.

    దారి మరచినంత తప్ప నగును

    దారి మరిచి పోయినప్పుడు ఎవరికైనా దారి తప్పడం మామూలే.

    దారి వెతికి వెతికి దరిజేరకున్నను
    దారి తప్పు వాడు; ధర్మ విధుడు.


    తెలియని దారి కోసం వెతుకుతూ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన వాడు దారి తప్పిననూ ధర్మ విధుడే.

    రిప్లయితొలగించండి
  12. దారి తప్ప రాదు ధర్మపథము వీడి
    ఎంత కష్ట మైన నెట్టు లైన
    పతన మునకు జేర్చు పంకిల మయమగు
    దారి తప్పు వాడు ధర్మ విదుడు.

    రిప్లయితొలగించండి