22, డిసెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 176

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
హరుఁడు ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.

15 కామెంట్‌లు:

  1. హరియె హరియించు నఘముల హరుఁడగుటను.
    ధరణిఁ దుష్టుల హరియించు హరుడతండు.
    హరియె సుజన రక్షకుఁడగున్. హరియె దురిత
    హరుఁడు. ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.

    రిప్లయితొలగించండి
  2. హరిహరుల దారులొక్కటే నరయ గాను,
    వరములిచ్చినా ,దృంచినా, వసుధ లోన
    సత్యమొక్కటే నిత్యమై సాగునంచు,
    హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!

    రిప్లయితొలగించండి
  3. ఇందు గలడందు లేడని సందియమ్ము
    లేల ? కలడు ; కలండు - ఎందెందు వెదకి
    చూడ నందందు చక్రి ; విష్ణుండు; కలుష
    హరుఁడు ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ విష్ణు నందన్ గారి పూరణ గొప్పగా ఉంది .సమస్యకు సరియైన పూరణ అదే అన్నట్లుగా ఉంది
    వీరి పూరణ జూచి ,నా పూరణకు చిన్న సవరణ చేస్తున్నాను .

    హరి హరుల దారు లొక్కటే నరయ గాను,
    వరము లిచ్చినా ,దృంచినా వసుధ లోన
    సత్య మొక్కటే నిత్యమై సాగ !దురిత
    హరుడు ప్రహ్లాదు గాచినా డసురు జంపి!

    రిప్లయితొలగించండి
  5. అమరు లసురులు వేడగా నమిత విషము
    కేల నేరేడు పండును బోల గ్రోలె
    హరుఁడు ;ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి
    హరియు నిరువురు నొక్కరే, హరిహరుండు

    రిప్లయితొలగించండి
  6. శ్రీ చింతా రామకృష్ణా రావుగారు,డా.విష్ణునందన్ గారు చక్కని పూరణలు చేసారు. గొప్ప పండితుల సరసన నిలుచున్నందులకు మాకు అవకాశమిచ్చినందులకు వారిరువురికి కృతజ్ఞతలు. విష్ణు నందన్ గారూ శంకరాభరణమునకు మకుటముగా చక్కని శ్లోకాన్ని తీర్చి దిద్ది నందులకు మరోసారి అభినందనలు. శ్రీ మంద పీతాంబర్ గారూ మీ పూరణ సవరించాక యింకా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. "ప్రహ్లాదుడే వచ్చి పలికిపోయినట్లు" ఉంది విష్ణు గారి పూరణ .

    రిప్లయితొలగించండి
  8. అసుర సంతతియై యుండి హరుని గొలిచె
    తండ్రి హింసించ నొడిగట్టె దడియ కుండ
    హరిని స్మరియించి భక్తితొ హరుడె యనగ
    హరుఁ డు ప్రహ్లాదుఁ గాచి నాఁ డసురుఁ జంపి. !

    మీరంతా సరస్వతీ పుత్రులు ,పండితులు ,గురువులు.మీ మధ్యన నా పేరు తగదు.ఐనా ఎంతో వ్రాయ గలనన్న ఆశ కంటె ఏదైనా వ్రాయాలన్న చిన్న కోరిక .మీ అందరికి కృతజ్ఞతాభి వందనములు.+ " నూతన సంవత్సర శుభా కాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. పాము నేనుగు పురుగుల ప్రేమ నేలె
    హరుఁడు, ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి
    హరియు, రామదాసు వెతల హరియించె
    దాశరథి జాతి యడ్డమే దైవ కృపకు?

    రిప్లయితొలగించండి
  10. సదస్యు లందరికీ వందనములు
    అందరి పూరణలు అద్భుతముగా నున్నవి.
    ___________________________________‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    01)
    ఆది మద్యాంత రహితుండు! - అచ్యుతుండు
    పరమ పూజ్యుడు! ముల్లోక - పాలకుండు
    కమల నాభుడు! కల్యాణ - కారకుండు
    హరుఁడు , ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  11. 02)

    హ్లాదు, డసురుడు నందరు- హరియె గాదొ ?
    "హరుడు హరిగాచె తానుగా - హరిని జంపి!"
    అనిన నేమాయె! సర్వము - హరియె గాన
    హరుఁడు , ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.

    రిప్లయితొలగించండి
  12. ___________________________________

    మమకారము గల దొక్కటి
    ముదమారగ పదము పాడ - మొదలిడ! మదిలో!
    మదనారి, కరుణ వలనను
    మదమాయెను నేడు శంక - రాభరణమునన్
    __________________________________
    (అదనాయెను )
    (శ్రధనంబగు )
    ___________________________________

    రిప్లయితొలగించండి
  13. చింతా రామకృష్ణారావు గారూ,
    బహుకాలానికి నా బ్లాగును పావనం చేసారు. మనోజ్ఞమైన పూరణతో ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    సవరించిన తర్వాత మీ పూరణ సార్థక మయింది. చాలా బాగుంది. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    అద్భుతమైన పూరణతో నా బ్లాగును అలంకరించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    రాజేశ్వరి గారూ,
    మీ పద్యం నిర్దోషంగా ఉంది. అభినందనలు.
    సరస్వతీ పుత్రుల సలహా, సహకారాలు ఎల్లకాలం కొనసాగాలని ఆశిద్దాం. వారి పద్యాలు మనకు స్ఫూర్తిదాయకాలు. పద్య రచనలో ఔత్సాహికులకు పాఠ్యాంశాలు.

    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణను అందించి ఎప్పటిలాగే ఆనందపరచారు. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి