2, నవంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1223 (విరసంబౌ కావ్య మొప్పె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  పిచ్చివాళ్ళు
  పిచ్చిమాటలు(కరి కిరి కిరి కరి )
  వాళ్ళకదే గొప్ప కావ్యం :

  01)
  __________________________________

  సరి సరి మతి చెడినది గద
  మరి మరి పలికిరి నొక పరి - మర్కట సములై
  కరి కిరి కిరి కరి యనగా
  విరసంబౌ కావ్య మొప్పె - వీనుల విందై !
  __________________________________

  రిప్లయితొలగించు
 2. సురు చిర కవనమ్ము లనట
  విర చించిన పండి తుండు వేడుక మీరన్
  విరుపుల మలుపులు ద్రిప్పగ
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందౌ

  రిప్లయితొలగించు
 3. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు
  కాళిదాసు నాశ్రయించి
  రాజసన్మానం కోరుకున్నాడట !
  సరే రేపు సభకు వచ్చి మౌనంగా కూర్చో
  నీ కోరిక తీరేలా చేస్తా నన్నాడట కాళిదాసు !

  మరునాడు భోజుని కొలువులో
  రామాయణం మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు
  సభలో ప్రవేశించిన బ్రాహ్మణుడు
  రావణుడు అన్న మాట వినగానే
  కాళిదాసు చెప్పిన సంగతి మరచి పోయి
  "ఆ మూర్ఖ రాభణుడా " అన్నాడట !
  ఆ మాటతో సభంతా వానివైపు చూడగా
  ఎవరీ మూర్ఖుడని భోజరాజు గద్దించాడట !

  వెంటనే కాళిదాసు లేచి
  అయ్యా పూర్వాశ్రమంలో వీరు నా సహపాఠి !
  వీరు పురాణాలమీద పరిశోధనలెన్నో చేస్తున్నారు !
  మనభాగ్యం కొద్దీ ఇక్కడికొచ్చారు !

  ఇంతకీ వీరి ఉద్దేశమేమంటే
  రావణుడు , విభీషణుడు, కుంభకర్ణుడు అన్నదమ్ములు గదా !
  విభీషణ , కుంభకర్ణుల పేర్లలో యున్న" భ"కారం
  రావణుని పేరులో కూడా ఉండి ఉండాలన్నదే వీరి సిద్ధాంతం !
  అందుకే వీరెప్పుడూ రావణుణ్ణి రాభణుడనే సంబోధిస్తుంటారు
  అని సమర్థించాడట !

  ఈ తర్కానికి ముగ్ధుడైన భోజుడు ఆ పండితునకు సన్మానం చేసి పంపాడట !

  భోజుని ఆస్థానంలో యిటువంటివెన్నో :

  02)
  __________________________________

  సరి సరి భోజుని కొలువున
  విరివిగ వర కాళిదాసు - వివరణ తోడై
  పరులది యేదో పలికిన
  విరసంబౌ కావ్య మొప్పె - వీనుల విందై !
  __________________________________

  రిప్లయితొలగించు
 4. క్షమించాలి చివరి పాదం టైప్ పొరబాటు
  వీనుల .....విందై ....అని ఉండాలి

  రిప్లయితొలగించు
 5. గూడ రఘురామ్ గారి తాతగారు కీ.శే. గూడ శ్రీరాములు గారి పూరణ......

  స్ఫురదర్థభావయుతమై
  కర మలఁతి తెలుంగునుడులఁ గ్రాలుచు ద్రాక్షా
  సురుచిరపాకంబున గత
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించు
 6. హరి కృపచే పోతన కవి
  పరమార్థము గోరి వ్రాయ భాగవతంబున్
  హరి భక్తి సుమమ్ముల తా
  వి రసంబౌ కావ్య మొప్పె వీనులవిందై

  రిప్లయితొలగించు
 7. సరసస్వర తాళము లయ సం
  భరితముగా బాణిగట్టి పాడగ ఘనుడౌ
  పరమాద్భుత గాయకుడే
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించు
 8. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మంచి పద్యమును వ్రాసేరు. అభినందనలు. 1వ పాదములో సరసస్వర అనుటలో స్వ వలన ముందున్న అక్షరము గురువు అగును గదా. స్వస్తి.

  రిప్లయితొలగించు
 9. పరమాద్భుత శక్తుల సం
  భరితంబై వెలసినట్టి భారతమిలలో
  నరయగ ధర్మాధర్మపు
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

  విరసము = విరుద్ధ భావములు

  రిప్లయితొలగించు
 10. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు..
  సవరణ తో నా పూరణ...

  సరసస్వర లయగతి సం
  భరితముగా బాణిగట్టి పాడగ ఘనుడౌ
  పరమాద్భుత గాయకుడే
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించు
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 12. హరినే తలచుచు నోకవి
  హరి కధ నే రచనచేయ హరహర యనుచున్
  హరిహర తత్వము చాటుచు
  విరసంబై కావ్యమొప్పె - వీనుల విందై

  రిప్లయితొలగించు
 13. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్యగారికివందనములు
  సరస విరస కావ్యమ్ములు
  నరయగ జీవనమునందు ననుబంధమ్ముల్
  సరిదీర్చు కొనిన వానిని
  విరసంబౌ కావ్యమొప్పె వీనుల విందై

  రిప్లయితొలగించు
 14. విరి కొరకై సత్య హరిని
  విరహంబున ముంచి దేల్చి విరుపుల మరులే
  గురిపించు తిమ్మ నార్యుని
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించు
 15. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
  మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
  1వ పాదములో "కావ్యమ్ములు" కి బదులుగా "కావ్యమ్ముల" అంటే సరిపోతుంది. అదియొక టైపు పొరపాటు అనుకొనుచున్నాను. కావ్యమ్ములు తరువాత అచ్చుతో పదము ప్రారంభమైనది కాబట్టి సంధి నిత్యము అగును. అందుకే సవరణ. స్వస్తి.

  రిప్లయితొలగించు
 16. అమ్మా~ శైలజ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  1వ పాదములో ఓ కవి కి బదులుగా ఒక కవి అనవలెను. పద్యము అంతయును చదివినా సమస్య సమస్యగానే మిగిలిపోయినది. పరిష్కరింపబడ లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించు
 17. భర్త భార్యతోఁ దాను జదివిన కావ్యముం గూర్చి యన్న మాటలు...

  సరవి దశప్రాణ యుతము,
  నిరవౌ నష్టాదశమ్ము నెఱి వర్ణనముల్,
  కరము నలంకృతముగ, దే
  వి! రసంబౌ కావ్య మొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించు
 18. శ్రీ పండిత నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ..పద్యము సవరించి వ్రాసాను ..సరిదిద్ద ప్రార్ధన...

  హరినే తలచుచు ఒకకవి
  హరి కధ నే రచనచేయ హరహర యనుచున్
  సురుచిరసుమధురమగు మా
  వి రసంబై కావ్యమొప్పె - వీనుల విందై

  రిప్లయితొలగించు
 19. పండిత నేమాని గారికి వందనములు.
  మీరు చేసిన సవరణకు కృతఙ్ఞతలు.

  రిప్లయితొలగించు
 20. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నాను. వ్యాఖ్యల ద్వారా, ఫోన్ ద్వారా సందేశాలిచ్చిన అందరికీ ధన్యవాదాలు.
  దీనికి సంబంధించిన వ్యాఖ్యలను తొలగిస్తున్నందుకు మన్నించండి.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణకు సంబంధించిన ప్రసిద్ధ శ్లోకం ఎన్నోసార్లు చదివాను. కాని గుర్తుకు రావడం లేదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ విరుపుల మలుపుల పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  భక్తిసుమాల తావితో రసమయంబైన కావ్యమును గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ధర్మాధర్మవిరసమైన కావ్యాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  నేమాని వారి సూచన ననుసరించి సవరించారు. బాగుంది.
  కాని ‘మావి రసము’ అని సమాసము చేయరాదు కదా.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  పారిజాతాపహరణ కావ్య ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  దాస్యం వెంకటకృష్ణ గారూ,
  ధన్యవాదాలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  దేవికి రసమయమైన కావ్యాన్ని గురించి చెప్తూ చక్కని పూరణ చేశారు. అభినందనలు.

  రిప్లయితొలగించు
 21. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  శ్రీమతి శైలజ గారి సవరించిన పూరణలో దోషము లేదు. మధురమగు మావి రసంబై అనుటలో ఎక్కడా సమాసము లేదు కదా. ఒకవేళ మావి రసము అనిననూ సంస్కృత పదము ఉత్తర పదముగా నుండుట సమ్మతమే కదా. స్వస్తి.

  రిప్లయితొలగించు
 22. నేమాని వారూ,
  నిజమే. శైలజ గారి పూరణ విషయంలో నేను పొరబడ్డాను. మన్నించండి.

  రిప్లయితొలగించు
 23. శ్రీ వసంత కిశోర్ గారు ప్రస్తావించిన విషయములో కాళిదాసు భోజరాజు సభలో చెప్పిన శ్లోకమునకు పాఠాంతరములున్నవి. నాకు తెలిసిన ఒక శ్లోకమును ఇక్కడ వ్రాయుచున్నాను:

  భకారో కుంభకర్ణశ్చ
  భకారశ్చ విభీషణః
  త్రయోర్ జ్యేష్టః కులశ్రేష్టః
  రాభణో నచ రావణః

  రిప్లయితొలగించు
 24. శంకరార్యా ! ధన్యవాదములు !
  ఉదయం ఈ శ్లోకం నాకూ గుర్తుకు రాలేదు !

  గుర్తు చేసిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు !

  రిప్లయితొలగించు
 25. వరియించి వచ్చు కన్యను
  సరికాదను ప్రవరుకథను సామర్థ్యముగా
  విరచించిన మను చరితము
  విరసంబౌ కావ్యమొ, ప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించు
 26. సరసపు సల్లాపములున్
  మురిపెమ్ముల తోడనుండు
  ముద్దులు కొద్దై
  సరిసరి వేళల సరసము
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల
  విందౌ

  రిప్లయితొలగించు
 27. "రంగరాయ వాస్తవ శతకం"
  (రాజకీయ హాస్య వెలదులు)

  కరచుచు నేతల బుద్ధులు
  కురియుచు శాపములు మెండు కూరిమి తోడన్
  సరసమ్మౌ బూతులతో
  విరసంబౌ కావ్య మొప్పె వీనుల విందై...

  రిప్లయితొలగించు